అరకు స్పెషల్ ట్రైన్ సహా ప్రపంచంలోని 9 అబ్బురపరిచే రైలు మార్గాలు ఇవే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లిన్ బ్రౌన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సెప్టెంబర్ 27, 1825న రవాణాలో విప్లవాత్మక మార్పు తెచ్చే ఒక ఆవిష్కరణను చూసేందుకు ఇంగ్లండ్ నలుమూలల నుంచీ జర్నలిస్టులు, ఆసక్తిగల ప్రజలు డార్లింగ్టన్ పట్టణానికి (లండన్‌కు ఉత్తరాన దాదాపు 420 కిలోమీటర్లు) తరలివచ్చారు.
ఆ రోజు ఆవిరి రైలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో దగ్గరలోని స్టాక్టన్ నగరం వైపు వెళుతోంది. 20 బోగీలలో ఒకదానిలో వందలాది మంది ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ఈ చిన్న చరిత్రాత్మక ప్రయాణం మొదటి ప్రయాణీకుల రైలుకు, ఆధునిక రైలు ప్రయాణానికి నాంది పలికింది.
200 ఏళ్ల తరువాత గమనిస్తే రైలు ప్రయాణాల చరిత్ర హై-స్పీడ్ రైళ్లకు చేరింది. 1950లు, 1960ల్లో విమానాలు ప్రజాదరణ పొందినప్పటికీ రైలుప్రయాణం ఇప్పటికీ చాలామందికి జ్ఞాపకంగా, అద్భుతమైన అనుభూతిగా మిగిలిపోతుంది.
రైళ్లు ఇప్పటికీ అత్యంత పర్యావరణ అనుకూల రవాణాలో ఒకటిగా ఉన్నాయి.
ఈ రవాణా విధానం ద్విశతాబ్ది వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచంలో అబ్బురపరిచే, ప్రత్యేక రైలు ప్రయాణ మార్గాల వివరాలను అందిస్తున్నాం.


ఫొటో సోర్స్, Getty Images

"మిస్టర్ హెండర్సన్ రైల్వే"గా పిలిచే ఈ విక్టోరియా కాలం నాటి రైలు అండలూసియన్ గ్రామీణ ప్రాంతాల గుండా ప్రయాణిస్తుంది. బ్రిటిష్- స్పానిష్ చరిత్రలో ఇది ప్రత్యేకంగా నిలిచిపోయింది.
ఈ మార్గానికి బ్రిటిష్ రైల్వే ఫైనాన్షియర్ అలెగ్జాండర్ హెండర్సన్ పేరు పెట్టారు. 1892లో బ్రిటిష్ నియంత్రణలో ఉన్న రాక్ ఆఫ్ జిబ్రాల్టర్‌ను స్పెయిన్‌లోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించే ప్రాజెక్టుకు ఆయన ఆర్థిక సాయం అందించారు.
అల్జీసిరాస్ ఓడరేవును అండలూసియన్ కేంద్రానికి రైలు ద్వారా అనుసంధానించడానికి అంతకుముందు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎందుకంటే రైలు ఇప్పుడు ప్రయాణించే మార్గంలోని అడవులు, కొండల్లో బందిపోట్ల బెడద ఉండేది.
ఈ ప్రయాణమార్గం మారుమూల కొండల గుండా సాగుతుంది. వంద మీటర్ల ఎత్తయిన కానోన్ డి లాస్ బ్యూట్రెరాస్ వంటి ప్రకృతి సహజ అద్భుత ప్రాంతాల దగ్గరకు చేరుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

విశాఖపట్నం-కిరండూల్ స్పెషల్ ప్యాసింజర్ రైలు భారతదేశంలోని పచ్చని తూర్పు కనుమల గుండా నాలుగు గంటల పాటు ప్రయాణిస్తుంది.
58 సొరంగాలతో ఉండే ఈ మార్గం మబ్బులతో నిండిన కొండలు, ఓక్ అడవుల గుండా సాగి అరకు పట్టణంలో ముగుస్తుంది. అరకులో కాఫీ పరిశ్రమను సందర్శకులు చూడొచ్చు.

కొత్తగా ప్రారంభమైన బాల్టిక్ ఎక్స్‌ప్రెస్ సెంట్రల్ యూరప్‌లోని కీలక నగరాలను చూసే వీలు కల్పిస్తుంది.
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్) నగరంలో మొదలయ్యే ఈ మార్గం పైన్, ఓక్ అడవుల గుండా సాగి బాల్టిక్ సముద్రానికి ఎదురుగా పోలాండ్‌లోని తీరప్రాంత నగరమైన గ్డినియాకు చేరుతుంది.
ఎనిమిది గంటల ప్రయాణం ప్రపంచానికి అంతగా తెలియని పార్డుబైస్ నగరాన్ని చూసే వీలు కల్పిస్తుంది. అక్కడ పాస్టెల్ రంగు ఇళ్లు, చెక్ బెల్ టవర్లును సందర్శించవచ్చు. పోలిష్ సాంస్కృతిక రాజధాని పోజ్నాన్ చారిత్రక స్క్వేర్...డిస్నీ సినిమాలోనిదిలా అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Takaaki Iwabu/Bloomberg via Getty Images

"బుల్లెట్ రైలు"గా పేరుగాంచిన జపనీస్ షింకన్‌సెన్ 2024లో 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక్కడ గంటకు 321 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటి హై-స్పీడ్ రైలు మార్గం ఇది. సమయపాలన, వేగం దీని ప్రత్యేకతలు.
ఈ రైలు జపాన్ ప్రయాణంపై భారీ ప్రభావాన్ని చూపింది. ఆరు దశాబ్దాల తరువాత ఇప్పుడు దేశవ్యాప్తంగా తొమ్మిది వేర్వేరు షింకన్‌సెన్ మార్గాలున్నాయి.
కొత్త మార్గం టోకైడో షింకన్‌సెన్‌ను "న్యూ గోల్డెన్ రూట్" అని పిలుస్తారు. ఇది టోక్యో నుంచి రాజధానికి నైరుతి దిశగా 456 కిలోమీటర్ల దూరంలో ఉన్న సురుగా నగరం వరకు ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

మెక్సికోలో టెకీలా పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతోంది. టెకీలా అనేది ఓ డ్రింక్. కొత్తగా పునఃప్రారంభించిన టెకీలా ఎక్స్‌ప్రెస్ రైలు సందర్శకులకు దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఎగుమతి ఉత్పత్తులలో ఒకదాని గురించి మరింత తెలుసుకోవడానికి వీలు కల్పిస్తోంది.
అదే సమయంలో జాలిస్కోలోని నీలం-ఆకుపచ్చ రంగు అగావే పొలాల అందాలను ఆస్వాదించవచ్చు.
రెండు గంటల ప్రయాణం గ్వాడలజారా నగరంలో ప్రారంభమై టెకిలా పట్టణంలో ముగుస్తుంది. పురాణాల ప్రకారం టెకీలా పానీయాన్ని కనుక్కుంది ఇక్కడే.

ఫొటో సోర్స్, Getty Images

వౌగా హిస్టారిక్ రైలు పోర్చుగల్‌లోని వౌగా లోయలోని కొండల గుండా అందమైన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తుంది. దేశంలో ఇప్పటికీ ఉన్న ఏకైక నారో-గేజ్ రైల్వే లైన్ ఇది.
మెరిసే ఎరుపు, ఆకుపచ్చ, రాయల్ బ్లూలో ఉండే రంగురంగుల చెక్క క్యారేజీలు, పుదీనా ఆకుపచ్చ ఇంటీరియర్లు, చెక్క సీట్లు, ఆరు గంటల ప్రయాణంలో ప్రయాణీకులకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం కల్పించే ఓపెన్-ఎయిర్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ రైలు ప్రత్యేకతలు.
వేసవిలో మాత్రమే నడిచే ఈ రైలు మాసిన్యాటా దో వౌగాతో సహా అనేక ప్రదేశాలలో ఆగుతుంది. మాసిన్యాటా దో వౌగాలో ప్రాంతీయ దుస్తులు ధరించిన పది మంది సభ్యుల జానపద బృందం ప్రయాణీకులకు స్వాగతం పలుకుతుంది.
మరొక స్టాప్ అగ్వేడాలో ఉంది. ఇది కళాకృతులు, పట్టణ అందాలకు ప్రసిద్ధి చెందిన రంగురంగుల నగరం.

ఫొటో సోర్స్, Ralph Hardwick/Sutton Images via Getty Images

స్నీఫెల్ రైలు ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవం. ఐరిష్ సముద్రంలోని ఐల్ ఆఫ్ మాన్ పర్వతాలను దాటుతూ వెళ్లే ఈ రైలు బ్రిటిష్ దీవుల్లో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ మౌంటెయిన్ రైలు.
1893లో ఈ రైలు ప్రారంభమైంది. ఈ ద్వీపానికి పర్యాటకులను ఆకర్షించడంలో మాంక్స్ ఎలక్ట్రిక్ రైల్వేతో పాటు కీలక పాత్ర పోషించింది.
ఇప్పటికీ ఈ రెండు లైన్లు విక్టోరియా కాలం నాటి రైళ్లలాగే చెక్క ఇంటీరియర్స్, గాజుతో ఉండే అద్దాల ప్యానెల్స్ వంటివాటితో ఉన్నాయి.

ఫొటో సోర్స్, SOPA Images/LightRocket via Getty Images

ఇన్వర్నెస్, థర్సో పట్టణాలను కలిపే ఫార్ నార్త్ రైల్వే లైన్ ద్వారా స్కాటిష్ హైలాండ్స్ మారుమూల ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.
నాలుగు గంటల ప్రయాణం 270 కిలోమీటర్ల మేర సాగుతుంది. ప్రపంచంలో చిత్తడినేల ఉండే అతిపెద్ద ప్రాంతం ఇది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన ప్రాంతం.

ఫొటో సోర్స్, Getty Images

కత్రినా హరికేన్ ఈ ప్రాంతాన్ని నాశనం చేసిన రెండు దశాబ్దాల తర్వాత, ఆమ్ట్రాక్ ఆగస్టు 18, 2025న గల్ఫ్ కోస్ట్ లైన్‌లో తన సర్వీసులను తిరిగి ప్రారంభించింది.
ఇప్పుడు మార్డి గ్రాస్ సర్వీస్ అని పిలిచే ఈ రైలు తీరప్రాంతాలు, అద్భుతమైన బీచ్‌లు, రంగురంగుల దక్షిణ అమెరికాలోని అలబామా, న్యూ ఆర్లియన్స్, లూసియానా వంటి సముద్రతీర పట్టణాల గుండా వెళుతుంది. అనేక చారిత్రక నగరాలను కలుపుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














