అఫ్గానిస్తాన్: ఏకే-47తో ఎదురుతిరిగి ‘హీరో’ అనిపించుకున్న అమ్మాయి చంపింది తాలిబన్లనా? తన భర్తనా?

నూరియా వర్ణచిత్రం

పదిహేనేళ్ల నూరియా ఇంటిపై తాలిబన్లు దాడి చేసినప్పుడు ఆమె వారి నుంచి ఏకే47 లాక్కుని కాల్పులు జరిపి ఇద్దరిని హతమార్చింది. మూడో తీవ్రవాదికి గాయాలయ్యాయి.

ఆమె ధైర్యాన్ని ప్రపంచమంతా మెచ్చుకుంది.. హీరో అంటూ కీర్తించింది. అయితే, ఆ రోజు రాత్రి జరిగిన అసలు కథ మాత్రం కొంచెం సంక్లిష్టంగా ఉంది.

ఇంతకీ నూరియా తాలిబన్లను చంపిందా..? తన భర్తను చంపిందా? అసలు రహస్యం ఏమిటి?

(ఘటనకు సంబంధించిన అందరి పేర్లను ఈ కథనంలో మార్చాం)

ఏకే 47తో నూరియా
ఫొటో క్యాప్షన్, ఏకే 47తో నూరియా

ఆ అర్ధరాత్రి ఏం జరిగింది?

ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందో నూరియా 'బీబీసీ'కి వివరించారు.

''కొండ పక్కనే ఉన్న అమ్మానాన్నల ఇంట్లో ఉన్నాను. సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో తలుపులు బాదుతున్న చప్పుడు వినిపించింది. ఆ చప్పుడుకు బెడ్ రూంలో ఉన్న నేను ఒక్కసారిగా నిద్ర లేచాను. కానీ, కదలకుండా అక్కడే ఉన్నాను. నాతో పాటు ఉన్న నా పన్నెండేళ్ల తమ్ముడి గురించే నా ఆందోళనంతా.

వాళ్లు మా అమ్మానాన్నను ఇంటి బయటకు తీసుకెళ్లారు. ఆ వెంటనే తుపాకీతో కాల్చిన శబ్దం వినిపించింది. అమ్మను, నాన్నను చంపేశారు'' అని చెప్పారామె.

అఫ్గానిస్తాన్‌లోని ఒక గ్రామంలో పుట్టి పెరిగారు నూరియా. మెల్లగా మాట్లాడే, సిగ్గరి అయిన నూరియా గురి చూసి తుపాకీ కాల్చడంలో మాత్రం నేర్పరి.

ఆత్మరక్షణ కోసం చిన్నప్పటి నుంచే తండ్రి నేర్పించడంతో తుపాకీ పేల్చడంలో ఆమె నేర్పు సాధించారు.

ఆ రోజు రాత్రి తన తల్లి, తండ్రిని తాలిబన్లు బయటకు తీసుకెళ్లి కాల్చేయడంతో ఆమె ఇంకేమాత్రం ఆలస్యం చేయలేదు. ఇంట్లో ఉన్న తన తండ్రి ఏకే-47ను చేతిలోకి తీసుకుని తాలిబన్లపై కాల్పులు జరిపింది.

''గన్‌లోని తూటాలన్నీ అయిపోయే వరకు అలా కాలుస్తూనే ఉన్నాన''ని చెప్పారు నూరియా.

దాడికి వచ్చినవారిలో కొందరు చీకట్లో కలిసిపోయారు. తన ఇంటి బయట అయిదు మృతదేహాలున్నాయి.

''అమ్మానాన్నల మృతదేహాలతో పాటు ఇంటి పక్కనే ఉన్న తాత.. నా చేతుల్లో చనిపోయిన ఇద్దరు తాలిబన్ల మృతదేహాలు పడున్నాయి'' అని చెప్పారు నూరియా.

''వాళ్లు చాలా క్రూరులు. వికలాంగుడైన నా తండ్రిని, అమాయకురాలైన నా తల్లిని చంపేశారు'' అంటూ నూరియా రోదించారు.

ఘోర్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ బలగాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఘోర్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ బలగాలు

ప్రభుత్వం, తాలిబన్ల మధ్య నలిగిపోతున్న అఫ్గాన్ ప్రజలు

నూరియా వంటి అఫ్గాన్ టీనేజర్లకు యుద్ధం తప్ప ఇంకేమీ తెలియదు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు, ప్రభుత్వ బలగాల మధ్య 25 ఏళ్లుగా యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వ అనుకూల బలగాలకు నగరాలు, పట్టణాలపై పట్టు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో తాలిబన్లదే ఆధిపత్యం.

ఈ క్రమంలో ప్రభుత్వ బలగాలు, తాలిబన్ల మధ్య ఏళ్లుగా నిత్యం పోరాటం జరుగుతోంది. నూరియా ఉండే గ్రామంలాంటి ఎన్నో గ్రామాలు ఈ రెండు వర్గాల మధ్య సంఘర్షణలో నలిగిపోతున్నాయి.

నూరియా ఉండే గ్రామీణ రాష్ట్రం ఘోర్‌లో ప్రభుత్వ బలగాల స్థావరాలు, ప్రభుత్వ అనుకూల వ్యక్తులపై తాలిబన్ల దాడులు సర్వసాధారణం.

నూరియా అన్న మిలటరీ పోలీస్ ఆఫీసర్.. తమ తండ్రి గిరిజన పెద్ద కావడం, ప్రభుత్వ అనుకూల నాయకుడు కావడం వల్లే తాలిబన్లు తమను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని ఆయన చెప్పారు.

అయితే, ఈ ఘటన జరిగి కొన్ని వారాలయ్యేటప్పటికి దీనిపై భిన్న వాదనలు మొదలయ్యాయి. నూరియా, ఆమె అన్న ఓ రకంగా చెబుతుంటే.. నూరియా చేతిలో హతమైన తాలిబన్ల కుటుంబ సభ్యులు వేరే రకంగా.. తాలిబన్లు ఇంకో రకంగా, ప్రభుత్వం మరో రకంగా చెబుతోంది. ఇక పోలీసులు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారు.

'బీబీసీ'తో మాట్లాడినవారిలో ఎక్కువ మంది చెప్పిన ప్రకారం చూస్తే.. ఆ రోజు రాత్రి నూరియా ఇంటిపై దాడికి వచ్చినవారిలో ఆమె భర్త కూడా ఉన్నారు. తాలిబన్లపై పదిహేనేళ్ల యువతి పోరాడిందని చెబుతున్న ఈ ఘటన వెనుక అసలు కథ కుటుంబ వివాదమని స్థానికులు కొందరు చెబుతున్నారు.

ఆ రోజు రాత్రి వచ్చినవారు ముజాహిదీన్లమని చెప్పారని నూరియా అంటోంది. ముజాహిదీన్లంటే తాలిబన్లే.. వారు తమను తాము ముజాహిదీన్లుగా చెప్పుకొంటారు. వారు నూరియా తండ్రి కోసం వచ్చారు.

అయితే, తాలిబన్లు మాత్రం నూరియా ఇంటిపై దాడి ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని ప్రకటించారు. కానీ, అదే రోజు రాత్రి ఆ ఊరిలోని పోలీస్ చెక్ పోస్ట్‌పై తాము దాడి చేశామని చెప్పారు.

మరోవైపు స్థానిక, జాతీయ స్థాయిలో అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు ఇందుకు భిన్నంగా చెబుతూ వచ్చాయి. తాలిబన్లు జరిపిన భారీ దాడిని తిప్పి కొట్టి విజయం సాధించామని చెబుతూ ఈ విజయంలో నూరియానే నిజమైన హీరో అని చెప్పారు.

ఆ ఘటన జరిగిన వెంటనే నూరియా, ఆమె తమ్ముడిని అఫ్గాన్ ప్రభుత్వం అత్యవసరంగా అక్కడి నుంచి హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతానికి తరలించింది. దీంతో నూరియా ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీరోగా మారింది.

అయితే, తాలిబన్ల దాడులను తిప్పికొట్టడంలో కీలకంగా వ్యవహరించిన సాధారణ పౌరులను అఫ్గాన్ అధ్యక్షుడు ప్రశంసించడం కొత్తేమీ కాదు. కానీ, ఈసారి నూరియాకు అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రాజధాని కాబూల్‌కు పిలిపించడంపై మిశ్రమ స్పందన వచ్చింది.

మిలటరీ హెలికాప్టర్ ఎక్కి సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న నూరియా, ఆమె ఇద్దరు తమ్ముళ్లు

ఫొటో సోర్స్, Local Afghan authorities

ఫొటో క్యాప్షన్, మిలటరీ హెలికాప్టర్ ఎక్కి సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న నూరియా, ఆమె ఇద్దరు తమ్ముళ్లు

హీరోనా బలిపశువా?

కొందరు ఆమెను హీరో అన్నారు. ఇంకొందరు ఈ అమాయక బాలిక తాలిబన్ల దాడికి గురవడంతో పాటు ప్రభుత్వ ప్రచారంలోనూ పావుగా మారారని ఆవేదన వ్యక్తంచేశారు.

''లెక్కలేనని మరణాలు, అంతులేని హింసను చవిచూసిన దేశంలో మనిషి జీవితం, శాంతి విలువను ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు. హింసకు సమాధానం హింస కాదు. ఆయుధం పట్టడాన్ని ప్రోత్సహించడమూ సరికాద''ని ఓ యూజర్ ట్వీట్ చేశారు.

''తమ జీవితాలను రక్షించుకున్న మహిళలకు నూరియా ప్రతీక. చాలామంది అఫ్గాన్ బాధిత మహిళలు నిస్సహాయంగా ఉంటున్నారు. పవిత్ర యుద్ధం పేరుతో తాలిబన్లు సాగిస్తున్న హింస కారణంగా కష్టాలు పడుతున్నారు'' అని ఇంకో యూజర్ అభిప్రాయపడ్డారు.

దాడి జరిగిన మరునాడు అక్కడ ఉన్న మృతదేహాల్లో ఇద్దరి వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ప్రకారం వారు తాలిబన్ల మద్దతుదారులుగా స్థానిక పోలీసులు గుర్తించారు.

సయ్యద్ మసూమ్ కమ్రాన్ అనే హై ర్యాంకింగ్ తాలిబన్ కమాండర్ నూరియా కాల్పుల్లో గాయపడి తప్పించుకుని పారిపోయాడని పోలీసులు చెప్పారు.

ఘటన స్థలంలో ఉన్న ఓ వ్యక్తి గతంలో తమతో పనిచేసినట్లు తాలిబన్లు కూడా ధ్రువీకరించారు.

నూరియా ఇంటి బయట హత్యలు జరిగిన ప్రదేశం
ఫొటో క్యాప్షన్, నూరియా ఇంటి బయట హత్యలు జరిగిన ప్రదేశం

ఇంతకీ రహీంతో నూరియాకు పెళ్లయిందా లేదా?

నూరియా, ఆమె పన్నేండేళ్ల తమ్ముడు అధ్యక్షుడి పిలుపు మేరకు కాబూల్ చేరుకున్నప్పుడు వారి తల్లిదండ్రుల హత్య కేసు విషాదంగా కనిపించింది.

కానీ, వారం తరువాత ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నూరియా చేతిలో ఆ రాత్రి చనిపోయిన ఇద్దరిలో ఒకరు ఆమె భర్తేనని వార్తలొచ్చాయి.

కొద్దికాలం కిందట కుటుంబ కలహాల అనంతరం నూరియాను ఆమె తండ్రి తన ఇంటికి తీసుకొచ్చేయడంతో మళ్లీ ఆమెను తీసుకెళ్లేందుకు ఆమె భర్త రహీమ్ వచ్చాడని గ్రామస్థులు, కుటుంబసభ్యులు 'బీబీసీ'కి చెప్పారు.

రహీంకు తాలిబన్లతో సంబంధాలున్నాయని.. ఆయన నూరియాను తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు తనతో పాటు తాలిబన్లనూ వెంట తీసుకొచ్చాడని గ్రామస్థులు చెప్పారు.

అయితే, నూరియా మాత్రం తమ ఇద్దరికీ పెళ్లి కాలేదని చెబుతోంది.

గ్రామంలోని ఇతరులు చెబుతున్న ప్రకారం... మోఖీ ఒప్పందంలో భాగంగా నూరియా రహీం ఇంటికి వెళ్లాల్సి ఉంది. మోఖీ ఒప్పందం అంటే దాదాపు కుండమార్పులు వివాహం వంటిది. దాని ప్రకారం రహీంకు రెండో భార్యగా నూరియా.. అలాగే రహీం ఇంటి నుంచి ఓ టీనేజ్ బాలిక(రహీం సోదరుడి కుమార్తె)ను నూరియా తండ్రికి రెండో భార్యగా చేసేందుకు ఒప్పందం కుదిరింది.

అయితే, ఇద్దరూ ఇంకా బాలికలే కావడంతో కొన్నేళ్ల వరకు ఎవరింట్లో వారు ఉండేలా మాట్లాడుకున్నారు.

కాబూల్
ఫొటో క్యాప్షన్, కాబూల్

నూరియా రహీం భార్యో కాదో తెలుసుకోవడానికి బీబీసీ అతడి తల్లి షఫీకాను.. మొదటి భార్య, పిల్లలను సంప్రదించింది.

రహీం, నూరియాలకు మూడేళ్ల కిందటే పెళ్లయిందని షఫీకా చెప్పారు. అలాగే తమ మనవరాలితో రెండేళ్ల కిందట నూరియా తండ్రికి పెళ్లయిందనీ చెప్పారు.

అయితే, నూరియా తండ్రి కొద్దిరోజుల కిందట రహీం లేని సమయంలో వచ్చి తన భార్యను విడిచిపెట్టి నూరియాను తనతో తీసుకెళ్లిపోయాడని షఫీకా చెప్పారు. నూరియా తండ్రి ఒప్పందాన్ని పక్కనపెట్టి ఇలా చేయడంతో తాము గ్రామ పెద్దలను ఆశ్రయించామని.. అయితే, తాము పేదవాళ్లం కావడం, అధికారం లేకపోవడంతో నూరియా తండ్రిని అడ్డుకోలేకపోయామని చెప్పారు.

రహీం ఆ రోజు నూరియా ఇంటికి వెళ్లాడు కానీ ఆమె తండ్రిని చంపాలని మాత్రం అనుకోలేదని షఫీకా చెప్పారు.

సమస్యను పరిష్కరించుకుందా, ఒకవేళ కావాలనుకుంటే విడాకుల గురించీ మాట్లాడుకోవచ్చని నూరియా తండ్రి పిలవడంతో ఘటన జరిగిన రోజు సాయంత్రమే వారింటికి వెళ్లాడని షఫీకా చెప్పారు.

తన కుమారుడు తాలిబన్లతో పనిచేయడం లేదని చెప్పారామె. కానీ.. రహీం కొన్నేళ్ల కిందట హెల్మద్‌కు వెళ్లినట్లుగా ఆమె చెబుతున్న కాలం.. రహీం తమతో పనిచేశాడని తాలిబన్లు చెబుతున్న కాలం సరిపోలుతున్నాయి.

షఫీకా మరో కుమారుడు పోలీస్ అధికారిగా పనిచేసేవారు.. పన్నెండేళ్ల కిందట నిర్ముజ్‌లో ఒక బాంబుదాడిలో మరణించారు. ఇప్పుడా కుటుంబంలో సంపాదించే మగవాళ్లే లేకుండాపోయారు.

తమకు సంబంధం లేకుండానే హింస కారణంగా నష్టపోతున్న అఫ్గాన్ మహిళల్లో ఇప్పడు ఆమె కూడా ఒకరు.

మృతులను ఖననం చేశారు
ఫొటో క్యాప్షన్, మృతులను ఖననం చేసింది ఇక్కడే

మరోవైపు స్థానిక పోలీసులు, కొందరు గ్రామ పెద్దలు, అఫ్గాన్ అధికారులు మాత్రం రహీం, నూరియాలకు పెళ్లి కాలేదని.. ఇది నూరియా తండ్రిని లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు జరిపిన దాడేనని చెబుతున్నారు.

నూరియా, ఆమె తమ్ముడు, మరికొందరికి మాత్రమే వాస్తవాలేమిటో తెలిసే అవకాశం ఉంది.

మరోవైపు తాలిబన్లు, అఫ్గాన్ ప్రభుత్వం మధ్య ప్రత్యక్ష చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రతి నెలా వందలాది మంది అఫ్గాన్లు హింసకు బలవుతున్నారు. వారిలో అత్యధికులు అమాయక మహిళలు, చిన్నారులే.

నూరియాలాగే వారూ బలహీనులు.. గొంతెత్తలేనివారు. నిత్యం తమను తాము రక్షించుకొనేందుకు పోరాడడం తప్ప ఇంకేమీ చేయలేనివారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)