ఆ ఊళ్లో వందల మంది మగవారిని వారి భార్యలే చంపేశారు, ఎందుకు? అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా వార్తాపత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్'లో 1929 డిసెంబర్ 14న ప్రచురితమైన ఒక వార్త అమెరికాలో మాత్రమే కాదు, చాలా దూరంలో ఉండే హంగరీ దేశ ప్రజల్ని కూడా ఆశ్చర్యపోయేలా చేసింది.
సుమారు 50 మంది మహిళలపై ఒక కేసు విచారణ మొదలైందని, ఒక గ్రామంలో నివసించే చాలామంది పురుషులకు వారు విషమిచ్చి చంపేశారని ఈ మహిళలపై ఆరోపణలు వచ్చినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు.
చిన్న వార్తగా ప్రచురితమైనప్పటికీ, అందులో చాలా సమాచారం ఉంది.
1911 నుంచి 1929 మధ్య కాలంలో, హంగరీ రాజధాని బుడాపెస్ట్‌కు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉన్న నాగ్యరెవ్ అనే ప్రాంతానికి చెందిన పలువురు మహిళలు 50 కంటే ఎక్కువమంది పురుషులకు విషమిచ్చినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.
ఈ మహిళలను 'దేవదూతల తయారీదారులు' అని పిలిచేవారు. వారు ఆర్సెనిక్ కలిపిన విషపూరిత ద్రవంతో ఆ పురుషులను చంపారు.


ఫొటో సోర్స్, Getty Images
ఏళ్లు గడిచిన తర్వాత దర్యాప్తు
ఆధునిక చరిత్రలో పురుషులపై మహిళలు చేసిన అతిపెద్ద సామూహిక హత్యగా కొందరు ఈ ఘటనను అభివర్ణించారు.
తర్వాత మహిళలను విచారిస్తున్న సమయంలో జోజసానా ఫాజ్కాస్ అనే పేరు పదే పదే వినిపించింది. ఫాజ్కాస్ ఈ గ్రామానికి చెందిన మంత్రసాని.
ఆ కాలంలో నాగ్యరెవ్ గ్రామం ఆస్ట్రో-హంగరీ సామ్రాజ్యం ఆధీనంలో ఉండేది. అక్కడ స్థానిక డాక్టర్లు ఎవరూ లేరు. అందుకే, మంత్రసాని అక్కడి ప్రజలకు మందులు కూడా ఇచ్చేవారు.
ఆ గ్రామంలోని మహిళలంతా ఫాజ్కాస్‌తో తమ వ్యక్తిగత సమస్యల గురించి చెప్పేవారని, ఈ కారణంతోనే ఈ కేసులో ఫాజ్కాస్‌ను ప్రధాన నిందితురాలిగా పేర్కొన్నారని 2004లో బీబీసీ రేడియో డాక్యుమెంటరీలో ఆ గ్రామానికి చెందిన మారియా గుణ్యా చెప్పారు.
భర్తతో లేదా ఇతర పురుషులతో ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని తీర్చే ఒక సులభ పరిష్కారం తన వద్ద ఉందని ఆ మహిళలకు ఫాజ్కాస్ చెప్పారని గుణ్యా అన్నారు.
ఈ సామూహిక హత్యల కేసులో ఫాజ్కాస్‌ను ప్రధాన నిందితురాలిగా పేర్కొన్నారు. అయితే, విచారణ పత్రాల్లోని మహిళల వాంగ్మూలాల ద్వారా అక్కడి పురుషుల దుష్ప్రవర్తన, అత్యాచారాలు, హింస వంటి బాధాకరమైన విషయాలు బయటపడ్డాయి.
ఈ ఘటనలు చాలా ఏళ్ల పాటు బయటకు రాలేదు. హత్యలు 1911లోనే మొదలయ్యాయని, 1929 వరకు వాటిపై దర్యాప్తు జరగలేదని పోలీసు రిపోర్టులు తెలిపాయి. అయితే, ఈ హత్యల గురించి అసలు ఎలా తెలిసింది?

ఫొటో సోర్స్, Getty Images
మొదట ఏం జరిగిందంటే...
ఫాజ్కాస్ 1911లో నాగ్యరెవ్ గ్రామానికి వచ్చారు.
రెండు కారణాల వల్ల ఫాజ్కాస్ అందరి దృష్టిని ఆకర్షించారని గుణ్యాతో పాటు ఈ కేసులోని ఇతర సాక్షులు పేర్కొన్నారు.
మొదటిది, మంత్రసాని పనితో పాటు, ఆమెకు మందుల గురించి కూడా మంచి జ్ఞానం ఉంది. ఆమె తయారు చేసే కొన్ని మందుల్లో రసాయనాలు ఉండేవి. ఇది ఆ ప్రాంతంలో అసాధారణమైన విషయం.
రెండోది, ఆమె భర్త గురించి ఎవరికీ తెలియదు.
''నాగ్యరెవ్‌లో పూజారి కానీ, డాక్టర్ కానీ ఎవరూ లేరు. అందుకే ఆమెకున్న జ్ఞానం అందర్నీ ఆకర్షించింది. ప్రజలు ఆమెను నమ్మడం మొదలుపెట్టారు'' అని గుణ్యా చెప్పారు.
భర్తలు తమ భార్యలను కొట్టడం, బలత్కారం చేయడం, మోసం చేయడం వంటి ఘటనలను ఫాజ్కాస్ గమనించారు. మహిళల ఇళ్లలో జరిగే అనేక విషయాలకు ఆమె సాక్షిగా నిలిచారు.
ఆ కాలంలో అబార్షన్లు చేయడం నిషేధం. అయినప్పటికీ ఆమె అబార్షన్లు చేయడం ప్రారంభించారు. ఈ కారణంగా ఆమె కోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆమెకు ఎప్పుడూ శిక్ష పడలేదు.
ఆనాటి అసలు సమస్య ఏంటంటే, చాలా వరకు పెళ్లిళ్లు కుటుంబాల ఇష్టప్రకారం జరిగేవని గుణ్యా అన్నారు. చాలా చిన్న వయసులో ఉన్న అమ్మాయిలకు చాలా పెద్ద వయసున్న పురుషులతో పెళ్లిళ్లు చేసేవారని చెప్పారు.
ఆ సమయంలో విడాకులు అసాధ్యమని గుణ్యా తెలిపారు. ''మీపై ఎంత అన్యాయం జరిగినా, ఎంత దోపిడీకి గురైనా మీరు విడిపోవడం సాధ్యం కాదు" అని గుణ్యా చెప్పారు.
కుటుంబాలు కుదిర్చిన పెళ్లిళ్లతో పాటు, భూమి, వారసత్వం, చట్టపరమైన బాధ్యతలకు సంబంధించిన ఒక ఒప్పందం కూడా ఉండేదని ఆ కాలం నాటి నివేదికలు చెబుతున్నాయి.
మహిళల సమస్యలను తాను పరిష్కరించగలనని వారిలో ఫాజ్కాస్ నమ్మకం కలిగించడం మొదలుపెట్టారని గుణ్యా బీబీసీకి తెలిపారు.
ఒక పురుషుడికి విషమిచ్చిన మొదటి ఘటన ఆమె వచ్చిన వెంటనే 1911లో జరిగింది. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో, ఆస్ట్రో-హంగరీ సామ్రాజ్యం కూలిపోయినప్పుడు ఇలాంటి సంఘటనలు ఇంకా పెరిగాయి. ఎక్కువ మంది పురుషుల హత్యలు జరిగాయి.
ఈ రకంగా 18 ఏళ్లలో 45 నుంచి 50 మంది పురుషులు మరణించారు. వారందరినీ గ్రామంలోని స్మశానంలో పూడ్చిపెట్టారు.
దీంతో చాలా మంది నాగ్యరెవ్‌ను 'హంతకుల నగరం' అని పిలవడం మొదలుపెట్టారు.
ఈ విషయాలు పోలీసుల దృష్టికి రావడంతో, 1929లో మృతదేహాలను పరిశీలించడానికి సమాధుల నుంచి బయటకు తీశారు. ఆ శవాలలో దొరికిన ఏకైక ఆధారం 'ఆర్సెనిక్'.

ఫొటో సోర్స్, Getty Images
మహిళలపై విచారణ
గ్రామంలో రోడ్డుకి ఎదురుగా ఉన్న ఒక మామూలు ఇంట్లో ఫాజ్కాస్ ఉండేవారు. ఈ ఇంట్లోనే ఆమె అనేక విషపూరిత ద్రవాలను తయారు చేశారు. ఈ ద్రవాలను హత్యలకు వాడారు.
పోలీసులు 1929 జులై19న ఆమెను అరెస్టు చేయడానికి వెళ్లారు.
పోలీసులు తన ఇంటికి వస్తున్నారనే సంగతి తెలిసి, తన ఆట ముగిసిందని ఆమె అర్థం చేసుకున్నారు. వారు ఇంటికి చేరుకునేసరికి, తాను తయారుచేసిన విషాన్ని తాగి ఆమె చనిపోయారు.
కానీ, ఆమె ఒక్కరే నేరస్తురాలు కాదు.
ఇతర మహిళల గురించి కూడా సమాచారం బయటపడటంతో, 1929లోనే సోజ్‌నోక్ పట్టణానికి చెందిన 26 మంది మహిళలను విచారించారు.
వారిలో ఎనిమిది మందికి మరణశిక్ష విధించారు. మిగతా వారిని జైలుకు పంపారు. వారిలో ఏడుగురికి జీవిత ఖైదు విధించారు. చాలా తక్కువ మంది మహిళలు తమ నేరాన్ని అంగీకరించారు. ఈ నేరం వెనుక వారి ఉద్దేశ్యం ఏమిటో సరిగ్గా తెలియరాలేదు.
ఈ కేసులో ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదని బీబీసీతో సోజ్‌నోక్ పట్టణ ఆర్కైవ్ హిస్టారియన్ డాక్టర్ గీజా చెక్ చెప్పారు.
''ఆ మహిళలు హత్యలు ఎందుకు చేశారు అనేదానిపై చాలా అభిప్రాయాలు ఉన్నాయి. పేదరికం, దురాశ, విసుగు వంటివి కారణాలుగా పేర్కొన్నారు. కొన్ని నివేదికలలో చాలా మంది మహిళలకు రష్యన్ యుద్ధ ఖైదీలతో సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. ఈ యుద్ధ ఖైదీలు పొలాల్లో కూలీలుగా పనిచేసేవారు. వారి భర్తలు తిరిగి వచ్చినప్పుడు, ఆ మహిళలు తమ స్వేచ్ఛను కోల్పోతున్నట్లుగా భావించారు. అందుకే వారు ఇలా చేశారని నివేదికల్లో ఉంది'' అని గీజా చెక్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














