తెలంగాణ ఎన్నికలు 2018: టీఆర్‌ఎస్‌లో మహిళల స్థానమేంటి? క్యాబినెట్‌లో ఒక్కరూ ఎందుకు లేరు?

ఫొటో సోర్స్, Vasundhara Srinivas/Facebook
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో 107 స్థానాల నుంచి టీఆర్‌ఎస్ తరపున బరిలో దిగబోయే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే విడుదల చేసారు. అందులో కేవలం నలుగురు మహిళా అభ్యర్థులు మాత్రమే ఉన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మెదక్ నుంచి ఎం.పద్మా దేవేందర్ రెడ్డి, ఆసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మి, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి రేఖా నాయక్ టీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేయనున్నారు. వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలే.
2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్.. "జాతి నిర్మాణంలో భాగంగా అన్నిరంగాల్లో మహిళా శక్తిని ఉపయోగించుకోకుండా ఏ దేశం బాగుపడదు" అని పేర్కొన్నారు.
2014 ఎన్నికలలో టీఆర్‌ఎస్ 119 స్థానాలకు 9 స్థానాలలో మహిళా అభ్యర్థులకు టికెట్ ఇచ్చింది. వారిలో ఆరుగురు గెలిచి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సభ్యులయ్యారు. వారిలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు, మరో ఇద్దరు షెడ్యూల్డ్ తెగకు చెందిన వారు. కానీ వారిలో ఒక్కరికీ మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. పద్మా దేవేందర్ రెడ్డిని మాత్రం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకున్నారు.

ఫొటో సోర్స్, TRS Party/Facebook
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రీపురుషుడే
కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. 2001లో స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ట్రం సంపాదించాక తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.
అయినా మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రీ లేకపోవటం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తెలంగాణ మరోసారి ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో మహిళలకు టీఆర్‌ఎస్‌లో ఇచ్చే ప్రాధాన్యతపై చర్చలు జరుగుతున్నాయి.
"పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఎక్కడుంది? ఆఖరికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా పురుషుడే. అలాగని మహిళా శాసనసభ్యులను కేవలం మహిళా శాఖలకే మంత్రులుగా నియమించాలని కాదు. ఎంతో సమర్థంగా పని చేయగల మహిళా సభ్యులు ఉండగా వారిని పాలన, విధాన నిర్ణయాలలో ఎందుకు భాగస్వాములుగా చేయడం లేదు?" అని ప్రశ్నించారు సామజిక కార్యకర్త శ్రావ్య రెడ్డి మందాడి.
2018, ఆగస్టులో ఉమ్మడి హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్ వేసిన దార శ్రీశైలం.. మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించకపోవడం వారి పట్ల వివక్ష చూపడమే అని వాదించారు.
అయితే కోర్టు ఆ వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ, మంత్రివర్గంలో ఎవరు ఉండాలన్న నిర్ణయం ముఖ్యమంత్రిదే అని పేర్కొంది.

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 76 మహిళా కార్పొరేటర్లు టీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచారు. వారిలో కూడా ఎవరికీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. అయితే ఇంకా వెల్లడించాల్సిన 12 స్థానాల జాబితాలో మహిళలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ పి. విజయారెడ్డి వారిలో ఒకరు.
"మహిళా ప్రాతినిధ్యం ఉంటేనే రిజర్వేషన్ వంటి అంశాలలో న్యాయం జరుగుతుంది. అసెంబ్లీలో మహిళా సభ్యులు ఉండడం ఎంతో అవసరం. విడుదల కాబేయే జాబితాలో నా పేరు ఉంటుందని ఆశిస్తున్నాను" అని విజయారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో మొత్తం 2,73,18,603 ఓటర్లలో మహిళా ఓటర్లు 1,35,28,020 ఉన్నారు. మొత్తం 31 జిల్లాలలోని 10 జిల్లాలలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది.
2014లో 119 నియోజకవర్గాలలో 76 నియోజకవర్గాలలో మహిళలు పోటీ చేసారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి 133 మహిళలు ఎన్నికల్లో పోటీ చేసారు. వీరిలో 9 మందే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఫొటో సోర్స్, Kalvakuntla Kavitha/Facebook
సంక్షేమ పథకాలు ఓకే.. కానీ ప్రాతినిధ్యం మాటేంటి?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. గర్భిణిలకు మెటర్నిటీ కిట్, 15 వేల రూపాయల ఆర్థిక సహాయం, కాన్పుకు ముందు, తర్వాత పికప్ అండ్ డ్రాప్, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ అందజేస్తున్నారు.
షీ టీమ్స్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం లక్ష నూట పదహారు రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.
అయితే మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి లేకపోవటం వెనుక గల కారణాలు ఏమిటి?
రాజకీయ విశ్లేషకురాలు దేవి దీన్ని విశ్లేషిస్తూ.. ఇది దొరల మనస్తత్వం నుంచి వచ్చే లక్షణమన్నారు.
"దొరల పాలన పోయినా, దొరల మనస్తత్వం మాత్రం పోలేదు. అందుకే పాలనలో వాళ్లకు చోటు కల్పించడం లేదు. మగవాళ్లు ఆడవాళ్లను రక్షించాలన్నది దొరల మనస్తత్వం. ఇదే ప్రభుత్వ విధానాలలో ప్రతిబింబిస్తోంది. మహిళకు సాధికారత కల్పించకపోతే ఏం ప్రయోజనం? తమ కాళ్ల మీద తాము నిలవగలిగినపుడే సాధికారత వస్తుంది. అలా కాకుండా పితృస్వామ్య మనస్తత్వంతో విధానాలు చేస్తే ఏమీ ఉపయోగం లేదు" అని దేవి అన్నారు.

ఫొటో సోర్స్, Kalvakuntla Kavitha/Facebook
ఏం చేశామన్నది ముఖ్యం
అయితే మహిళలను రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలను టీఆర్‌ఎస్ కొట్టిపారేసింది. పార్లమెంట్ సభ్యురాలు కె.కవిత, మహిళలు ఉన్నారా లేదా అన్నది ముఖ్యం కాదు, మహిళల కోసం ఏం చేసామన్నది ముఖ్యం అన్నారు.
''ఇలాంటి ఆలోచన కేవలం రాజకీయ పార్టీలలోనే ఉంది. కానీ రాష్ట్రంలోని మహిళలు ఆలా అనుకోవడం లేదు. మంత్రివర్గంలో మహిళలను పెట్టుకొని కూడా ఏం చేయకపోతే ఏం ప్రయోజనం? మేం రాష్ట్రంలో మహిళల కోసం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల విషయంలో గర్విస్తున్నాం.''
''నిజమే, మహిళా మంత్రి లేరు. అలాగని మేం మహిళల సంక్షేమం గురించి మర్చిపోలేదు. కేంద్ర మంత్రివర్గంలో మహిళలు అధిక సంఖ్యలో ఉన్నా.. మహిళా రిజర్వేషన్ బిల్ ప్రవేశ పెట్టలేకపోయారు. కాబట్టి, మహిళలు ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు" అని కవిత అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వాయు కాలుష్యం: హైదరాబాద్‌లో ఉంటే.. రోజుకు రెండు సిగరెట్లు తాగినట్లే
- ‘టపాసుల ప్యాకెట్లపై కూడా హెచ్చరిక గుర్తులు ముద్రించాలి’
- అమెరికా మధ్యంతర ఎన్నికలు: ఆసియన్ల జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం ఉందా?
- కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు: బళ్లారిలో బీజేపీ ఓటమి, ‘గాలి’ బ్రదర్స్‌కు ఎదురుదెబ్బ
- Fake News -గుర్తించడం ఎలా-
- అమెరికా మధ్యంతర ఎన్నికలు: ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. సభలో డెమొక్రాట్ల విజయం
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








