రష్యా అమ్మాయిలు తమ శరీరం మీద ముడతలు, చారలు, మచ్చలను గర్వంగా ప్రదర్శిస్తున్నారు.. ఎందుకు?

ఫొటో సోర్స్, @TYSYA
శరీరాన్ని సానుకూలంగా చూసే విషయంలో సోషల్ మీడియాకు చెడ్డ పేరు ఉంది. శరీరాన్ని మంచి సౌష్టవంతో, అందంగా చూపించుకోవాలన్న ఒత్తిడి సోషల్ మీడియాలో నిరంతరం ఉంటుంది.
ఈ తీరును ఎలాగైనా మార్చాలని @Tysya అనే ఓ యువ ఉద్యమకారిణి నిశ్చయించుకున్నారు.
ఈ రష్యన్ యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. 'మేకప్‌లు, మెరుగులూ లేకుండా మీ ఫొటోలు పోస్ట్ చేయండి' అని ఆమె ప్రజలను కోరారు.
ఆ ఫొటోలకు #SoMnoyVsyoTak (నేను చక్కగా ఉన్నాను) అనే హ్యాష్‌ట్యాగ్ ఉపయోగించాలనీ ప్రోత్సహించారు.
''మెరుగులు అద్దకుండా, ఫోజులు లేకుండానే మా శరీరాలు సంపూర్ణంగా ఉన్నాయని మేం బ్లాగర్లు, సబ్‌స్క్రైబర్లం కలిసి చెప్తున్నాం. చర్మం సాగిన చారలు, మానిన గాయాల మచ్చలు, కొవ్వుతో ఉబ్బిన శరీర భాగాలు, ముక్కు మీద గుబ్బలు, మొటిమలు - ఏవీ సమస్యలు కావు. అవి శరీరంలోని భాగాలు. ప్రతి ఒక్కటీ విశిష్టమైనది. నా విషయంలో అంతా బాగానే ఉంది. మీ సంగతేమిటి?'' అని @Tysya తన యూట్యూబ్ చానల్ వేదికగా ప్రశ్నించారు.
ఆమె ఆ తర్వాత బీబీసీతో మాట్లాడుతూ.. శరీరం విషయంలో సానుకూల దృక్పథం అనే ఆలోచన రష్యాలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోందని చెప్పింది.

ఫొటో సోర్స్, @YULYA_BELOVE
''ఇది చాలా మందికి ఒక సమస్య అనే విషయం నాకు ఎప్పటినుంచో తెలుసు. కానీ అది ఎంత బాధాకరమో ఇంతవరకూ తెలియలేదు'' అని వివరించింది.
ఈ వ్యాసం రాసేటప్పటికి 2000 మందికి పైగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ తిస్యా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోను 10 లక్షల మందికి పైగా చూశారు. యూట్యూబ్‌లో సైతం ఐదు లక్షల మందికి పైగా తిలకించారు.
ఈ అంశం మీద సోషల్ మీడియాలో చాలా చర్చ మొదలైంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో తిస్యా ఉద్యమాన్ని @yulya_belove అనే యూజర్ కీర్తిస్తూ.. దీనిని గౌరవించాలని, అందరూ దీని మీద దృష్టి సారించాలని పేర్కొన్నారు.
''నా కూతురు పొట్ట మీద ఓ గాయం తాలూకూ గాటు ఉంది. దానివల్ల తనను తాను తక్కువగా భావించేలా ఎవరూ చేయకుండా ఉండటానికి చిన్నప్పటి నుంచీ ఆమెలో స్వీయ గౌరవం, ప్రేమలను పెంపొందిస్తూ వచ్చాను'' అని కూడా ఆమె వివరించారు.
మరో ఇన్‌స్టాగ్రామ్ యూజర్ @ulyakoroliova కూడా తన శరీరం మీద గాట్లను దాచివేయాలనే ఒత్తిడిని విస్మరించి.. సగర్వంగా వాటిని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు.
''నా శరీరం మీద గాట్లు నన్ను సమాజపు సౌందర్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండకుండా అడ్డకుంటాయి. కానీ ఆ ప్రమాణాలను విశ్వసించటం ఇప్పుడు నేను మానేశాను'' అని ఆమె పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, @TYSYA
మరో బ్లాగర్ @murwitch పుట్టుకతోనే జుట్టు రాలిపోవడమనే సమస్యను ఎదుర్కొంటున్నారు. బట్టతల అయినా, విగ్గు ధరించటం అయినా తనకు సంతోషమేనని ఆమె పేర్కొన్నారు.
''స్కూలులో, వీధుల్లో నన్ను గేలి చేసేవారు. ఈ సమస్యతో ఎలా బతకటమో నాకు తెలియలేదు. ఇప్పుడు ఈ భారం, ఈ అబద్ధాల నుంచి నాకు విముక్తి లభించింది. చాలా సంతోషంగా ఉంది'' అని ఆమె రాశారు.
అయితే.. సోషల్ మీడియాలో కొంత మంది భిన్న స్వరం వినిపిస్తున్న వారూ ఉన్నారు.
అకేలా అనే ట్విటర్ యూజర్.. ‘‘జనం తమ బద్ధకాన్ని, బలహీనతలను బాడీ పాజిటివిటీ పేరుతో సమర్థించుకోవటం నవ్వు తెప్పిస్తోంది. కానీ నిజాన్ని నేరుగా చూడాలి. మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి. శరీర సౌష్ఠవం ఓ పిచ్చిగా ఉండాలని ఎవరూ అనటం లేదు. శరీరం దృఢంగా ఉండాలని మాత్రమే అంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
అయితే.. తిస్యా తన ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టంచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- 17 ఏళ్లుగా దొరకని నేరస్తుడిని డ్రోన్ల సాయంతో పట్టుకున్న పోలీసులు
- కశ్మీర్, గో రక్షణ, మూకదాడులు, మతాంతర వివాహాలపై గాంధీ అభిప్రాయాలేంటి?
- బోటు వెలికితీతలో ఆటంకాలు.. తెగిన ఇనుప తాడు, వంగిన లంగరు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి?
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- వృద్ధురాలి వంటగదిలో దొరికిన రూ.46 కోట్ల విలువైన కళాఖండం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








