పాకిస్తాన్: ఆరేళ్ల జైనబ్‌ను రేప్ చేసి చంపిన నేరస్థుడికి ఉరి శిక్ష అమలు

ఫొటో సోర్స్, EPA
పాకిస్తాన్‌లో ఆరేళ్ల చిన్నారి జైనబ్ అన్సారీపై అత్యాచారం చేసి హతమార్చిన కేసులో దోషిగా తేలిన ఇమ్రాన్ అలీని ఆ దేశం ఉరి తీసింది.
జనవరిలో అత్యాచారం, హత్యకు గురైన జైనబ్ మృతదేహం ఒక చెత్తకుప్పలో దొరికిన తరువాత ఇమ్రాన్ అలీని పట్టుకున్నారు. విచారణ అనంతరం ఆయన దోషిగా తేలడంతో ఉరి శిక్ష విధించారు. బుధవారం వేకువన ఆయన్ను లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైల్లో ఉరి తీశారు.
జైనబ్ కేసులో దోషిగా నిర్ధారణ అయిన ఇమ్రాన్ అలీ మరో ఆరుగురి బాలికలపైనా అత్యాచారం జరిపి హత్య చేసినట్లు దోషిగా నిరూపణ అయింది.

ఫొటో సోర్స్, POLICE HANDOUT
‘ఇప్పడు తృప్తిగా ఉంది’
కాగా, అలీని ఉరి తీసిన సమయంలో జైనబ్ తండ్రి అమీన్ అన్సారీ అక్కడే ఉన్నారు. ''ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
''నా కళ్లతో నేను ఇమ్రాన్ చావును చూశాను. తలారీ ఆయన్ను ఉరి కంబానికి వేలాడదీశారు. ఆయన దేహాన్ని అలానే అర్ధగంటపాటు ప్రాణాలు పూర్తిగా పోయేవరకు వేలాడుతూ ఉండనిచ్చారు'' అని అమీన్ విలేకరులతో చెప్పారు.
తన కుమార్తె కనుక బతికుంటే ఇప్పుడామెకు ఏడేళ్ల రెండు నెలల వయసు ఉండేదంటూ జైనబ్‌ను తలచుకుని ఆయన కంటతడి పెట్టుకున్నారు.
ఈ ఏడాది జనవరి 4న జైనబ్ కనిపించకుండా పోగా ఐదు రోజుల తరువాత ఆమె మృతదేహం ఒక చెత్తకుప్ప వద్ద దొరికింది.
అప్పటికి రెండేళ్లుగా కసూర్‌లో చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని పోలీసులు చెప్పారు.
జైనబ్ హత్య తరువాత పాకిస్తాన్ అట్టుడికింది. ప్రజలు రోడ్లపైకి నిరసన తెలిపారు. జైనబ్‌ను ఓ వ్యక్తి తనతో పాటు తీసుకెళ్తున్న వీడియో ఫుటేజ్ దొరకడంతో అది సోషల్ మీడియాలో అందరికీ చేరింది. పోలీసులు దానిపై విచారణ జరిపి ఇమ్రాన్ అలీని పట్టుకున్నారు. డీఎన్ఏ పరీక్షల తరువాత ఆయనే నిందితుడిని తేలింది. ఫిబ్రవరిలో కోర్టు ఆయనకు ఉరి శిక్ష వేసింది. ఉరి శిక్ష రద్దు చేయాలంటూ ఆయన అప్పీలు చేసుకోగా కోర్టులు, దేశాధ్యక్షుడు దాన్ని తిరస్కరించారు.
మా ఇతర కథనాలు:
- ఎయిర్ ఇండియా: ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు - మంచివీ, చెడ్డవీ
- ఆసియాలో విమానయానాన్ని ఎవరు శాసిస్తున్నారు?
- 'తిత్లీ' తుపానుకు ఆ పేరు పెట్టింది పాకిస్తాన్
- చరిత్ర: "నన్ను మీరు మభ్య పెట్టలేరు, నేను ఆయన శరీరంలో 34 బుల్లెట్లు దించాను"
- క్వీన్ నేని: ఆమెను గెలవలేక బ్రిటిషర్లు చేతులెత్తేశారు
- తండ్రి ఆస్తిలో కూతురి వాటా ఎంత? తాత ఆస్తిలో ఆమెకు హక్కుందా లేదా?
- సింగపూర్ టూ అమెరికా... 19 గంటల నాన్‌స్టాప్ జర్నీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








