తెలంగాణ ఎన్నికలు : హైదరాబాద్‌లో వీరి ఓట్లు ఎవరికి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ నగరం దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలకు ఆవాసం. వ్యాపారాల రీత్యా.. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాల రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడినవారు ఎందరో ఉన్నారు.
కర్నాటక, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌కు చెందినవారు హైదరాబాద్ నగరంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో నివసిస్తున్నారు.
నగరంలోని పలు నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు విస్తరించి ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు నియోజకవర్గాలు గోషామహల్, అంబర్‌పేట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లలో పెద్ద సంఖ్యలో ఇలాంటి జనాభా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
గోషామహల్
హైదరాబాద్ నగరంలో వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన బేగంబజార్, సుల్తాన్‌బజార్, గోషామహల్ ప్రాంతాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ వ్యాపార రీత్యా పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. ఇవి కాకుండా ధూల్‌పేట్, మంగళ్‌హాట్, గన్‌ఫౌండ్రీ, గౌలిగూడ ప్రాంతాల్లో పంజాబీలు, కన్నడిగులు, మహారాష్ట్రకు చెందినవారు నివసిస్తున్నారు.
నియోజకవర్గాల పునర్విభజన తరువాత గోషామహల్ నియోజకవర్గం ఏర్పడి 2009 నుంచి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖేశ్ గౌడ్ గెలవగా 2014 ఎన్నికల్లో బీజేపీ నేత రాజాసింగ్ లోథ్ ఎన్నికయ్యారు. రాజాసింగ్ లోథ్ ఉత్తర్‌ప్రదేశ్ మూలాలున్నవారు.
ఈ ఎన్నికల్లో ఆయనతో తలపడిన టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రేమ్ కుమార్ ధూత్ ఏళ్ల కిందట మహారాష్ట్ర నుంచి వచ్చి స్థిరపడిన కుటుంబానికి చెందినవారు. స్వతంత్రుడిగా బరిలో దిగిన మరో అభ్యర్థి నందకిశోర్ వ్యాస్ కూడా రాజస్థాన్ నుంచి సుదీర్ఘకాలం కిందట వచ్చి స్థిరపడిన కుటుంబానికి చెందినవారే.
నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఉన్న మహరాజ్‌గంజ్ నియోజకవర్గం కూడా రాష్ట్రేతరులను ఆదరించింది. రాజస్థాన్ నుంచి వచ్చి స్థిరపడిన ప్రేమ్‌సింగ్ రాథోడ్ 1999లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. 1967లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1972, 1978 ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
అంబర్‌పేట్
అంబర్‌పేట్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అంతకుముందు ఉన్న హిమయత్‌నగర్ నియోజకవర్గంలోని అత్యధిక ప్రాంతాలు దీని పరిధిలోకి వచ్చాయి.
నియోజకవర్గం ఏర్పడిన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు.
అంబర్‌పేట్ నియోజకవర్గంలోని బాగ్‌లింగంపల్లి, బర్కత్‌పుర, నింబోలీ అడ్డా, మోతీ మార్కెట్, నల్లకుంట, కాచిగూడ, పుత్లిగూడ, విద్యానగర్ ప్రాంతాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడినవారున్నారు.
1978 నుంచి 2004 వరకు హిమయత్‌నగర్ నియోజకవర్గం నుంచి కానీ.. 2004, 2014ల్లో అంబర్‌పేట్ నుంచి కానీ రాష్ట్రేతరులెవరూ ఎన్నిక కానప్పటికీ ఇక్కడి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు కీలకమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
సికింద్రాబాద్ కంటోన్మెంట్
స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ సైనిక స్థావరాలు ఏర్పాటైన ప్రాంతమిది. దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు ఈ నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రజల జనాభా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది.
వీరితో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలవారూ ఉన్నారు.
తిరుమలగిరి, లాల్‌బజార్, కార్ఖానా, బొల్లారం, బోయినపల్లి ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడినవారున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశ 'తొలి' కమ్యూనిటీ రేడియో దశాబ్ది వేడుక... ఇది తెలంగాణ దళిత మహిళల విజయ గీతిక
- కెనెడా: ఇకపై పెరట్లో నాలుగు గంజాయి మొక్కలు పెంచుకోవచ్చు
- పాకిస్తాన్: ఆరేళ్ల జైనబ్‌ను రేప్ చేసి చంపిన నేరస్థుడికి ఉరి శిక్ష అమలు
- ఎంజే అక్బర్ రాజీనామా: ఇది #మీటూ విజయం - ఎన్ రామ్
- రామ్‌లీల: ‘సంపూర్ణ రామాయణాన్ని’ తొలిసారి ప్రదర్శించింది ఇక్కడే
- సౌదీ అరేబియా: అమెరికా ఆంక్షలు విధిస్తే ప్రపంచానికి ఏమవుతుంది?
- పాకిస్తాన్ దేశ చరిత్రలోనే కటిక చీకటి రాత్రి
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలేంటి?
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఎందుకు విధించింది? వాటి ప్రభావం ఎలా ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








