#NationalMathematicsDay: ‘శకుంతలా దేవి నా జాతకం చూసి నాకు జీవితంలో తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’

శ‌కుంత‌లా దేవి

ఫొటో సోర్స్, Shakuntala Devi/Anupama Banerji

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“అది 1971. నాకు కొత్తగా పెళ్లి అయింది. నా భర్త ఇస్రోలో శాస్త్రవేత్తగా పని చేసేవారు. మేం అప్పుడు త్రివేండ్రంలో ఉండేవాళ్లం. హ్యూమన్ కంప్యూటర్‌గా పిలిచే శ‌కుంత‌లా దేవి త్రివేండ్రంలోని స్కూల్స్‌లో కొన్ని ప్రదర్శనలు ఇవ్వడానికి వచ్చారు. అప్పుడు ఆమె గర్భవతి. ఆమెకు సుమారు 41ఏళ్లు ఉంటాయి. అంటే మా అమ్మగారి వయసు ఆమెకు ఉందని నేననుకున్నాను,” అని గీత అరవముదన్ అన్నారు.

గీత అరవముదన్ బెంగళూరులో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.

తమ ఇంటికి శకుంతల ఒక రోజు బ్రేక్ ఫాస్ట్‌కి వచ్చినప్పటి విశేషాలను ఆమె గుర్తు చేసుకున్నారు.

“నేను ది హిందూ పత్రికకు ఫ్రీ లాన్సింగ్ చేస్తూ ఉండేదాన్ని. ఇస్రోలో చాలా వేగవంతమైన కంప్యూటర్లు ఉంటాయి. కానీ, ఆమె వాటి కంటే వేగంగా సమాధానాలు చెప్పారని నా భర్త చెప్పారు. అది వినగానే నాకు శకుంతలను చూడాలనే ఆసక్తి కలిగింది."

కానీ, శకుంతల ప్రోగ్రాం కవర్ చేయడానికి మరొకరిని అసైన్ చేశారు. అయితే, నేను శకుంతలను చూడాలనిపించి త్రివేండ్రం క్లబ్‌లో జరుగుతున్న ఆమె కార్యక్రమానికి హాజరయ్యాను.”

"శ‌కుంత‌లా దేవి చీర కట్టుకుని, లిప్‌స్టిక్ వేసుకుని, పొట్టి జుత్తుతో, ఎగురుతూ నడిచేవారు. ఆమె స్టేజి మీద లెక్కలు టకటకా తడుముకోకుండా చెప్పేస్తూ ఉంటే నేను కన్నార్పకుండా తన్మయత్వంతో ఆమెని చూస్తూ ఉండిపోయాను".

"ఆమె ప్రోగ్రాం అయిపోగానే నేనామెకు అభినందనలు చెప్పడానికి స్టేజి దగ్గరకు వెళ్లాను. ఇంతలో నాకు తెలిసిన వారెవరో.. గీత కూడా బెంగళూరు అమ్మాయే అని పరిచయం చేశారు".

"ఆ మాట వినగానే శకుంతల కళ్లల్లో మెరుపు. అవునా! నాకు కన్నడ భోజనం తినాలని ఉంది. రేపు పొద్దునే మీ ఇంటికి బ్రేక్ ఫాస్ట్‌కు వచ్చేస్తున్నా’’ అని అన్నారు.

"నాకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. నాకు కొత్తగా పెళ్లి అయింది. నాకు వంటలు సరిగా రావు".

వీడియో క్యాప్షన్, శకుంతలాదేవిని హ్యూమన్ కంప్యూటర్‌ అని ఎందుకంటారు?

"ఉప్మా మాత్రం వండకు"

"నేను ఆలోచనలో ఉండగానే, నాకేం వండుతున్నావు? ఇడ్లీ, దోస? అని అడిగారు? ఇడ్లీ, దోస వండేందుకు కావాల్సిన పదార్ధాలు ఇంట్లో సిద్ధంగా లేవని చెప్పాను. ఉప్మా మాత్రం వండకు" అని ఆమె అన్నారు.

"నేను అలోచించి పొంగల్ చేస్తా అని చెప్పా. ఆమె కళ్లు మెరిశాయి. డ్రైవర్‌కు మీ అడ్రస్ ఇచ్చి వెళ్లండి" అని చెప్పారు.

"మేం ఒక పెద్ద విలాసవంతమైన బంగ్లాలో ఉండేవాళ్ళం. ఆమె చెప్పిన సమయానికి సరిగ్గా ఉదయం 9 గంటలకు మా ఇంటికి వచ్చేశారు.

ఆమె ఊర్లో తిరగడానికి ఒక వ్యాపారవేత్త ఇచ్చిన ఒక ఎర్ర కార్లో మా ఇంటికి వచ్చారు. ఆ కారుని గుర్తు పట్టిన చుట్టుపక్కల పిల్లలు పరుగు పెట్టుకుంటూ ఆమెని చూడటానికి వచ్చేశారు. ఆమె వారిని పలకరించి ఇంటి లోపలికి వచ్చారు".

"నేను చేసిన వేడివేడి పొంగల్ తిని, ఫిల్టర్ కాఫీ తాగుతూ సుమారు ఒక గంటన్నర ఆమె మాతో గడిపారు".

"ఆమె చిన్న నాటి సంగతులు, ప్రపంచ పర్యటనలు, వ్యక్తిగత జీవితం గురించి మాతో చెప్పారు".

"ఏమో! మళ్లీ నన్ను కలవను కాబట్టి మనసులో విషయాలు చెప్పాలనుకున్నారో, లేకపోతే నా మీద నమ్మకంతో చెప్పారో తెలియదు".

శకుంతల దేవి

ఫొటో సోర్స్, SHAKUNTALADEVI/ANUPAMA BANERJEE

ఫొటో క్యాప్షన్, శకుంతల దేవి

"ఆమె పూర్తిగా హృదయంలో రగులుతున్న కోపానికి ప్రతీకలా కనిపించారు. స్టేజిపై కనిపించే చలాకీతనం స్టేజి బయట కనిపించలేదు. బాల్యం కోల్పోయాననే కోపం, తండ్రి తన ప్రతిభను వాడుకున్నారనే ఆగ్రహం, స్కూల్‌కు వెళ్లలేక పోయాననే బాధ చాలా ఉన్నాయి".

“నన్ను సర్కస్‌లో కూడా షోలు చేయించేవారు. లండన్‌కు ఓడలో వెళ్తున్నప్పుడు కూడా నాతో ప్రదర్శనలు చేయించారు”అని ఆమె చెప్పారు.

“ఎందుకో ఆమెకి చాలా మంది మీద ద్వేషం, కోపం ఉన్నాయని అనిపించింది. ఆమె చాలా బాధ పడి ఉంటారని అనిపించింది”

"ఆ తర్వాత మేం ఎప్పుడూ కలుసుకోలేదు".

"నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె కూతురిని కలిశాను. కానీ, ఆమె తన తల్లి గురించి వినడానికి ఇష్టపడలేదు" అని గీత చెప్పారు.

"నీకు లెక్కలు సరిగ్గా చెప్పే టీచర్లు దొరకలేదు"

అరుణ చంద్రరాజు ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ఆమె 2006లో డెక్కన్ హెరాల్డ్ పత్రిక కోసం శకుంతలా దేవిని ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా ఆమెను కలిసినప్పుడు ఆమెతో మాట్లాడిన అనుభవాలను పంచుకున్నారు.

"అది 2006. నేనొక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌ను. నాకు లెక్కలు అంటేనే భయం. అన్ని లెక్కలను ఇట్టే చేసే హ్యూమన్ కంప్యూటర్ శకుంతల గురించి నాకు తెలియని ఆసక్తి ఉండేది. ఆమెను ఇంటర్వ్యూ చేయాలనే ప్రతిపాదనను నేను డెక్కన్ హెరాల్డ్ పత్రిక ఎడిటర్ కి చెప్పగానే ఆయన అంగీకరించారు.’’

"ఆమె ఇంటర్వ్యూ దొరకడం అంత కష్టమేమి కాలేదు. మేడం, మీ ఇంటర్వ్యూ కావాలి అని అడగగానే, ఓహ్.. సరే ఎప్పుడు వస్తావు అన్నారు? మీరు సెలబ్రిటీ కాబట్టి మీరు చెప్పండి, నేనెప్పుడైనా రాగలను అని అన్నాను. ఒక రెండు రోజుల తర్వాత ఆమె ఇంటికి రమ్మని చెప్పారు".

గీత అరవముదన్

ఫొటో సోర్స్, GITAARAVAMUDAN

ఫొటో క్యాప్షన్, గీత అరవముదన్

ఆమె బెంగుళూరులో బసవన్న గుడి దగ్గర కృష్ణారావు పార్క్ ఎదురుగా ఉన్న ఒక విలాసవంతమైన అపార్టుమెంట్లో నివాసం ఉండేవారు.

నేను వెళ్ళేటప్పటికి ఆమె తన రూమ్‌లో ఎవరివో జాతక చక్రాలు చూస్తున్నట్లుగా అనిపించింది. నన్ను చూడగానే ఆ పని పక్కన పెట్టి నన్ను లోపలికి రమ్మని ఆహ్వానించారు.

“ఆమె ఆకుపచ్చని రంగుకు ఎరుపు జరీ అంచుతో ఉన్న పట్టు చీర కట్టుకుని చాలా హుందాగా కనిపించారు”.

“జ్ఞానంతో కూడిన ఆత్మ విశ్వాసం ఆమెలో తొణికిసలాడింది. సాధారణంగా ఏదైనా ప్రత్యేక ప్రతిభలో నిష్ణాతులైన వారు వారికి ప్రావీణ్యం ఉన్న రంగంలోనే జీనియస్‌గా అనిపిస్తారు. ఆమె మాత్రం లెక్కలు మాత్రమే కాకుండా, అనర్గళంగా మాట్లాడటం, రాయడం చేసేవారు. అందుకే ఆమె రచయత కూడా కాగలిగారు”అని అరుణ అభిప్రాయపడ్డారు.

“ఆమె మాటల మధ్యలో నీకేం ఇష్టం అని నన్నడిగారు. నేను వెంటనే మాథెమాటిక్స్ స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాదు. లెక్కల్లో నా ప్రావీణ్యం మిగిలిన సబ్జెక్టుల కన్నా తక్కువే“ అని చెప్పాను. ఆమె వెంటనే "నీకు గణితం రాదని అనకు. నీకు లెక్కలు సరిగ్గా చెప్పే టీచర్లు దొరకలేదు, నీకు వారు లెక్కలపై ప్రేమ కలిగించలేకపోయారు” అని అన్నారు.

ఆమె డెక్కన్ హెరాల్డ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకుంటూ.. “ఆమెకు చిన్నప్పుడు ఒకే ఒక్క చీర ఉండేదని, అదే చీరను ఉతికి ఆరబెట్టి, ఆరే వరకు చలికి వణికిపోతూ కూర్చునే దాన్నని చెప్పారు”.

శకుంతల నాలుగు నెలల పాటు స్కూల్‌కు వెళ్లి, ఫీజు చెల్లించలేక స్కూల్ మానేసినట్లు ఆ ఇంటర్వ్యూ లో రాశారు.

”ఆ తర్వాత కూడా అదే దారిలో ఒక స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తున్నప్పుడు.. ఆమె బాల్కనీ లోనుంచి చూసి గుర్తుపట్టి పైకి రమ్మని పిలిచారు. కొంత సేపు కబుర్లు చెప్పి వచ్చేశాను”అని అరుణ చంద్ర రాజు చెప్పారు.

శ‌కుంత‌లా దేవి

ఫొటో సోర్స్, Shakuntala Devi/Anupama Banerji

హైదరాబాద్‌కు చెందిన అరుణ రెడ్డి న్యూజెర్సీలో ఉండేవారు. 2006 - 2008 మధ్యలో ఒకసారి శకుంతల న్యూయార్క్ వచ్చారని, 500 డాలర్లు చెల్లిస్తే ఆమెను కలవొచ్చని పత్రికల్లో, రేడియోలో వచ్చిన ప్రకటనలు చూసి ఆమెతో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నట్లు చెప్పారు.

అరుణ రెడ్డి అప్పట్లో న్యూజెర్సీలో మాంటిస్సోరి స్కూల్ నడిపేవారు. లెక్కలంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా న్యూమరాలజీ మీద ఆసక్తితో ఆమెని కలవడానికి న్యూ జెర్సీ నుంచి న్యూ యార్క్ వెళ్లినట్లు వివరించారు.

“నాతో పాటు ఆమెను కలవడానికి ఇంకా కొంత మంది బయట హాల్‌లో వేచి చూస్తున్నారు. ఆమెను కలవడానికి నా వంతు వచ్చింది.”

"ఆమె చాలా సింపుల్‌గా చీర కట్టులో హుందాగా కనిపించారు.

హౌ ఆర్ యూ అని అడగ్గానే కాస్త తేలికయ్యాను. ఆమె నాకిచ్చిన సమయం 10 నిమిషాలు మాత్రమే.

శ‌కుంత‌లా దేవి

ఫొటో సోర్స్, Shakuntala Devi/Anupama Banerji

"నీ లాంటి వాళ్ళు ఎప్పటికీ ఒంటరిగానే ఉంటారు”

శకుంతల దేవి జాతకాలు కూడా చెబుతారని విని ఉండటంతో.. “నాకు ఎప్పటికైనా ఒక తోడు దొరుకుతారా అని ప్రశ్నించాను. ఆమె నా పుట్టిన తేదీ తీసుకుని, నువ్వొక స్వతంత్ర ధీర మహిళవు, నీ లాంటి వాళ్ళు ఎప్పటికీ ఒంటరిగానే ఉంటారు” అని అన్నారు.

“లేదు, నాకు ఒంటరిగా ఉండాలని లేదు అని అన్నాను. నీకు మరో చాయిస్ లేదు”అని ఆమె అన్నారు.

శకుంతల దేవి "ఆస్ట్రాలజీ ఫర్ యు" అనే పుస్తకాన్ని రాశారు.

“నాకు నచ్చినట్లు ఆమె మాట్లాడకపోవడంతో నేను టాపిక్‌ను గణితం వైపు మరల్చాను”.

“శకుంతల గణితం గురించి మాట్లాడుతూ.. ఒక స్టోర్‌కు వెళ్ళినప్పుడు సేల్స్‌మ్యాన్ చిన్న లెక్క సరిగ్గా చేయలేదని కోపం వచ్చి చెంప దెబ్బ కొట్టానని చెప్పారు. అమ్మో! నాకు మ్యాథ్స్ రావంటే నన్ను కూడా కొడతారేమో అని భయపడ్డాను”.

“మిమ్మల్ని కలిశాననే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను” అని చెప్పి నా సమయం ముగియడంతో అక్కడ నుంచి బయటకు వచ్చేశాను“అని అరుణ చెప్పారు.

“ఆమెను కలిశానని గానీ, మాట్లాడానని గానీ.. నాకు పెద్దగా గుర్తు రాలేదు. ఇటీవల ఆమె జీవిత చరిత్రతో సినిమా తీస్తున్నారనే విషయం తెలిసినప్పుడు.. ఆమెని కలిసిన విషయాన్ని గుర్తు చేసుకుని ఆమెతో మాట్లాడిన మాటలు నెమరు వేసుకున్నాను“అని అరుణ చెప్పారు.

ఇప్పుడు అరుణ రెడ్డి హైదరాబాద్ దగ్గరలో సింహగడి అనే హోమ్ స్టే నిర్వహిస్తున్నారు.

"ఆమె చెప్పిన అంచనా సరైనదో కాదో తెలియదు. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను" అని అరుణ అన్నారు.

వీడియో క్యాప్షన్, నీలకంఠ భాను ప్రకాశ్: ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)