కశ్మీర్: ‘జీవితంలో మొదటిసారి నేను ముస్లిం అని నాకు అనిపించింది‘ - మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా తో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ

మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా

ఆర్టికల్ 370 రద్దు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి - పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా అన్నారు.

కశ్మీర్ సమస్యపై ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా ఏమన్నారంటే..

''కశ్మీరీలు ఇప్పుడు ఏ స్థితికి చేరుకున్నారంటే... వారికి మెహబూబా ముఫ్తీ లేదా ఒమర్ అబ్దుల్లాల నాయకత్వం అవసరమని నేను భావించడం లేదు. నాయకులు లేకుండానే ఉద్యమం సాగుతుందని భావిస్తున్నా. శాంతియుత పోరాటం ద్వారానే తమ హక్కులు సాధించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కశ్మీర్ ప్రజలను ప్రభుత్వం బోనులో బంధించినట్లుగా చేసి, వారికి శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశాన్ని కూడా ఇవ్వడంలేదు'' అని అన్నారు.

కశ్మీర్ సమస్య

ఫొటో సోర్స్, Getty Images

ప్రశ్న: దీనిపై భారత్‌లోని ప్రజల స్పందనను, కశ్మీర్‌లోని ప్రస్తుత పరిస్థితిని మీరెలా చూస్తున్నారు?

నాకు చాలా బాధగా అనిపిస్తోంది. మా అమ్మ ట్విటర్‌ హాండిల్ ద్వారా నేను ఏదైనా చెప్పినా లేదా ఏదైనా ఇంటర్య్వూలో నా అభిప్రాయాలు వెల్లడించినా... మరి మీరు కశ్మీరీ పండితులను వెళ్లగొట్టారు కదా అని ప్రశ్నిస్తున్నారు.

చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. కశ్మీర్ లోయలో హింస వల్ల నష్టపోయింది పండితులు మాత్రమే కాదు, మేం కూడా. నేను తొమ్మిదేళ్ల బాలికగా ఉన్నప్పుడు, మా అమ్మ బయటకు వెళ్తే మిలిటెంట్ల దాడులకు గురవకుండా సాయంత్రం క్షేమంగా తిరిగి వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉండేది. కాబట్టి కశ్మీరీ పండితులను మేం వెళ్లగొట్టామన్నది తప్పు.

పండితుల వేదనను వీళ్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. రైట్ వింగ్ సంస్థలు, బలహీనంగా వ్యవహరిస్తున్న మీడియా దీన్ని వాడుకుంటూ.. మీరు పండితులకు ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు మీకూ అదే గతి పట్టిస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు.

చరిత్రను వక్రీకరిస్తున్న ఈ నాయకులను చూస్తుంటే మన దేశం ఎలాంటి స్థితిలో ఉందో అందరూ అర్థం చేసుకోవచ్చు.

కశ్మీర్ సమస్య

ఫొటో సోర్స్, Getty Images

ప్రశ్న: భారత్ పూర్తిగా మారినట్లుగా అనిపిస్తోందా మీకు?

కేవలం జమ్మూ కశ్మీర్ లోనే కాదు.. మొత్తం దేశంలోనే భయానక వాతావరణం నెలకొని ఉన్నట్టుగా అనిపిస్తోంది. నా జీవితంలో మొదటిసారి నన్ను ముస్లింగా భావించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇన్నేళ్లలో నన్ను నేను ఎన్నడూ ఒక ముస్లింగా చూసుకోలేదు. కానీ ప్రభుత్వం చేపట్టిన ఎన్‌ఆర్‌సీ, ఆర్టికల్-370 రద్దు, పౌరసత్వ బిల్లు వంటివన్నీ చూస్తుంటే ఈ దేశం ఆత్మ ప్రతిరోజూ గాయపడుతున్నట్టుగా అనిపిస్తోంది. భారత్‌లో ఉన్న అందరూ సమానమనే స్ఫూర్తి రోజురోజుకూ తగ్గుతున్నట్లుగా అనిపిస్తోంది.

బహుళత్వానికి, ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికీ ప్రతీకగా ఉన్న ఈ దేశం ఇప్పుడు హిందుత్వ రాజ్యంగా, రైట్ వింగ్ ఫాసిస్టు రాజ్యంగా మారుతున్నట్టుగా అనిపిస్తోంది. వాళ్లు మెజారిటీల నియంతృత్వాన్ని అందరిపై రుద్దాలని చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)