గెలాక్సీ గ్రానైట్: జీఐ ట్యాగ్, వన్‌ డిస్ట్రిక్ట్‌.. వన్‌ ప్రోడక్ట్ కోసం ప్రతిపాదనలు, ఈ గ్రానైట్ రాయి ప్రత్యేకతలేంటి ?

గ్రానైట్, చీమకుర్తి, ప్రకాశం జిల్లా, చైనా, జపాన్
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఒంగోలు గిత్తలు. తెల్లటి శరీరం, నిండైన సౌష్టవం, ఎత్తైన మూపురంతో అవి ఆ ప్రాంతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకువచ్చాయి.

ఆ ఒంగోలు జాతి పశువుల తర్వాత గత ముప్పై ఏళ్లుగా ఆ జిల్లాకి దేశ, విదేశాల్లో ఎంతో గుర్తింపు తెస్తున్నవి చీమకుర్తిలోని గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలే.

ఇక్కడ మాత్రమే లభ్యమయ్యే ఈ ప్రత్యేకమైన గెలాక్సీ గ్రానైట్‌‌కి జీఐ ట్యాగ్‌ తో పాటు వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రోడక్ట్‌ కింద గుర్తింపు కోసం కృషి చేస్తున్నట్టు ఆ జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘ఆ గుర్తింపు తప్పకుండా వస్తుందనుకుంటున్నాం’

మరెక్కడా లేని విధంగా చీమకుర్తి ప్రాంతంలోనే దొరికే ఈ గెలాక్సీ గ్రానైట్‌ కి జీఐ ట్యాగ్‌ తో పాటు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్‌ కింద గుర్తింపు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసినట్టు భూగర్భగనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజశేఖర్‌ చెప్పారు.

జీఐ దరఖాస్తు ప్రాసెస్‌లో ఉందనీ, ఇక కేంద్రప్రభుత్వం ఇచ్చే వన్‌ డిస్ట్రిక్ట్‌.. వన్‌ ప్రోడక్ట్‌ గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

అసలు.. ఏమిటీ గెలాక్సీ గ్రానైట్‌? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? దాని ప్రత్యేకత ఏంటి?

గ్రానైట్, చీమకుర్తి, ప్రకాశం జిల్లా, చైనా, జపాన్
ఫొటో క్యాప్షన్, చీమకుర్తిలోని క్వారీ

అరవై ఏళ్ల నుంచే మైనింగ్‌

గ్రానైట్‌ నిల్వలకు ప్రసిద్ధి చెందిన ప్రకాశం జిల్లాలో 1960ల నుంచే మైనింగ్‌ మొదలైంది.

అప్పట్లో ఆ ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఉండేది. 1970లో ఒంగోలు జిల్లాగా ఏర్పడింది. 1972లో జిల్లాకు స్వాతంత్ర సమరయోధులు, ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెట్టడంతో ప్రకాశం జిల్లా అయింది.

ఈ ప్రాంతం ప్రధానంగా క్వార్ట్‌రైట్, బైరైటీస్, బ్లాక్‌ గ్రానైట్‌, రోడ్‌ మెటల్‌ గనులకు ప్రసిద్ధి చెందింది.

1960 నుంచి ప్రకాశం జిల్లాలో మైనింగ్‌ కార్యకలాపాలు జరిగేవనీ, ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1857 హెక్టార్లలో మైనింగ్‌ గనులు ఉన్నాయని భూగర్భగనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజశేఖర్‌ బీబీసీకి తెలిపారు.

గ్రానైట్, చీమకుర్తి, ప్రకాశం జిల్లా, చైనా, జపాన్
ఫొటో క్యాప్షన్, చీమకుర్తిలో నల్లరంగు రాయిపై నక్షత్రాల్లా మెరిసే బంగారు రంగు చుక్కలను గుర్తించారు.

1980 తర్వాత గెలాక్సీ గ్రానైట్‌ వెలుగులోకి.. మొదట జపాన్‌కు ఎగుమతి

మైనింగ్‌ జరుగుతున్న క్రమంలో 1983–85 మధ్య కాలంలో జిల్లాకు చెందిన బాలకృష్ణారెడ్డి అనే వ్యాపారితో పాటు చెన్నైలో గ్రానైట్‌ వ్యాపారం చేసే మరొకరు తొలిసారిగా చీమకుర్తిలో నల్లరంగు రాయిపై నక్షత్రాల్లా మెరిసే బంగారు రంగు చుక్కలను గుర్తించారు.

ఎక్కువగా మెరిసే బంగారు లేదా రాగి రంగు బ్రాంజైట్‌ మచ్చలతో ఉన్న రాళ్లను వెలికి తీశారు.

మొదట వాళ్లు ఆ రాయి శాంపిల్స్‌ తీసుకుని జపాన్‌కు పంపించారు.

అక్కడి వ్యాపారస్తులకు ఆ గ్రానైట్‌ నచ్చడం, ఇది చాలా మన్నిక కలిగిన విలువైన రాయిగా అక్కడి పరీక్షల్లో తేలడంతో 1987–1990 మధ్య ప్రాంతంలో ఈ గ్రానైట్‌ మైనింగ్‌ మొదలైందని గెలాక్సీ గ్రానైట్‌ క్వారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ నవీన్‌ కుమార్‌రెడ్డి బీబీసీతో చెప్పారు.

చీమకుర్తి ప్రాంతంలో దొరికే గెలాక్సీ గ్రానైట్‌ ప్రపంచ ప్రసిద్ధిగాంచిందనీ, ఇంకెక్కడా లభ్యం కాని నేపథ్యంలో ఇది ఒక యునిక్‌ డిపాజిట్‌గా గుర్తింపు వచ్చిందని మైనింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్‌ తెలిపారు.

గ్రానైట్, చీమకుర్తి, ప్రకాశం జిల్లా, చైనా, జపాన్
ఫొటో క్యాప్షన్, తొలుత ఈ రాయిని గోల్డ్‌ స్టార్‌ గ్రానైట్‌ అని పిలిచే వారు.

గెలాక్సీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే..

బంగారు రంగులో ప్రకాశవంతంగా మెరిసే చుక్కలు ఉన్న ఈ రాయిని తొలుత గోల్డ్‌ స్టార్‌ గ్రానైట్‌ అని పిలిచే వారు. ఇప్పటికీ కొందరు అలానే పిలుస్తుంటారు.

అయితే 1990 తర్వాత ఎక్కువగా గెలాక్సీ గ్రానైట్‌ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. పాలపుంతలో నక్షత్రాలు ఎలా మెరుస్తాయో ఈ గ్రానైట్‌పై బ్రాంజైట్‌ స్పెక్ట్స్‌ అలాగే మెరుస్తుంటాయి కాబట్టి దీన్ని అలా పిలవడం ప్రారంభించారు.

నక్షత్రాల తరహాలో వీటికి కూడా ట్వింకిల్‌ నేచర్‌ ఉండటంతో దీనికి గెలాక్సీ గ్రానైట్‌ అనే పేరు పెట్టారని మైనింగ్‌ డీడీ రాజశేఖర్‌ తెలిపారు.

గ్రానైట్, చీమకుర్తి, ప్రకాశం జిల్లా, చైనా, జపాన్
ఫొటో క్యాప్షన్, చైనాకు ఎగుమతులు మొదలైన తర్వాత గెలాక్సీ గ్రానైట్‌కు డిమాండ్ పెరిగింది.

ఆ మూడు ప్రాంతాల్లోనే నిక్షేపాలు

జిల్లాలోని చీమకుర్తి, ఆర్‌ఎల్‌పురం, బూదవాడ.. ఈ మూడు గ్రామాల పరిధిలోనే గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయని భూగర్భగనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజశేఖర్‌ బీబీసీతో చెప్పారు.

మొత్తంగా జిల్లాలో 537 హెక్టార్లలో ఈ గెలాక్సీ గ్రానైట్‌ గనులున్నాయని, చీమకుర్తి ప్రాంతంలో కేవలం 5 కిలోమీటర్ల పరిధిలోనే ఈ రాయి నిక్షిప్తమై ఉందని ఆయన అన్నారు.

ఇక్కడే ఆ నిక్షేపాలు ఎందుకున్నాయంటే..

ఇక్కడి నేల ప్రత్యేక పరిస్థితుల వల్లనే గెలాక్సీ గ్రానైట్‌ ఈ ప్రాంతంలో నిక్షిప్తమై ఉందని, ఈ ప్రాంతాన్ని జియలాజికల్‌గా లేయర్డ్‌ ఇగ్నేష్‌ కాంప్లెక్స్‌ అంటారని కడప జిల్లాకు చెందిన సీనియర్‌ జియాలజిస్ట్‌ భాస్కర్‌రెడ్డి చెప్పారు.

కొన్ని మిలియన్ల సంవత్సరాల కిందటే ఇక్కడ ఇవి నిక్షిప్తమై ఉన్నాయని, భూమి దిగువున శిలాద్రవం స్పటీకరణ చెందితే ఇలాంటి నిక్షేపాలు ఏర్పడతాయని ఆయన చెప్పారు.

ఈ రాయిని నోరైడ్‌ గాబ్రో రాక్‌ అంటారని, ఈ రాళ్లల్లో బంగారు రంగు, రాగి రంగు మెరుపు సహజ సిద్ధంగా వస్తుందని ఆయన చెప్పారు.

గ్రానైట్, చీమకుర్తి, ప్రకాశం జిల్లా, చైనా, జపాన్
ఫొటో క్యాప్షన్, గెలాక్సీ గ్రానైట్ కోసం 200 అడుగుల లోతు వరకు మైనింగ్ జరుగుతుంది.

చైనా మార్కెట్‌ తర్వాత విపరీతంగా పెరిగిన డిమాండ్

‘‘తొలుత ఇక్కడి నుంచి ఈ గెలాక్సీ గ్రానైట్‌ ఎక్కువగా జపాన్‌కు ఎగుమతయ్యేది. ఆ తర్వాత యూరప్ దేశాలకు ఎగుమతులు మొదలయ్యాయి. ప్రధానంగా ఇటలీకి ఎగుమతులు ఎక్కువ ఉండేవి.

ఇక 2000 సంవత్సరం నుంచి చైనాకి ఎగుమతులు మొదలయ్యాయి. ఆ దేశ ప్రజలు ఈ రాయిని ఎక్కువగా వినియోగించడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారిగా ఈ గెలాక్సీ గ్రానైట్‌కి విపరీతమైన డిమాండ్‌ వచ్చింది’’ అని గెలాక్సీ గ్రానైట్‌ క్వారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శిద్ధా సుధీర్‌ బీబీసీకి తెలిపారు.

చైనా వ్యాపారులే ఈ గెలాక్సీ గ్రానైట్‌ను విపరీతంగా ప్రమోట్‌ చేశారని ఆయన చెప్పారు.

ప్రధానంగా ఇళ్ల నిర్మాణంలోని ఇంటీరియర్స్‌లో ఈ గెలాక్సీ గ్రానైట్‌ను వినియోగిస్తుంటారని చీమకుర్తిలోని గ్రానైట్‌ వ్యాపారవేత్త భరత్ చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమంది వరకు జిల్లాలో గ్రానైట్‌ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని ఆయన చెప్పారు.

గ్రానైట్, చీమకుర్తి, ప్రకాశం జిల్లా, చైనా, జపాన్
ఫొటో క్యాప్షన్, మైనింగ్‌ శాఖ డీడీ రాజశేఖర్‌

200 అడుగుల లోతు వరకు తవ్వకాలు

మొదటగా కోర్‌ డ్రిల్‌ వేసుకుని ఎక్కడ మంచి రాయి ఉందో చెక్‌ చేసుకుని అప్పుడు క్వారీయింగ్‌ చేపడతామని చీమకుర్తిలోని గెలాక్సీ గ్రానైట్‌ క్వారీ యజమాని రవిచంద్రన్‌ వివరించారు.

30 అడుగులు, 40 అడుగుల లోతు నుంచి మంచి రాయి లభ్యమవుతుందని, దాదాపు 200 అడుగుల లోతు వరకు వెళ్లి మైనింగ్‌ చేస్తామని ఆయన చెప్పారు.

బండరాళ్లను ఇక్కడే రెండు, మూడు మీటర్ల వరకు కట్‌ చేసి.. పలకల తయారీకి, పాలిష్‌ కోటింగ్‌కి ఫ్యాక్టరీకి పంపిస్తామని, ఒక్కోసారి నేరుగా క్వారీల నుంచి ముడి రాయి కూడా ఎక్స్‌పోర్ట్‌కి వెళ్తుందని రవిచంద్రన్‌ బీబీసీతో చెప్పారు.

గ్రానైట్, చీమకుర్తి, ప్రకాశం జిల్లా, చైనా, జపాన్

కావాల్సిన పరిమాణంలో

క్వారీ నుంచి వచ్చిన రాయిపలకలను ఓసారి క్వాలిటీ చెక్‌ చేసి.. కటింగ్‌కి అనుకూలంగా ఉన్న పలకలను వేరు చేసి.. ఎగుమతుదారులకు ఎవరికి ఏ సైజ్‌లో కావాలంటే ఆ సైజ్‌లో కట్‌ చేసి ఇస్తామని ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్వాహకులు తెలిపారు.

గెలాక్సీ గ్రానైట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉండడంతో ఎక్కువమొత్తం మెటీరియల్‌ను ఎలా ఉపయోగించాలనేదానిపై ఫోకస్‌ చేస్తామని చీమకుర్తిలోని ఓ ప్రాసెసింగ్‌ యూనిట్‌ యజమాని రాజా బీబీసీతో అన్నారు.

గ్రానైట్, చీమకుర్తి, ప్రకాశం జిల్లా, చైనా, జపాన్
ఫొటో క్యాప్షన్, గెలాక్సీ గ్రానైట్‌ క్వారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శిద్ధా సుధీర్‌

కోవిడ్‌ తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు

కోవిడ్‌ తర్వాత గత మూడు, నాలుగేళ్లుగా జాతీయంగా అంతర్జాతీయంగా కాస్త డిమాండ్‌ తగ్గిందని, ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్‌పై దృష్టి పెట్టామని గెలాక్సీ గ్రానైట్‌ క్వారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శిద్ధా సుధీర్‌ చెప్పారు.

ప్రభుత్వం నుంచి సహకారం బాగానే ఉందనీ, అయితే పన్నులు, రాయల్టీ చెల్లింపులో కొంత రాయితీలు ఇస్తే ఇంకా బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)