సైబీరియన్ హస్కీ: ఖరీదైన ఈ 12 కుక్కలను నడివీధులలో ఎందుకు వదిలేశారు?

ఫొటో సోర్స్, SWAN NGO
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 5 నిమిషాలు
సంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామశివారులో గత రెండు వారాలకు పైగా ఆలనా పాలనా లేకుండా గుంపుగా తిరుగుతున్న ఖరీదైన 'సైబీరియన్ హస్కీ' కుక్కల విషయం చర్చనీయాంశమైంది.
పెంపుడు జంతువుల మార్కెట్‌లో వేల రూపాయల ధర పలికే ఈ జాతి కుక్కలను ఎవరు, ఎందుకు ఇలా రోడ్డుపై వదిలేసి వెళ్లారు? అనే ప్రశ్నలు తలెత్తాయి.
వాటి వయసు పెరగడం, నిర్వహణ భారంగా మారడంతోనే ఆ కుక్కలను ఇలా వదిలేశారని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ చెప్పారు.
ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురిని మే 7న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్పీ వెల్లడించారు.
కుక్కలను రోడ్డుపై వదిలేసిన కేసులో నిందితులపై 'ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్-1960' చట్టంలోని సెక్షన్ 11(1)(i), బీఎన్ఎస్ సెక్షన్ 325 కింద బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఎస్పీ పంకజ్ తెలిపిన వివరాల ప్రకారం, కుక్కలను రోడ్డుపై వదిలివెళ్లిన ట్రాలీ ఆటో మియాపూర్‌లోని కల్వరీ టెంపుల్ చర్చి వద్ద పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో నిందితులు కూడా అదే చర్చిలో పనిచేస్తున్నారు. కుక్కల సంరక్షులుగా ఉన్న నీతిపూడి సత్యనారాయణ, వండలూరి సుధీర్ బాబు, డ్రైవర్లుగా పనిచేస్తున్న ఎం.సుందర్ సింగ్, సపతి అన్నవరం సత్యనారాయణలను అరెస్ట్ చేశారు.
''రెస్క్యూ చేసిన 12 కుక్కలలో ఒకటి జర్మన్ షెపర్డ్. వీటిలో ఒక హస్కీ కుక్క ఎండవేడికి తాళలేక చనిపోయింది. అనారోగ్య స్థితిలో ఉన్న మిగతా కుక్కలను జంతు సంరక్షణ ఎన్జీవోలకు అప్పంచాం. చల్లని వాతావరణంలో ఉంచాల్సిన హస్కీ కుక్కలను నిందితులు కావాలనే ఎండలో నడిరోడ్డుపై వదిలివెళ్లారనేదీ మా విచారణలో తేలింది’’ అని ఎస్పీ పంకజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Sangareddy Police

ఫొటో సోర్స్, Sangareddy Police
‘పోషించలేక వదిలేశారు’
కుక్కలను నడిరోడ్డుపై వదిలేశారని హైదరాబాద్‌కు చెందిన స్వాన్ (ఎస్‌డబ్ల్యూఏఎన్) జంతు సంరక్షణ ఎన్జీవో ప్రతినిధి హర్ష్ భట్నాగర్ ఏప్రిల్ 30న బీడీఎల్ భానూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
"సమాచారం అందడంతో వాటి రెస్క్యూ కోసం ఏప్రిల్ 28న అక్కడికి వెళ్లాం. ఆ రోజు నాలుగు సైబీరియన్ హస్కీ కుక్కలు సజీవంగా కనిపించాయి. అక్కడ ఒక కుక్క కళేబరం గుర్తించాం'' అని హర్ష్ భట్నాగర్ బీబీసీతో అన్నారు.
ఆ తర్వాత పోలీసులు, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో మొత్తం 12 కుక్కలను రెస్క్యూ చేసి, షెల్టర్ హోమ్‌కు తరలించినట్టుగా ఆయన తెలిపారు.
ఈ కేసు విచారణాధికారి బీడీఎల్ భానూరు పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయకృష్ణతో బీబీసీ మాట్లాడింది.
‘‘ఫిర్యాదు అందిన వెంటనే ఈ కుక్కలు ఏ రూట్‌లో, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తెచ్చారు అనే అంశంపైనే మొదట దృష్టి పెట్టాం. ఏప్రిల్ 21న సీసీ కెమెరా ఫుటేజిలో మొదటిసారి వీటిని గుర్తించాం. ఆ తర్వాత మరో వీడియోలో ఒక ట్రాలీ ఆటోలో తరలించినట్టు కనిపించింది. ఆ కుక్కలను తరలించిన వాహనం మియాపూర్ కల్వరీ టెంపుల్ చర్చి వద్ద గుర్తించాం" అని చెప్పారు.
‘‘మియాపూర్ కల్వరీ చర్చి వెనక భాగంలో మరో 15 సైబీరియన్ హస్కీ జాతి కుక్కలను గుర్తించాం. స్థలం సరిపోకపోవడం, వాటి వయసు పెద్దది కావడంతో ఎవరైనా పెంచుకుంటారనే ఉద్దేశంతో మెడలో బెల్ట్ సహా వదిలేశాం’’ అని నిందితులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, SWAN NGO
చర్చి మేనేజ్‌మెంట్ ఏమంటోంది?
ఈ కుక్కలకు సంబంధించిన వాక్సినేషన్ , ఇతర వివరాలతో కూడిన రికార్డు బుక్‌ను చర్చి నిర్వాహకులు మెయింటెయిన్ చేస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది వీటిని పెంచుతున్నట్టు తెలిసింది.
చర్చి మేనేజ్‌మెంట్ స్థాయివారికి కుక్కలను పెంచుతున్న విషయం తెలియదని తమ విచారణలో తేలిందని ఇన్‌స్పెక్టర్ విజయకృష్ణ చెప్పారు.
రోడ్డుపై కుక్కలను వదిలేసిన అంశంపై మియాపూర్ కల్వరీ టెంపుల్ చర్చి మేనేజ్‌మెంట్ వివరణ కోసం ఫోన్‌లో బీబీసీ సంప్రదించింది.
మూడు కాంటాక్ట్ నంబర్లకు ఫోన్ చేయగా అందులో ఒకటి పనిచేయలేదు. మరో రెండు కాంటాక్ట్ నెంబర్ల ద్వారా మాట్లాడిన వ్యక్తులు, తాము కింది స్థాయి సిబ్బంది అని, కుక్కల సంగతి తమకు తెలియదని, తమ స్థాయిలో ఎలాంటి వివరాలు వెల్లడించలేమని సమాధానం ఇచ్చారు.
చర్చి ఉన్నతస్థాయి మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన వ్యక్తుల ఫోన్ నంబర్లు, మెయిల్ అడ్రస్‌లు తాము ఇవ్వలేమని, అయితే వివరణ కోసం బీబీసీ సంప్రదించిందనే విషయాన్ని వారికి తెలియజేస్తామని, వారితో తిరిగి ఫోన్ చేయిస్తామని చెప్పారు.
చర్చి యాజమాన్యం నుంచి వివరణ వచ్చిన తర్వాత ప్రచురిస్తాం.

ఫొటో సోర్స్, Sangareddy Police
‘బ్రీడింగ్ చేస్తున్నారా?’
నిబంధనలకు విరుద్దంగా, విచ్చలవిడిగా జంతువుల బ్రీడింగ్ జరుగుతోందని జంతుసంరక్షణ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఇది ఒక వ్యాపారంలా కొనసాగుతోందని విమర్శిస్తున్నాయి.
సైబీరియన్ హస్కీ జాతి కుక్కలను రోడ్డుపై వదిలేసి వెళ్లిన వాహనం దొరికిన మియాపూర్ కల్వరీ టెంపుల్ చర్చి వద్ద కూడా ఇల్లీగల్ బ్రీడింగ్ జరుగుతోందన్న అనుమానాన్ని స్వాన్, ఆస్రా ( అసోసియేషన్ ఫర్ యానిమల్ షెల్టర్ అండ్ రెస్క్యూ ఎయిడ్) సంస్థల ప్రతినిధులు వ్యక్తం చేశారు.
"ఇల్లీగల్ బ్రీడింగ్ బ్యాన్ కావాలి. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. కుక్కలను వ్యాపార వస్తువులుగా మార్చారు. కొన్నిచోట్ల ఇళ్ల డాబాలపై బ్రీడింగ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ వంటి ఆన్‌లైన్ వేదికలను ఉపయోగించుకుని వాటిని అమ్ముతున్నారు. ఇది జీవహింస, చట్ట వ్యతిరేకం" అని స్వాన్ సంస్థ ప్రతినిధి హర్ష్ భట్నాగర్ అన్నారు.
"కుక్క పిల్లలను బుట్టల్లో వేసుకుని బొమ్మల్లా అమ్ముతున్నారు. కొన్ని సందర్భాలో సేల్ కాలేదని, ఏజ్ అయిపోయిందని రోడ్లపై వదిలేస్తున్నారు. పోషణ, పట్టింపు లేక డీహైడ్రేట్ అయిన స్థితిలో ఉన్న కుక్కలను ఈ కేసులో రెస్క్యూ చేశాం" అని ఆస్రా సంస్థ వ్యవస్థాపకురాలు గౌరీ వందన బీబీసీతో అన్నారు.
"బ్రీడింగ్ కోసం వాడే తల్లి కుక్కల సంరక్షణ గురించి పట్టింపులేకుండా, కేవలం వ్యాపార దృష్టితో చూస్తున్నారు. మూగ జీవుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. బ్రీడింగ్ కోసం యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ నుంచి అనుమతులుండాలి. జంతుసంరక్షణ చట్టాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలి" అన్నారు గౌరీ వందన.
కల్వరీ టెంపుల్ చర్చి యజమాన్యానికి సంబంధించి కుక్కల పెంపకం లైసెన్స్ వివరాలపై జీహెచ్ఎంసీ అధికారులకు లేఖ రాశామని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
‘‘కల్వరీ టెంపుల్ చర్చి వద్ద కుక్కల అంశంలో విచారణ జరుగుతోంది. మరిన్ని వివరాల కోసం యానిమల్ వెల్పోర్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులకు లేఖ ద్వారా వివరాలు కోరాం. ఆ వివరాలు వస్తేగానీ ఏన్జీవోలు ఆరోపిస్తున్న చట్టవ్యతిరేక బ్రీడింగ్ అంశాలపై విచారణ కొలిక్కి రాదు’’ అని బీడీఎల్ భానూర్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌కృష్ణ బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































