అఫ్గానిస్తాన్: ‘యుద్ధంలో మేమే గెలిచాం, అమెరికా ఓడిపోయింది' అంటున్న తాలిబన్లు

అఫ్గానిస్తాన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సికందర్ కిర్మాని, మహఫౌజ్ జుబైద్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ఆక్రమిత భూభాగానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఉత్తరాన ఉన్న మజర్-ఎ-షరీఫ్ నగరం నుంచి 30 నిమిషాలు ప్రయాణం చేసి ముందుకు వెళ్తే బాల్ఖ్ జిల్లాలో తాలిబన్ల షాడో మేయర్ హాజీ హెక్మత్‌ను కలవొచ్చు.

హక్మత్ 1990లలో ఉగ్రవాదుల బృందంలో చేరారు. అప్పటికి వీరి బృందం అఫ్గానిస్తాన్‌లో చాలా ప్రాంతంపై పట్టు సాధించింది.

అక్కడికి వెళ్తే దారికి రెండు వైపులా సాయుధులు బారులు తీరి కనిపిస్తారు. ఒకరి చేతిలో రాకెట్‌తో నడిచే గ్రెనేడ్ లాంచర్ ఉంది. మరొకరి చేతిలో అమెరికా అధికారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎం4 అసాల్ట్ రైఫిల్ కనిపించింది.

ఒకప్పుడు బాల్ఖ్ చాలా సుస్థిరమైన ప్రాంతం. ఇప్పుడు అత్యంత హింసాత్మకంగా మారింది.

"ప్రధాన మార్కెట్ దగ్గర ప్రభుత్వ దళాలు ఉంటాయి. కానీ వారు తమ స్థావరాలను వదిలిపెట్టి రాలేరు. ఈ ప్రాంతమంతా ముజాహిదీన్లకు చెందినదే" అని స్థానిక మిలటరీ కమాండర్ బర్యాలై తెలిపారు.

తాలిబన్లు

అఫ్గానిస్తాన్‌లో ఎక్కడికి వెళ్లినా ఇదే దృశ్యం కనిపిస్తుంది. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కానీ, వాటి చుట్టుపక్కల ప్రాంతమంతా తాలిబన్ల నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా పల్లె ప్రాంతాలు తాలిబన్ల ఆధీనంలో ఉంటాయి.

కీలక రహదారుల్లో అక్కడక్కడా వీరు కాపు కాస్తూ కనిపిస్తారు. వచ్చీపోయే వాహనాలను ఆపి తనిఖీ చేస్తారు.

"ఆ వాహనాల్లో ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని అరెస్ట్ చేసి ఖైదు చేస్తాం. తరువాత, వారిని మా కోర్టులకు అప్పగిస్తాం. తుది నిర్ణయం కోర్టు తీసుకుంటుంది" అని తాలిబన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ స్థానిక అధ్యక్షుడు ఆమిర్ సాహిబ్ అజ్మల్ తెలిపారు.

హాజీ హెక్మత్

'యుద్ధంలో మేమే గెలిచాం'

యుద్ధంలో విజయం తమదేనని తాలిబన్లు భావిస్తున్నారు.

"యుద్ధంలో మేమే గెలిచాం, అమెరికా ఓడిపోయింది" అని హాజీ హెక్మత్ అన్నారు.

అఫ్గానిస్తాన్ నుంచి మిగిలిన అమెరికా మిలటరీ బలగాలను ఉపసంహరించుకునే కార్యక్రాన్ని జో బైడెన్ సెప్టెంబర్‌కు వాయిదా వేశారు.

గత ఏడాది ఒప్పందం ప్రకారం మే 1 నాటికల్లా అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాల్సి ఉండగా, ఇప్పుడు అది వాయిదా పడడంపై తాలిబన్ నాయకులు తీవ్రంగా స్పందించారు.

"మేం అన్నిటికీ సిద్ధపడే ఉన్నాం. మేం శాంతి కోసం పూర్తిగా సన్నద్ధులై ఉన్నాం. అలాగే, జిహాద్ కోసం పూర్తిగా తయారుగా ఉన్నాం" అని హెక్మత్ తెలిపారు.

"జిహాద్‌లో అలసట ఉండదు. మేం సిద్ధంగా ఉన్నాం" అని అని పక్కనే కూర్చున్న మరో మిలిటరీ కమాండర్ అన్నారు.

గత ఏడాది కాలంగా తాలిబన్ల "జిహాద్"లో స్పష్టమైన వైరుధ్యాలు కనిపిస్తున్నాయి.

అమెరికాతో ఒప్పందం చేసుకున్నాక అంతర్జాతీయ దళాలపై దాడులు ఆపేశారు. కానీ, అఫ్గాన్ ప్రభుత్వంతో పోరాటం జరుపుతూనే ఉన్నారు.

అయితే, ఇవేమీ పరస్పర విరుద్ధాలు కావని హాజీ హెక్మత్ అంటున్నారు.

"మాకు షరియాలు పాలించే ఇస్లామిక్ ప్రభుత్వం కావాలి. మా డిమాండ్లకు తల ఒగ్గేవరకూ మేము మా జిహాద్ కొనసాగిస్తూనే ఉంటాం" అని ఆయన అన్నారు.

ఇతర అఫ్గాన్ రాజకీయ వర్గాలతో అధికారాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్నకు హాజీ హెక్మత్ సమాధానం ఇస్తూ.. ఖతార్‌లో తమ బృందం రాజకీయ నాయకత్వాన్ని వాయిదా వేస్తున్నామని చెప్పారు.

"వాళ్లు ఏం నిర్ణయిస్తారో దానికి మేం అంగీకరిస్తాం" అని ఆయన అన్నారు.

తాలిబన్లు తమని తాము కేవలం ఒక తిరుగుబాటు దళంగా భావించట్లేదు. రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచే బృందంగా భావిస్తున్నారు.

తమని తాము "ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్" అని పిలుచుకుంటున్నారు.

1996లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత వారు వాడుకున్న పేరు అది.

ఇప్పుడు అక్కడ వారు ఒక అధునాతనమైన షాడో వ్యవస్థ ఏర్పరుచుకున్నారు. తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలన్నిటినీ తమ అధికారులు పర్యవేక్షిస్తుంటారు.

ఈ వ్యవస్థలో హాజీ హెక్మత్ తాలిబన్ల షాడో మేయర్‌గా వ్యవహరిస్తున్నారు.

అక్కడ ఉన్న ఒక స్కూల్లో ఆడపిల్లలు, మగపిల్లలు చదువుకుంటున్నారు. 1990లలో వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆడపిల్లలు చదువుకునేందుకు నిరాకరించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, వాటిని తాలిబన్లు అంగీకరించరు.

ప్రస్తుతం, ఆడపిల్లలను కూడా చదువుకోమని ప్రోత్సహిస్తున్నట్లు వారు చెబుతున్నారు.

"ఆడపిల్లలు హిజాబ్ ధరించినంతకాలం వాళ్లకు చదువుకోవడం ముఖ్యం" అని తాలిబన్ స్థానిక ఎడ్యుకేషన్ కమిషన్ ఇంఛార్జ్ మావ్లవి సలాహుద్దీన్ అన్నారు.

పాఠ్య పుస్తకాల్లోంచి కళ, పౌరసత్వ పాఠాలు తీసివేశారుగానీ మిగతాదంతా జాతీయ స్థాయి సిలబసేనని స్థానికులు చెప్పారు.

విద్యార్థినులు

ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఒక హైబ్రిడ్ వ్యవస్థ కొనసాగుతోంది. ప్రభుత్వం తమ సిబ్బందికి వేతనాలు ఇస్తుంది కానీ, అధికారం, బాధ్యతలు తాలిబన్ల చేతిలో ఉంటాయి.

స్థానిక ఆస్పత్రులలో ఆడవాళ్లు కూడా పని చేస్తారు. కానీ రాత్రి పూట విధుల్లో మగవారు మాత్రమే ఉంటారు. అలాగే ఆడవాళ్లకు, మగవాళ్లలు వార్డులు విడిగా ఉంటాయి. కుటుంబ నియంత్రణ, గర్భనిరోధకాల గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది.

ఇవన్నీ చూస్తుంటే, ప్రపంచం తమని సానుకూల దృక్పథంతో చూడాలని వారు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఇప్పటికీ మహిళల హక్కులు, స్వేచ్ఛ పట్ల తాలిబన్ల అభిప్రాయాలు, నియమాలపై సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా వారి బృందంలో మహిళల ప్రాతినిధ్యం లేదు. 1990లలో మహిళలు బయటకు వెళ్లి పని చేసేందుకు అనుమతి ఉండేది కాదు.

అయితే బాల్ఖీలో ఇప్పుడు కొందరు ఆడవాళ్లు బుర్ఖా ధరించకుండా బయట తిరగడం కనిపిస్తోంది.

కచ్చితంగా బుర్ఖా వేసుకోవాలనే రూలేమీ లేదు, కానీ సాధారణంగా సంప్రదాయ వ్యవస్థలో అది లేకుండా స్త్రీలు బయటకు రారని హాజీ హెక్మత్ తెలిపారు.

అక్కడి స్థానికులు కూడా తాలిబన్ల పాలనలో రక్షణ మెరుగైందని, నేరాలు తగ్గాయని అంగీకరిస్తున్నారు.

"ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్లని తీసుకెళ్లి జైల్లో పెట్టేవారు. విడిపించడానికి లంచం అడిగేవారు. మేమంతా చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు సంతోషంగా ఉన్నాం" అని ఒక పెద్దాయన తెలిపారు.

అయితే, తాలిబన్ల సాంప్రదాయక విలువలు పల్లెటూళ్లల్లో చెల్లుతాయిగానీ పట్టణాలలో యువత మాత్రం తాలిబన్ల పాలన గురించి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

తాలిబన్లు పాలనలోకి వస్తే గత రెండు దశాబ్దాలుగా వారికి లభించిన స్వేచ్ఛ కనుమరుగవుతుందేమోనని భయపడుతున్నారు.

అఫ్గాన్ బాలికలు

గత పాలనకు, ఇప్పటి ఆలోచనలకు ఏమైనా తేడా ఉందా?

"అంతకుముందు తాలిబన్ల ఆలోచనలు, ఇప్పటివారి ఆలోచనలు ఒకటే. ఏమీ మారలేదు" హాజీ హెక్మత్ స్పష్టం చేశారు.

అయితే, తాలిబన్ల దృష్టిలో "ఇస్లామిక్ ప్రభుత్వం" అంటే ఏమిటో స్పష్టంగా చెప్పలేదు. వారు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అస్పష్టత పాటిస్తున్నట్లు తోస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

అంతర్గతంగా కఠినమైన నియమాలకు, ఇప్పుడు కనిపిస్తున్న కొంత వెసులుబాటు ధోరణికి మధ్య ఉన్న ఘర్షణలను దూరం పెట్టేందుకే ఇలా చేస్తున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు.

వారు ప్రభుత్వాన్ని ఏర్పరచి పాలనలోకి వస్తే అది వారికి పెద్ద పరీక్షే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

కాబూల్ అడ్మినిస్ట్రేషన్ (ప్రస్తుత ఆఫ్ఘన్ ప్రభుత్వం) అవినీతిపరులతో నిండిపోయిందని, ఇస్లామిక్ కాదని హాజీ హెక్మత్ అభిప్రాయపడ్డారు.

"ఇది జిహాద్, ఇది ఆరాధన. మేం అధికారం కోసం ఇదంతా చెయ్యట్లేదు. అల్లా కోసం, ఆయన ఏర్పరచిన నియమావళిని ఆచరించడం కోసం చేస్తున్నాం. షరియా పాలనను తీసుకు రావడమే మా లక్ష్యం. మమ్మల్ని వ్యతిరేకించే వారందరితోనూ పోరాడుతాం" అని హాజీ హెక్మత్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)