ముస్లిం మహిళల హక్కులపై సుప్రీంకోర్టు 5 కీలక తీర్పులు, వాటి ప్రభావం ఏమిటంటే...

ముస్లిం మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అభినవ్ గోయల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ముస్లిం యువతుల వివాహ వయసుకు సంబంధించిన కీలకమైన కేసులో సుప్రీంకోర్టు ఆగస్టు 19వ తేదీన తీర్పు ఇచ్చింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం యువతుల వివాహ వయసు 16 ఏళ్లుగా నిర్ణయించడాన్ని సమర్థించింది.

వివాహ వయసుపై ప్రశ్నలు లేవనెత్తినందుకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్)ను మందలించింది.

ముస్లిం బాలికల వయసును ప్రస్తావిస్తూ ఓ వివాహాన్ని ఎన్‌సీపీసీఆర్ ప్రశ్నించింది. ఇది పోక్సో (లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ) చట్టం ఉల్లంఘన అవుతుందని పేర్కొంది.

ఎన్‌సీపీసీఆర్ కేసుపై కోర్టు నిర్ణయం తర్వాత బాల్య వివాహ చట్టం వర్సెస్ పర్సనల్ లా పై చర్చ పెరిగింది.

భారత్‌లో చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్-2006 ప్రకారం బాలికల వివాహానికి కనీస వయసు 18 సంవత్సరాలు.

ముస్లిం మహిళలకు సంబంధించి వివిధ సందర్భాల్లో న్యాయస్థానాలు, ముఖ్యంగా సుప్రీం కోర్టు చాలా ముఖ్యమైన తీర్పులు ఇచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
ముస్లిం పర్సనల్ లా వర్సెస్ చట్టం

2022 సంవత్సరంలో, 26 ఏళ్ల జావెద్, 16 ఏళ్ల ముస్లిం యువతి ఆషియానాను ప్రేమ వివాహం చేసుకున్నారు.

తమకు రక్షణ కోరుతూ వారిద్దరూ పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఈ వివాహం చెల్లుబాటు అవుతుందన్న వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. వారికి రక్షణ కల్పించాలని ఆదేశాలిచ్చింది.

''ముస్లిం యువతి వివాహం ముస్లిం పర్సనల్ లా పరిధిలోకి వస్తుంది. దిన్షా ఫర్దూంజీ ముల్లా రచించిన 'ప్రిన్సిపల్స్ ఆఫ్ మహమ్మదీన్ లా'లోని 195 ఆర్టికల్ ప్రకారం, ఆ యువతికి 16 ఏళ్లకు మించి వయసు ఉన్నందున తన ఇష్టానుసారం వివాహం చేసుకోవచ్చు'' అని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు లైవ్ లా రిపోర్టు చేసింది.

దిల్లీ మైనారిటీ కమిషన్ మాజీ చైర్మన్ జఫారుల్ ఇస్లాం ఖాన్ ఈ తీర్పుపై స్పందిస్తూ, ''ముస్లిం పర్సనల్ లాలో ఎక్కడా అమ్మాయి వివాహ వయసు గురించి ప్రస్తావన లేదు. యుక్తవయసు వచ్చిన అమ్మాయి వివాహం చేసుకోవడానికి అర్హురాలిగా పరిగణిస్తారు'' అని అన్నారు.

జావెద్ – ఆషియానాల వివాహం పోక్సో చట్టం ఉల్లంఘన కిందకు రాదని హైకోర్టు స్పష్టంచేసింది.

హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ ఎన్‌సీపీసీఆర్ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

''అలాంటి ఆదేశాలను సవాలు చేయడానికి ఎన్‌సీపీసీఆర్‌కు ఎటువంటి హక్కు లేదు. ఇద్దరు మైనర్లకు హైకోర్టు రక్షణ కల్పిస్తే, ఎన్‌సీపీసీఆర్ అలాంటి ఉత్తర్వులను ఎలా సవాలు చేయగలదు?'' అని సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లు లైవ్ లా వెల్లడించింది.

సుప్రీంకోర్టు తీర్పుపై జఫారుల్ ఇస్లాం హర్షం వ్యక్తం చేశారు.

''సుప్రీంకోర్టు నిర్ణయం సముచితమే. బ్రిటిష్ వారి కాలం నుంచి భారత ప్రభుత్వాల వైఖరి, ఇస్లామిక్ పర్సనల్ లా లో జోక్యం చేసుకోకూడదు అన్నట్లుగానే ఉంది'' అని చెప్పారు.

మరోవైపు, బాలికలను సామాజిక దురాచారాల నుంచి విముక్తి చేయాల్సిన అవసరం ఉందని 'నేషనల్ కౌన్సిల్ ఆఫ్ విమె‌న్ లీడర్స్ అండ్ హ్యూమన్ రైట్స్' కార్యకర్త మంజుల ప్రదీప్ బీబీసీతో అన్నారు.

''అమ్మాయి యుక్తవయసులో శారీరక మార్పులకు లోనవుతుంది. ఇది చాలా కష్టమైన సమయం. అటువంటి పరిస్థితిలో వివాహం వంటి నిర్ణయాలు స్వయంగా తీసుకోలేరు. ఆమె కుటుంబం నిర్ణయాలు తీసుకుంటుంది'' అని చెప్పారు.

''బాలికలు విద్య ద్వారానే తమ కాళ్లపై తాము నిలబడటానికి, సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం పొందాలి'' అని మంజుల ప్రదీప్ అభిప్రాయపడ్డారు.

షైరా బానో, సుప్రీంకోర్టు
ఫొటో క్యాప్షన్, ట్రిపుల్ తలాక్ రాజ్యాంగవిరుద్ధమైందిగా ప్రకటించాలనే డిమాండును షైరా బానో సుప్రీంకోర్టులో లేవనెత్తారు
ముస్లిం పర్సనల్ లా వర్సెస్ చట్టం

ట్రిపుల్ తలాక్ (తలాక్-ఇ-బిద్దత్) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017 సంవత్సరంలో తీర్పు చెప్పింది.

ఈ కేసులో పిటిషనర్ షైరా బానో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవారు. ఆమెకు 2002 సంవత్సరంలో వివాహమైంది. 15 ఏళ్ల తర్వాత ట్రిపుల్ తలాక్ చెబుతూ ఆమె భర్త ఒక ఉత్తరం పంపించారు.

ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో 3-2 మెజారిటీతో తీర్పు ఇచ్చింది.

ట్రిపుల్ తలాక్ మహిళల సమానత్వానికి, గౌరవానికి విరుద్ధమని కోర్టు పేర్కొంది.

ఆ సమయంలో షైరా బానో తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ బీబీసీతో మాట్లాడారు.

''తన ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన అని ఆరోపిస్తూ విడాకులను ఒక ముస్లిం మహిళ సవాలు చేయడం అదే తొలిసారి'' అని చెప్పారు.

సుప్రీంకోర్టు తీర్పుతో చట్టపరమైన నిర్ణయమేమిటంటే, ముస్లిం మహిళా చట్టాన్ని 2019లో పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం, ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధం, శిక్షార్హమైన నేరంగా ప్రకటించింది.

అయితే, ఈ నిర్ణయంపై అనేక మత సంస్థలు అభ్యంతరం చెప్పాయి. ఇది ముస్లిం పర్సనల్ లాలో జోక్యం చేసుకోవడమేనని వాదించాయి.

''పర్సనల్ లాను ముస్లిం సమాజానికే వదిలేయాలి. ఏ ప్రభుత్వమూ మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు'' అని జఫారుల్ ఇస్లాం అభిప్రాయపడ్డారు.

''ఎవరైనా మూడు మాటలు చెప్పి తన నుంచి ఒక స్త్రీని వేరుచేయడం అనే విధానం అన్యాయం. సాటి మహిళగా నేనెప్పటికీ అంగీకరించలేను'' అని మంజుల ప్రదీప్ అన్నారు.

''ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మహిళలు మరింత ధైర్యంగా మారారు. వారు న్యాయం కోసం చట్టాన్ని ఆశ్రయించవచ్చు'' అని ఆమె చెప్పారు.

ముంబయిలోని హాజీ అలీ దర్గా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముంబయిలోని హాజీ అలీ దర్గా
ముస్లిం పర్సనల్ లా వర్సెస్ చట్టం

ఈ కేసు ముంబయిలో ప్రముఖమైన హాజీ అలీ దర్గాలోకి మహిళల ప్రవేశం, వారి సమానత్వ హక్కులకు సంబంధించింది.

2011 తర్వాత, హాజీ అలీ దర్గా లోపలి భాగంలోకి మహిళలు ప్రవేశించకుండా నిషేధించారు. మహిళలు దర్గాలోకి ప్రవేశించడం మతపరమైన నియమాలకు విరుద్ధమని దర్గాను నిర్వహించే ట్రస్టు పేర్కొంది.

దర్గా యాజమాన్య ట్రస్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. దీన్ని విచారించిన కోర్టు, మహిళలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

మతస్వేచ్ఛను ప్రస్తావిస్తూ, మహిళలపై ట్రస్టు వివక్ష చూపకూడదని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

మతపరమైన ప్రదేశాలలో సమానత్వం కోసం మహిళల పోరాటానికి ఈ తీర్పు ఒక చిహ్నంగా మారింది. ఈ తీర్పు తర్వాత, శబరిమల ఆలయం, శని శింగణాపూర్ ఆలయం వంటి చోట్ల మహిళల ప్రవేశానికి సంబంధించి చట్టపరమైన చర్చ తీవ్రమైంది.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు
ముస్లిం పర్సనల్ లా వర్సెస్ చట్టం

ముస్లిం మహిళల హక్కుల పోరాటంలో ఈ కేసును ఒక మైలురాయిగా పరిగణిస్తారు.

షా బానో ఇండోర్ నివాసితురాలు. ఆమెకు 1932 సంవత్సరంలో వివాహమైంది. ఆమెకు ఐదుగురు సంతానం.

1978లో, షా బానో తన 62 ఏళ్ల వయసులో కోర్టును ఆశ్రయించారు.

విడాకులు తీసుకున్న తన భర్త మహమ్మద్ అహ్మద్ ఖాన్ నుంచి నెలకు రూ.500 చొప్పున భరణం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 125 ప్రకారం ఇప్పించాలని కోరారు.

అయితే, ఇండియన్ ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకుల తర్వాత ఇద్దత్ (భర్త మరణించినా లేదా విడాకులు తీసుకున్నా ఒక ముస్లిం మహిళ వేచి ఉండే కాలం. ఇది మూడు నెలలు. కానీ పరిస్థితిని బట్టి మార్చవచ్చు) సమయానికి మాత్రమే భరణం చెల్లిస్తానని అహ్మద్ ఖాన్ వాదించారు.

సుదీర్ఘకాలం విచారణ తర్వాత, 1985లో సుప్రీంకోర్టు షా బానోకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సీఆర్‌పీసీ 125 సెక్షన్ అనేది వారి మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ వర్తిస్తుందని కోర్టు స్పష్టంచేసింది.

ఈ తీర్పును ముస్లిం మహిళల విజయంగా పరిగణిస్తారు. కానీ ముస్లిం సామాజికవర్గంలో మెజారిటీ భాగం దీన్ని వ్యతిరేకించారు. ఇది షరియాలో జోక్యమేనని వాదించారు.

నిరసనలతో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఏడాది తర్వాత, అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 'ముస్లిం ఉమెన్ (ప్రొటెక్షన్ ఆన్ డైవర్స్ యాక్ట్)-1986ను ఆమోదించింది.

ఫలితంగా షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు కాలం చెల్లిపోయింది. ఇద్దత్ కాలానికే భరణం ఇవ్వవచ్చని ఆ చట్టం పేర్కొంది.

డానియల్ లతిఫి కేసు

ఫొటో సోర్స్, Getty Images

ముస్లిం పర్సనల్ లా వర్సెస్ చట్టం

షా బానో కేసుతో ఈ కేసుకు ప్రత్యక్షంగా సంబంధం ఉంది. షా బానో కేసులో పిటిషనర్ తరఫు న్యాయవాది డేనియల్ లతీఫీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలుచేశారు.

రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'ముస్లిం ఉమెన్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవోర్స్) చట్టం, 1986ను ఆయన సవాలు చేశారు.

అయితే, ఈ చట్టం చెల్లుబాటును సమర్ధిస్తూనే ''విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాల్సిన ముస్లిం వ్యక్తి బాధ్యత ఇద్దత్ కాలానికి మాత్రమే పరిమితం కాదు'' అని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఇద్దత్ కాలానికే కాకుండా భర్త తన జీవితకాలం భరణం ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకోవాలని కోర్టు తీర్పులో పేర్కొంది.

ఈ తీర్పు ముస్లిం మహిళలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)