లగడపాటి రాజగోపాల్ సర్వే: ఎందుకంత సంచలనం?

లగడపాటి రాజగోపాల్

ఫొటో సోర్స్, LagadapatiRajagopal

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రాజకీయ పార్టీల ప్రచారాలతో తెలంగాణ పల్లెలు, పట్టణాలు హోరెత్తుతున్న సమయంలోనే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరూ మరోసారి తెలంగాణలో మార్మోగింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజా కూటమికి ఆధిక్యం లభిస్తుందని లగడపాటి అంచనా వేశారు. ప్రజా కూటమికి 65 (+/-10), టీఆర్‌ఎస్‌కు 35 (+/-10), ఇతరులు 14 (+/- 4) స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం గళమెత్తి నిత్యం వార్తల్లో నిలిచిన ఆయన అనంతరం.. తెలంగాణ విడిపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగారు.

అయితే, తన అభిరుచిగా చెప్పుకొనే ఎన్నికల ఫలితాలను అంచనా వేసే పనిని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సర్వేలనూ ఆయన సూచనప్రాయంగా వెల్లడిస్తున్నారు. అది రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీ.సింది

ఆయనవి చిలక జోష్యాలని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అనగా.. తన సర్వేలు నిజమైన సందర్భాలే అధికమని.. తానెవరినీ ప్రభావితం చేయడానికి సర్వేలు చేయడం లేదని లగడపాటి అంటున్నారు.

గతంలో ఆయన తన బృందంతో చేయించిన సర్వేల ఆధారంగా వేసిన అంచనాలు ఎక్కువ సందర్భాల్లో వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపై ఉంది.

లగడపాటి రాజగోపాల్

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికల ఫలితాల అంచనా అనేది నేతలు, విశ్లేషకులు, పార్టీలు, మీడియా స్థాయిలో మొదటి నుంచీ ఉన్నప్పటికీ అది ఒక ప్రత్యేక గుర్తింపుతో రావడమనేది 1991లో మొదలైంది. ఎన్నికల సరళి అధ్యయనం, ఫలితాల అంచనా విషయంలో ప్రణయ్ రాయ్, యోగేంద్ర యాదవ్, జీవీఎల్ నరసింహరావు(ప్రస్తుత బీజేపీ రాజ్యసభ ఎంపీ)లను తొలి తరం ముఖ్యులుగా చెప్పుకోవాలి. ఆ తరువాత ఈ రంగం మరింత విస్తృతమైంది.

లగడపాటి ప్రవేశం..

పారిశ్రామికవేత్త అయిన లగడపాటి రాజగోపాల్ 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2005లో తొలిసారి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలపై ఆయన బృందం సర్వే చేసింది. ఆ తరువాత గుజరాత్ శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన తన సర్వే ఫలితాలు వెల్లడించారు. అవి వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండడంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు.

అనంతరం 2008లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో వచ్చిన ఉపఎన్నికల సమయంలోనూ ఆయన సర్వే చేసి ఫలితాలు అంచనా వేయడంతో ప్రాచుర్యంలోకి వచ్చారు.

2009 సార్వత్రిక ఎన్నికలు, ఆ తరువాత 2011, 2012, 2013లో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు ఆయన బృందంతో సర్వేలు చేశారు.

మోదీ, చంద్రబాబు, కేసీఆర్, లగడపాటి

ఫొటో సోర్స్, Getty Images, lagadapati Rajagopal

2014 ఎన్నికల్లో లగడపాటి అంచనాలు ఎంతవరకు నిజమయ్యాయి?

పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2014లో జరిగిన ఎన్నికల సమయంలోనూ ఆయన సర్వే చేసి ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల ముందు అంచనాలు వెల్లడించారు. ఆంధ్ర, రాయలసీమలు(ప్రస్తుత ఆంధ్రప్రదేశ్) ఒక యూనిట్‌గా, తెలంగాణ ఒక యూనిట్‌గా చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కలిసి.. తెలంగాణలో టీఆర్ఎస్, దేశంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని అంచనా వేశారు.

ఆంధ్రప్రదేశ్(ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు)లో సర్వే:

* 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ-బీజేపీ కూటమి 115 నుంచి 125.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 45 నుంచి 55 సీట్లు గెలుస్తాయని చెప్పారు.

* 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమి 19 నుంచి 22 స్థానాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 6 స్థానాలు గెలుచుకుంటాయని చెప్పారు.

వాస్తవ ఫలితాలు:

* అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 103, బీజేపీ 4 కలిపి మొత్తం 107 సీట్లు గెలుచుకున్నాయి. ఇది లగడపాటి అంచనాల్లోని కనిష్ఠ సీట్లు 115 కంటే 8 తక్కువ.

* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 66 సీట్లు గెలుచుకుంది. ఇది లగడపాటి అంచనాల్లోని గరిష్ఠ సీట్లు 55 కంటే 11 అధికం.

* ఏపీలో పార్లమెంటు సీట్లకు వచ్చేసరికి టీడీపీ 15, బీజేపీ 2 కలిపి మొత్తం 17 గెలిచాయి. ఇది లగడపాటి అంచనాల్లోని కనిష్ఠ సంఖ్య 19 కంటే రెండు తక్కువ.

* వైఎస్సార్ కాంగ్రెస్ 8 లోక్ సభ సీట్లు గెలిచింది. ఇది లగడపాటి అంచనాల్లోని గరిష్ఠ సీట్ల కంటే రెండు ఎక్కువ.

ఈవీఎం

ఫొటో సోర్స్, Getty Images

2014 ఎన్నికల్లో తెలంగాణపై లగడపాటి అంచనాలు

* 17 లోక్‌సభ సీట్లలో టీఆర్ఎస్ 8 నుంచి 10... కాంగ్రెస్ 3 నుంచి 5... టీడీపీ-బీజేపీ కూటమి 3 నుంచి 4... ఎంఐఎం ఒక స్థానం గెలుస్తాయన్నారు.

* 119 అసెంబ్లీ సీట్లలో టీఆర్‌ఎస్ 50 నుంచి 60.. కాంగ్రెస్ 30 నుంచి 40.. టీడీపీ-బీజేపీ 18 నుంచి 22.. ఎంఐఎం 7 నుంచి 9 గెలిచే అవకాశం ఉందని చెప్పారు.

వాస్తవ ఫలితాలు:

* టీఆర్ఎస్ 63 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. లగడపాటి సర్వేలోని గరిష్ఠ సంఖ్య 60 కంటే 3 ఎక్కువ వచ్చాయి.

* కాంగ్రెస్ 21 సీట్లు గెలిచింది. లగడపాటి అంచనా వేసిన కంటే 9 తక్కువగా వచ్చాయి.

* టీడీపీ 15, బీజేపీ 5 గెలిచాయి. లగడపాటి ఈ కూటమికి 18 నుంచి 22 వస్తాయని చెప్పారు. అదే అవధిలో వచ్చాయి.

* ఎంఐఎం నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. లగడపాటి చెప్పిన కనిష్ఠ సంఖ్యతో ఇది సమానం.

* టీఆర్ఎస్ 11 లోక్ సభ సీట్లలో విజయం సాధించింది. లగడపాటి అంచనా కంటే ఒకటి ఎక్కువ వచ్చింది.

* టీడీపీ 1, బీజేపీ 1 గెలిచాయి. ఆయన అంచనాల కంటే ఒకటి తక్కువ.

* కాంగ్రెస్ పార్టీ 2 గెలిచింది. ఇది కూడా సర్వే ఫలితాల కంటే ఒకటి తక్కువ.

* ఎంఐఎం 1 గెలిచింది. లగడపాటి కూడా అంతే సంఖ్యలో అంచనా వేశారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ ఒక స్థానం గెలిచింది.

పార్లమెంటు

ఫొటో సోర్స్, Getty Images

2014 లోక్ సభ ఎన్నికలపై సర్వే:

* బీజేపీ సొంతంగా 270 నుంచి 280 సీట్లు, ఎన్టీయే కూటమి 320 నుంచి 330 లోక్‌సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని లగడపాటి చెప్పారు.

* కాంగ్రెస్ పార్టీ సొంతంగా 60 నుంచి 70 సీట్లు.. యూపీఏ పార్టీలన్నీ కలిసి 70 నుంచి 80 సీట్లలో గెలవొచ్చని తెలిపారు.

వాస్తవ ఫలితాలు:

* బీజేపీ 282 లోక్‌సభ స్థానాలు గెలిచింది.

* కాంగ్రెస్ 44 సీట్లు గెలిచింది. ఇది లగడపాటి అంచనాల కంటే బాగా తక్కువ. ఆయన 60 నుంచి 70 గెలుస్తుందని అంచనా వేశారు.

ఓటర్లు

ఫొటో సోర్స్, Getty Images

అందుకే 'ఆంధ్రా ఆక్టోపస్' అయ్యారా?

అంతకుముందు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆంధ్రప్రదేశ్‌లో 155 అసెంబ్లీ సీట్లు, 33 లోక్ సభ సీట్లు వస్తాయని లగడపాటి చెప్పగా అది నిజమైంది.

2010లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది రాజీనామాలు చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ వారంతా గెలుస్తారని ఆయన చెప్పారు. అదీ నిజమైంది.

2011లో కడప లోక్‌సభ స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుమారు 4 లక్షల మెజారిటీ వస్తుందని లగడపాటి అంచనా వేయగా అది నిజమైంది.

నంద్యాల ఉప ఎన్నికల విషయంలోనూ ఆయన అంచనాలు నిజమయ్యాయి.

రాజకీయాలకు దూరం కావడానికి ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లగడపాటి అప్పట్లో ప్రతి ఎన్నికల సమయంలో పార్టీకి తన అంచనాలు ఇచ్చేవారు.

జయలలిత

ఫొటో సోర్స్, Getty Images

తమిళనాడు విషయంలో తడబాటు

లగడపాటి సర్వేలు అత్యధిక సందర్భాల్లో వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నప్పటికీ 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ఆయన అంచనాలు విఫలమయ్యాయి. ఆ ఎన్నికల్లో ఆయన డీఎంకే గెలుస్తుందని అంచనా వేశారు.

కానీ, అన్నాడీఎంకే వరుసగా రెండోసారి విజయం సాధించి జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు.

లగడపాటి రాజగోపాల్

ఫొటో సోర్స్, facebook

'నా పేరుతో వచ్చే తప్పుడు సర్వేలను నమ్మొద్దు'

లగడపాటి సర్వేలు పలు సందర్భాల్లో వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండడంతో ఆయన పేరిట తప్పుడు సర్వేలూ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నాయి. అలాంటి తప్పుడు సర్వే ఫలితాలు చాలాసార్లు తన వరకు వచ్చాయని లగడపాటి చెప్పారు.

తాను మీడియా ముందుకొచ్చి వెల్లడించే సర్వే వివరాలు మాత్రమే తనవని.. సోషల్ మీడియాలో తన పేరు వాడుకుంటూ ప్రచారంలోకి తెచ్చే సర్వేలతో తనకు సంబంధం లేదని చెప్పారు.

'ఆర్‌జీ ఫ్లాష్ టీం' పేరుతో లగడపాటి సర్వేలు చేయిస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)