ఇరాన్ కొత్త నాయకుడిని ఎలా ఎన్నుకుంటారు?

ఫొటో సోర్స్, Tasnim
- రచయిత, బీబీసీ పర్షియన్
- చదివే సమయం: 5 నిమిషాలు
ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకుడు మరణించిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలను ఇరాన్ రాజ్యాంగం, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ (నిపుణుల సభ) అంతర్గత నియమావళి నిర్ణయించాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం, సుప్రీం లీడర్ మరణించినప్పటి నుంచి నిపుణుల సభ కొత్త నాయకుడిని పరిచయం చేసేవరకు, త్రిసభ్య మండలి సుప్రీం లీడర్ విధులను తాత్కాలికంగా నిర్వహిస్తుంది.
ఈ త్రిసభ్య మండలిలో అధ్యక్షుడు, న్యాయవ్యవస్థ చీఫ్‌తో పాటు గార్డియన్ కౌన్సిల్ నుంచి ఎక్స్‌పెడియన్సీ డిసర్న్‌మెంట్ కౌన్సిల్ (ఇరాన్‌లో అత్యున్నత సలహామండలి) ఎంపిక చేసిన న్యాయనిపుణుడు ఉంటాడు.
అయితే ఈ త్రిసభ్య మండలికి పూర్తి అధికారాలు ఉండవు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అత్యున్నత సలహామండలిలోని మూడొంతుల సభ్యుల ఆమోదం ఉండాలి.
ఆ నిర్ణయాలు ఏవంటే...
- వ్యవస్థ సాధారణ విధానాలను నిర్ణయించడం
- ప్రజాభిప్రాయ సేకరణకు డిక్రీ జారీ చేయడం
- యుద్ధం లేదా శాంతి ప్రకటన
- అధ్యక్షుడిపై అభిశంసన
- జాయింట్ స్టాఫ్ చీఫ్, ఐఆర్‌జీసీ కమాండర్-ఇన్-చీఫ్ లేదా సీనియర్ మిలటరీ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ కమాండర్ల తొలగింపు, నియామకం.
- అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా నాయకుడు తాత్కాలికంగా తన విధులను నిర్వర్తించలేకపోతే, ఈ కౌన్సిల్ అదే హోదాలో ఆయన విధులను స్వీకరిస్తుంది.


ఫొటో సోర్స్, IRNA
కొత్త నాయకుడి ఎన్నిక
నాయకుడి వారసుడిని నియమించడం నిపుణుల సభ బాధ్యత. ఈ సభలో 88 సీట్లు ఉన్నాయి. (ఏ సభ్యుడైనా మరణిస్తే ఆ స్థానం తదుపరి సాధారణ ఎన్నికల వరకు ఖాళీగానే ఉంటుంది).
ఈ అసెంబ్లీకి చైర్మన్ మొహమ్మద్ అలీ మోవాహెది కెర్మానీ. వైస్ చైర్మన్లుగా హషేం హోస్సేని బుషెహ్రీ, అలిరేజా ఆరాఫీ ఉన్నారు. నిపుణుల సభ సభ్యులందరినీ వారి ఎన్నికకు ముందు గార్డియన్ కౌన్సిల్ పరిశీలించి అనుమతిస్తుంది.
నాయకత్వ స్థానం ఖాళీ అయితే ఈ సభ వీలైనంత త్వరగా సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
నిబంధనల ప్రకారం, నిపుణుల సభ సమావేశం దాని సభ్యులలో కనీసం మూడింట రెండు వంతుల మంది (59 మంది) హాజరైనప్పుడే చెల్లుబాటు అవుతుంది.
కొత్త నాయకుడిని ఎన్నుకోవాలంటే సమావేశంలో ఉన్న వారిలో మూడింట రెండోవంతు మెజారిటీ ఓట్లు అవసరం. అంటే 59 మంది సభ్యులు హాజరైతే, కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి 40 ఓట్లు సరిపోతాయి. అయితే ఇంత ముఖ్యమైన సమావేశానికి సభ్యుల్లో చాలామంది హాజరవుతారని భావిస్తారు.
హాజరైన సభ్యులందరూ కొత్త నాయకుడి ఎన్నికకు సంబంధించిన సమావేశ తీర్మానాలపై సంతకం చేయాలి.

ఫొటో సోర్స్, Tasnim
నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటారు?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 109 ప్రకారం నాయకుడు కావాలంటే " న్యాయం, భక్తి, సరైన రాజకీయ, సామాజిక అవగాహన, సునిశిత ఆలోచనాశక్తి, వివేకం, ధైర్యం, నిర్వహణ, నాయకత్వానికి తగినంత శక్తి, వివిధ ఇస్లామిక్ అంశాలపై ఫత్వాలు జారీ చేయడానికి అవసరమైన మతపరమైన జ్ఞానం" ఉండాలి.
నాయకత్వ పదవికి పరిగణనలోకి తీసుకునే వ్యక్తుల అర్హతలను సమీక్షించడానికి నిపుణుల సభకు ఒక కమిషన్ ఉంది. ఇందులో 11మంది సభ్యులుంటారు.
ఈ కమిషన్ పనితీరు పారదర్శకంగా ఉండదు. నివేదికలను రహస్యంగా ఉంచుతారు.
అలీ ఖమేనీకి ప్రోస్టేట్ శస్త్రచికిత్స జరిగిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత 2015 డిసెంబర్‌లో నిపుణులసభ సభ్యుడు అక్బర్ హషేమి రఫ్సంజాని మాట్లాడుతూ ‘‘ఏవైనా సంఘటనలు జరిగితే, నాయకత్వ పదవికి ఎంపిక చేసే వారి అర్హతలను సమీక్షించడానికి వీలుగా నిపుణుల సభ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది " అని చెప్పినప్పుడే ఈ కమిషన్ ఉనికి గురించి మొదటిసారి తెలిసింది.
కొన్ని నెలల తర్వాత జూన్ 2016లో ఆయన మరింత వివరణ ఇచ్చారు. "ఇద్దరు లేదా ముగ్గురు నిపుణులు అధ్యయనం చేసి వ్యక్తులకు గ్రేడ్‌లు ఇస్తున్నారు. తద్వారా అవసరమైతే, వారి గురించి నిపుణులసభలో చర్చించవచ్చు'' అని చెప్పారు.
కమిషన్ "ఒక దశలో అనేక వందల మందితో చర్చలు జరిపిన తర్వాత చివరకు రహస్యంగా ఇద్దరిని ఎంపికచేసి పరిచయం చేసింది'' అని ఆయన చెప్పారు.
ఆ ఇద్దరు వ్యక్తులను ఎవరికి లేదా ఏ అధికార సంస్థకు పరిచయం చేశారో అక్బర్ హషేమి రఫ్సంజానీ చెప్పలేదు. అయితే, నిపుణులసభ సభ్యుడు, కార్యదర్శి అహ్మద్ ఖతామి గతంలో ఓ విషయం వెల్లడించారు.
'' నిపుణులసభ తమ దగ్గర కొందరు నాయకుల పేర్లను సిద్ధంగా ఉంచుకోవాలని....సుప్రీం లీడర్ కోరుకుంటే ఈ పేర్లు కేవలం ఆయనకు మాత్రమే చూపాలని, ఇతరులెవ్వరకీ చూపకూడదని ఖమేనీ చెప్పినట్టు'' అహ్మద్ ఖతామి తెలిపారు.

ఫొటో సోర్స్, More
కొత్త నాయకుడి ఎంపికకు ఎంత సమయం పట్టొచ్చు?
నిపుణుల సభలో కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి ఎలాంటి కాలపరిమితి నిర్ణయించలేదు. ముగ్గురు సభ్యుల తాత్కాలిక మండలి ఏర్పాటును పేపర్ మీద చూపించినా సరే అధికార శూన్యత లేనట్టే.
కానీ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణం తర్వాత జరిగిన సంఘటనలను గమనిస్తే, ఆ పరిస్థితుల్లో నిపుణులసభ సభ్యులు త్వరితగత నిర్ణయానికి ప్రాధాన్యం ఇచ్చారని అర్ధమవుతుంది.
రుహోల్లా ఖొమేనీ జూన్ 4, 1989న రాత్రి 10 గంటల తర్వాత మరణించారు. ఆయన వారసుడిని ఎన్నుకోవడానికి నిపుణులసభ మరుసటి రోజు ఉదయం సమావేశమై కొన్ని గంటల్లోనే ఒక నిర్ణయానికి వచ్చింది.
అది రాజ్యాంగాన్ని తిరిగి సమీక్షిస్తున్న సమయం. సుప్రీం లీడర్ కావడానికి మతాధికారి అయి ఉండాలన్న షరతును అప్పటికి తొలగించలేదు. అయితే నిపుణుల సభ ఆ సమయంలో అలీ ఖమేనీకి అటువంటి అర్హత లేకపోయినా తాత్కాలిక నాయకుడిగా ఎంపిక చేసింది. రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత ఈ ఎంపికను చట్టబద్ధం చేసింది.
అయితే అలీ ఖమేనీని తాత్కాలికంగా ఎంపిక చేశారని ఆ సమయంలో అధికారికంగా చెప్పలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












