‘ఈ ఉద్యోగాలు చేయలేం, రిటైరైపోతాం అనుమతించండి’ అంటూ 72మంది లోకోపైలట్ల లేఖ..అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అల్పేష్ కర్కరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
"ప్రయాణీకులను సురక్షితంగా తీసుకెళ్లడం మా బాధ్యత. కానీ మా భద్రత సంగతేంటి? మేం ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నాయి, అవి మరింత ఎక్కువవుతున్నాయి"
సెంట్రల్ రైల్వేలోని ముంబయి డివిజన్‌లో పనిచేస్తున్న 72 మంది మెయిల్ లోకో పైలట్లలో ఒకరైన అమోల్ (పేరు మార్చాం) చేసిన వ్యాఖ్యలివి. ఆయన ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ కోరారు.
శారీరక, మానసిక ఒత్తిడి, విధులు సక్రమంగా లేకపోవడం, పాలనాయంత్రాంగం ఒత్తిడి కారణంగా ఇక ఉద్యోగాలు చేయలేమంటూ 72 మంది లోకో పైలట్లు డివిజనల్ రైల్వే మేనేజర్లకు లేఖ రాశారు.
అయితే, లోకో పైలట్ల సమస్యలు, ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో పరిష్కారం దొరుకుతుందని రైల్వే అధికార యంత్రాంగం అంటోంది.


ఫొటో సోర్స్, NOAH SEELAM/GETTY IMAGES
'రైల్వేకు నా జీవితాన్ని ఇచ్చాను'
"రైలు సమయానికి, సురక్షితంగా గమ్యం చేరేలా చూడటం మా బాధ్యత. కానీ మేమెంత సురక్షితంగా ఉన్నాం?" అని 51 ఏళ్ల అమోల్ ప్రశ్నించారు. ఆయన సెంట్రల్ రైల్వేలోని ముంబయి డివిజన్‌లో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతున్న ఒక లోకో పైలట్, స్వచ్ఛంద పదవీ విరమణ కోరిన 72 మందిలో ఒకరు.
మూడు దశాబ్దాల సర్వీసు తర్వాత కూడా, ఒక క్రమపద్ధతి లేని షిఫ్టులు, ఎక్కువ ఫోన్ కాల్స్, గంటల తరబడి పని ఒత్తిడి, ఏదీ తగ్గలేదని, డ్యూటీ ముగిసిన తర్వాత కూడా ఒత్తిడి తగ్గదని ఆయన అంటున్నారు.
"డిపార్ట్‌మెంట్‌లో భారీగా ఖాళీలు ఉండడం వల్ల, అదనంగా పని చేయాల్సి ఉంటుంది. సిగ్నల్ విషయంలో ఏదైనా తప్పు జరిగితే.. కఠినమైన చర్యలు, జీతంలో కోత, ఇతర చర్యల భయం నిరంతరం ఉంటుంది" అన్నారు.
రన్నింగ్ రూమ్‌లో కావాల్సిన సౌకర్యాలు ఉండవు. పరిశుభ్రత ఉండదు. నాణ్యతలేని ఆహారం, తమకు తగినంత విశ్రాంతి లేకుండా చేస్తాయని అంటున్నారు అమోల్.
"ఇదేం విలాసవంతమైన డిమాండ్ కాదు, భద్రతాపరమైన అవసరం" అన్నారు.
నిరంతర ఒత్తిడి ఆరోగ్యంపై, కుటుంబ జీవితంపై కూడా ప్రభావం చూపుతోందని ఆయన చెప్పారు.
"నేను రైల్వేకు నా జీవితాన్నిచ్చాను. కానీ, ఇప్పుడు నా ఆరోగ్యం, కుటుంబాన్ని కూడా చూసుకోవాలి" అని అమోల్ అన్నారు.
స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలనే నిర్ణయం అంత సులభం కాదని ఆయన అంటున్నారు.
"దేశానికి జీవనాడిగా పరిగణించే రైళ్లను సురక్షితంగా నడపగలిగేలా.. ఇంజిన్ సిబ్బంది సమస్యలు, సంక్షేమాన్ని కూడా పరిగణించాలని ఆశిస్తున్నాను" అన్నారు అమోల్.

ఫొటో సోర్స్, NARINDERNANU/GETTY IMAGES
అధికార యంత్రాంగంపై ఆరోపణలు
అధికార యంత్రాంగం ఒత్తిడి, వేధింపుల కారణంగా ఆందోళనలో పనిచేస్తున్నట్లు లోకో పైలట్లు అధికారులకు అందించిన స్వచ్ఛంద విరమణ దరఖాస్తు(లేఖ)లో ఆరోపించారు.
సక్రమంగా లేని విధులు, పాలనాయంత్రంగా అసమర్థతత శారీరక, మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయని, ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయని అంటున్నారు.
అందుకే, అందరూ స్వచ్ఛంద పదవీ విరమణకు కలిసి వచ్చినట్లు లోకో పైలట్లు చెప్పారు.
లోకో పైలట్లకు అందించే సేవలు కూడా నాణ్యత లేనివని, సౌకర్యాల కొరత ఎక్కువగా ఉందని స్వచ్ఛంద పదవీ విరమణ అభ్యర్థన దరఖాస్తులో పేర్కొన్నారు.

దరఖాస్తులో ఏముంది?
2026 ఫిబ్రవరి 16న ముంబయి డివిజన్‌లోని సెంట్రల్ రైల్వే, సీఎస్ఎంటీ డివిజనల్ రైల్వే మేనేజర్‌కు లోకో పైలట్ (మెయిల్) ఉద్యోగులు సమర్పించిన ఉమ్మడి దరఖాస్తులో, ప్రస్తుత రైల్వే నిబంధనల ప్రకారం స్వచ్ఛంద పదవీ విరమణ కోసం అభ్యర్థించారు.
సంవత్సరాలుగా నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, కొన్ని నిరంతర, వ్యవస్థాగత సమస్యలు పరిష్కారం కాలేదని, ఇవి ఆరోగ్యం, భద్రత, గౌరవం, మొత్తం తమ సంక్షేమాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అందులో పేర్కొన్నారు.
ఈ సమస్యలపై సంబంధిత అధికారులకు పదేపదే రాతపూర్వక, మౌఖిక ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ, ఎటువంటి పరిష్కారాలకు నోచుకోలేదని తెలిపారు. అందుకే, ఇక సర్వీసును కొనసాగించడం అలసట, ఒత్తిడిని కలిగిస్తుందని, వృత్తిపరంగా అస్థిరంగా ఉంటుందని భావించినట్లు చెప్పారు.
ఇంకా ఆ దరఖాస్తులో, "డ్యూటీ సమయంలో రన్నింగ్ రూమ్‌లో వడ్డించే ఆహారం తరచుగా నాసిరకం, అపరిశుభ్రతతో తినడానికి పనికిరానిదిగా ఉంటోంది. రన్నింగ్ రూమ్, అనుబంధ విశ్రాంతి గదులలో ప్రాథమిక శుభ్రత, సరైన నిర్వహణ, అవసరమైన సౌకర్యాలు లేవు. అందువల్ల సుదీర్ఘమైన, శ్రమతో కూడిన విధి తర్వాత కనీస విశ్రాంతి దొరకడం లేదు"
"సురక్షితమైన మార్గాలు, లైటింగ్ లేకపోవడం, లాబీ, ట్రిప్ షెడ్, రన్నింగ్ రూమ్‌లకు సురక్షితమైన దారి లేకపోవడం ముఖ్యంగా రాత్రివేళల్లో , ప్రతికూల పరిస్థితులలో తీవ్రమైన భద్రతా ప్రమాదాలకు దారితీస్తుంది" అని తెలిపారు.
ఖాళీ పోస్టులు
సెంట్రల్ రైల్వేలోని ముంబయి డివిజన్‌లో దాదాపు 240 మెయిల్ లోకో పైలట్లు పనిచేస్తున్నారు. దాదాపు 230 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీల కారణంగా ప్రస్తుత పైలట్లు అదనంగా పనిచేయాల్సి వస్తోంది.
సెంట్రల్ రైల్వేలో ముంబయి నుంచి ప్రతిరోజూ 200కి పైగా మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరుగుతాయి. మరోవైపు, ముంబయి లోకల్‌లో దాదాపు 950 మంది స్థానిక పైలట్లు ఉన్నారు. అక్కడ కూడా ఖాళీల కొరత ఉంది.
కొన్నిసార్లు, మెయిల్ రైళ్లను నడుపుతున్నప్పుడు సిగ్నల్ నియమాలను అనుకోకుండా ఉల్లంఘిస్తారు. సిగ్నల్ ఉల్లంఘనలకు రైల్వే అడ్మినిస్ట్రేషన్ కంపల్సరీ రిటైర్మెంట్ సర్వీస్ (సీఆర్ఎస్) చేస్తుంది. కొన్నిసార్లు జీతంలో తగ్గింపు లేదా పదవిని తగ్గించడం జరుగుతుంది. ఇది పదవీ విరమణ సమయంలో ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. కాబట్టి లోకో పైలట్లకు ప్రస్తుత దారి పదవీ విరమణ చేయడమే.
50 ఏళ్లు పైబడిన కొంతమంది లోకో పైలట్లు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని 72 మంది లోకో పైలట్లలో ఒకరు బీబీసీ మరాఠీకి చెప్పారు.
అధికారులు ఏమంటున్నారు?
రన్నింగ్ స్టాఫ్, లోకో పైలట్లు, గార్డులు, ఇతర రైల్వే ఉద్యోగుల సమస్యలను సెంట్రల్ రైల్వే మజ్దూర్ కాంగ్రెస్ యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ బాజ్‌పాయ్ లేవనెత్తారు.
"ఈ లోకో పైలట్ల సమస్యలు చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. అధికార యంత్రాంగం దీనిపై తగినంత శ్రద్ధ చూపడం లేదు. మా ఉద్యోగులు మానసిక, ఇతర ఒత్తిడిలో పనిచేస్తున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో సహా లోకో పైలట్లు చేసిన అన్ని డిమాండ్లను వెంటనే పరిగణించాలి" అని ప్రవీణ్ బాజ్‌పాయ్ బీబీసీతో అన్నారు.
లోకో పైలట్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి డిమాండ్ల గురించి రైల్వే ప్రజా సంబంధాల అధికారులను బీబీసీ మరాఠీ సంప్రదించింది. లోకో పైలట్ల డిమాండ్లపై రైల్వే అధికారులు తగిన చర్యలకు ఆదేశించినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా అన్నారు. రైల్వే సానుకూలంగా పరిశీలిస్తోందని, పదవీ విరమణను వద్దనుకుంటున్నట్లు కొంతమంది పైలట్లు మళ్లీ లేఖలు రాస్తున్నట్లు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













