ఫొటోల్లో ప్రపంచ మెట్రో రైలు చరిత్ర

ఫొటో సోర్స్, Hulton Archive/getty images
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్రిటన్: ప్రపంచంలో తొలి మెట్రోపాలిటన్ రైలు వ్యవస్థను లండన్‌లో 1863లో ప్రారంభించారు. భూగర్భం ద్వారా రైల్వే లైన్లు వేశారు. తొలిరోజు దాదాపు 30,000 మంది ప్రయాణించారు. విద్యుత్‌తో నడిచే తొలి రైలు 1890లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఉన్నది లండన్‌లోని ప్రయిడ్ స్ట్రీట్‌లో ప్రయాణిస్తున్న తొలి మెట్రో రైలు.

ఫొటో సోర్స్, Hulton Archive/getty images
బ్రిటన్: 1863లో మెట్రో ట్రైల్ రన్ సందర్భంగా పోర్ట్‌ల్యాండ్ రోడ్ స్టేషన్ వద్ద గాలిలో టోపీలు ఊపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు. తొలుత మెట్రో లైన్లు ప్రైవేటు కంపెనీల అధీనంలో ఉండేవి.

ఫొటో సోర్స్, ADRIAN DENNIS/getty images
బ్రిటన్: ప్రభుత్వ అధీనంలోని లండన్ అండర్‌గ్రౌండ్ లిమిటెడ్ ప్రస్తుతం మెట్రోను నిర్వహిస్తోంది. ప్రస్తుతం 270 స్టేషన్లు, 400 కిలోమీటర్ల నెటవర్క్ ఉంది. రోజుకు సుమారు 50 లక్షల మంది ఈ రైళ్ల ద్వారా ప్రయాణిస్తారు. 1983లో తొలిసారి ట్రావెల్ కార్డు, 2003లో కాంటాక్ట్‌లెస్ కార్డ్‌ను తీసుకొచ్చింది. లండన్‌లో పార్సన్స్ గ్రీన్ స్టేషన్ వద్ద ఉన్న భూగర్భంలో ప్రయాణించే మెట్రో రైలును ఈ చిత్రంలో చూడొచ్చు.

ఫొటో సోర్స్, WPA Pool/getty images
బ్రిటన్: లండన్ మెట్రో రైలు వ్యవస్థలో మొత్తం 11 లైన్లు ఉంటాయి. దాదాపు 12 మెట్రో డిపోలు ఉన్నాయి. బ్యాంకర్ స్ట్రీట్ స్టేషన్ వద్ద మెట్రోలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2.

ఫొటో సోర్స్, Andrew Burton/getty images
అమెరికా: న్యూయార్క్ సిటీ సబ్‌వే మెట్రో రైలు వ్యవస్థను 1904లో ప్రారంభించారు. 2014 నాటికి ఇది 110 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రోజులో 24 గంటలూ ఇది సేవలు అందిస్తూ ఉండటం విశేషం. ఈ చిత్రంలో ఉన్నది 34 స్ట్రీట్, హడ్సన్ యార్డ్స్ స్టేషన్‌లోని మెట్రో రైలు.

ఫొటో సోర్స్, Andrew Burton/getty images
అమెరికా: ప్రపంచంలో అతి ఎక్కువ స్టేషన్లు ఉన్నది న్యూయార్క్ సిటీ సబ్‌వే మెట్రోలోనే. దాదాపు 472 స్టేషన్లు ఉన్నాయి. రోజుకు సుమారు 60 లక్షల మంది ఈ మెట్రో ద్వారా ప్రయాణిస్తారు.

ఫొటో సోర్స్, ALEJANDRO PAGNI/getty images
అర్జెంటీనా: లాటిన్ అమెరికాలో తొలి మెట్రో బ్యూనోస్ ఎయిరీస్ అండర్‌గ్రౌండ్. దీన్ని 1913లో ప్రారంభించారు. 100 ఏళ్లపాటు చెక్కతో తయారు చేసిన బోగీలను వినియోగించారు. 2013లో వీటి స్థానంలో అధునాతన బోగీలు ప్రవేశపెట్టారు. ఆధునిక, పాత బోగీలను చిత్రంలో చూడొచ్చు.

ఫొటో సోర్స్, TORU YAMANAKA/getty images
జపాన్: టోక్యో సబ్‌వే మెట్రోను 1927లో ప్రారంభించారు. ప్రపంచంలో ఎక్కువ ప్రవేశ ద్వారాలు గింజా మెట్రో స్టేషన్‌కు ఉన్నాయి. ఈ ద్వారాల సంఖ్య దాదాపు 48. ప్రపంచవ్యాప్తంగా భూగర్భ స్టేషన్లలో ఇది అతిపెద్దది.

ఫొటో సోర్స్, Facebook/Masco metro
రష్యా: మాస్కో మెట్రో 1935లో ప్రారంభమైంది. నాటి సోవియట్ యూనియన్‌లో ఇది మొదటి భూగర్భ రైలు వ్యవస్థ. తొలి రైలులో స్టాలిన్ ప్రయాణించినట్లు నాటి కమ్యూనిస్ట్ పార్టీ అధికార పత్రిక ప్రవ్దా వెల్లడించింది.

ఫొటో సోర్స్, Ian Walton/Getty images
రష్యా: ప్రపంచంలో అందమైన మెట్రోలలో మాస్కో ఒకటిగా ఉంది. ఇక్కడి స్టేషన్లను ఆకట్టుకునేలా రూపొందించారు. పార్క్ పొబెడీ ప్రపంచంలో అతి లోతైన భూగర్భ మెట్రో స్టేషన్‌గా గుర్తింపు పొందింది.

ఫొటో సోర్స్, VCG/getty images
చైనా: బీజింగ్ సబ్‌వే ప్రపంచంలో రెండో అతి పెద్ద మెట్రో రైలు వ్యవస్థగా ఉంది. 1969లో దీన్ని ప్రారంభించారు. రోజుకు సగటున 90 లక్షల మంది ఇందులో ప్రయాణిస్తున్నారు.

ఫొటో సోర్స్, PETER PARKS/getty images
చైనా: షాంఘై సబ్‌వేను 1993లో ప్రారంభించారు. ప్రయాణించే దూరంగా ఆధారంగా చూస్తే ప్రపంచంలో ఇదే అతి పెద్ద మెట్రో వ్యవస్థ. ప్రతిరోజూ సగటున 90 లక్షల మంది ప్రయాణిస్తారు.

ఫొటో సోర్స్, Facebook/Kolkata Metro
భారత్: కోల్‌కతా మెట్రో దేశంలో మొదటిది. 1984లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రతి రోజూ సగటున 6-7 లక్షల మంది ప్రయాణిస్తారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








