అసలు జీఈఎస్ (అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు) అంటే?

ఫొటో సోర్స్, Facebook/Ivanka Trump
ఇవాంకా ట్రంప్.. ప్రస్తుతం హైదరాబాద్ జపిస్తున్న మంత్రం. ఈ నెల 28-30 మధ్య జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో ఆమె పాల్గొననున్నారు.
దీన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది.
ఈ నేపథ్యంలో అసలు జీఈఎస్ అంటే ఏమిటి? ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ సదస్సు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
ప్రధాన లక్ష్యం
ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదార్లను ఒక తాటిపైకి తీసుకు వచ్చే ఉద్దేశంతో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)ను ఏర్పాటు చేశారు.
ముఖ్య విధులు
- ప్రభుత్వం, ప్రైవేటు రంగానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించడం
- అంతర్జాతీయంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను పంచుకునేందుకు వేదిక ఏర్పాటు చేయడం
- కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలు కల్పించడం
- ప్రధానంగా యువ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థల (స్టార్టప్స్)ను ప్రోత్సహించడం
- పెట్టుబడులు పొందేందుకు సహాయం చేయడం
- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం
ఇవి కూడా చూడండి

ఫొటో సోర్స్, GES-2017.org
ఎప్పుడు నిర్వహిస్తారు?
- ఈ సదస్సును ప్రతి ఏడాదీ నిర్వహిస్తారు.
- తొలి సదస్సు 2010లో అమెరికాలో జరిగింది.
ప్రయోజనాలు
- వినూత్న ఆలోచనలతో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
- ఇప్పటి వరకు ఎన్నో ఆలోచనలు ఇలా వ్యాపార సంస్థలుగా మారాయి.
- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదార్లను కలుసుకోవచ్చు.
- వ్యాపారాన్ని సులభంగా నిర్వహించేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేయవచ్చు.
- యువత వ్యాపార నైపుణ్యాలను పెంచుకునే వీలు కలుగుతుంది.

ఫొటో సోర్స్, Facebook/Narendra Modi
జీఈఎస్-2017
వేదిక: హైదరాబాద్
ఎప్పుడు: అమెరికాతో కలిసి నీతి ఆయోగ్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ నెల 28 నుంచి 30 వరకు సదస్సు జరుగుతుంది. దక్షిణాసియాలో తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
అంశం: "ఉమెన్ ఫస్ట్, ప్రాస్పర్టీ ఫర్ ఆల్ " అనే అంశంతో మహిశా పారిశ్రామికవేత్తలకు పెద్ద పీట వేయనున్నారు. అలాగే అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.
ప్రతినిధులు: ప్రపంచవ్యాప్తంగా 1500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్న ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
ఇవి కూడా చూడండి

ఫొటో సోర్స్, GES-2016.org
గత సమావేశాలు ఇలా..
తొలిసారి 2010లో నిర్వహించిన సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. ఆ తరువాత టర్కీ (2011), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (2012), మలేసియా (2013), మొరాకో (2014), కెన్యా (2015), అమెరికా (2016)లలో సదస్సులు జరిగాయి. ప్రస్తుతం 8వ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది.
(ఆధారం: గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్-2017, 2016 వెబ్‌సైట్స్)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









