20 అంతస్తులు, ఏడు స్విమ్మింగ్ పూల్స్.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ షిప్‌లో ఇంకా ఏమేం ఉన్నాయి?

ఫొటో సోర్స్, Reuters
ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక అమెరికాలో ఫ్లోరిడాలోని మయామీ నుంచి తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. దీని పేరు ‘ఐకాన్ ఆఫ్ ద సీస్’.
‘టైటానిక్’ షిప్‌తో పోలిస్తే ఇది చాలా పెద్దది. టైటానిక్ 882 అడుగుల పొడవుంటుంది. తొమ్మిది డెక్‌లు మాత్రమే ఉంటాయి. కానీ ఈ ఐకాన్ ఆఫ్ ద సీస్ పొడవు 1,197 అడుగులు. అంటే సుమారు 365 మీటర్లు. ఇందులో 20 డెక్‌లు ఉన్నాయి.
ఈ నౌక ప్రయాణంలో విడుదలయ్యే మిథేన్ ఉద్గారాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వీటి నడుమే ఇది ప్రయాణం మొదలుపెట్టింది.
గరిష్ఠంగా 7,600 మంది ఈ నౌకలో ప్రయాణించవచ్చు. ఈ నౌక రాయల్ కరీబియన్ గ్రూప్‌కు చెందినది.
ఇది ఏడు రోజుల పాటు వివిధ ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రయాణిస్తూ పలు దీవులను చుట్టిరానుంది.
లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్‌ఎన్‌జీ)తో నడిచే ఈ నౌకపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల అత్యంత ప్రమాదకర మిథేన్ గాలిలోకి విడుదలయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
‘‘తప్పుడు నిర్ణయం ఇది’’ అని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్(ఐసీసీటీ) మెరైన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ బ్రయాన్ కోమర్ అన్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘‘సముద్ర ఇంధనంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్‌జీ)ను వాడటం వల్ల మెరైన్ గ్యాస్ ఆయిల్‌తో పోలిస్తే 120 శాతానికి పైగా అధిక ‘లైఫ్-సైకిల్ గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలు’ విడుదల కానున్నాయి’’ అని ఆయన తెలిపారు.
ఎల్ఎన్‌జీతో నడిచే నౌకలు ప్రస్తుత నియంత్రణ చట్టాలు అంచనా వేసిన దాని కంటే అత్యధికంగా మిథేన్ ఉద్గారాలను విడుదల చేయనున్నాయని ఇటీవల ఐసీసీటీ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.
సముద్ర ఇంధనాలుగా ప్రస్తుతం వాడుతున్న వాటితో పోలిస్తే ఎల్‌ఎన్‌జీ కాస్త స్వచ్ఛమైనదే. కానీ, ఈ ఇంధనం గాలిలో లీకయ్యే ప్రమాదముంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
రాయల్ కరీబియన్ ఏం చెబుతోంది?
అత్యంత శక్తిమంతమైన గ్రీన్‌హౌస్ గ్యాస్ మిథేన్ వాతావారణంలో కలిస్తే 20 ఏళ్లలో కార్బన్ డయాక్సైడ్‌తో పోలిస్తే 80 రెట్లు ఎక్కువ వేడిమి కలగజేయనుంది. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు ఈ ఉద్గారాలను తగ్గించడం చాలా కీలకం.
అధునాతన నౌకలకు ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన దాని కంటే 24 శాతం ఎక్కువగానే ఇంధన సమర్థతను ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ కలిగి ఉందని రాయల్ కరీబియన్ అధికార ప్రతినిధి చెప్పినట్లు మీడియా సంస్థలు తెలిపాయి. 2035 నాటికి జీరో ఉద్గారాలతో నౌకను ప్రవేశపెట్టాలని కంపెనీ చూస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం ఇంటర్ మయామీ తరఫున ఆడుతున్న అర్జెంటీనా ప్రపంచ కప్ విజేత కెప్టెన్ లియోనెల్ మెస్సీ గురువారం ఈ నౌక ‘నేమింగ్ సెరిమనీ’లో పాల్గొన్నారు.
ప్రత్యేకంగా రూపొందించిన స్టాండ్‌పై ఫుట్‌బాల్‌ను ఉంచిన మెస్సీ.. నౌకా ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటూ సంప్రదాయబద్ధంగా నౌక ముందు నిల్చుని శాంపైన్ బాటిల్ పగలకొట్టారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images
నౌక నిర్మాణానికి అయిన ఖర్చెంత?
‘ఐకాన్ ఆఫ్ ద సీస్’ నిర్మాణానికి మొత్తం 2 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.16,624 కోట్లు ఖర్చయింది.
ఏడు స్విమ్మింగ్ పూల్స్, ఆరు నీళ్లలో జారుడ బండలు, 40కి పైగా రెస్టారెంట్లు, బార్లు, లాంజ్‌లు దీనిలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఐఎన్ఎస్ విశాఖపట్నం: 22 మంది భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై హుతీల క్షిపణి దాడి, స్పందించిన భారత నౌకాదళం
- పీతలకు ‘రక్షణ కవచం’గా బాటిల్ మూతలు.. హృదయం ముక్కలైందన్న శాస్త్రవేత్తలు
- వెంకి రామకృష్ణన్: ముసలితనాన్ని, మృత్యువును ఆపగలమా...భారత సంతతి నోబెల్ గ్రహీత ఏం చెబుతున్నారు?
- ‘డిసీజ్ ఎక్స్’ అంటే ఏమిటి? కరోనా లాంటి మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు మనం సిద్ధమేనా?
- అమెజాన్ అడవుల్లో బయటపడ్డ పురాతన నగరం.. అత్యాధునిక రహదారి వ్యవస్థ, కాల్వల నిర్మాణంతో వేలమంది నివసించిన ఆనవాళ్లు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















