వాతావరణ మార్పులు: కర్బన ఉద్గారాలను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశాలు ఏమైనా చర్యలు చేపట్టాయా?

కార్బన్ న్యూట్రల్‌గా మరేందుకు వివిధ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి
    • రచయిత, రియాలిటీ చెక్ టీం
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచంలో అధిక శాతం కర్బన ఉద్గారాలకు యూరోపియన్ యూనియన్‌ సహా నాలుగు పెద్ద దేశాలే కారణం.

భూతాపాన్ని పెంచే గ్రీన్‌హౌస్ వాయువుల్లో కార్బన్ డయాక్సైడ్‌దే ప్రధాన పాత్ర.

ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండేందుకు ఉద్గారాలను తగ్గిస్తామని ఈ అయిదూ 2015లో పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి.

అప్పటి నుంచి ఈ దేశాలు తీసుకున్న చర్యలేమిటి?

ప్రపంచంలో అత్యధిక కర్బన ఉద్గార దేశం చైనా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రపంచంలో అత్యధిక కర్బన ఉద్గార దేశం చైనా

చైనా: ప్రపంచంలో అత్యధిక ఉద్గారాలు ఇక్కడి నుంచే

చైనా ఏం చెప్పిందంటే..

  • 2030కి ముందే కార్బన్ ఉద్గారాలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి
  • 2030 నాటికి శిలాజేతర వనరుల నుంచి 25 శాతం ఇంధన శక్తిని ఉత్పత్తి చేయడమే లక్ష్యం
  • 2060 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారుతామని వాగ్దానం

కార్బన్ న్యూట్రాలిటీ అంటే కార్బన ఉద్గారాల్లో సమతుల్యం సాధించడం. వాతావరణం నుంచి ఉద్గారాలను తగ్గించేందుకు చెట్లు నాటడంతో సహ పలు చర్యలు తీసుకోవడం ద్వారా నెట్ జీరో సాధించవచ్చు.

కార్బన్ డయాక్సైడ్‌ను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశం చైనా. ప్రపంచంలో పావు వంతు ఉద్గారాలకు ఈ దేశమే కారణం.

విదేశాలలో కొత్త బొగ్గు ఆధారిత ప్రాజెక్టులకు నిధులను నిలిపివేస్తున్నట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గత నెలలో ప్రకటించారు.

కానీ స్వదేశంలో ఇంధన శక్తికి పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాలని ఆదేశించారు.

అయితే, 2026 నాటికి బొగ్గు వాడకాన్ని తగ్గిస్తామని చైనా వాగ్దానం చేసింది.

పునరుత్పాదక వనరుల విషయంలో చైనా కొంత ప్రగతి సాధించింది. ప్రపంచ సౌరశక్తిలో మూడింట ఒకవంతు కన్నా ఎక్కువ భాగం చైనా ఉత్పత్తి చేస్తోంది. అలాగే, పవన శక్తిలో అతి పెద్ద ఉత్పత్తిదారుగా ఉంది.

కానీ, 2060 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే బొగ్గు డిమాండ్‌ను 80 శాతం కంటే ఎక్కువ తగ్గించుకోవాలని 'ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ' తెలిపింది.

అయితే చైనా విధానాలు, చర్యలు "సరిపడినంత" లేవని క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ తెలిపింది. అన్ని దేశాలూ ఇదే మార్గాన్ని అనుసరిస్తే ప్రపంచ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతాయని వెల్లడించింది.

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా: తలసరి ఉద్గారాలు అత్యధికం

అమెరికా లక్ష్యాలు ఇవి..

  • 2030 నాటికి కార్బన్ డయాక్సైడ్‌ను 2005 స్థాయిలో కనీసం 50 శాతాన్ని తగ్గించాలి
  • 2030 కల్లా కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాహనాల్లో సగం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలి
  • 2050 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారాలి

అమెరికాలో 80 శాతం కన్నా ఎక్కువ ఇంధన శక్తి శిలాజ వనరుల నుంచి వస్తోంది. అయితే, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం క్రమంగా పెరుగుతోంది.

కాగా, గ్రీన్ ఎనర్జీని మరింత విస్తరించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. శిలాజ ఇంధనాల నుంచి మారే కంపెనీలకు పారితోషకం ఇచ్చేందుకు 150 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,23,357 కోట్లు) క్లీన్ ఎలక్ట్రిసిటీ ప్రోగ్రాంను అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

అయితే, ఇది, బొగ్గు ఉత్పత్తి, ఫ్రాకింగ్ ప్రరిశ్రమలపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందని కొంతమంది చట్టసభ సభ్యులు వ్యతిరేకించారు.

గత దశాబ్ద కాలంగా ఆ దేశంలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుముఖం పట్టాయి.

అమెరికా విధానాలు, చర్యలు "సరిపోవని" క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ తెలిపింది.

పారిస్ ఒప్పందం లక్ష్యాలను చేరుకోవాలంటే "గణనీయమైన మెరుగుదల" సాధించాల్సి ఉంటుందని పేర్కొంది.

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Getty Images

యూరోపియన్ యూనియన్ (ఈయూ): ఉద్గారాలు తగ్గుతున్నాయి

ఈయూ లక్ష్యాలు ..

  • 2030 నాటికి ఉద్గారాల్లో 1990 నాటి స్థాయిల కన్నా 55 శాతం తరుగుదల
  • 2030 కల్లా పునరుత్పాదక వనరుల నుంచి 40 శాతం ఇంధన శక్తి ఉత్పత్తి
  • 2050 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారడం

ఈయు దేశాల్లో జర్మనీ, ఇటలీ, పోలండ్ కార్బన్ ఉద్గారాల్లో ప్రథమ స్థానంలో ఉన్నాయి.

ఈయూ మొత్తంగా ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలు పేర్కొన్నప్పటికీ, దీని సభ్య దేశాలు విభిన్న ఆర్థిక, సాంకేతిక సామర్థ్యాలు కలిగి ఉన్నాయి.

కాప్26 సదస్సులో ఈయూ మొత్తం ఒక కూటమిగా చర్చల్లో పాల్గొంటున్నా, ఈ లక్ష్యాలు చేరుకునేందుకు సభ్య దేశాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వివరించాల్సి ఉంది.

భూ తాపాన్ని తగ్గించేందుకు ఈయూ పాటిస్తున్న విధానాలు, చర్యలు "సరైన దిశలో సాగుతున్నాయని" క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ వెల్లడించింది. 2018 నుంచి ఉద్గారాలు తగ్గుముఖం పట్టాయని తెలిపింది.

భారతదేశంలో మూడొంతుల విద్యుత్ ప్రాజెక్టులు బొగ్గు మీదే ఆధారపడ్డాయి

ఫొటో సోర్స్, NTPC

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో మూడొంతుల విద్యుత్ ప్రాజెక్టులు బొగ్గు మీదే ఆధారపడ్డాయి

భారతదేశం: అధికంగా బొగ్గుపై ఆధారపడి ఉంది

భారతదేశ లక్ష్యాలు..

  • 2030 నాటికి 'ఉద్గారాల తీవ్రత'లో 33 నుంచి 35 శాతం తగ్గింపు
  • 2030 నాటికి శిలాజేతర వనరుల నుంచి 40 శాతం విద్యుత్ ఉత్పత్తి
  • 2070 కల్లా నెట్ జీరోకు చేరుకోవడం

గత రెండు దశాబ్దాలుగా భారతదేశంలో కార్బన ఉద్గారాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

కానీ, తలసరి ఉద్గారాలు తక్కువ స్థాయిలోనే ఉన్నాయి.

భూతాపం పెరుగుదలకు పారిశ్రామిక దేశాలే ఎక్కువ దోహదపడ్డాయి కాబట్టి అవి మరింత ఎక్కువ బాధ్యతను స్వీకరించాలని భారత్ పేర్కొంది.

"ఉద్గారాల తీవ్రత" తగ్గించడమే తమ లక్ష్యమని తెలిపింది. అంటే ఆర్థిక వృద్ధికు అనుగుణంగా కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించడం. మిగతా దేశాలతో పోలిస్తే ఇది మేలైన పద్ధతి అని వెల్లడించింది.

పవన, సౌర, జల విద్యుత్ వంటి శిలాజేతర వనరుల నుంచి ఇంధన శక్తిని అధికంగా ఉత్పత్తి చేయడం మరో ప్రధాన లక్ష్యమని తెలిపింది.

2019కి శిలాజేతర ఇంధన శక్తి 23 శాతానికి చేరుకుంది. అయితే, భారతదేశం 70 శాతం బొగ్గుపైనే ఆధారపడి ఉంది.

2040కి ముందే భారతదేశంలో విద్యుత్ కోసం బొగ్గు వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాల్సి ఉంటుందని క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ పేర్కొంది. శిలాజేతర ఇంధన వనరులపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించింది.

వాతావరణ మార్పులు

ఫొటో సోర్స్, Getty Images

రష్యా: చమురు, గ్యాస్‌లపై ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది

  • 2030 నాటికి ఉద్గారాలను 1990 స్థాయి కన్నా 30 శాతానికి తగ్గించడమే లక్ష్యం
  • 2060 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారడం

1991లో సోవియట్ యూనియన్ పతనం తరువాత రష్యా ఆర్థిక వ్యవస్థతో పాటు కర్బన ఉద్గారాలు కూడా క్షీణించాయి.

కానీ ఆ దేశం ఇప్పటికీ కార్బన్‌ను కట్టడి చేయడానికి విస్తృతమైన అడవులు, చిత్తడి నేలలపైనే ఆధారపడుతోంది.

రష్యా మొత్తం ఇంధన శక్తిలో విండ్, సోలార్, హైడ్రో పవర్‌తో సహా శిలాజేతర ఇంధనాల వాటా చాలా తక్కువ.

శిలాజ ఇంధనాలు 20 శాతం కంటే ఎక్కువగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)కి దోహదపడతాయి.

భూతాపాన్ని తగ్గించే లక్ష్యానికి రష్యా విధానాలు, చర్యలు "సుదూరంగా ఉన్నాయని" క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ పేర్కొంది.

(ఈ నివేదికను అందించినవారు జేక్ హోర్టన్, శ్రుతి మీనన్, డేనియేలే పలుంబో, కై వాంగ్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)