జమ్మూకశ్మీర్: పోలీసుల అదుపులో ఉన్న వారి బంధువులకు లాయర్లు ఎందుకు దొరకడం లేదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ప్రభుత్వం ఆగస్టు 4న జమ్మూకశ్మీర్‌కున్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి, అక్కడ కర్ఫ్యూ విధించింది. అప్పటి నుంచి కొన్ని వేల మందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
వేల సంఖ్యలో సైనికులను ప్రభుత్వం మోహరించింది. మొబైల్ ఫోన్ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు. రోడ్లు, వీధుల్లో పెద్దగా జనసంచారం లేదు.
స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా నడుస్తాయని ప్రభుత్వం హామీ ఇచ్చినా, వాటి కార్యకలాపాలు సాగట్లేదు.
ప్రభుత్వంపై నిరసనతో కొందరు, మిలిటెంట్ల దాడుల భయంతో ఇంకొందరు వ్యాపారాలు మూసేశారు. జనజీవనం స్తంభించిపోయింది.
ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నవారిలో చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఉద్యమకారులు ఉన్నారు. వీరిలో చాలా మంది ఇతర రాష్ట్రాల్లోని జైళ్లలో ఉన్నారు.
శ్రీనగర్ హైకోర్టులోని పెద్ద హాలులో ఓ సోఫాపై కూర్చున్న అల్తాఫ్ హుస్సేన్ ఆందోళనగా కనిపిస్తున్నారు.
ప్రజారవాణా సదుపాయాలు లేకపోవడంతో తన సొంత పట్టణం బారాముల్లా (50 కి.మీ.ల దూరం) నుంచి ఇక్కడికి వచ్చేందుకు ఆయనకు బాగానే ఖర్చయింది.
అల్తాఫ్ సోదరుడు షబ్బీర్ ఓ గ్రామస్థాయి నాయకుడు. వివాదాస్పద ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద అరెస్టైనవారిలో షబ్బీర్ ఒకరు.
ఈ చట్టం కింద ప్రభుత్వం వ్యక్తులను రెండేళ్ల వరకూ నిర్బంధంలో ఉంచుకోవచ్చు.
షబ్బీర్ తరఫున వాదించేందుకు ఓ న్యాయవాదిని వెతుక్కునేందుకు అల్తాఫ్ శ్రీనగర్‌కు వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూకశ్మీర్ బార్ అసోసియేషన్‌లో 2,200 మందికిపైగా న్యాయవాదులు సభ్యులుగా ఉన్నారు. కానీ, అల్తాఫ్‌కు న్యాయవాదులు ఎవరూ దొరకడం లేదు.
ఆ అసోసియేషన్ కోర్టులను బహిష్కరించింది. 50 రోజులుగా వారు కేసులేవీ వాదించడం లేదు. బార్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు మిలాన్ అబ్దుల్ ఖయ్యూం, మాజీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ రోంగాలను కూడా ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.
'వేర్పాటువాదాన్ని సమర్థిస్తున్నందుకు' పీఎస్‌ఏ కింద వీళ్లిద్దరూ అరెస్టయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రెండు వేర్వేరు జైళ్లలో ఉన్నారు. ఈ అరెస్టులకు 'రాజకీయ కక్షలే' కారణమని కొందరు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు న్యాయవాదులు దొరకకపోవడంతో, అరెస్టైనవారి కుటంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
షబ్బీర్ కోసం అల్తాఫ్ ఇదివరకే హేబియర్ కార్పస్ పిటిషన్ వేశారు. తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలో ఆయనకు అర్థం కావడం లేదు.
హెబియస్ కార్పస్ వేస్తే అరెస్టు చట్టబద్ధతను కోర్టు పరిశీలిస్తుంది.

ఆగస్టు తర్వాత శ్రీనగర్ కోర్టులో ఇలాంటి పిటిషన్లు 250కుపైగా దాఖలయ్యాయి. వాటి కోసం ఇద్దరు న్యాయమూర్తులనే కేటాయించడంతో ఆ పిటిషన్లేవీ విచారణకు నోచుకోవడంలేదు.
సాధారణంగా 17 మంది న్యాయమూర్తులుండే కోర్టులో ఇప్పుడు తొమ్మిది మందే పనిచేస్తున్నారు.
షబ్బీర్ కుటుంబాన్ని పోషించే బాధ్యత కూడా ప్రస్తుతం అల్తాఫ్‌పైనే పడింది. ఇప్పుడు తనకేం చేయాలో పాలుపోవడం లేదని ఆయన అంటున్నారు.
మరోవైపు తమ సహచరులను విడుదల చేసేవరకూ ఆందోళన కొనసాగిస్తామని న్యాయవాదులు చెబుతున్నారు.
అరెస్టైనవారి కుటుంబాల తరఫున హేబియస్ కార్పస్ పిటిషన్లు వేస్తూ కొందరు న్యాయవాదులు సహాయం చేస్తున్నారు. అయితే, కోర్టు వాయిదాలు తప్ప, వీటి వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండటం లేదు.
తన మామయ్య ఆగస్టు 7న అరెస్టయ్యారని శ్రీనగర్ కోర్టుకు వచ్చిన తారిఖ్ (పేరు మార్చాం) అనే వ్యక్తి చెప్పారు.
స్థానిక పోలీస్ స్టేషన్‌లో కొన్ని రోజులపాటు ఉంచి, ఆ తర్వాత శ్రీనగర్ సెంట్రల్ జైలుకు ఆయన్ను తరలించారని వివరించారు.
''జమాత్-ఎ-ఇస్లామీ (కశ్మీర్‌లో భారత పాలనను వ్యతిరేకిస్తున్న మిలిటెంట్ సంస్థ)ని మా మామయ్య అనుసరించేవారు. అయితే, ఐదేళ్ల క్రితం దాన్ని పూర్తిగా వదిలేశారు. ఆయనకు ఇప్పుడు 63 ఏళ్లు. రెండు సర్జరీలు అయ్యాయి. నెల రోజులుగా ఆయన కోసం తిరుగుతున్నాం'' అని తారిఖ్ చెప్పారు.
శ్రీనగర్ హైకోర్టు కార్యకాలపాల పరిస్థితి అంశం సుప్రీం కోర్టులోను ప్రస్తావనకు వచ్చింది.
వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు అవసరమైతే స్వయంగా తానే శ్రీనగర్‌కు వస్తానని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు. అయితే, ఆయన ఇప్పటివరకూ తన పర్యటన తేదీ ప్రకటించలేదు.
వేల మంది కశ్మీరీలు జైళ్లలోనే మగ్గుతున్నారు.

''సాధారణంగా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన 48 గంటల్లో కోర్టు నోటీసులు జారీ చేస్తుంది. నాలుగో రోజు కేసు లిస్ట్ కాకముందే ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. 15 రోజుల్లోగా కేసు పరిష్కృతమవ్వాలి. ఇప్పుడా ప్రక్రియలు పూర్తయ్యేందుకు వారాలు, నెలలు, అంతకన్నా ఎక్కువే పట్టొచ్చు'' అని జమ్మూకశ్మీర్ బార్ అసోసియేషన్ సభ్యుడు ముదాసిర్ చెప్పారు.
ప్రస్తుత పరిణామాల వల్ల న్యాయవాదులు ప్రాక్టీస్ కూడా చేసుకోలేకపోతున్నారు.
''మా క్లైయింట్లను సంప్రదించలేకపోతున్నాం. మొదట్లో స్టాంపులు, బాండ్ పేపర్ల కొరత ఏర్పడింది. అప్పుడు బెయిల్ దరఖాస్తులు కూడా తెల్లకాగితాలపైనే రాశాం. పోలీస్ స్టేషన్లకు జనాలు నడిచివెళ్లేవారు. పిటిషన్లు రాసే స్టెనోగ్రాఫర్లకూ కొరత ఉంది. ఇంటర్నెట్ లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. వేటిని ఆధారంగా తీసుకుని అరెస్టులు చేశారన్నది కూడా తెలుసుకోలేకపోతున్నాం'' అని రఫీక్ బజాజ్ అనే సీనియర్ న్యాయవాది చెప్పారు.
ఇది తమ గుర్తింపు, హక్కులకు సంబంధించిన అంశమని, ఎన్ని ఇబ్బందులున్నా, తమ ఆందోళన మాత్రం కొనసాగిస్తామని ఆయన అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- 'హౌడీ మోదీ' నిరసనలో నేనెందుకు పాల్గొన్నాను, అక్కడేం జరిగింది: అభిప్రాయం
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
- కశ్మీర్‌పై భారత్-పాకిస్తాన్ల హెచ్చరిక ప్రకటనలను ఎలా అర్థం చేసుకోవచ్చు
- రష్యా అమ్మాయిలు తమ శరీరం మీద ముడతలు, చారలు, మచ్చలను గర్వంగా ప్రదర్శిస్తున్నారు.. ఎందుకు?
- కశ్మీర్‌లో ఒక్కసారే పర్యటించిన గాంధీ.. అప్పుడు ఆయన ఏమన్నారు?
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- కశ్మీర్, గో రక్షణ, మూకదాడులు, మతాంతర వివాహాలపై గాంధీ అభిప్రాయాలేంటి?
- సౌదీ ప్రిన్స్: 'ఇరాన్ దూకుడుని ఆపకపోతే... చమురు ధరలు చెలరేగిపోతాయి'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








