క్రిస్మస్: క్యాథలిక్ చర్చిలో పవిత్ర కన్యలు... 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని ఆయనకు అర్పిస్తాను'

ఫొటో సోర్స్, TODAY'S CATHOLIC/JOE ROMIE
- రచయిత, వెలారియా పెరాసో
- హోదా, సోషల్ అఫైర్స్ కరెస్సాండెంట్, బీబీసీ వరల్డ్ సర్వీస్
ఒక అందమైన తెల్లని పెళ్లి గౌను, ఒక మేలి ముసుగు, ఒక వేలి రింగు.. తన పెళ్లి కోసం సిద్ధం చేసుకుంది జెస్సికా హేస్. వధువుగా ముస్తాబై చర్చిలో బిషప్ ముందు నిలుచుంది. ఆమె పక్కన ఏ వరుడూ లేడు.
ఆమె ఏసుక్రీస్తును పెళ్లి చేసుకుంటోంది.
జెస్సికా వయసు 41 సంవత్సరాలు. ఆమె ఒక పవిత్ర కన్య. క్యాథలిక్ చర్చిలో దేవుడికి తమను తాము వధువులుగా అర్పించుకోవాలని కోరుకున్న వాళ్లు ఈ విధిని స్వీకరిస్తారు.
క్యాథలిక్ మతంలో కూడా ఈ పవిత్ర కన్యల గురించి పెద్దగా తెలియదు. ఈ విధిని చర్చి బహిరంగంగా ఆమోదించి యాబై ఏళ్లు కూడా కాకపోవటం దీనికి పాక్షిక కారణం.
వధువులా ధవళ వస్త్రాలు ధరించిన కన్య.. ఈ పవిత్ర వేడుక సందర్భంగా తాను జీవితాంతం పరిశుద్ధంగా ఉంటానని, ఎన్నడూ లైంగిక లేదా ప్రేమాయణ సంబంధాలు ఏర్పరచుకోనని ప్రమాణాలు చేస్తుంది.
క్రీస్తుతో తన పెళ్లి నిశ్చయమైనట్లు గుర్తుగా పెళ్లి ఉంగరం కూడా ధరిస్తుంది.

ఫొటో సోర్స్, JOE ROMIE
''అయితే.. నీకు పెళ్లయిందా?' అని నన్ను చాలా మంది అడుగుతుంటారు. నేను క్రీస్తుకు పూర్తిగా అంకితమయ్యానని చెప్తాను. నేను కూడా మత కన్య వంటిదానినని.. కాకపోతే నేను బయటి ప్రపంచంలో జీవిస్తుంటానని క్తుప్లంగా వివరిస్తాను'' అని జెస్సికా చెప్తారు.
ఈ ఏడాది బీబీసీ 100 మంది మహిళలలో ఆమె ఒకరు.
యునైటెడ్ స్టేట్స్ అసోసియేషన్ ఆఫ్ కాన్సెక్రేటెడ్ వర్జిన్స్ (యూఎస్ఏసీవీ) లెక్క ప్రకారం అమెరికాలో ఉన్న 254 మంది ''క్రీస్తు వధువుల''లో జెస్సికా ఒకరు. వీరు.. నర్సులుగా, సైకాలజిస్టులుగా, అకౌంటెంట్లుగా, వ్యాపారవేత్తలుగా, అగ్నిమాపక సిబ్బందిగా వివిధ వృత్తుల్లో ఉన్నారు.
2015 సర్వే ప్రకారం ప్రపంచంలో కనీసం 4,000 మంది పవిత్ర కన్యలు ఉన్నారు. చాలా విభిన్నమైన భౌగోళిక ప్రాంతాలు, సాంస్కృతిక సమూహాల్లో ఈ విధి స్వీకరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని వాటికన్ చెప్తోంది.
నన్‌ల (సిస్టర్లు) లాగా కాకుండా పవిత్ర కన్యలు.. మత ప్రాంతాలకు పరిమితమై జీవించరు. ప్రత్యేక దుస్తులు ధరించరు. వారు లౌకిక జీవితం గడుపుతారు. జీవనాధారం కోసం ఉద్యోగాలు చేస్తారు.
అయితే.. క్యాథలిక్ చర్చిలో ఈ పవిత్ర కన్యల తరహాలో పురుషులకు ఎటువంటి విధీ లేదు.

ఫొటో సోర్స్, TODAY'S CATHOLIC/JOE ROMIE
''నేను 18 ఏళ్లుగా టీచర్‌గా పనిచేస్తున్నాను. నేను చదువుకున్న హైస్కూల్‌లోనే టీచర్‌గా ఉన్నాను'' అని చెప్పారు జెస్సికా. ఆమె అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఫోర్ట్ వేన్‌లో నివసిస్తున్నారు.
''నన్‌ల లాగా ఒక మత సమూహంలో జీవించాలన్న ఆకాంక్ష నాకు కలగలేదు'' అని ఆమె చెప్పారు.
ఆమె ఖాళీ సమయంలో చాలా వరకూ ప్రైవేటు ప్రార్థనలు, పశ్చాత్తాపాల్లో గడుపుతుంటారు. తన ఆధ్యాత్మిక సలహాదారు బిషప్‌ను తరచుగా కలుస్తుంటారు.
గతంలో తానూ కొందరిని ప్రేమించానని.. కానీ ఆ సంబంధాలు తనకు సౌకర్యవంతంగా అనిపించలేదని ఆమె చెప్తారు.
''వైవాహిక జీవితం ఒక వ్యక్తికి చాలా సహజమైన కాంక్ష అని నేను భావించాను. కొందరిని కలిశాను. మంచి వాళ్లనే కలిశాను. కానీ ఎవరితోనూ ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న కాంక్ష నాకు కలగలేదు'' అని జెస్సికా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, WIKICOMMONS
'శాశ్వత నిబద్ధత'
క్రైస్తవ మతం ఆరంభ కాలం నుంచీ చర్చిలో కన్యలు ఒక భాగంగానే ఉండేవారు. మొదటి మూడు శతాబ్దాల్లో దీని ఫలితంగా చాలా మంది చనిపోయి అమరులయ్యారు.
వారిలో ఆగ్నెస్ ఆఫ్ రోమ్ ఒకరు. మతపరమైన పరిశుద్ధతకు నిబద్ధమైన ఆమె నగర గవర్నర్‌ను పెళ్లాడటానికి నిరాకరించటం వల్ల.. ఆమెను చంపేశారని చెప్తారు.
మతపరమైన మఠ, సన్యాస జీవితానికి ప్రజాదరణ పెరగటంతో మధ్య యుగాల్లో ఈ పవిత్ర కన్య ఆచారం తగ్గిపోయింది. అయితే.. శాశ్వత కన్యత్వాన్ని చర్చిలో ఒక స్వచ్ఛంద జీవన శైలిగా గుర్తిస్తూ 1971లో చర్చి ఒక పత్రాన్ని జారీ చేయటంతో మళ్లీ ఇది ప్రాణం పోసుకుంది.
పవిత్ర కన్యగా మారాలని తాను మొదట్లో అనుకోలేదని.. ఒక ఆధ్యాత్మిక సలహాదారు తనను 'సరైన ప్రశ్నలు అడగటం మొదలుపెట్టిన' తర్వాతే ఈ ఆకాంక్ష కలిగిందని జెస్సికా చెప్తారు.
ఆమె 2013లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత రెండేళ్లకు ఆమెకు 36 ఏళ్ల వయసున్నప్పుడు పవిత్ర కన్యత్వం స్వీకరించారామె.

ఫొటో సోర్స్, TODAY'S CATHOLIC/JOE ROMIE
''దేవుడిని స్నేహితుడిగా చూడటం కన్నా.. భర్తగా చూడటం పూర్తి భిన్నంగా ఉంటుంది'' అని ఆమె పేర్కొన్నారు.
శారీరక సంబంధాలను శాశ్వతంగా త్యజించాలని నిర్ణయించుకున్న కన్యలకు.. లైంగికతను ప్రధానంగా భావించే సమాజంలో జీవించటం సవాళ్లతో కూడుకున్న విషయం.
''నా దృష్టిలో అన్నిటికన్నా కష్టమైనది.. మనల్ని పొరపాటుగా అర్థం చేసుకోవటం. మనం ఎంచుకున్న మార్గాన్ని సంస్కృతికి వ్యతిరేకంగా చూస్తారు. 'ఓహో.. అంటే.. నువ్వు ఒంటరి జీవి వంటిదానివన్నమాట' అని చాలా మంది అంటుంటారు. దేవుడు నా ప్రధాన బంధం అని.. నా శరీరాన్ని ఆయనకు అర్పిస్తానని నేను వివరించాల్సి వస్తుంది'' అని అంటారామె.

ఫొటో సోర్స్, JOE ROMIE
శారీరక కన్యలు?
వాటికన్ గత జూలైలో ప్రచురించిన కొత్త మార్గదర్శకాలు పవిత్ర కన్యల్లో చాలా కలకలం రేకెత్తించాయి.
ఈ విధిని ఎంచుకునే మహిళలు.. కన్యత్వం స్వీకరించే క్రతువు వరకూ కూడా కన్యగానే ఉండాల్సిన అవసరం ఉందా అన్నది అందులోని ప్రధానాంశం.
మత శ్రేణిలో చేరిన తర్వాత నుంచీ పరిశుద్ధత ప్రమాణం చేసే నన్‌ల లాగా కాకుండా.. ఈ క్రీస్తు వధువులు జీవితాంతం కన్యలుగానే ఉండాలని చెప్తారు.
ఆ పత్రంలోని వివాదస్పద 88వ నిబంధన.. ఆమె తన శరీరాన్ని నిక్కచ్చిగా నిరంతరం పరిశుద్ధంగా ఉంచుకోవటం'' చాలా ముఖ్యం.. కానీ ''తప్పనిసరి'' అర్హత కాదని వాటికన్ ఇప్పుడు అంటోంది.

మరో మాటలో చెప్తే.. పవిత్ర కన్య కావటానికి కన్యగానే ఉండి ఉండాల్సిన అవసరం ఇక లేదు.
ఈ మార్గదర్శకాలు ''నిరుత్సాహకరంగా'' ఉన్నాయని యూఎస్ఏసీవీ అభిప్రాయం.
''కన్యత్వ జీవితం స్వీకరించటానికి శారీరకంగా కన్యగా ఉండి ఉండటం ముందస్తు అర్హతగా ఇక పరిగణించబోమంటూ మదర్ చర్చ్ చెప్పటం దిగ్భ్రాంతికరం'' అని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆ పత్రంపై మరింత స్పష్టత ఉంటే బాగుంటుందని తను భావిస్తున్నట్లు జెస్సికా చెప్తారు. అయినప్పటికీ.. కన్యల విధి మీద క్యాథలిక్ చర్చి దృష్టి సారించటం పట్ల ఆమె సంతోషం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఆ పత్రం ఇంకా.. (అభ్యర్థులు) వివాహితులై ఉండరాదని, కన్యత్వాన్ని బాహాటంగా, ప్రత్యక్షంగా ఉల్లంఘించి ఉండరాదని నిర్దేశిస్తోంది'' అని ఆమె పేర్కొన్నారు.
''గతంలో ఒక వివక్షాపూరిత చట్టం ఉండి ఉండొచ్చు. తన ఇష్టప్రకారం కాకుండా.. చిన్న వయసులోనో, మహిళగానో అత్యాచారానికి గురైన స్త్రీని కన్యగా గుర్తించి ఉండకపోవచ్చు'' అని వ్యాఖ్యానించారు.
ఏదేమైనా.. క్యాథలిక్ మహిళల్లో ఈ విధికి ప్రోత్సాహం లభించటానికి సంబంధించన అంశమిదని ఆమె అంటారు.
''జనం దేవుడికి ఇంతగా నిబద్ధులై జీవించాల్సిన అవసరం ఉంది కాబట్టి.. చర్చికి ఇప్పుడది అవసరం కాబట్టి ఈ విధి చేపడుతున్న వారు పెరుగుతుండవచ్చు'' అని అభిప్రాయపడ్డారు.
- బ్రిటన్, అమెరికాల్లో క్రిస్మస్ను నిషేధించినప్పుడు ఏం జరిగింది
- జీసస్ గురించి ఖురాన్ ఏం చెబుతోంది?
- లగడపాటి రాజగోపాల్ సర్వేలు ఎందుకంత సంచలనం?
- ఎగ్జిట్ పోల్స్: ఎలా నిర్వహిస్తారు.. కచ్చితత్వం ఎంత
- పెయిడ్ న్యూస్: ‘తెలంగాణ ఎన్నికల్లో రూ.100 కోట్ల చెల్లింపు వార్తలు’
- తెలంగాణ ఎన్నికల ఫలితాలు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- ఎగ్జిట్ పోల్స్‌ను ఎంత వరకు నమ్మొచ్చు? తుది ఫలితాలను అవి ఎంత వరకు అంచనా వేయగలవు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








