'పెళ్లి రోజే వధువుని చంపేసిన వరుడు', ఆ రోజు అసలేం జరిగింది?

వధువు, వరుడు, హత్య, గుజరాత్, సహజీవనం, పెళ్లి

ఫొటో సోర్స్, Alpesh Dabhi

ఫొటో క్యాప్షన్, హత్యకు గురైన సోనీ (ఎడమవైపు), నిందితుడు సాజన్ (కుడివైపు)

(ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

పెళ్లి రోజే కాబోయే భార్యను హత్య చేశారనే ఆరోపణలతో గుజరాత్‌ భావ్‌నగర్‌లోని ప్రభుదాస్ లేక్ ప్రాంతంలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

భావ్‌నగర్‌కు చెందిన 22 ఏళ్ల సోనీ రాథోడ్‌కు, సాజన్ అనే వ్యక్తితో నవంబర్ 15న వివాహం జరగాల్సి ఉంది.

అయితే, వారిద్దరూ ఏదో విషయంలో గొడవపడ్డారని, తర్వాత సోనీ ఇంటికి వెళ్లిన సాజన్ ఆమెను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదులో ఉంది. సోనీని ఆమెకు కాబోయే భర్త సాజన్ బరేయాా హత్య చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ కేసులో నిందితుడు సాజన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సాజన్ బరేయా హింసాత్మక స్వభావం కలిగిన ఉన్న వ్యక్తి అని ఫిర్యాదులో ఉంది. సోనీని బలవంతంగా తీసుకెళ్లి ఆమెతోనే కలిసి ఉంటున్నారని, దీంతో వారిద్దరికీ వివాహం జరిపించాలని సోనీ కుటుంబం నిర్ణయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, సరిగ్గా పెళ్లి జరగాల్సిన రోజే వారిద్దరి మధ్య గొడవ జరిగిందని.. దీంతో సోనీని సాజన్ హత్య చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది.

వధువు, వరుడు, హత్య, గుజరాత్, సహజీవనం, పెళ్లి

ఫొటో సోర్స్, Alpesh Dabhi

ఫొటో క్యాప్షన్, నిందితుడు సాజన్ బరేయా

సోనీ సోదరుడి ఫిర్యాదులో ఏముందంటే..

సోనీ సోదరుడు విపుల్ రాథోడ్ పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం.. భావ్‌నగర్‌లోని అగారియా వార్డు ప్రాంతానికి చెందిన విపుల్ రాథోడ్ ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తారు.

తన సోదరి 22 ఏళ్ల సోనీ రాథోడ్ గత 8 నెలలుగా సాజన్ అలియాస్ భురో ఖన్నాబాయ్ బరేయాతో కలిసి ఉంటోంది. తనతో ఉండాలని సాజన్ ఆమెను బెదిరించారని ఫిర్యాదులో విపుల్ రాథోడ్ ఆరోపించారు. ఆ తర్వాత, వారి కుటుంబం వాళ్లిద్దరికీ పెళ్లి జరిపించాలని నిర్ణయించింది. పెళ్లి కోసం ఆహ్వాన పత్రికలను కూడా ముద్రించింది.

నవంబర్ 15న వారి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ, పెళ్లి రోజున సోనీ, సాజన్ మధ్య గొడవ జరిగింది. సోనీని సాజన్ కొట్టారు. దీంతో సోనీ సోదరుడు విపుల్ రాథోడ్ ఇంటికి వెళ్లారు.

వధువు, వరుడు, హత్య, గుజరాత్, సహజీవనం, పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోనీ కాబోయే భర్త పేరును టాటూ వేయించుకుంది.

సోనీని అమ్మమ్మ ఇంటికి పంపించారు..

ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం, సాజన్ నుంచి తప్పించేందుకు సోనీని వాళ్ల అమ్మమ్మ శాంతాబెన్ బంబానియా ఇంటికి పంపించింది ఆమె కుటుంబం.

అయితే, నవంబర్ 15 (నవంబర్ 14 - 15 మధ్య రాత్రి) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సాజన్.. సోనీ ఇంటికి వచ్చారు. సోనీ తమ్ముడు సునీల్‌ను కొట్టి, సోనీ గురించి అడిగారు.

సోనీ ఎక్కడుందో సాజన్‌కు చెప్పారు సునీల్. ఆ తర్వాత, సాజన్ సోనీ దగ్గరకు వెళ్లారు. అక్కడ ఉన్న సోనీ తండ్రిపై కూడా ఆయన దాడి చేశారు.

ఆ తర్వాత సోనీని కిడ్నాప్ చేశారు.

వధువు, వరుడు, హత్య, పంజాబ్

ఫొటో సోర్స్, Alpesh Dabhi

ఫొటో క్యాప్షన్, సోనీ మృతదేహం కనిపించిన ఇంటి వద్ద దర్యాప్తు చేస్తున్న పోలీసులు

'రాత్రంతా వెతికినా సోనీ ఆచూకీ దొరకలేదు..'

సోనీ సోదరుడు చేసిన ఫిర్యాదు ప్రకారం, తన సోదరి కోసం ఆయన రాత్రంతా వెతికారు. కానీ, ఆమె ఆచూకీ తెలియలేదు.

మరుసటి రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో సాజన్ బరేయా ఇంటి వద్ద సోనీ మృతదేహం ఉందని తెలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ వెంటనే సాజన్ ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్లారు. అక్కడ సోనీ మృతదేహం కనిపించింది. తల మీద తీవ్ర గాయాలతో ఆమె పడి ఉన్నారు.

ఆమె ముఖం, ఇతర శరీర భాగాలపై గాయాల గుర్తులు ఉన్నాయి. ఆమె పక్కనే ఓ ఐరన్ పైపు పడి ఉంది. అక్కడే రక్తపు మరకలు కూడా ఉన్నాయి.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా… పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ సమయంలో సాజన్ పరారీలో ఉన్నారు.

నవంబర్ 16 రాత్రి సాజన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సోనిపై కర్కశంగా దాడి చేయడంతో ఆమె చనిపోయారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్.ఆర్. సింఘాల్ మీడియాకు చెప్పారు.

"పన్నేటర్ (గుజరాతీ పెళ్లి సమయంలో ఇచ్చే సంప్రదాయ చీర) ధరించడం, ఇంకా నగదు విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. సాజన్‌ను అరెస్టు చేశాం. కోర్టులో హాజరుపరుస్తాం" అని ఆయన చెప్పారు.

వధువు, వరుడు, హత్య, పంజాబ్

ఫొటో సోర్స్, Alpesh Dabhi

ఫొటో క్యాప్షన్, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

వధువు చేతులపై హెన్నాతో రాసి…

సాజన్‌తో పెళ్లి జరగాల్సిన రోజునే సోనీ హత్యకు గురయ్యారు. పెళ్లి వేడుకలో భాగంగా ఆమె తన చేతులపై హెన్నా కూడా పెట్టుకున్నారు.

కొన్ని కథనాల ప్రకారం… సోనీ, సాజన్ 8 నెలలుగా సహజీవనం చేస్తున్నారు.

సోనీ చేతులపై 'ఐ లవ్ సాజన్' అనే టాటూ కూడా ఉంది. మరో చేతి మీద హెన్నాతో 'సదా సౌభాగ్యావతి' అని రాసి ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)