‘ఇరాన్‌లో బాలికల పాఠశాలపై దాడిలో 153 మంది మృతి’- దీనిపై అమెరికా, ఇజ్రాయెల్ ఏమన్నాయంటే…

ఇరాన్, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, స్కూల్ బిల్డింగ్ శిథిలాలను తొలగిస్తున్న సిబ్బంది, ప్రజలు
    • రచయిత, ఘోన్షే హబిబాయ్‌జాద్, రాబర్ట్ గ్రీనాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • చదివే సమయం: 3 నిమిషాలు

దక్షిణ ఇరాన్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడిలో చిన్నారులు సహా కనీసం 153 మంది మరణించారని ఇరాన్ అధికారులు తెలిపారు.

ఈ ఘటనకు అమెరికా, ఇజ్రాయెలే బాధ్యులని ఇరాన్ ఆరోపించింది. దీనికి సంబంధించిన నివేదికలను పరిశీలిస్తున్నామని యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తెలిపింది.

మరోవైపు, ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ రక్షణ దళాల కార్యకలాపాలేవీ జరిగినట్లు తమకు అవగాహన లేదని ఇజ్రాయెల్ సైన్యం అంటోంది.

దాడికి గురైనట్లు చెబుతున్న బాలికల పాఠశాల మినాబ్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) స్థావరానికి సమీపంలో ఉంటుంది. ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని గతంలో దాడులు జరిగాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'అనాగరిక చర్య'

ఇరాన్‌లో జరిగిన గగనతల దాడుల్లో శనివారం నుంచి కనీసం 201 మంది మరణించారని, 747 మంది గాయపడ్డారని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ తెలిపింది.

ఈ తాజా ఘటనను "అనాగరిక చర్య" అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అభివర్ణించారు. "అరాచకులు కొనసాగిస్తున్న లెక్కలేనన్నీ నేరాల చిట్టాలో ఇది మరో చీకటి అధ్యాయం" అని పేర్కొన్నారు.

"ఈ ఘటనకు సంబంధించిన రిపోర్టులను మేం తీవ్రంగా పరిశీలిస్తాం" అని సెంట్‌కామ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ అమెరికా మీడియా రిపోర్ట్ చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

"పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. ఉద్దేశపూర్వకంగా చేయని దాడుల వల్ల కలిగే హాని నుంచి పౌరులను కాపాడేందుకు మేం తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూనే ఉంటాం" అని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్‌లో శనివారం నుంచి గురువారం వరకు ఆరు రోజులను పనిదినాలుగా పరిగణిస్తారు. శుక్రవారం అధికారిక సెలవు రోజు. దీన్నిబట్టి చూస్తే ఘటన జరిగిన రోజు పాఠశాలలో పిల్లలు ఉండే ఉండొచ్చు.

శనివారం ఈ ఘటన తర్వాత, స్కూలుకు పంపడం కోసం తమ సహాయక బృందాలను సమీకరించామని జెనీవాలోని రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ అధికారులు తెలిపారు.

హార్మోజ్‌గాన్ ప్రావిన్సులోని మినాబ్‌ పట్టణంలో ఉన్న ఈ పాఠశాలపై "మూడు మిసైల్స్ దాడి చేశాయి" అని పాఠశాలకు చెందిన ఓ అధికారి తెలిపారు.

ఐఆర్‌జీసీ స్థావరం నుంచి 600 మీటర్ల దూరంలో ఈ పాఠశాల ఉంది.

ఈ పేలుడు తర్వాత దృశ్యాలను బీబీసీ ధ్రువీకరించింది. అందులో భవనం నుంచి పొగవ్యాపిస్తున్నట్లుగా కనిపించింది. అలాగే, చాలామంది అక్కడ గుమిగూడి, ఆందోళనతో అరుస్తున్నట్లగా వినిపించింది.

అయితే ఎంత మంది మరణించారనే విషయాన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు. అంతర్జాతీయ వార్తా సంస్థలకు ఇరాన్ వీసాలను నిరాకరించిన నేపథ్యంలో అక్కడి నుంచి వార్తలను సేకరించడం కష్టంగా మారింది.

ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

'ఇస్లామిక్ రిపబ్లిక్‌దే బాధ్యత'

ఈ ఘటనపై ఇరాన్‌లోని సోషల్ మీడియా యూజర్ల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

"ఈ యుద్ధంలో తొలి బాధితులు మినాబ్‌లో మిసైల్ దాడికి గురైన 40 మంది అమ్మాయిలు. ఈ యుద్ధానికేనా మీరు సంతోషపడుతోంది?" అని ఇరాన్‌లో సైనిక జోక్యాన్ని వ్యతిరేకించే ఓ ఇరాన్ పౌరుడు కామెంట్ చేశారు. ఆయన విదేశాల్లో నివసిస్తుంటారు.

ఇరాన్‌లో పాలకులపై అపనమ్మకం ఉన్న నేపథ్యంలో చాలామందికి అధికారిక నివేదికలను అంగీకరించడం కష్టంగా మారుతోంది. ఈ దాడిలో ఇరాన్ ప్రభుత్వానిదే బాధ్యత అని కొంతమంది ఇరాన్ పౌరులు నేరుగా నిందించారు.

"ప్రభుత్వం నేరుగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకోనప్పటికీ, మినాబ్‌లోని చిన్నారుల మృతికి ఇస్లామిక్ రిపబ్లిక్‌దే బాధ్యత" అని ఓ యూజర్ రాశారు.

"ప్రజలు ఉండేందుకు చోటు లేదు. ఇంటర్నెట్‌ను తీసేశారు. ఫోన్‌లైన్స్ పని చేయడం లేదు. పాఠశాలలకు చిన్నారులను దూరంగా ఉంచాలని ఎలాంటి హెచ్చరికా చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇంటి దగ్గర ఉండటం కనీస అవసరం కదా’’ అన్నారు.

శనివారం ఇరాన్ నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్ గగనతల దాడులు చేపట్టిన తర్వాత ఇరాన్‌లోని ఈ పాఠశాలపై దాడి జరిగింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)