ఎయిర్ ఇండియా: ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు - మంచివీ, చెడ్డవీ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, త్రుషార్ బారోత్
- హోదా, డిజిటల్ ఎడిటర్, బీబీసీ ఇండియా
విమానంలో నేను మొదటిసారి ప్రయాణించినపుడు నా వయసు నాలుగేళ్లు. నేను మా అమ్మతో కలిసి ప్రయాణం చేస్తున్నాను. అప్పుడు మేం భారతదేశం నుంచి బ్రిటన్‌కు వలస వెళుతున్నాం. ముంబయి నుంచి లండన్‌కు విమానంలో బయలుదేరాం.
మా రాక కోసం మా నాన్న హీత్రూ విమానాశ్రయంలో వేచిచూస్తున్నారు. ఆయనతో పాటు బాబాయిలు, పెదనాన్నలు, మామయ్యలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, అత్తమ్మలు, వరసకు నాకు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల సైన్యం కూడా ఉంది.
విమానంలో నేను ఏమీ తినలేదు. అప్పుడు నా రోజు వారీ ఆహారంలో ఎక్కువగా బోర్న్‌విటా హాట్ చాకొలేట్ కప్పులే ఉండేవి. అందుకే ఎయిర్ ఇండియాలో ఉన్న ఆహార పదార్థాల్లో నాకు ఏదీ నచ్చలేదు. అయితే ఓ దయగల ఎయిర్ హోస్టెస్ నన్ను చూసి జాలిపడి.. విమాన సిబ్బంది దగ్గర బర్బోన్ చాకొలేట్ క్రీమ్ బిస్కట్లు ఉంటే తీసుకువచ్చి నాకు బహూకరించారు. నేను సంశయించకుండా ఆ బిస్కట్లు అన్నీ తిన్నాను.

ఫొటో సోర్స్, Getty Images
అది ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణానికి సంబంధించిన నా మొదటి జ్ఞాపకం - దాదాపు 35 సంవత్సరాల కిందట. జాతీయ విమానయాన సంస్థను నాలుగు వేర్వేరు సంస్థలుగా విడగొట్టాలన్న భారత ప్రభుత్వ ప్రణాళిక గురించిన వార్త వచ్చినపుడు.. నాకు, నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చాలా మందికి ఎన్నో జ్ఞాపకాలు - మంచివీ, చెడ్డవీ - కళ్లముందు కదలాడాయి.
బ్రిటన్, అమెరికాల్లో నాకు తెలిసిన ప్రవాస భారత సమాజంలో ఎయిర్ ఇండియా తరచుగా ఎగతాళికి గురవుతూ ఉంటుంది. ఇన్నేళ్లుగా ఎన్నో కథలు వినిపిస్తూ వచ్చాయి.
విమానంలో సీట్లకు మించి ఎక్కువ టికెట్లు బుక్ చేయటం, ప్రయాణికులను వదిలేసి రావటం, చెక్-ఇన్ డెస్కుల వద్ద ఆగ్రహావేశాలతో వాగ్వాదాలు, కూర మరకలు పడ్డ కుర్చీలు, విరిగిన కుర్చీలు, సరిగా పనిచేయని టాయిలెట్లు, చికాకుపడే ఎయిర్ హోస్టెస్‌లు.. ఎన్నో అనుభవాలు కథలుగా వినిపించేవి.
విమానాల్లో ఎలుకలు కనిపించేవనే కథనాలు కూడా విన్నాను. కానీ నాకుగా అయితే విమానంలో ఎలుక కనిపించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఎయిర్ ఇండియా గురించి మీరు ఏమనుకుంటున్నారని సోషల్ మీడియాలో నా స్నేహితులను నేను అడిగాను. దానికి విభన్నమైన సమాధానాలు వచ్చాయి:
- విమానంలో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళా స్నేహితురాలు.. ఒక ఆల్కహాల్ డ్రింక్ కావాలని అడిగితే తనకు తీక్షణమైన చూపులు ఎదురయ్యేవని చెప్పారు.
- దిల్లీ నుంచి లండన్ ప్రయాణిస్తున్న మరో స్నేహితుడు.. విమానంలో అందరికీ చూపుతున్న సినిమా ఫ్రెంచ్ భాషలో ఉందని ఫిర్యాదు చేశారు. దానిని మారుస్తామని హామీలు ఇచ్చినప్పటికీ ఏమీ జరగలేదు. చివరికి ఒక ఫిర్యాదుదారుకి ‘ఎలాగూ సినిమా పూర్తవుతోంది కదా సర్’ అనే జవాబు లభించింది.
- మరో విమానయాన సంస్థ విమానంలో ప్రయాణిస్తుండగా.. కొంచెం జబ్బుపడి ఇబ్బంది పడుతున్న నా స్నేహితురాలు ఒకరిని.. అదే విమానంలో ఫస్ట్ క్లాస్ సీటులో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా పైలట్ ఒకరు గమనించి.. ఆమెకు తన సీటు ఇచ్చి ఆమె సీటులో తను కూర్చున్నారు.
- విమానంలో భోజనాన్ని తిరస్కరించిన మరో స్నేహితుడికి.. ఒక ఎయిర్ హోస్టెస్ మళ్లీ వచ్చి క్యారట్ హల్వా బహూకరించారు. ఆయన సంతోషంగా దానిని స్వీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
- కఠినంగా వ్యవహరించే హోస్టెస్‌ల గురించి ఎక్కువగా వినిపిస్తుంది. విమానం టేక్-ఆఫ్ సమయంలో తన ముందు సీటులో కూర్చున్న ప్రయాణికుడు సీటును పదే పదే వెనక్కు పుష్ చేస్తున్నారని ఒక స్నేహితుడు ఫిర్యాదు చేశారు. హోస్టెస్ వచ్చి ఆ సీటులోని ప్రయాణికుడిని చూశారు. అతడి సీటును సాధారణ స్థానంలోకి వచ్చేలా బటన్ పుష్ చేసి అతడిని.. ‘మళ్లీ సీటును వెనక్కు పుష్ చేయటానికి ప్రయత్నించి చూడండి. మిమ్మల్ని విమానంలో నుంచి బయటకు విసిరేస్తా. ఇది పడక కుర్చీ కాదు!’ అని హెచ్చరించారు. ఇక ఆ ప్రయాణికుడు బుద్ధిగా నడుచుకున్నాడు.
- నా స్నేహితుడు జెఫ్ ఒకసారి ప్రయాణించాల్సిన విమానం రద్దయింది. ‘రేపు రండి’ అని ఆయనకు విమానయాన సంస్థ సిబ్బంది చెప్పారు. ఆయన తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నారు. ‘‘మమ్మల్ని విమానం ఎక్కించి తీరాలని నేను మృదువుగా.. నిక్కచ్చిగా చెప్పాను. దీంతో మాకు బిజినెస్ తరగతికి అప్‌గ్రేడ్ చేశారు. కానీ సమస్య ఏమిటంటే.. ఆ తర్వాతి సంవత్సరం నా ఇద్దరు పిల్లలు ఎకానమీ తరగతిలో వెళ్లటానికి నిరాకరించారు’’ అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
నేను ఎయిర్ ఇండియాలో మొదటిసారి విమాన ప్రయాణం చేసిన 35 సంవత్సరాల తర్వాత చివరిసారిగా గత వారంలో లండన్ నుంచి దిల్లీకి ప్రయాణించాను 787 డ్రీమ్‌లైనర్‌లో నా కుడి పక్కన రెండు సీట్లు దారి పొడవునా ఖాళీగానే ఉన్నాయి. ఎకానమీ తరగతిలో నా కాళ్లు చాచుకుని విమానంలోని వ్యక్తిగత ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌లో సినిమా చూశాను. నాలుగేళ్ల పిల్లాడిగా తొలి ప్రయాణం జ్ఞప్తికొచ్చింది. నేటి ఆధునిక పరిసరాలను చూసి నవ్వొచ్చింది.
ఇవి కూడా చదవండి:
- ‘విమాన ఛార్జీలపై గరిష్ఠ పరిమితి’
- 'దంగల్' ఫేమ్ జైరా వసీంకు వేధింపులు
- హీరోయిన్ను వేధించిన కేసులో ఒక వ్యక్తి అరెస్ట్
- హజ్ సబ్సిడీ రద్దుపై ముస్లింలేమంటున్నారు?
- హజ్ సబ్సిడీ నిజంగా ముస్లింలకా, విమానయాన కంపెనీలకా?
- అమెరికా ఆరోగ్య మంత్రి రాజీనామా
- రైలుకు వేలాడుతూ 25 కి.మీ. ప్రయాణం
- వీళ్లు మెట్రో రైళ్లలో ప్యాంట్లు విప్పేశారు
- నల్లమలలో రైలు బండి... పేదలకు బతుకు బండి!
- మొట్టమొదటి మెట్రో ఎప్పుడు మొదలైందో తెలుసా!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








