అఫ్గానిస్తాన్: ‘తాలిబాన్లు ఇంటింటికీ తిరిగి డబ్బు వసూలు చేస్తున్నారు, వితంతువులను చెరబడుతున్నారు’

- రచయిత, హుమైరా కన్వల్
- హోదా, బీబీసీ ఉర్దూ
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. స్థానికంగా దీనిని 'పన్ను, చందా' అని కాకుండా 'భత్యం' అని పిలుస్తున్నారు.
ప్రజలు తమ ప్రాంతాల్లో నివసించడానికి, ప్రయాణించడానికి డబ్బు వసూలు చేస్తున్నారని తాలిబాన్లపై ఆరోపణలు వస్తున్నాయి.
తాలిబాన్ల నుంచి తమ ఇళ్లలోని వితంతువులను రక్షించుకోవడానికి ఆయా కుటుంబాలు ఇళ్లను విడిచిపెట్టి వెళ్లాల్సివస్తోందని చెబుతున్నారు.
అఫ్గానిస్తాన్‌లోని జోజాన్ ప్రావిన్స్‌లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామని కొందరు ‘బీబీసీ’తో చెప్పారు.

షబ్నం (పేరు మార్చాం) ఇటీవల మజార్-ఎ-షరీఫ్ నుంచి జోజాన్ వరకు ప్రయాణించారు.
''ఇప్పుడు మేం అఫ్గాన్ మహిళలం. మెహ్రం లేకుండా ఇల్లు వదిలి వెళ్లలేం. ఈ ప్రయాణంలో నాతో పాటు బంధువైన మహిళ ఒకరు... ఆమె భర్త, కుమారుడు ఉన్నారు'' అని ఆమె చెప్పారు.
మీరు మజార్-ఎ-షరీఫ్ నగర పరిమితులను దాటగానే, తాలిబాన్ల భద్రత తనిఖీ కేంద్రం కనిపిస్తుంది. అక్కడ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి, లోపల ఉన్న ప్రయాణికులను ఆరా తీసి, లగేజీ తనిఖీ చేస్తారు.
అయితే, చెక్‌పోస్టుల వద్ద తాలిబాన్ అధికారి ఒకరు ఉన్నారు. ఆయన పని.. వాహనాల డ్రైవర్ల నుంచి డబ్బు వసూలు చేయడమే. ఆయనతో పాటు సాయుధుడైన మరొకరు కూడా ఉన్నారు.
తాలిబాన్ ఫైటర్లు మోటార్ సైకిళ్లపై హైవేపై పెట్రోలింగ్ చేస్తూ కనిపించారు.
జోజాన్ నుంచి అద్ఖోయ్ జిల్లాకు మూడు గంటల ప్రయాణంలో నేను దాదాపు 11 చెక్‌పోస్టులను దాటాను.
"తాలిబాన్లు ప్రతి ఇంటి నుంచి చందా వసూలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారి ఆర్థిక స్థితిని బట్టి డబ్బు ఇస్తున్నారు. నేను కూడా 100 అఫ్గాని రూపాయలు ఇచ్చాను. కొందరు ఇంతకంటే ఎక్కువ ఇవ్వాల్సి వచ్చేది, మరికొందరు వారికి ఆహారం సమకూర్చేవారు" అని మజార్-ఎ-షరీఫ్ నివాసి నాదిర్ (పేరు మార్చాం) చెప్పారు.

తాలిబాన్లు మీ ఇంటికి వస్తారా?
"తాలిబాన్లు దీనికోసం స్థానికంగా కొందరిని నియమించుకున్నారు. వారు మా ఇళ్లకు వస్తారు.. వారితో పాటు ఇద్దరు తాలిబాన్ సభ్యులు కూడా ఉంటారు"
కాబూల్, మజార్-ఎ-షరీఫ్ కాకుండా, నేను ఇంతకు ముందు చాలాసార్లు జోజాన్‌కి వెళ్లాను. షబర్ఘన్ జైలు మీదుగా వెళ్తున్నప్పుడు, అక్కడ ప్రధాన గేటు తెరిచి ఉంది. తాలిబాన్లు అక్కడ కూడా కాపలాగా ఉన్నారు.
హైవేపై ఉన్న అన్ని అవుట్‌పోస్టులు పోరాటాల వల్ల ప్రభావితమయ్యాయి. ఇప్పుడు వాటి పైకప్పులపై తాలిబాన్ జెండాలు రెపరెపలాడుతున్నాయి.
"నేను అద్ఖోయ్‌లోకి ప్రవేశించినప్పుడు, ప్రతిదీ పూర్తిగా మారిపోయినట్లు కనిపించింది. నగరమంతా నిర్మానుష్యంగా ఉంది. దుకాణాలన్నీ మూతపడి భయానక వాతావరణం నెలకొంది" అని షబ్నమ్ తెలిపారు.
"తాలిబన్ల ఆదేశాల మేరకు సాయంత్రం 5 గంటలకు షాపులు మూసేస్తామని నాకు చెప్పారు. మేము లోపలికి వచ్చేసరికి నాలుగు గంటలైంది. సూర్యుడు అస్తమించిన తర్వాత కర్ఫ్యూ విధిస్తారు"
వాహనాల్లో సంగీతం నిషేధం
వాహనాల్లో సంగీతాన్ని నిషేధించారు... మహిళలు బురఖాలు ధరించడం తప్పనిసరి చేశారు. దీంతో స్మార్ట్ ఫోన్ల వినియోగం మానుకోవాలని తాలిబాన్లు సూచించారు.
"ఇక్కడ నేను మా అత్తతో కలిసి ఉన్నాను. తాలిబాన్లు తమ ప్రాంతానికి వచ్చినప్పుడు, అక్కడ గొడవ జరిగిందని ఆమె నాతో చెప్పారు. కాబూల్, మజార్-ఎ-షరీఫ్ లేదా ఇతర ప్రధాన నగరాల కంటే ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉందని ఆమె నాతో అన్నారు"
"మా ఇంటి ముందు యుద్ధం జరుగుతున్నట్లు అనిపించింది. చాలా మంది బంధువులు తమ పిల్లలతో ఆశ్రయం పొందేందుకు మా ఇంటికి వచ్చారు" అని షబ్నం అత్త చెప్పారు.
"పిల్లలు చాలా భయపడిపోయారు. బేస్‌మెంట్లలో మేడమీద గదుల్లో భయంతో అరుస్తూ ఇంట్లో ఒక మూల నుంచి మరో మూలకు పరిగెడుతున్నారు"
"అవి యుద్ధం నాటి భయంకరమైన రోజులు. మూడు రోజుల పాటు ఇలాగే సాగింది. ఈ ఘర్షణలో పలు దుకాణాలు అగ్నికి ఆహుతై మార్కెట్ అద్దాలు పగిలిపోయాయి"
"గత తాలిబాన్ ప్రభుత్వంలో, తాలిబాన్లు మా ఇంట్లో ప్రతి మూలను సోదా చేసి, పురుషులను అరెస్టు చేశారు. నా దగ్గర ఒక కుట్టు మిషన్ ఉండేది. అది వారికి చాలా కొత్తగా అనిపించింది. దీంతో అది ఏమిటని నన్ను అడగడం మొదలుపెట్టారు"

ఇళ్లకే పరిమితమైన కాలేజీ అమ్మాయిలు
ఆ రోజు తాలిబాన్లు "మా బ్యాగులు, అన్నింటినీ వెతికారు. కానీ వారికి ఏమీ దొరకలేదు. వారు ఒక జాగీర్దార్ ఇంటికి వెళ్లి దోచుకున్నారు. మా ఇంట్లోని మగవాళ్లను తీసుకెళ్లి 10 రోజుల తర్వాత విడుదల చేశారు. వారిని చాలా వేధించారు"
గొడవ ముగియగానే, నాతో మార్కెట్‌కి రావాలని నా భర్తకు చెప్పాను. నేను కొన్ని వస్తువులు కొనవలసి ఉందని చెప్పాను. నా భర్త ‘వెళ్లు, ఏమీ జరగదు’ అని చెప్పారు. కాని సాక్స్ ధరించని లేదా వదులుగా ఉన్న బూట్లు ధరించని మహిళలతో తాలిబాన్లు అసభ్యంగా ప్రవర్తించడం నేను చూశాను. ఆ తర్వాత భయంతో బయటకు రాలేదు. ఆ తర్వాత శబర్‌ఘన్‌లో గొడవ మొదలైంది. తర్వాత మా ఇంటికి మరికొంతమంది బంధువులు వచ్చారు.
పెద్ద నగరాలకు రాకముందే తాలిబన్లు మారుమూల గ్రామాల్లో ఉండేవారని ఆమె చెప్పారు.
''నేను చిన్నతనంలో స్కూల్‌కి వెళ్లినప్పుడు నీలిరంగు బురఖా ధరించేవాళ్లం కాదు. మా యూనిఫాంగా మోకాలి వరకు పొడవుగా ఉండే స్కర్ట్ ధరించేవాళ్లం. సాక్స్ కూడా వేసుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు తాలిబాన్లు బురఖాను ధరించాలని చెబుతున్నారు. వారి ఆదేశాలు రోజురోజుకు కఠినంగా మారాయి'' అని షబ్నం అత్త చెప్పారు.
ఈ ప్రాంతంలో మరింత ముందుకు వెళుతున్నప్పుడు, సాధారణం కంటే తక్కువ మంది మహిళలు కనిపించారు. పాఠశాలలు మూసివేసి ఉన్నాయి.
ఇక్కడ నాకు చాలా మంది యువతులను కలిసే అవకాశం కూడా వచ్చింది. కొంతమంది అమ్మాయిలు ఇక్కడికి కూతవేటు దూరంలో ఉన్న జోసన్ యూనివర్శిటీలో చదువుతుండేవారు. ఇప్పుడు వారు ఇళ్లకే పరిమితమయ్యారు.
భవిష్యత్తుపై ఆందోళన
స్కూల్, కాలేజీకి వెళ్లే అమ్మాయిలు కూడా తమ చదువు ఏమవుతుందోనన్న భయంలో ఉన్నారు. విలువైన సంవత్సరాలను వృథా చేసుకుంటే, భవిష్యత్తులో చదువుకోవడానికి ఏదైనా మార్గం ఉంటుందా, అనే వారి ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు.
పనికి పిలిచిన వారికి కూడా జీతాలు ఇవ్వడం లేదని అక్కడి మహిళలు చెబుతున్నారు.
తాలిబాన్లు స్కూల్ యూనిఫామ్‌లను బూడిద రంగు నుంచి నల్ల రంగుకు మార్చారు. కాని అమ్మాయిలు పాఠశాలకు వెళ్లలేరు.
ఇక్కడ నేను మరియంను కలిశాను. ఆమె భుజం, మోకాలిపై గాయాల గుర్తులున్నాయి. చాలా ఏళ్ల కిందట తాలిబాన్లు తన ఇంటిపై గ్రెనేడ్ వేయడంతో నాటి విధ్వంసం తాలూకూ శకలాలు అలానే ఉన్నాయి. ఆ రోజు ఒక కుమారుడిని కూడా కోల్పోయారు.
ఆమె భర్త సెక్యూరిటీ గార్డుగా చేసేవారు, తర్వాత ఆమె కొడుకు ఆ పని చేశారు.
తాలిబాన్లు ఆహారం మాత్రమే కాకుండా డబ్బు కూడా తీసుకున్నారని జోజాన్‌లోని చాలా మంది నాతో చెప్పారు. ప్రస్తుతం కరెంటు బిల్లులు రెట్టింపు అవుతున్నాయని, కరెంటు కోతలు కూడా ఎక్కువగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఉపాధ్యాయులైతే 1000 అఫ్గాన్ రూపాయలు, వ్యాపారులైతే 5000 అఫ్గాన్ రూపాయలు.. ఇలా స్థాయిని బట్టి తాలిబాన్లు వసూలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
మరియం కోడలు స్కూల్ టీచర్. దీంతో తన కోడలు కూడా తాలిబాన్లకు వెయ్యి అఫ్గాన్ రూపాయలు ఇచ్చినట్లు ఆమె చెప్పారు. అయితే ఇక్కడ ఆడపిల్లలు ఆరో తరగతి వరకు చదువుకోవచ్చని చెబుతున్నారని మరియం తెలిపారు. కనీసం ఇక్కడ ఆరో తరగతి వరకైనా అనుమతిస్తున్నారన్నారు.
ఈ ప్రాంతంలో బాలికలను పాఠశాలలకు వెళ్లనీయడం లేదు. అంతకుముందు తాలిబన్ల శకాన్ని తాను మరచిపోయానని, కానీ ఇప్పుడు పరిస్థితి చాలా కష్టంగా ఉందని అన్నారు. ఆమె చెప్పిన దాని ప్రకారం.. ఈ ప్రాంతంలో ఇంతకుముందు కూడా పరిస్థితి అధ్వాన్నంగా ఉండేది. ఇది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. తాలిబాన్లు అనేక ఇళ్లను దోచుకున్నారని చెప్పారు.
ఏ మహిళ కూడా అత్యవసరమైనా రిక్షాలో ఒంటరిగా ప్రయాణించలేదని మరియం అన్నారు. ఓ రిక్షాలో ఇద్దరు మహిళలను తీసుకెళ్తున్న డ్రైవరును చంపేశారని చెప్పారు.
కరవు కారణంగా వ్యవసాయం కుంటుపడటం కూడా జోజాన్ ప్రావిన్స్‌లోని అద్ఖోయ్ జిల్లా ప్రజల ఇబ్బందులకు ఒక కారణం. తాలిబాన్లు రాకముందు ఇక్కడి ప్రజలకు అంతర్జాతీయ సంస్థలు సాయంగా ఆహారం అందించేవి. కానీ ఈసారి అవి కూడా అందలేదు. ఇప్పుడు తమను ఎవరు ఆదుకుంటారని ప్రజలు అంటున్నారు.
ఇక్కడి పేద రైతులు కూడా తాలిబాన్లకు పన్ను చెల్లించాలి. తాలిబాన్ ప్రతినిధులు అన్ని వ్యాపార కేంద్రాల వద్ద నిలబడి ఉంటారు. మజార్-కాబూల్ హైవే, హెరాత్-కాబూల్ హైవేలో ఇలాంటి వారిని మీరు చూడొచ్చు. ఇక్కడ వారు వేర్వేరు వస్తువులకు వేర్వేరు రేట్లు నిర్ణయిస్తారు. అదనంగా వ్యాపారులు, సంపన్న దుకాణదారులు తాలిబాన్లకు భత్యాలు చెల్లించాలి.

డబ్బు వసూళ్లకు కొత్త మార్గం
ఇప్పుడు అక్కడ భత్యం వసూలు చేయడానికి తాలిబాన్లు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. అక్కడి కుటుంబాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.. లేదంటే తాలిబాన్ ఫైటర్లకు ఆహారం సమకూర్చమంటున్నారు.
వివాహితులందరి నుండి ఆహారంతో పాటు, తాలిబాన్లు 150 అఫ్గాని రూపాయలు తీసుకున్నారని ఇద్రిస్ (పేరు మార్చాం) నాతో చెప్పారు. తాలిబాన్లు మదర్సాను నిర్మించాలనుకుంటున్నారని తెలిపారు.
ఖమాబ్‌లోని 18 గ్రామాల్లో ఇప్పటికే 30 మదర్సాలు ఉన్నాయని, అయితే తాలిబాన్లు ఇంకా మరిన్ని మదర్సాలు ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నారని అన్నారు. "వారు యువతను తాలిబాన్‌గా మార్చడానికి ప్రోత్సహిస్తున్నారు" అని ఇద్రిస్ చెప్పారు. తాలిబాన్‌లో చేరుతున్న యువకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు.
సైన్యంలో పని చేసిన వారి దగ్గర నుంచి కూడా తాలిబాన్లు డబ్బు వసూలు చేశారని, ఆయుధాలు తీసుకొని ఆ సైనికులను జైళ్లలో పెట్టారని మరొక వ్యక్తి నాతో చెప్పాడు.
తన జిల్లాలో తాలిబాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముల్లా మజీద్ స్థానికంగా నివసించే వితంతువును వివాహం చేసుకున్నట్లు సమాచారం ఉందని ఇద్రిస్ చెప్పారు.
జోజాన్ ప్రావిన్స్‌లోని అచా జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇద్దరు వితంతువులను అక్కడ పెళ్లి చేసుకోమని తాలిబాన్లు అడిగారని, కానీ వారికి పిల్లలు ఉన్నారని, పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక కుటుంబాలతో సహా పారిపోయారని నా స్నేహితుడు ఒకరు చెప్పారు. ఇద్రిస్ తల్లిదండ్రులు జోజాన్‌లోనే ఉంటున్నారు.
''నా ఇంట్లో మా కోడలు కూడా వితంతువే. ఆమెకి ఏమవుతుందోనని ఎప్పుడూ ఆందోళన చెందుతాం. మా వృద్ధ తల్లిదండ్రులు తమ ప్రాంతాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అంతేకాకుండా ఆర్థిక స్తోమత లేకపోవడంతో వేరే ప్రాంతానికి వెళ్లి నివసించలేం''
''ఉద్యోగాలు కోల్పోయిన యువకులు కూడా ఇక్కడ మీకు కనిపిస్తారు. వారు తాలిబాన్ల అరాచకాలకు దూరంగా ఉండటానికి పాస్‌పోర్ట్ లేకపోయినా దేశం విడిచిపెట్టి వెళ్లాలని ప్రయత్నిస్తారు'' అని ఇద్రిస్ తెలిపారు.
చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ తమతో చేరి తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడలని ఇప్పటికీ కోరుకునే వారు కూడా ఉన్నారు. అయితే తాలిబాన్ల భయం వారిని అలా చేయకుండా అడ్డుకుంటుంది.
జోజాన్‌లోని కర్కాన్ జిల్లాలో కూడా తాలిబాన్లు వసూలు చేస్తున్నారు. అక్కడ 140 కిలోల గోధుమలలో ఏడు కిలోల గోధుమలను వసూలు చేస్తారు. ఇంతే మొత్తంలో ఇంతకుముందు పేదలకు లేదా స్థానిక మసీదుకు విరాళంగా రైతులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు తాలిబాన్లు తమకే ఇవ్వాలంటూ రైతులను బెదిరిస్తున్నారు.
జోజాన్ సందర్శన తర్వాత, షబ్నం ఫోన్‌లో విపరీతంగా ఏడుస్తూ నాతో మాట్లాడారు. అక్కడ ఉన్న స్త్రీలు, పురుషుల దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. అక్కడ తాను చూసిన, అనుభవించిన బాధను మాటల్లో వర్ణించలేనన్నారు.

తాలిబాన్లపై ఆరోపణల్లో నిజమెంత?
తాలిబాన్ల వసూళ్ల పర్వం, రైతుల నుంచి ధాన్యం తీసుకోవడం వంటి ఆరోపణలు నిజమా కాదా? ఇప్పుడు తాలిబాన్ నియంత్రణలో ఉన్న అఫ్గానిస్తాన్‌లో ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవడానికి తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌కు బీబీసీ కొన్ని ప్రశ్నలు పంపింది.
అయితే తాలిబాన్ కార్యాలయం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. అఫ్గానిస్తాన్‌లోని ఒక ప్రావిన్స్‌లో పన్ను వసూలు చేసే తాలిబాన్ సభ్యుడు, అక్కడి పరిస్థితిపై మాకు కొన్ని వివరాలను అందించారు.
రెండు రకాల పన్నులు వసూలు చేస్తున్నామని బీబీసీకి చెందిన మాలిక్ ముదస్సిర్‌తో చెప్పారు.
సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే వస్తువులపై వ్యాపారులు పన్ను చెల్లిస్తారని, దీన్ని చెల్లించిన తర్వాత వ్యాపారులకు రశీదు ఇస్తే అది మా డేటాబేస్‌లోకి వెళ్తుందని చెప్పారు. పిండి, వంటనూనె ఇలా ప్రతిదానికీ ధర ఉంటుందని.. రకరకాల పన్నులు విధిస్తారన్నారు.
వసూలు చేస్తున్న సెస్‌ను పేదలకు అందజేస్తున్నట్లు పన్ను వసూలు చేసే తాలిబాన్ సభ్యుడు తెలిపారు.
రైతులు తనకు ఇంతకు ముందుతో పోల్చితే సగం సెస్ మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. (ఆ ప్రాంత ఆచారం ప్రకారం ఒక వస్తువులో పదవ వంతు లేదా దాని ధరలో పదవ వంతు) ఇప్పుడు అదే పాత పద్దతి నడుస్తోందన్నారు.
''మాకు ఇంకా కొత్త వ్యవస్థ లేదు. పాత విధానంలోనే ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నాం''
అఫ్గానిస్తాన్ అంతటా తమ ప్రభుత్వం ఒకేలా పన్ను విధిస్తుందని పన్ను వసూలు చేసే తాలిబాన్ సభ్యుడు అన్నారు. మా ప్రభుత్వం నుంచి ఆదేశం వచ్చినప్పుడు, దానిని అందరూ పాటిస్తారు. మొత్తం అఫ్గానిస్తాన్‌పై మాకు నియంత్రణ ఉంది.
ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని, అమెరికా, ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించాయని చెప్పారు.
''అఫ్గాన్‌లు చాలా డబ్బు సంపాదించేవారు. కానీ ఇప్పుడు మేము వారికి ఆ డబ్బు సంపాదించే అవకాశం ఇవ్వలేకపోతున్నాము. ఇది మా ముందున్న పెద్ద సమస్య''
బయట ఏ దేశాలు సహాయం చేస్తున్నాయని ఆయన్ని అడిగినప్పుడు, ''మేము అంతర్జాతీయ సమాజం నుండి సహాయం పొందుతున్నాము. మాకు పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇతర దేశాల నుండి సహాయం అందుతోంది''
''మాకు అందిన ఆ సహాయాన్ని విపత్తు నిర్వహణ సంస్థ, శరణార్థుల విభాగానికి అందించాము. ఇది కాకుండా, మేము ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మందులు ఇచ్చాము. వివిధ ప్రాంతాల్లోని పేదలకు పిండి, వంటనూనెలు పంపిణీ చేశాము''
పేదలకు సహాయం చేయడానికి తాలిబాన్లు సంసిద్ధతతోనే ఉన్నారు. అయితే ఇంట్లోని వస్తువులను కేవలం ఆహారం కోసం విక్రయిస్తున్న దృశ్యాలు కూడా అఫ్గాన్‌లో కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- T20WorldCup: 'మతం పేరుతో ఒక వ్యక్తిపై దాడి చేయడం అత్యంత నీచం' - విరాట్ కోహ్లీ
- COP26: గ్లాస్గోలో జరిగే పర్యావరణ సదస్సులో ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు?
- పాకిస్తాన్ జర్నలిస్ట్ ‘ఘోరమైన ప్రశ్న’.. సమాధానం ఇవ్వడానికి నిరాకరించిన అఫ్గాన్ కెప్టెన్
- టీ20 ప్రపంచ కప్‌లో క్రికెటర్లు మోకాళ్లపై ఎందుకు నిలబడుతున్నారు? భారత జట్టుపై విమర్శలు ఎందుకు?
- పాలస్తీనా ఎడారి కోటలో ‘ప్రపంచంలోనే అతి పెద్ద చలువ రాతి చిత్తరువు’
- రైతుల ఆందోళన: భారత వ్యవహారాలలో కెనడా ఎందుకు జోక్యం చేసుకుంటోంది?
- కెనడా పాఠశాల ప్రాంగణంలో బయటపడిన 215 మంది పిల్లల అవశేషాలు..
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











