నెల్లూరు: నిడిగుంట అరుణ ఎవరు? ఖైదీ శ్రీకాంత్‌కు పెరోల్ ఎవరు ఇప్పించారు?

ఫొటో సోర్స్, facebook.com/aruna.aruna
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
నెల్లూరు జిల్లా జైలు నుంచి పెరోల్‌పై విడుదలైన ఓ యావజ్జీవ ఖైదీని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు అక్కడ హాస్పిటల్ బెడ్‌పై తన స్నేహితురాలితో సన్నిహితంగా మెలిగిన వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి.
వీటిని బీబీసీ స్వయంగా ధ్రువీకరించలేదు.
అనంతరం అది రాజకీయ వివాదానికీ దారి తీసింది.
యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి పెరోల్ ఇవ్వమని సిఫారసు చేసింది మీరంటే మీరంటూ పాలక టీడీపీ, విపక్ష వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఆ ఖైదీ శ్రీకాంత్‌తో వీడియోలలో కనిపించిన స్నేహితురాలు నిడిగుంట అరుణ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయమైంది.
పోలీస్ అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రభావితం చేసి ఆమె శ్రీకాంత్‌కు పెరోల్ ఇప్పించారని, కొన్ని నేరాలలో ఆమెకూ భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు.
గతవారం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
ఓ బిల్డర్‌ను బెదిరించారన్న చిన్న కేసుతో మొదలైన ఈ అరెస్టుతో ఆమెపై ఇంకా అనేక కేసులు వెలుగులోకి వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఇంతకీ ఈ నిడిగుంట అరుణ ఎవరు?
ఈ మొత్తం వ్యవహారంలో అరుణ పాత్ర ఏమిటి?

ఫ్లాట్ విషయంలో వివాదం
అరుణ అరెస్టు గురించి కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.
అరుణను మొదట ఒక ఫ్లాట్‌కు సంబంధించిన బలవంతపు వసూళ్ల కేసులో అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు.
''కోవూరు మండలంలో బిల్డర్ మునగ వెంకట మురళి కృష్ణమోహన్ ఒక అపార్ట్‌మెంట్ నిర్మించారు. అందులో ఒక ఫ్లాట్‌ను నిడిగుంట అరుణ 2020లో అద్దెకు తీసుకున్నారు. 2022లో ఆమె అదే ఫ్లాట్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. అడ్వాన్స్ కొంత చెల్లించి మిగిలిన మొత్తాన్ని 2023లోపు చెల్లిస్తానని బిల్డర్‌తో ఒప్పందం చేసుకున్నారు. అయితే, గడువు ముగిసినా అరుణ మిగిలిన డబ్బు చెల్లించలేదని.. అద్దె కూడా ఇవ్వలేదని అందుకే ఫ్లాట్ ఖాళీ చేయాలని మురళి కృష్ణమోహన్ కోర్టులో కేసు వేశారు'' అని సీఐ వివరించారు.
"2024లో మురళి కృష్ణమోహన్ దగ్గరకు వెళ్లిన అరుణ, ఆమె అనుచరులు ఫ్లాట్ ఆమె పేరు మీద రిజిస్టర్ చేయకపోతే చంపేస్తామని కత్తులతో బెదిరించారని.. తనను కోవూరులోని పెళ్లకూరు కాలనీకి తీసుకెళ్లి, ఫ్లాట్ కొనుగోలుకు అరుణ రూ. 35 లక్షలు చెల్లించినట్లుగా ఒక ఒప్పంద పత్రంపై సంతకాలు చేయించుకున్నారని మురళి ఫిర్యాదు చేశారు" అని సీఐ చెప్పారు.
అరుణ తనను వేధిస్తున్నారంటూ మురళి గతంలోనే పోలీసులను ఆశ్రయించారు. తాజాగా ఆమెపై మీడియాలో వస్తున్న కథనాలు చూసి ఇప్పుడు మరోసారి ఆయన ఫిర్యాదు చేశారు.
నెల్లూరు ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అరుణతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశాయని.. ఆమెను రిమాండ్‌కు తరలించామని సీఐ సుధాకర్ రెడ్డి చెప్పారు.
ప్రస్తుతం ఆమె ఒంగోలు జైల్లో ఉన్నారని.. విచారణ తరువాత మరిన్ని వివరాలు తెలుస్తాయని సుధాకర్ రెడ్డి తెలిపారు.
శ్రీకాంత్, అరుణ గతంలో చేసిన నేరాలపైన ఫిర్యాదులు వస్తున్నాయని.. దర్యాప్తు జరుగుతోందని నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
శ్రీకాంత్‌తో కలిసి సెటిల్మెంట్లు చేసేవారా?
‘ఈ ఫ్లాట్ వివాదం అరుణపై వచ్చిన ఆరోపణలలో ఒక కేసు మాత్రమే. ఆమె వెనుక హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న గూడూరుకు చెందిన శ్రీకాంత్ ఉన్నారు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.
‘శ్రీకాంత్ 2014లో జైలు నుంచి పారిపోయారు. అతడు నాలుగున్నరేళ్ల పాటు పోలీసులకు దొరక్కుండా బయటే ఉన్నారు. హత్యలు, దాడులు, కిడ్నాప్‌లు, సెటిల్మెంట్లు వంటి ఎన్నో కేసుల్లో అతడి ప్రమేయం ఉందని ఆరోపణలున్నాయి. శ్రీకాంత్‌కు, అరుణకు పరిచయం ఉంది’ అని ఆ పోలీస్ అధికారి చెప్పారు.
ఇటీవల శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు కావడం వెనుక అరుణ ప్రమేయం ఉందని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వొద్దంటూ తిరుపతి ఎస్పీ, నెల్లూరు జైలు సూపరింటెండెంట్‌లు నివేదికలు పంపినా.. అరుణ తనకున్న పలుకుబడితో హోం శాఖలో చక్రం తిప్పి పెరోల్ ఇప్పించారని మీడియాలో కథనాలు రావడంతో ఏపీ ప్రభుత్వం శ్రీకాంత్ పెరోల్ ఉత్తర్వులను రద్దు చేసింది.

ఫొటో సోర్స్, facebook.com/aruna.aruna
ఎన్నో ఆరోపణలు
‘నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన అరుణ భర్త కొన్నేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించారు. అనంతరం ఆమె 'వెలుగు' విభాగంలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఆమెపై కొన్ని ఆరోపణలు రావడంతో ఉద్యోగం మానేశారు’ అని ఓ కేసు విషయంలో అరుణను సంప్రదించానని చెప్తున్న రాజ్యలక్ష్మి బీబీసీతో చెప్పారు.
రాజ్యలక్ష్మి అరుణ ఇంటికి సమీపంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు.
‘అరుణది కోవూరు మండలం పడుగుపాడు దళితవాడ. 10వ తరగతి వరకు చదివిన తరువాత ఆమెకు వివాహమైంది. భర్త మరణం తర్వాత ఆమె వెలుగులో చేరారు. అక్కడ కొన్ని వివాదాలు రావడంతో కొంతకాలం వేరే ఎక్కడికో వెళ్లిపోయారు. యానాంలో ఉన్నట్లు నాతో చెప్పేవారు. ఆ తర్వాత మా ఇంటి సమీపంలో పడుగుపాడు రోడ్డు దగ్గర అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. మా షాపులోనే అప్పుగా సరకులు తీసుకెళ్లేవారు.. అలా నాకు పరిచయం’ అని రాజ్యలక్ష్మి చెప్పారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 'దిశ' యాప్‌ను ఆమె తన ఎదుగుదలకు ఒక వేదికగా మార్చుకున్నారని, 'దిశ' ప్రచారకర్తగా, మహిళా సమస్యలపై పోరాడే మహిళగా తనను తాను చెప్పుకుంటూ పోలీసు అధికారులకు దగ్గరయ్యారని, ఈ క్రమంలోనే ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులతో పరిచయాలు పెంచుకున్నారని స్థానికంగా పనిచేసే సీనియర్ జర్నలిస్ట్ దినకర్ రాజు బీబీసీతో చెప్పారు.
'దిశ చైర్మన్' అని చెప్పడంతో తన కుటుంబానికి సంబంధించిన ఒక కేసు పరిష్కారం కోసం ఆమెకు రూ. 2 లక్షల వరకు ఇచ్చానని, అయినా తమకు న్యాయం జరగకపోగా.. అరుణ తమ ఇంటిపై దాడి చేసి తమపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని రాజ్యలక్ష్మి ఆరోపించారు.
ఆరోపణలపై అరుణ ఏమంటున్నారు?
తనపై మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను నిడిగుంట అరుణ ఖండించారు.
ఇది తనపై జరుగుతున్న ఒక వ్యవస్థీకృత దాడి అని ఆమె ఆరోపించారు.
తనపై వస్తున్న ఆరోపణలకు ఆమె అరెస్ట్ కావడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ సమాధానమిచ్చారు.
‘పెరోల్ ఇప్పించే అధికారం నాకు ఎక్కడుంది? అది ఖైదీగా శ్రీకాంత్ హక్కు. దాని ప్రకారం అతను అప్లై చేసుకున్నాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పెరోల్ మంజూరైంది. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. ఇద్దరు ఎస్పీలు వద్దన్నారని చెప్పడం అబద్ధం’ అన్నారామె.
తనపై వచ్చే ఆరోపణలన్నీ కట్టుకథలని, తాను ఒక ఎస్సీ మహిళను కాబట్టే ఇలా లక్ష్యంగా చేసుకుని తన వ్యక్తిగత జీవితంపై బురద జల్లుతున్నారని అరుణ ఆరోపించారు.
‘ఖైదీని ప్రేమించడం నేరమా?’ అని అరుణ ప్రశ్నించారు.
‘నేను శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకుని ఒక సాధారణ గృహిణిగా బతకాలనుకుంటున్నాను. ఒక ఖైదీని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం నేరమా? నా దగ్గర కోట్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. నా ఆస్తులపై విచారణ చేసుకోండి, ఒక్క కోటి రూపాయలు కూడా లేవని తేలుతుంది’ అన్నారామె.
2024 ఎన్నికలలో సూళ్ళూరుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.
ప్రస్తుతం అరుణపై నమోదైన కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
శ్రీకాంత్ ఎవరు?
శ్రీకాంత్‌కు 2010లో ఒక హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడింది. నెల్లూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆయన 2014లో జైలు నుంచి పరారయ్యారు. ఆ తరువాత కొంత కాలానికి పోలీసులకు లొంగిపోయారు.
తర్వాత లొంగిపోయి జైలులో ఉన్నప్పుడు కూడా అతని నేర కార్యకలాపాలు ఆగలేదని ఒక పోలీస్ అధికారి చెప్పారు.
‘శ్రీకాంత్‌ది గూడూరు పట్టణంలోని మాలవీయ నగర్. ఆయన తండ్రి పోస్ట్‌మ్యాన్. ఇంటర్మీడియట్ వరకు చదివిన ఆయనపై అనంతరం నేరారోపణలు రావడంతో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. 2017లో సూళ్ళూరుపేటలో జరిగిన హత్య కేసులో శ్రీకాంత్ ప్రమేయంపై ఆరోపణలున్నాయి. అప్పటికి శ్రీకాంత్ జైలులోనే ఉన్నారు’ అని స్థానిక పాత్రికేయుడు దినకర్ రాజు చెప్పారు.
శ్రీకాంత్‌కు రాజకీయ పరిచయాలున్నాయని.. నరాల సంబంధిత సమస్యల పేరుతో తరచూ తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి వెళ్తుండేవారని.. అక్కడ ఆయనకు ప్రత్యేకంగా రూమ్ ఇవ్వాలని స్వయంగా ఒక మంత్రి ఫోన్ చేసి చెప్పారనే ఆరోపణలు కూడా ఉన్నాయని దినకర్ రాజు చెప్పారు.
శ్రీకాంత్ అరుణకు ఆయింట్‌మెంట్ రాస్తున్నట్లుగా బయటకొచ్చిన వీడియో ఆ ఆసుపత్రిలోనిదేనన్న ఆరోపణలున్నాయి. ఈ వీడియోలో విషయాలను, వీడియో ఎక్కడిదనేది ‘బీబీసీ’ స్వయంగా ధ్రువీకరించలేదు.
కాగా శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వొద్దు అని తాను చెప్పడం వాస్తవమేనన్నారు నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్.
బీబీసీతో మాట్లాడిన ఆయన... శ్రీకాంత్ పెరోల్ విషయం తిరుపతి ఎస్పీ పరిధిలోకి వస్తుందన్నారు.
‘ఆసుపత్రిలో వీడియోలు బయటకు వచ్చిన వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశాం. శ్రీకాంత్‌కు ఎస్కార్ట్‌గా వెళ్లినవారినీ విచారణ చేస్తున్నాం’ అన్నారాయన.
జైల్లో నుంచి శ్రీకాంత్ గ్యాంగులు నడిపారని, హత్యలకు కుట్ర చేశారనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని కృష్ణ కాంత్ తెలిపారు.
కాగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ‘బీబీసీ’తో మాట్లాడుతూ... శ్రీకాంత్ బయటకు వస్తే ఆయనకు ప్రత్యర్థుల నుంచి ప్రమాదం ఉండొచ్చన్న విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆయనకు పెరోల్ ఇవ్వొద్దని సూచించినట్లు చెప్పారు.
‘శ్రీకాంత్ గూడూరుకు చెందిన వ్యక్తి. హత్య కేసులో దోషిగా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనపై అనేక నేరాలలో ఆరోపణలున్నాయి. ఆయన బయటకు వస్తే సంఘవిద్రోహ కార్యకలాపాలు సాగించడమే కాదు, ప్రత్యర్థుల నుంచి కూడా అతని ప్రాణానికి ముప్పు ఉండొచ్చు. అందుకే అతనికి పెరోల్ ఇవ్వొద్దని చెప్పాను'' అని తిరుపతి ఎస్పీ అన్నారు.
శ్రీకాంత్ పెరోల్ కోసం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ లేఖ ఇచ్చారు అని ఆరోపణలు రావడంతో ఆయన కూడా వివరణ ఇచ్చారు.
శ్రీకాంత్ తల్లి గ్రీవెన్స్ డేలో వచ్చి అడగడంతో లేఖ ఇచ్చానని.. తన దగ్గరికి ఎంతోమంది వివిధ సమస్యలపై వస్తుంటారని ఆయన చెప్పారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంపై స్పందించారు. అరుణ పలుమార్లు తనను కలిసి శ్రీకాంత్ పెరోల్ కోసం లెటర్ ఇవ్వమని అడిగారని.. ఇతర నియోజకవర్గాలలో తాను జోక్యం చేసుకోనని చెేప్పి పంపించేశానని ఆయన మీడియాతో చెప్పారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాంత్ తండ్రి, సోదరుడు వచ్చి అడగడంతో పెరోల్‌కు సిఫారసు చేస్తూ లేఖ ఇచ్చానని, కానీ తన లేఖను తిరస్కరించారని చెప్పారు. అనంతరం శ్రీకాంత్‌కు పెరోల్ ఎలా వచ్చిందో విచారణ జరపాలని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














