నల్లగా ఉందని భార్యను సజీవ దహనం చేసిన భర్త, తన క్లయింట్ నిర్దోషి అంటున్న లాయర్, కోర్టు తీర్పు ఏంటంటే..

ఉదయ్‌పూర్, లక్ష్మీ
ఫొటో క్యాప్షన్, లక్ష్మీ హత్య కేసు పతాక శీర్షికలకు ఎక్కింది
    • రచయిత, గీతా పాండే,
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలచివేయవచ్చు

నల్లగా ఉందనే కారణంతో భార్యను సజీవ దహనం చేసిన ఒక వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

తన భర్త కిషన్ దాస్ ఎప్పుడూ తనను నల్లగా ఉన్నావంటూ గేలి చేసేవారని మరణ వాంగ్మూలంలో బాధితురాలు లక్ష్మీ పేర్కొన్నారు.

ఈ హత్య కేసును అత్యంత అరుదైనదిగా, మానవత్వానిపై జరిగిన నేరంగా పేర్కొంటూ ఉదయ్‌పూర్ డిస్ట్రిక్ట్ జడ్జ్ రాహుల్ చౌధరీ నిందితునికి మరణశిక్ష విధించారు.

కిషన్‌దాస్ నిర్దోషి అని, ఈ తీర్పుపై అప్పీల్ చేస్తామని బీబీసీతో ఆయన తరఫు న్యాయవాది అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘‘శరీరానికి ద్రవాన్ని పూసి అగర్‌బత్తీతో..’’

ఎనిమిదేళ్ల క్రితం జరిగిన లక్ష్మీ హత్య కేసుకు సంబంధించి ఈ వీకెండ్‌లో వెలువడిన తీర్పు దేశంలో పతాక శీర్షికలకు ఎక్కింది.

లక్ష్మీపై 2017 జూన్ 24న రాత్రిపూట దాడి జరిగినట్లుగా కోర్టు ఉత్తర్వుల ద్వారా బీబీసీకి తెలిసింది.

చనిపోవడానికి ముందు పోలీసులకు, వైద్యులకు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌కు లక్ష్మీ ఇచ్చిన వాంగ్మూలాన్ని తీర్పులో ప్రస్తావించారు.

2016లో పెళ్లి అయినప్పటి నుంచి తన భర్త తనను 'కాలీ' (నలుపు రంగు) అని, నల్లగా ఉన్నావంటూ తన శరీరాన్ని గేలిచేసేవాడని లక్ష్మీ వాంగ్మూలం ఇచ్చారు.

'నీ చర్మాన్ని తెల్లగా మార్చే ఒక మెడిసిన్ తెచ్చా’నంటూ' కిషన్ దాస్ ఒక ప్లాస్టిక్ బాటిల్‌లో గోధుమ రంగు ద్రవాన్ని తీసుకొచ్చారని ఆమె తెలిపారు. అదే రోజు రాత్రి ఆమె చనిపోయారు.

వాంగ్మూలంలో పేర్కొన్న వివరాల ప్రకారం, ''కిషన్ దాస్ ఆమె శరీరానికి ఆ ద్రవాన్ని పూశారు. అది యాసిడ్‌లా వాసన వస్తుందని ఆమె చెప్పడంతో ఒక అగర్‌బత్తితో ఆమె శరీరానికి నిప్పంటించారు. ఆమె శరీరం కాలడం మొదలవ్వగానే మిగిలిన ద్రవాన్ని ఆమెపై పోసి అక్కడి నుంచి పారిపోయారు.''

గాయపడిన లక్ష్మీని కిషన్‌దాస్ తల్లిదండ్రులు, సోదరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె చనిపోయారు.

భార్యను సజీవ దహనం చేసిన కేసు

ఫొటో సోర్స్, Getty Images

‘‘మన కూతుళ్లను మనం కాకపోతే ఇంకెవరు కాపాడతారు’’

''ఈ హృదయ విదారక, క్రూరమైన నేరం కేవలం లక్ష్మీపైనే కాదు. మానవత్వంపై జరిగిన నేరంగా చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కిషన్‌దాస్ ఆమె నమ్మకాన్ని వమ్ము చేశారు. పైగా ఆమె శరీరం కాలిపోతున్నప్పుడు మిగతా ద్రవాన్ని ఆమెపై చల్లి మరింత దారుణమైన క్రూరత్వాన్ని ప్రదర్శించారు. మానవాళిని షాక్‌కు గురిచేసే నేరం ఇది. ఒక ఆరోగ్యకరమైన, నాగరిక సమాజంలో ఇలాంటి నేరాలను ఊహించలేం'' అని తీర్పులో న్యాయమూర్తి చౌధరీ పేర్కొన్నారు.

ఈ తీర్పు చరిత్రాత్మకమైనదని పేర్కొన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ దినేశ్ పలివాల్, సమాజంలో ఇతరులకు ఇది ఒక గుణపాఠంలా పనిచేస్తుందని ఆశిస్తున్నట్లు బీబీసీతో చెప్పారు.

''పాతికేళ్ల లోపున్న ఒక యువతి దారుణంగా హత్యకు గురయ్యారు. ఆమె ఒకరికి సోదరి, మరొకరికి కూతురు. ఆమెను ప్రేమించే మనుషులు ఉన్నారు. మన కూతుళ్లను మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారు?'' అని ఆయన అన్నారు.

మరణశిక్ష ధ్రువీకరణ కోసం తీర్పు కాపీని హైకోర్టుకు పంపానని పలివాల్ చెప్పారు. అయితే, దోషికి ఈ తీర్పుపై అప్పీల్ చేసే అవకాశం 30 రోజుల వరకు ఉంటుందని తెలిపారు.

ప్రమాదవశాత్తు లక్ష్మీ మరణించారని, ఈ హత్య తన క్లయింట్ కిషన్‌దాస్ చేశారని చెప్పే సాక్ష్యాధారాలు లేవని, అతనిపై తప్పుడు కేసు పెట్టారని బీబీసీకి చెప్పారు కిషన్‌దాస్ లాయర్ సురేంద్ర కుమార్ మెనారియా.

శరీర కాంతిని పెంచే ఉత్పత్తులు

ఫొటో సోర్స్, Getty Images

శరీర రంగుకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారా?

ఉదయ్‌పూర్ కోర్టు ఇచ్చిన తీర్పు, దేశంలో ఒక వ్యక్తి శరీర ఛాయకి ఇచ్చే అనవసర ప్రాధాన్యతను మరోసారి వెలుగులోకి తెచ్చింది.

ముదురు రంగు శరీర ఛాయ ఉన్న అమ్మాయిలు, స్త్రీలను అవమానకర పేర్లతో పిలుస్తుండటంతో వారు వివక్షకు గురవుతున్నారు. చర్మాన్ని కాంతివంతం చేసే ఉత్పత్తులతో పెద్ద వ్యాపారాలు వెలుస్తున్నాయి. బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జిస్తున్నాయి.

వివాహ వేదికలుగా పిలిచే సైట్లలో చర్మం రంగుకు ప్రాధాన్యత ఉంటుంది. కాస్త తెల్లగా ఉండే వధువులకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

''ముదురు రంగు శరీరం'' ఉన్న కారణంగా భర్తల చేతుల్లో అవమానాలు పడలేక మహిళలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనల గురించి బీబీసీ గతంలో కూడా కథనాలు ప్రచురించింది.

తెలుపే మంచిదనే భావనను కార్యకర్తలు ఈ మధ్య కాలంలో సవాలు చేశారు. కానీ, లోతుగా ముద్రించుకుపోయిన ఈ భావనలను మనసుల్లో నుంచి తొలగించడం అంత సులభం కాదని వారు అంటున్నారు.

అది మారేంతవరకు, ఇలాంటి వివక్షాపూరిత వైఖరులు జీవితాలను నాశనం చేస్తూనే ఉంటాయని వారు అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)