అమెరికా, ఇజ్రాయెల్ vs ఇరాన్: ఒకే యుద్ధం.. ఎవరికివారే గెలిచినట్లు ప్రకటించుకుంటున్న ప్రత్యర్థులు

ఫొటో సోర్స్, AFP via Getty Images
- రచయిత, అమిర్ అజ్మి
- హోదా, బీబీసీ న్యూస్ పర్షియన్
- చదివే సమయం: 6 నిమిషాలు
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం ముగిసినట్లే కనిపిస్తోంది. వాషింగ్టన్ నుంచి అందుతున్న సంకేతాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొన్నివారాల కాల్పుల విరమణ తర్వాత, మే 5 మంగళవారం నాడు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' దాదాపు ముగిసిందని పేర్కొన్నారు.
అయితే ఈ 'ప్రకటన' హెడ్లైన్ల మధ్య మరుగున పడిపోయింది. ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే: గెలిచింది ఎవరు? దీనికి సమాధానం ఎవరి కోణంలో వారు చెబుతున్నారు.
ఇరాన్: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక కూటమిని ఎదిరించి ఓడించామని, ఈ యుద్ధమే అందుకు నిదర్శనమని అక్కడి ప్రభుత్వ మీడియా ప్రచారం చేస్తోంది.
అమెరికా: అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఆయన యంత్రాంగం కూడా తామే గెలిచామని ప్రకటించుకున్నారు. అనుకున్న లక్ష్యాలను సాధించామని పదే పదే చెబుతున్నారు.
కానీ, ఈ బహిరంగ ప్రకటనల వెనుక, యుద్ధ క్షేత్రంలో పోరాటం కంటే ఇప్పుడు జరుగుతున్న చర్చలే నిజమైన విజేత ఎవరో నిర్ణయించడంలో కీలకం కానున్నాయి.


ఫొటో సోర్స్, Anna Moneymaker/Getty Images
అమెరికా మీడియా సంస్థలైన ఆక్సియోస్, రాయిటర్స్ కథనాల ప్రకారం.. ఇరాన్‌తో 14 అంశాల అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి వైట్‌హౌస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి, ప్రాంతీయ ఉద్రిక్తతలపై విస్తృత చర్చలకు ఈ డాక్యుమెంట్ ఒక ప్రాథమిక చట్రంలా పనిచేస్తుంది.
ఈ ప్రతిపాదనను తాము పరిశీలిస్తున్నామని, పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా తమ స్పందనను తెలియజేస్తామని ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి తెలిపారు. అయితే, కొందరు ఇరాన్ సీనియర్ రాజకీయ నాయకులు అప్పుడే దీనిని బహిరంగంగా తిరస్కరించారు.
"ఓడిపోతున్న యుద్ధంలో అమెరికన్లు ఏమీ సాధించలేరు" అని ఇరాన్ పార్లమెంటు భద్రతా కమిషన్ ప్రతినిధి ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను కేవలం "అమెరికా కోరికల చిట్టా" గా ఆయన కొట్టిపారేశారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
సయోధ్యా... ఇరాన్ లొంగుబాటా?
ఇప్పటివరకు వెలువడిన వివరాల ప్రకారం... ఇరాన్ తన అణు కార్యకలాపాలలో ప్రధాన భాగాన్ని 20 ఏళ్ల పాటు నిలిపివేయాల్సి ఉంటుంది. అలాగే, తమ వద్ద ఉన్న అత్యధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అప్పగించడంతో పాటు, అంతర్జాతీయ తనిఖీలకు పూర్తిస్థాయిలో అనుమతించాల్సి ఉంటుంది.
నివేదికల ప్రకారం, ఈ 14 అంశాల అవగాహన ఒప్పందంలో భాగంగా హార్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ హామీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇందుకు ప్రతిగా, అమెరికా క్రమంగా ఆంక్షలను ఎత్తివేయడంతోపాటు, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఒప్పంద గడువు ముగిసిన తర్వాత పరిమిత స్థాయిలో యురేనియం శుద్ధిని తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్‌కు అనుమతి లభించే అవకాశం ఉంది.
అయితే, ఇరాన్‌లోని చాలామందికి ఈ నిబంధనలు 'సయోధ్య'లా కాకుండా, 'లొంగుబాటు'లా కనిపిస్తున్నాయి.
అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ఆశించిన ఫలితాలను ఇవ్వడంలో విఫలమవడమే కాకుండా.. హార్ముజ్ జలసంధిని తెరిపించడానికి ప్రారంభించిన 'ఆపరేషన్ ఫ్రీడమ్' అనూహ్యంగా ముగియడం వల్ల గల్ఫ్ దేశాలు కూడా ఈ యుద్ధంలోకి దిగే ప్రమాదం ఏర్పడింది. అందుకే అమెరికా వెనక్కి తగ్గింది అన్నది వారి అభిప్రాయం.
గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, ఇంధన వనరులపై ఇరాన్ దాడులు చేసినప్పటికీ, అరబ్ దేశాలేవీ అధికారికంగా ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు.
ముఖ్యంగా, తమ అత్యున్నత నాయకుడితో పాటు పలువురు ఉన్నత స్థాయి సైనిక కమాండర్లు, కీలక భద్రతాధికారులు యుద్ధంలో మరణించినప్పటికీ.. ఇస్లామిక్ రిపబ్లిక్ మనుగడ సాగించగలిగింది.
ఇరాన్ రాజకీయ, సైనిక వ్యవస్థలు ఎక్కడా ఆగకుండా పనిచేయడమే కాకుండా, మరణించిన వారి స్థానాల్లో కొత్త వారిని తక్షణమే నియమించారు.
యుద్ధానికి ముందు, పశ్చిమ దేశాల అధికారులు, విశ్లేషకులు ఒక అంచనాకు వచ్చారు. వేగవంతమైన సైనిక దాడులు, అలాగే ఇరాన్ అగ్రనేతలు, కమాండర్ల హత్యల వల్ల ఆ దేశంలో మరోసారి ప్రభుత్వంపై నిరసన జ్వాలలు ఎగిసిపడతాయని, అది చివరికి అక్కడి పాలన కూలిపోవడానికి దారితీస్తుందని వారు భావించారు.
కానీ, అది జరగలేదు.
యుద్ధానికి కొన్ని నెలల ముందు ఇరాన్‌ను కుదిపేసిన నిరసనలు, యుద్ధం మొదలయ్యాక వీధుల్లో ఎక్కడా కనిపించలేదు.
భద్రతా దళాలు తమ నియంత్రణను కఠినతరం చేశాయి. అరెస్టులు పెరిగాయి, కొందరికి మరణశిక్షలు కూడా అమలు చేశారు.
అదే సమయంలో, ప్రభుత్వానికి మద్దతుగా పలు నగరాల్లో భారీ ర్యాలీలు జరుగుతున్న దృశ్యాలను ప్రభుత్వ మీడియా పదేపదే ప్రసారం చేసింది.

ఫొటో సోర్స్, Iranian Parliament Speaker Office/Handout/Anadolu via Getty Images
ఇరాన్లో అంతగా కనిపించని ఆతృత
చర్చల్లో ఇరాన్ తరఫున పాల్గొంటున్న ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ ఇటీవల, ‘‘ప్రస్తుత పరిస్థితి కొనసాగడం అమెరికాకు భరించలేనిదని మాకు బాగా తెలుసు, అయితే మేము ఇంకా మా ప్రయత్నాలను ప్రారంభించనే లేదు’’ అని రాశారు.
ఇరాన్ నాయకత్వానికి, కేవలం మనుగడ సాగించడమే ఇప్పటికే ఒక విజయంగా పరిగణించబడవచ్చు.
ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలోని, ఇజ్రాయెల్‌లోని అమెరికా స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని తెహ్రాన్ గుర్తు చేస్తున్న తరుణంలో ఇది మరింత కీలకం.
అందుకే మరో రౌండ్ పోరాటాన్ని నివారించడానికి తెహ్రాన్ అంత ఆత్రుతగా ఉన్నట్లు కనిపించడం లేదు.
ప్రత్యర్థుల కంటే ఆర్థిక ఇబ్బందులు, సైనిక ఒత్తిడితో పాటు సుదీర్ఘ యుద్ధాలను తట్టుకునే శక్తి తమ దేశానికి ఎక్కువగా ఉందని ఇరాన్ అధికారులు విశ్వసిస్తున్నారు.

ఫొటో సోర్స్, Asghar Besharati/Getty Images
ఇరాన్ చర్చల సాధనంగా ‘హార్ముజ్’
హార్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇరాన్‌కు ఇంకా ఎంత పట్టు ఉందో నిరూపితమైందని ఆ దేశ నాయకులు, అధికారులు నమ్ముతున్నారు.
ఈ జలమార్గం కేవలం ఇంధన రవాణాకే కాకుండా అంతకంటే కీలకమైనదని తేలింది. ఇక్కడి అడ్డంకులు షిప్పింగ్, ఆహార సరఫరాలు, ఇన్సూరెన్స్ ఖర్చులు విస్తృత అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రభావితం చేశాయి.
ఇప్పుడు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడాన్ని ఇరాన్ ఒక రాయితీగా కాకుండా, చర్చలలో ఒక బలమైన సాధనంగా చూస్తోంది.
ఇది ప్రాంతీయంగా విస్తృత పరిణామాలకు దారితీయవచ్చు.
ఈ సంఘర్షణ నుంచి ఇరాన్ మరింత బలంగా బయటపడే అవకాశం ఉంది.
ముఖ్యంగా యుద్ధ సమయంలో అమెరికా స్థావరాలకు ఆశ్రయం కల్పించిన లేదా అమెరికా, ఇజ్రాయెల్ కార్యకలాపాలకు పరోక్షంగా మద్దతు ఇచ్చిన పొరుగు దేశాల పట్ల ఇరాన్ మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
యుద్ధంలో ఇరాన్‌కు భారీ నష్టం
యుద్ధ సమయంలో ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. సీనియర్ నాయకులను, సైనిక అధికారులను కోల్పోయింది. కీలకమైన మౌలిక సదుపాయాలను నష్టపోయింది.
అంతేకాకుండా, దేశంలో తిరిగి నిరసనలు మిన్నంటేలా చేసే తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
అత్యాధునిక ఆయుధాలు, నిఘా సామర్థ్యాలతో తాము ఇరాన్ భూభాగంలో ఎంత లోతుకైనా వెళ్లి దాడి చేయగలమని అమెరికా, ఇజ్రాయెల్ కూడా నిరూపించాయి.
కానీ యుద్ధాలు ఎప్పుడూ కేవలం యుద్ధభూమిలోనే తేలిపోవు.
చివరికి ఈ సంఘర్షణను యుద్ధం ప్రాతిపదికన కాకుండా, దానిని ముగించడానికి జరిగే చర్చల ఫలితాల ఆధారంగా అంచనా వేయవచ్చు.
ఒకవేళ అమెరికా ఇరాన్‌ను అణ్వాయుధాల విషయంలో భారీ కోతలకు ఒప్పుకునేలా ఒత్తిడి చేస్తే, అది తన విజయమని వాషింగ్టన్ చెప్పుకుంటుంది.
అలా కాకుండా, ఇరాన్ తన ప్రాంతీయ ప్రాబల్యాన్ని కాపాడుకుంటూ, తన అణు కార్యక్రమానికి శాశ్వత విరామం కలగకుండా చూసుకోగలిగితే, అప్పుడు తనదే విజయం అని తెహ్రాన్ చాటుకుంటుంది.
ప్రస్తుతానికైతే, ఇరు పక్షాలు తామే గెలిచామని తమ ప్రజలకు చెప్పుకుంటున్నాయి. దీనికి అసలైన సమాధానం చర్చలు ముగిసిన తర్వాతే స్పష్టమవుతుంది. అది కూడా ఇరు పక్షాలు చర్చల వేదికపైకి వచ్చి, ప్రక్రియ ముగిసే వరకు అక్కడే కొనసాగితేనే సాధ్యం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































