సముద్ర జలాల్లో చిక్కుకుపోయే నావికులను పట్టించుకోని దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఎందుకుంది?

అంకా కార్గో నౌకకు చెందిన భారతీయ నౌకా సిబ్బంది
ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ పోర్టులో ఏప్రిల్‌ నుంచి వదిలివేసిన అంకా కారోషిప్‌లో భారత్‌కు చెందిన మానస్ కుమార్ ఉన్నారు.
    • రచయిత, నేయాజ్ ఫరూఖీ
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

ఏప్రిల్ నుంచి యుక్రెయిన్ జలాల్లో ఒక కార్గో నౌకలో మానస్ కుమార్ ఉండిపోయారు.

మాల్దోవా నుంచి తుర్కియేకు పాప్‌కార్న్ రవాణా చేస్తున్న ఈ నౌకలో 14 మంది సిబ్బంది ఉండగా.. వారిలో భారత్‌కు చెందిన మానస్ కుమార్ ఒకరు. యుక్రెయిన్, రుమేనియాను విభజించే డానుబే నది మీదుగా వెళ్తున్నప్పుడు ఏప్రిల్ 18న ఈ నౌకపై దాడి జరిగింది.

ఈ అంకా నౌక రష్యాకు చెందిన 'షాడో' ఫ్లీట్‌ అని యుక్రెయిన్ చెప్పింది. లూటీచేసిన యుక్రెయిన్ ధాన్యాలను ఇతర దేశాలకు అమ్మేందుకు ఈ 'షాడో' ఫ్లీట్‌ను రష్యా నడుపుతోందని ఆరోపించింది.

అయితే, టాంజనియా జెండాపై తుర్కిష్ కంపెనీ ఈ నౌకను నడుపుతోందని అంకా చీఫ్ ఆఫీసర్ కుమార్ చెప్పారు.

కానీ నౌకా సిబ్బంది ఇచ్చిన పేపర్లను గమనిస్తే, అసలు ఈ నౌక ఎవరిదో స్పష్టంగా లేదు. మానస్ కుమార్‌తో పాటు, ఐదుగురు ఇతర భారతీయ సిబ్బంది, ఇద్దరు అజర్‌బైజాన్లు, ఆరుగురు ఈజిప్టియన్లు ఈ నౌకలో ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఐదునెలలైనా నౌకలోనే

నౌకా సిబ్బందిని విచారించడం లేదని, వారు వెళ్లిపోవచ్చని యుక్రెయిన్ అధికారులు చెప్పి ఐదు నెలలు అయినా ఇంకా తాము యుక్రెయిన్ జలాల్లోనే ఉన్నట్లు మానస్ కుమార్ తెలిపారు.

"నౌక నుంచి దిగిపోతే వారికి జీతాలు రావు . అంటే జూన్ నాటికి మొత్తం 102,828 అమెరికా డాలర్లు (రూ.89,45,719) జీతాలు పోతాయి" అని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) అంతర్జాతీయ నౌకాశ్రయ సంస్థ (IMO) సంయుక్తంగా నిర్వహిస్తున్న వదిలివేసిన ఓడల డేటాబేస్ ప్రకారం వెల్లడైంది.

నౌకా సిబ్బంది ఇచ్చిన వివరాలను ఆధారంగా చేసుకుని నౌక యజమాన్యాన్ని, యజమానులను బీబీసీ సంప్రదించింది.

'ఇది వార్ జోన్, త్వరగా ఇంటికెళ్లాలని ఉంది'

ఈ ఉద్యోగంలో చేరేటప్పుడు ఈ నౌక గతం గురించి తనకు తెలియదని మానస్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి తమ చేయి దాటిపోయిందన్నారు. ఇప్పుడీ సమస్య పరిష్కారం కావాలని సిబ్బంది కోరుకుంటున్నారు.

కానీ సంక్షోభ పరిష్కారానికి తమకు మరింత సమయం కావాలని నౌక యజమాని, భారత షిప్పింగ్ అధికారులు ఎప్పటికప్పుడూ చెబుతూనే ఉన్నారే కానీ, తమకు ఎలాంటి భరోసా దొరకడం లేదని మానస్ కుమార్ తెలిపారు.

'' ఇది వార్ జోన్. త్వరగా ఇంటికి చేరుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం'' అని మానస్ కుమార్ బీబీసీతో అన్నారు.

నిర్వానా నౌకలో నౌకా సిబ్బంది

ఫొటో సోర్స్, BBC/ITF

ఫొటో క్యాప్షన్, నిర్వాణ నౌకలోని సిబ్బంది సముద్రంలో నెలల తరబడి ఉండి, తిరిగివచ్చాక కూడా జీతాల కోసం వారు ఎదురుచూస్తూనే ఉన్నారు.

'జీతం లేకుండా నౌకను విడిచిపెట్టడం సాధ్యం కాదు'

ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య నౌకలకు సిబ్బందిని, నావికులను అందించే రెండో అతిపెద్ద దేశం భారత్. అలాగే యజమానులు ఎవరూ పట్టించుకోని నావికులు (విస్మృత నావికులు) ఎక్కువ మంది ఉన్న దేశాల్లో భారత్ టాప్‌లో ఉంది.

నౌకా సిబ్బందితో యజమానులు తమ సంబంధాలను తెంచుకుని, వారిని తిరిగి స్వదేశానికి పంపించకుండా, అవసరమైన సదుపాయాలను, వేతనాలను అందించని పరిస్థితిని వివరించేందుకు 2006లో మారిటైమ్ లేబర్ కన్వెక్షన్ విస్మృత నావికులు (అబాండన్డ్ సీఫేరర్స్) అనే పదాన్ని వాడింది.

ప్రపంచవ్యాప్తంగా నావికులకు ప్రాతినిధ్యం వహించే ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) ప్రకారం.. 2024లో 312 నౌకల్లో 3,133 విస్మృత నావికులు ఉన్నారని, వారిలో 899 మంది భారత సంతతికి చెందిన వారని తెలిసింది.

జీతం తీసుకోకుండా నౌకను విడిచి రావడం చాలామందికి సాధ్యం కాదని ప్రత్యేకించి వారు ఈ ఉద్యోగం పొందడానికి, ట్రైనింగ్ సర్టిఫికెట్ పొందడానికి ఏజెంట్లకు భారీగా డబ్బు చెల్లించి ఉంటారని మాజీ నావికుడు మొహమ్మద్ గులామ్ అన్సారీ చెప్పారు. ఈయన ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారత నావికులను స్వదేశానికి చేర్చేందుకు సాయపడుతుంటారు.

నౌకలను ఇలా ఎక్కడైనా యజమానులు వదిలివేయడానికి ప్రధాన కారణం యజమానులు తమ దేశాలలో కాకుండా ఫ్లాగ్ ఆఫ్ కన్వేయన్స్ ఉన్న దేశాలలో ఓడలను నమోదు చేయించుకోవడమే. ఈ నిబంధనలు షిప్పింగ్ రూల్స్‌ను బలహీనపరుస్తున్నాయి.

యజమానులు నౌకలను తమ దేశంలోనే కాకుండా మరో దేశంలో రిజిస్టర్ చేసుకునేందుకు ఇంటర్నేషనల్ మారిటైమ్ రూల్స్ అనుమతి ఇస్తున్నాయి.

''ఒక దేశం ఓడల నమోదును ఏర్పాటు చేసి, నౌకా యజమానులకు ఫీజులు విధించొచ్చు. కానీ అదే సమయంలో నౌకా సిబ్బంది భద్రతకు, సంక్షేమానికి తక్కువ ప్రమాణాలు పాటిస్తున్నారు. పైగా ఆ నౌక ఫ్లాగ్ స్టేట్‌గా ఉండాల్సిన నిబంధనను కూడా కచ్చితంగా పాటించడం లేదు'' అని ఐటీఎఫ్ వెబ్‌సైట్ పేర్కొంది.

ఇది అసలైన యజమాని ఎవరో గుర్తించేందుకు అడ్డంకిగా నిలుస్తుందని, అనుమానాస్పద యజమానులు నౌకలు నడిపేందుకు సాయపడుతుందని చెప్పింది.

2024లో ఐటీఎఫ్ చూపిస్తోన్న డేటా ప్రకారం.. విస్మృత నౌకల్లో సుమారు 90 శాతం ఫ్లాగ్ ఆఫ్ కన్వేయన్స్ కింద నడుస్తున్నాయని తెలిసింది.

షిప్పింగ్ ఇండస్ట్రీ ప్రపంచీకరణ కారణంగానూ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇండస్ట్రీ పరిశీలకులు చెబుతున్నారు.

నౌక యజమానులు, మేనేజర్లు, సిబ్బంది అంతా కూడా తరచూ వివిధ దేశాలకు చెందిన వారు ఉంటున్నారని అన్నారు.

నిర్వానా నౌకలో నౌకా సిబ్బంది
ఫొటో క్యాప్షన్, నిర్వానా నౌకలో వంట చేసుకుంటున్న సిబ్బంది

కెప్టెన్ అమితాబ్ చౌధురి 2025 జనవరి 9న ఇరాక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్తోన్న కార్గో నౌకను, వాతావరణం ప్రతికూలించడంతో కాస్త పక్కకు దారి మళ్లించారు.

ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే టాంజనియా జెండాతో వెళ్తోన్న ఈ స్ట్రాటోస్ నౌక కిందనున్న రాళ్లను ఢీకొట్టడంతో ఆయిల్‌ ట్యాంక్ పాడైపోయింది.

సౌదీ అరేబియా జుబైల్ ఓడరేవుకు సమీపంలో ఈ నౌక తప్పనిసరి పరిస్థితుల్లో ఆగిపోవాల్సి వచ్చింది.

ఈ నౌకలో తొమ్మిది మంది భారతీయులు, ఇరాక్‌కు చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. వీరు నౌక తిరిగి ప్రయాణించేలా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అది తిరిగి బయల్దేరే వరకు ఆరునెలలపాటు వీరు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది.

నౌక నిలిచిపోవడం వల్ల వచ్చిన నష్టంతో సిబ్బందికి తాను జీతాలు చెల్లించలేనని ఇరాక్‌కు చెందిన ఈ నౌక యజమాని చెప్పినట్లు చౌధురి బీబీసీతో అన్నారు.

ఈ ఆరోపణలపై స్పందన కోసం నౌక యజమానులను బీబీసీ సంప్రదించింది. అయితే, వారు స్పందించలేదు.

నావికులు తరచూ భారత మారిటైమ్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్(డీజీ) ఆఫ్ షిప్పింగ్‌ను నిందిస్తుంటారు. ఎందుకంటే, ఈ నియంత్రణ సంస్థే నౌక అధికార పత్రాలను, దాని యజమానులను, నియామకాలు, ప్లేస్‌మెంట్‌లు జరిపే ఏజెన్సీలను పరిశీలించి, ధ్రువీకరించాలి. అయితే దీనిపై స్పందన కోసం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్‌ను సంప్రదించగా స్పందించలేదు.

మరోపక్క సిబ్బంది కూడా అప్రమత్తతో ఉండాలని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు.

''మీ నియామకం జరిగినప్పుడు , మీ కాంట్రాక్ట్‌లో ఏమైనా లోపాలుంటే డీజీ షిప్పింగ్‌కు తెలియజేసేందుకు మీకు తగినంత సమయం ఉంటుంది'' అని నావికుల సంక్షేమం కోసం పనిచేసే ఐటీఎఫ్ సుశీల్ డియోరుఖ్ఖర్ చెప్పారు.

పేపర్లపైన సంతకం పెట్టి, చిక్కుకుపోయినప్పుడు సమస్య పరిష్కారం కోసం ప్రతి ఒక్కరి తలుపు తట్టాల్సి ఉంటుందని తెలిపారు.

దేశీయంగా తిరిగే నౌకల్లోని సిబ్బంది కూడా వివిధ కారణాల రీత్యాల సమస్యలను ఎదుర్కోవచ్చు.

కురసావో జెండాతో ఉన్న భారత్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్‌ నిర్వానాలో 22 మంది భారతీయ నౌకా సిబ్బందితో పాటు కెప్టెన్ ప్రబ్‌జీత్ సింగ్ కూడా ఉన్నారు. ఇటీవలే ఈ నౌకను కొత్త యజమానికి అమ్మేశారు. అయితే, ఈ కొత్త యజమాని నౌకను సర్వీసు నుంచి తొలగించాలని అనుకున్నారు. కానీ. నౌక సిబ్బంది జీతం విషయంలో కొత్త, పాత యజమానుల మధ్య వివాదం తలెత్తింది.

ఏప్రిల్ నెల ప్రారంభంలో నిర్వానా నౌకను సర్వీసు నుంచి తీసేసే ప్రక్రియ కోసం గుజరాత్ రాష్ట్రంలోని ఓడరేవుకు తీసుకెళ్తున్నప్పుడు, సిబ్బందికి జీతాలు చెల్లించనందుకు దాన్ని సీజ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఐఎల్ఓ-ఐఎంఓ డేటాబేస్‌లో తెలిసింది.

ఆ తర్వాత కొన్నిరోజుల్లోనే వారిని కొత్త యజమాని వదిలేసినట్లు సిబ్బంది గుర్తించారు.

''మాకు అవసరమైన ఆహారం, సదుపాయాలను అందించలేదు. నౌకలో డీజిల్ అయిపోయింది. పూర్తిగా బ్లాకవుట్ అయింది'' సింగ్ బీబీసీతో చెప్పారు.

వంట చేసుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో నౌక చెక్కను కాల్చాల్సి వచ్చిందన్నారు.

2024 అక్టోబర్‌లో జాబ్ వచ్చినప్పుడు, ఈ ఉద్యోగంతో గౌరవప్రదంగా జీవించవచ్చని ఆశించినట్లు సింగ్ తెలిపారు.

సెటిల్మెంట్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసిన తర్వాత జులై 7న సిబ్బంది నౌక నుంచి బయటకు రాగలిగారు. అయితే, కోర్టు ఆదేశించినప్పటికీ ఇంకా సిబ్బందికి జీతాలు చెల్లించలేదని ఐఎల్ఓ-ఐఎంఓ డేటాబేస్‌ తెలిపింది.

స్ట్రాటోస్ సిబ్బంది
ఫొటో క్యాప్షన్, సముద్రంలో నెలల తరబడి చిక్కుకుపోయిన స్ట్రాటోస్ నౌక మేలో తిరిగి బయల్దేరడంతో ఉద్యోగులు సంబరపడ్డారు.

ఇక గల్ఫ్‌లో నౌక కింద ఏర్పడిన రంధ్రం వల్ల ఈ నౌక ఎప్పుడైనా మునిగిపోవచ్చని భయపడుతున్నట్టు స్ట్రాటోస్ సిబ్బంది తెలిపారు. కానీ దీనికి మించిన సవాలు వారికి ఆకలి రూపంలో ఎదురైంది.

''కొన్నిరోజుల పాటు మేం కేవలం అన్నం లేదా బంగాళదుంపలు తిన్నాం. మాకెలాంటి సరుకులు అందించలేదు '' అని చౌధరి గతవారం బీబీసీకి చెప్పారు.

ఆరు నెలల అయిన తర్వాత, నౌకలోని సిబ్బంది తిరిగి ప్రయాణించేందుకు వీలు కుదిరింది.

కానీ, యాక్సిడెంట్ వల్ల నౌక వెనుక భాగంలో ఉండే మెటల్ భాగం (రడ్డర్) పాడైపోవడంతో ఇది ప్రయాణించేందుకు అనువుగా లేకుండా పోయింది.

సిబ్బంది ఇంకా నౌకలోనే ఉండి జీతాల కోసం ఎదురుచూస్తున్నారు.

''మేమింకా అదే ప్రాంతంలో అదే పరిస్థితిలో ఉన్నాం. నా మైండ్ పనిచేయడం ఆగిపోయింది. ఏం చేయాలో కూడా ఆలోచించలేకపోతున్నాం'' అని చౌధురి చెప్పారు.

'' కనీసం కొంత సాయం మాకు దొరకదా? మాకు ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను కలవాలనుకుంటున్నాం'' అని తెలిపారు.

వ్యక్తిగత గుర్తింపును కాపాడేందుకు ఈ కథనంలో కొన్ని పేర్లను మార్చాం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)