తైవాన్ ‘పాల సముద్రం’: సుందర ద్వీపం కింద విషం చిమ్మే సాగర రహస్యం

ఫొటో సోర్స్, Dr Mario Lebrato
- రచయిత, డానిష్ గార్డెనర్
- హోదా, బీబీసీ కోసం
ఓ ఘాటు వాసన ముందుగా నన్ను తాకింది. అది కుళ్లిన గుడ్ల వాసన. మా బోటు కింద సముద్రగర్భ అడవి ఉందని, అది గంధకపు అగ్నిపర్వత వాయువులను వెదజల్లుతోందని చెప్పటానికి గుప్పున వస్తున్న ఆ వాసనే ఆధారం.
సమీపంలో అడవి కప్పేసిన అగ్నిపర్వతపు దీవి ఉంది. మాకు తీరానికి మధ్యనున్న నీరు.. మిగతా సముద్రపు నీలి రంగుకు చాలా భిన్నంగా.. మణి నీలం రంగులో అద్భుతంగా కనిపిస్తోంది. ఈ రమణీయ ప్రకృతి దృశ్యంలో ఇలాంటి వాసన రావటం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.
తైవాన్ ఈశాన్య తీరం నుంచి సముద్రం మీద.. టర్టిల్ దీవి చుట్టూ తిరిగి సుమారు 12 కిలోమీటర్ల దూరం వచ్చాం. తైవాన్‌లో క్రియాశీలంగా ఉన్న రెండు అగ్నిపర్వతాల్లో ఇదొకటి. దాదాపు 7,000 సంవత్సరాల పురాతనమైనది. దీవుల వయసును చూసినపుడు దీని వయసు చాలా తక్కువే.
ఈ దీవి తాబేలు ఆకారంలో ఉంటుంది. అందమైన కొండ శిఖరాలు, సైనిక సొరంగాలు, తీరానికి కాస్త దూరంగా డాల్ఫిన్ల వీక్షణ.. ఈ హంగులన్నీ ఉన్న ఈ దీవి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
అయితే.. ఈ దీవికి తూర్పు వైపున, ఈ తాబేలు తల పైకి సముద్రం వెలుపలికి వంగుతున్న చోట.. లేత రంగులో కనిపించే ఈ జలాలు ఇటు ఇన్‌స్టాగ్రామర్లను, అటు శాస్త్రవేత్తలను అబ్బురపరుస్తున్నాయి.

ఫొటో సోర్స్, TopPhotoImages/Getty Images
మిల్కీ సీ – అంటే పాల సముద్రం అని ముద్దు పేరు పెట్టిన ఈ ప్రాంతం అందం, క్రూరత్వం కలగలిసిన చోటు. ఇక్కడి అందమైన రంగులు ఫొటోగ్రాఫర్లను ఆకర్షిస్తాయి. కానీ ఉపరితలం నుంచి కొంత దిగువకు వెళితే అక్కడి నీరు వేడిగా, ఆమ్లధార లాగా ఉంటుంది.
ప్రపంచ సముద్రాల్లో పీహెచ్ విలువ సహజంగానే అతి తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదొకటి. ఇలా ఎందుకు జరుగుతుందనేది శాస్త్రవేత్తలకు ఇప్పటివరకూ పూర్తిగా అంతుచిక్కలేదు.
ఇక్కడ సముద్ర ఉపరితలం మీద డజన్ల సంఖ్యలో హైడ్రోథర్మల్ వెంట్స్ (ఉష్ణనీటి కన్నాలు).. విషవాయువులను, భారలోహాలను వెదజిమ్ముతూ చిమ్నీల లాగా కనిపిస్తాయి. వీటిని ఫ్యూమరోల్స్ అంటారు.
ఈ టర్టిల్ ఐలండ్ చిమ్నీలు.. సహజ ప్రయోగశాల వంటివి. అవి తీరానికి దగ్గరగా, తక్కువ లోతులోనే ఉంటాయి. చాలా చిమ్నీలు ఉపరితలం నుంచి 14 మీటర్ల కన్నా తక్కువ లోతులోనే ఉన్నాయి. దీనివల్ల సముద్ర శాస్త్రవేత్తలు వీటి దగ్గరకు వెళ్లి అధ్యయనం చేయటం సులభమవుతోంది.

ఫొటో సోర్స్, Dr Mario Lebrato
‘‘ఇక్కడ సముద్రగర్భంలో దృశ్యం మరో ప్రపంచంలాగా కనిపిస్తుంది. అక్కడ భారలోహాలున్నాయి. అక్కడంతా యాసిడిక్‌గా ఉంటుంది. చాలా బుడగలు శబ్దం చేస్తూ కనిపిస్తాయి. ఉష్ణోగ్రతలు నిరంతరం మారిపోతుంటాయి’’ అని డాక్టర్ మారియో లెబ్రటో వివరించారు.
జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ కీల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోసైన్సెస్ విభాగం, తైవాన్, చైనా పరిశోధకులతో కలిసి 2009 నుంచి 2018 వరకూ పదేళ్ల పాటు సాగించిన అధ్యయనంలో భాగంగా ఆయన ఎన్నోసార్లు ఇక్కడ డైవ్ చేశారు.
ఈ చిమ్నీల నుంచి నీరు బయటకు వచ్చేటపుడు దాదాపు 100 సెంటీగ్రేడ్ల వేడిగా ఉంటుంది. ఆ నీరు బయటకు వచ్చి చుట్టూ ఉన్న సముద్ర నీటిలో కలవగానే వేగంగా చల్లబడిపోతుంది.
‘‘ఫ్యూమరోల్స్ నుంచి వచ్చే శబ్దం చెవులు దిబ్బుళ్లు పడేలా చేస్తుంది. అక్కడున్నంత సేపూ ప్రమాదంలో ఉన్నట్లు అనిపిస్తుంది’’ అని తెలిపారు డాక్టర్ మారియో.
ఇటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు.. వందల కోట్ల సంవత్సరాల కిందట భూమి మీద తొలుత జీవం ఆవిర్భవించినపుడు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ మిల్కీ సీలో మనుగడ సాగించగలిగేలా పరిణామం పొందిన జీవులను అధ్యయనం చేయటం ద్వారా.. 350 కోట్ల సంవత్సరాల కిందటి తొలి జీవరూపాల గురించి కొంత తెలుసుకోవచ్చు.
‘‘జీవం మూలాలను విశదీకరించటానికి సంబంధించినది ఏమైనా తెలుసుకోలేకపోవచ్చు. కానీ.. తొలినాటి కొన్ని లక్షల సంవత్సరాల్లో.. టర్టిల్ ఐలండ్ వంటి పరిస్థితులను పోలిన తీవ్ర పరిస్థితుల్లో జీవం ఎలా పరిణామం చెందిందనేది తెలుసుకోగలిగే అవకాశముంది’’ అని డాక్టర్ మారియో వివరించారు.
ఇక్కడ ఏ రకం జీవులు మనగలుగుతున్నాయి, అవి ఎలా జీవించగలుగుతున్నాయి, జీవవైవిధ్యం ఎంత తక్కువగా ఉంది.. అనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Dr Mario Lebrato
మరి ఈ నీటి కింద జీవించే జీవులు ఏమిటి?
ఈ చిమ్నీల చుట్టుపక్కల నేరుగా చూస్తే పెద్దగా ఏమీ లేవు. క్జెనోగ్రాప్సస్ టెస్టుడినాటస్ అనే ఓ ప్రత్యేకమైన పీత మాత్రమే ఇక్కడ మనగలుగుతోందని.. ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ యిమింగ్ వాంగ్ చెప్పారు.
‘‘ఈ చిమ్నీల సమీపంలో మరే ఇతర బహుకణ జీవులూ కనిపించలేదు. గంధకపు ద్రవ వాయువుల విషపూరిత వాతావరణం దీనికి కారణం’’ అని ఆమె తెలిపారు.
ఆ పీతలు మాత్రం.. పొరపాటున ఈ చిమ్నీల సమీపంలోకి వచ్చి ప్రాణాలు వదిలే చేపలు, సూక్ష్మజంతువులతో పాటు.. సముద్రగర్భం మీద ఉండే సూక్ష్మజీవులను తింటూ బతికేలా పరిణామం పొందాయి.
సల్ఫర్ బాక్టీరియా - గంధకాన్ని ఉపయోగించుకునే బాక్టీరియాను కూడా ఆహార వనరుగా ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కూడా అవి పొంది ఉండవచ్చునని డాక్టర్ వాంగ్ అంటారు.
ఈ పీతల జాతిని ఇటీవలి కాలంలోనే.. 2000 సంవత్సరంలో గుర్తించారు. ఈ రంగంలో పరిశోధన ఇంకా కొత్తగానే ఉంది. కాబట్టి ఇటువంటి విషపూరిత వాతావరణాన్ని ఈ పీతలు ఎలా తట్టుకోగలుగుతున్నాయనేది ఇంకా మిస్టరీగానే ఉంది.
ఇక ఈ చిమ్నీలకు కాస్త దూరంగా వెళితే కథ పూర్తిగా వేరేగా ఉంటుంది. వీటికి ఆమడ దూరంలో సముద్ర పూలు, నత్తలు, గుల్లలు, అనేక రకాల, రంగుల పగడాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇక మిల్కీ సీ ప్రాంతానికి వెలుపల.. టర్టిల్ ఐలండ్ చుట్టూ ఉన్న జలాల్లో సముద్ర జీవుల రాశి ఉంది. ఇవి తైవాన్‌లో అతి సంపన్నమైన చేపల వేట ప్రాంతాలు. ఇక్కడ డాల్ఫిన్ల మందలు ఇబ్బడిముబ్బడిగా ఉండటమే ఇందుకు సాక్ష్యం. ఈ దీవికి పర్యాటకులు రావటానికి ఈ డాల్ఫిన్లే ప్రధాన ఆకర్షణ.
టర్టిల్ ఐలండ్ దగ్గర ఈ హైడ్రోథర్మల్ వెంట్లను అధ్యయనం చేయటం.. మరో విధంగా కూడా చాలా అవసరం. విపరీతమైన మార్పులను సముద్ర పర్యావరణం ఎలా తట్టుకోగలదు అనేదానికి ఇక్కడ కొన్ని క్లూలు లభించవచ్చు.
‘‘విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో సముద్ర జీవులు ఎలా మనగలుగుతాయనేది అధ్యయనం చేయటానికి టర్టిల్ ఐలండ్ మనకు అవకాశం కల్పిస్తోంది. సముద్ర భవిష్యత్తును అర్థం చేసుకోవటానికి ఈ అధ్యయనం చాలా అవసరం’’ అని డాక్టర్ మారియో పేర్కొన్నారు.
వీరి సుదీర్ఘ అధ్యయనంలో సగం పూర్తయ్యాక జరిగిన పరిణామాలతో.. వారి పరిశోధన దిశ మారిపోయింది. 2016లో తైవాన్‌ను.. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత గల భూకంపం కుదిపేసింది. ఆ తర్వాత కొన్ని వారాలకే ఐదో కేటగిరీ టైఫూన్ నెపార్టాక్.. తైవాన్‌ను అతలాకుతలం చేసింది.
వీటివల్ల టర్టిల్ ఐలండ్ మీద కొండిచరియలు విరిగిపడ్డాయి. అవి చాలా చిమ్నీలను కప్పివేశాయి. సముద్రంలోని ఈ వేడినీటి ఊటలు చాలావరకూ మూసుకుపోవటంతో.. ఇక్కడి సముద్రజలాల రసాయన మిశ్రమం, పీహెచ్ స్థాయి చాలా మారిపోయాయి.
చిత్రమేమిటంటే.. ఈ మార్పుల వల్ల ఇక్కడి సముద్రగర్భంలో పర్యావరణ వ్యవస్థ పెద్దగా మారలేదు. ప్రధానమైన జీవులేవీ చచ్చిపోలేదు. ఈ పరిశోధకులు 2019లో ప్రచురించిన అధ్యయనం ఈ విషయం చెప్తోంది.
‘‘విపరీతమైన మార్పులకు అనుగుణంగా సర్దుకుపోయే అద్భుత సామర్థ్యం సముద్ర జీవులకు ఉంది. ఎంత భారీ ఆటంకం ఎదురైనా.. జీవం, మొత్తంగా జీవవ్యవస్థ కూడా రెండేళ్లలో తన పూర్వపు స్థాయికి పునరుద్ధరణ పొందగలిగిందని మా అధ్యయనంలో కనుగొన్న ముఖ్యమైన విషయం’’ అని డాక్టర్ మారియో వివరించారు.
అయితే.. ఈ సామర్థ్యం అన్ని జీవులకూ సమానంగా లేదు. చిమ్నీల దగ్గర జీవించే ప్రత్యేకమైన పీతల సంఖ్య తగ్గిపోయింది. నత్తలు, గుల్లల సంఖ్యలో తేడా రాలేదు. ఆహారంలో భాగంగా సల్ఫర్ బ్యాక్టీరియా అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్న ఈ పీతలకు.. మిగతా జీవ జాతులతో పోలిస్తే ప్రమాదం ఎక్కువగా ఉందని వాంగ్ వివరించారు. ఆహారం విషయంలో మరింత వెసులుబాటు గల జీవులు మెరుగుగా తట్టుకోగలిగాయి. కాబట్టి.. భారీ విధ్వంసక ఘటనల్లో కొందరు విజేతలు, కొందరు పరాజితులు ఎప్పుడూ ఉంటారు.
ఇక్కడికి వచ్చే పర్యాటకులు చాలా మందికి.. సముద్రం అడుగున జరుగుతున్న అద్భుతమైన జీవన పోరాటం గురించి ఎప్పుడూ తెలియదు. ఇక్కడ కనిపించే డాల్ఫిన్లను చూసి ఆనందిస్తారు. ఆశ్చర్యకరమైన మణి నీలం రంగులో కనిపించే మిల్కీ సీ ఫొటోలు తీసుకుంటారు. దీవిలో అందంగా కనిపించే కొండ శిఖరాలతో సెల్ఫీలు దిగుతారు.
తైవాన్ 1970లలో సైనిక చట్టం అమలు చేసినపుడు ఈ దీవిని 23 ఏళ్ల పాటు మూసివేసింది. ఇక్కడ సొరంగాలు, నిఘా టవర్లు నిర్మించింది. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ దీవిలో రాత్రిపూట గడపటం నిషిద్ధం. పర్యావరణాన్ని పరిరక్షించటానికి కేవలం పగటిపూట మాత్రమే పర్యాటకులను అనుమతిస్తారు. పర్యాటకులు ఈ సైనిక సొరంగాలు, స్థావరాలను వీక్షిస్తూ.. అడవిలో నడకలతో ఆనందిస్తారు.
ఇవి కూడా చదవండి:
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- జపాన్ దీవుల్లోని కొండకోనల్లో దాగిన ప్రాచీన ఆలయాల విశేషాలు...
- పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
- జమ్మూ: క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, ఇది ఎందుకు అంత ప్రమాదకరం?
- జపాన్: సముద్ర గర్భంలో అంతుచిక్కని ‘ప్రాచీన నగరం’
- ఆల్ఫ్స్ పర్వతాల్లో మంచు వింతగా ఎరుపు రంగులో ఎందుకుంది
- అమెరికాలో 15 రాష్ట్రాలను వణికిస్తున్న చేప
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- భారీ తిమింగలాలతో పాటు ఎన్నో సముద్ర జీవులను చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం
- సుమత్రా: జీవవైవిధ్యం పరిరక్షణ కోసం ఒక యువతి ఒంటరి పోరాటం
- అనంతపురం విషపు సాలీడు ఎందుకు అంతరించిపోతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












