ఏపీలో గ్రానైట్ ప‌రిశ్ర‌మ: వలస కూలీలు వచ్చేదెన్నడు... ఎగుమతులు మొదలయ్యేదెప్పుడు

గ్రానైట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

క‌రోనావైర‌స్ లాక్‌డౌన్‌ల‌తో ఎగుమ‌తులు ప‌డిపోయి అనేక రంగాలు అతలాకుతలం అవుతున్నాయి.

ముఖ్యంగా ప‌రిశ్ర‌మ‌ల‌పై దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. ఇప్పుడు సడలింపులు అమలులోకి వచ్చినా కూలీల కొరత వేధిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కూడా కీలక పరిశ్రమలు మళ్లీ యథాస్థితికి రావడానికి సుదీర్ఘ సమయం పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రసిద్ధి చెందిన గెలాక్సీ గ్రానైట్ ప‌రిశ్ర‌మ పరిస్థితిపై బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్ ఇది.

చీమకుర్తి

చైనా ఎగుమతులు నిలిచిపోవడంతో చిక్కులు

దిగుమతులతో పాటుగా అనేక సరకుల ఎగుమతికి కూడా చైనా కేంద్ర స్థానంగా ఉంది. గ్రానైట్, మిర్చీ సహా పలు ఉత్పత్తులు చైనాకు ఎగుమ‌తి అవుతుంటాయి.

చీమకుర్తి నుంచి జరిగే గ్రానైట్ ఎగుమతుల్లో ఏకంగా 80శాతం ఒక్క చైనాకే వెళ్ల‌డం విశేషం. ఈ ఏడాది జనవరి నుంచే చైనాలో కరోనా ప్రభావం తీవ్రం కావడంతో ఎగుమతులకు ఆటంకం ఏర్పడింది.

దాని ప్రభావంతో అనేక పరిశ్రమలు అవస్థలపాలయ్యాయి. మిర్చీ ధరలు పడిపోవడంతో రైతాంగం, వ్యాపారులు కూడా ఇక్కట్లకు గురయ్యారు.

ఇప్ప‌టికే ఇబ్బందులోనున్న‌ చీమకుర్తి గ్రానైట్‌కు క‌రోనావైర‌స్ మ‌రిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. నెలకు సగటున 150 మంది వరకూ చైనీయులు చీమకుర్తి రావడం చాలాకాలంగా జరుగుతోంది.

తమకు అవసరమైన గ్రానైట్‌ను స్వయంగా పరిశీలించి, ఆర్డర్ ఇవ్వడం వారికి అలవాటు. అయితే జనవరి తర్వాత వారి రాక క్రమంగా తగ్గిపోయింది. ఆ తర్వాత మార్చి నుంచి పూర్తిగా నిలిచిపోయింది. ఇక ఆర్డర్లు లేకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయి ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది.

వీడియో క్యాప్షన్, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటే, మాకు ఉపాధి పోతుందేమో

లాక్‌డౌన్‌తో పరిస్థితి పూర్తిగా తారుమారు

చీమకుర్తిలోని గ్రానైట్ పరిశ్రమల్లో 18వేల మంది సుమారుగా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. దాదాపుగా 250 గ్రానైట్ ఆధారిత పరిశ్రమలు ఇక్క‌డ‌ నిర్వహిస్తున్నారు.

పరోక్షంగా మరో 40వేల మందికి ఈ గ్రానైట్ పరిశ్రమల ఆధారంగా ఉపాధి లభిస్తోంది. నెలకు సగటున 50 వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ఇక్క‌డ‌ సిద్ధం అవుతోంది.

అందులో 30వేల క్యూబిక్ మీటర్ల వరకూ చైనాకు ఎగుమతి అవుతోంది. మిగిలిన దానిలో అత్యధికం తూర్పు ఆసియా దేశాలకు తరలిస్తున్నారు.

లాక్‌డౌన్ తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా తారుమారయ్యింది. ఎగుమతులు నిలిచిపోవడంతో పాటుగా పరిశ్రమ పూర్తిగా మూతపడడంతో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న వారితో పాటు పరోక్షంగా లబ్ది పొందుతున్న వారికి కూడా సమస్యగా మారింది.

ప్రకాశం జిల్లా నుంచి వ‌చ్చే ఎగుమ‌తుల‌కు చైనాకు చెందిన 50 పెద్ద కంపెనీలు ఫిబ్రవరి తర్వాత రెడ్ సిగ్నల్ వేశాయి. దాంతో మొదలయిన సమస్య లాక్‌డౌన్తో రెట్టింపు అయ్యింది.

గ్రానైట్ తవ్వకాల్లో కార్మికులు

వలస కూలీల వెతలు, సొంత ప్రాంతాలకు పయనం

లాక్‌డౌన్ సమయంలో సుమారు 50 రోజుల పాటు పరిశ్ర‌మ‌ల్లో పూర్తిగా కార్యకలాపాలు నిలిచిపోయాయి. చీమకుర్తి పరిసర గ్రానైట్ రంగంలో ఉపాధి పొందుతున్న వలస కూలీలకు ఇది పెద్ద సమస్యగా మారింది.

ఇక్క‌డ‌ ప్రత్యక్షంగా పనిచేస్తున్న వారిలో 80శాతం మంది వలస కూలీలే ఉంటారు.

వారిలో ఒడిశా, చత్తీస్‌గ‌ఢ్‌, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన కూలీలున్నారు. ఏపీలోని చిత్తూరు నుంచి వచ్చి చీమకుర్తి ప్రోసెసింగ్ యూనిట్లలో పనిచేస్తున్న కార్మికులు కూడా ఉన్నారు.

లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక వారంతా విలవిల్లాడిపోయారు. "తొలినాళ్లలో కొందరు యజమానులు చేయూత ఇవ్వడంతో సజావుగా సాగింది.

ఆ తర్వాత స్వచ్ఛందంగా అందించిన సహాయం ద్వారానే పొట్టనింపుకున్నాం."అని జార్ఖండ్‌కు చెందిన రాజ్ వీర్ అనే కార్మికుడు బీబీసీకి తెలిపారు.

కార్మికులు

మే 12న కాలినడకన సొంత ప్రాంతానికి వెళుతూ మార్గం మధ్యలో తాడేపల్లి వద్ద బీబీసీ పలకరించినప్పుడు ఆయ‌న‌ తన సమస్యలను వివరించారు.

"వివిధ రాష్ట్రాలకు చెందిన మేము 10 వేల మందికి పైగా ఉంటాం. ఫిబ్రవరిలో పనులు లేవని కొందరు వెళ్లిపోయారు. మిగిలిన అందరం చిక్కుకుపోయాము.

పనిచేసిన కాలానికే చాలామంది వేతనాలు ఇచ్చారు. వాటితోనే గడిపాము. రెండు నెలలు గడిచినా మళ్లీ పనులు మొదలవుతాయని అనిపించ‌క‌పోవ‌డంతో వెళ్లిపోతున్నాం.

కొందరు సైకిళ్లు కొనుక్కుని బయలుదేరారు. అలాంటి అవకాశం లేని వాళ్లందరం కాలినడకన వెళ్లిపోతున్నాం.

సొంతూళ్లలో పిల్లలు ఎలా ఉన్నారో తెలియదు. ఇక్కడ మా బతుకులకు గ్యారంటీ లేదు. ఇంకెలా ఉండగలం? అందుకే కష్టం అయినా ఓర్చుకుంటూ సాగిపోతున్నాం "అని రాజ్ వీర్ వివరించారు.

చీమకుర్తిలో చిక్కుకున్న కార్మికులు కొందరిని ఆ తర్వాత రోడ్డు, రైలు మార్గాల ద్వారా ప్రభుత్వమే తరలించింది.

అయితే ప్రైవేటు బస్సుల పేరుతో తమ నుంచి వసూళ్లు చేయడం మూలంగా, అవి చెల్లించలేని అనేక మంది కాలినడకన బయలుదేరినట్టు కనిపించింది.

గ్రానైట్ తవ్వకాలు

సడలింపులు ఇచ్చినా 10శాతం పనులే..

లాక్‌డౌన్ 3 తర్వాత ప్రభుత్వాలు పలు సడలింపులు ఇచ్చాయి. అందులో భాగంగా భౌతికదూరం పాటిస్తూ మైనింగ్ కార్యకలాపాలకు అనుమతినిచ్చారు. అయినప్పటికీ చీమకుర్తిలో ప్రస్తుతం 10శాతం కూడా కార్యకలాపాలు కనిపించడం లేదు. గత డిసెంబరుతో పోలిస్తే ఇప్పుడు నామమాత్రంగా కార్యక్రమాలు సాగిస్తున్నట్టు గ్రానైట్ క్వారీ యజమాని ఎస్ వెంకటేశ్వర రెడ్డి బీబీసీకి తెలిపారు.

"రెండు నెలలు మూతపడడంతో యంత్రాలు కూడా పనిచేయడం లేదు. వాటిని సర్వీసింగ్ చేయించుకుని సిద్ధం చేసుకోవడానికే పది రోజులు దాటిపోయింది. మళ్లీ మామూలు పరిస్థితి ఎప్పటికి వస్తుందో అర్థం కావడం లేదు. పనులు చేద్దామన్నా కూలీలు లేరు. అందరూ వలస వెళ్లిపోవడంతో వాళ్లు మళ్లీ వస్తారో లేదో తెలియదు. వెళ్లిపోయిన కూలీలు వస్తేనే సమస్య తీరుతుంది. లేదంటే గ్రానైట్ క్వారీలకు కష్టమే. లోకల్ వాళ్లు కొన్ని కష్టమైన పనులకు సిద్ధంగా ఉండరు. పైగా టెక్నికల్ అంశాలు చాలామందికి తెలియదు. కాబట్టి వలస కూలీలు మళ్లీ వస్తేనే చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమ కోలుకుంటుంది" అని వివరించారు.

ప్రభుత్వానికి కూడా ఆదాయం నిలిచిపోయింది..

చీమకుర్తి సమీపంలోని గ్రానైట్ రంగం నుంచి ఏపీ ప్రభుత్వానికి ఏటా రూ. 250 కోట్ల వరకూ పన్నుల రూపంలో ఆదాయం లభిస్తోంది. కానీ గత ఆరు నెలలుగా ఆదాయం క్రమంగా తగ్గిపోతోందని వాణిజ్య పన్నుల శాఖ లెక్కలు చెబుతున్నాయి. పన్నుల విషయంలో మినహాయింపులు ఇవ్వాలని గ్యాలక్సీ గ్రానైట్ క్వారీస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం ఏ అజీమ్ కోరుతున్నారు.

"ఆరు నెలలుగా ఆదాయం పడిపోయింది. మళ్లీ ఎప్పుడు గాడిలో పడుతుందో తెలియదు. ప్రభుత్వం వివిధ పరిశ్రమల పట్ల సానుకూలంగా స్పందిస్తోంది. గ్రానైట్ రంగం విషయంలో కూడా ఉదారంగా స్పందించాలి. పన్నులు మినహాయించాలి. లేదంటే క్వారీల నిర్వహణ కష్టమే. కొన్నాళ్లుగా ఎగుమతులు క్రమంగా తగ్గుతుండగా, లాక్‌డౌన్తో పూర్తిగా కుదేలయ్యాము. ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశిస్తున్నాము"అని అజీమ్ పేర్కొన్నారు.

గ్రానైట్ రాళ్లు

కోలుకోవడానికి ఏడాది పడుతుంది

కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని అంచనా వేస్తున్నట్టు గ్రానైట్ ఎక్స్ పోర్టర్ శిద్దా శ్రీరంగనాథ్ అంటున్నారు. అది కూడా కూలీల కొరత తీరితేనే అంటున్నారాయన. ప్రస్తుతం చైనాలో పరిస్థితి సర్దుమణుగుతుందని చెబుతున్నారు.

"కొన్ని కంపెనీలు కూడా ఎగుమతులకు ముందుకొస్తున్నాయి. జూన్ తర్వాత మళ్ళీ ఎగుమతులు క్రమంగా పెరుగుతాయి. కానీ ఉత్పత్తికి అవకాశం కనిపించడం లేదు. సొంతూళ్లకు వెళ్లిపోయిన వలస కూలీలు మళ్లీ వస్తేనే సాధారణ పరిస్థితి వ‌స్తుంది. దానికి తగ్గట్టుగా ప్రయత్నించాల్సి ఉంటుంది. అయినా ఇంకా చాలా సమయం పడుతుందని భావిస్తున్నాం. క్వారీ పనుల్లో నైపుణ్యం ఉన్న వారి కొరత తీర్చేందుకు ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలి. అప్పటి వరకూ ఆర్డర్లు వచ్చినా, పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది"అని తెలిపారు.

గ్రానైట్ తవ్వకాలు

కూలీలు ఇప్పట్లో వస్తారని చెప్పలేం..

లాక్‌డౌన్ తదనంతర పరిస్థితుల్లో సొంతూళ్లకు వెళ్లిపోయిన కూలీలు అంత త్వరగా వెనక్కి వచ్చే అవకాశం లేదని చీమకుర్తికి చెందిన కూలీల మేస్త్రీ రామేశ్వర్ రావు అంటున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ "మేము ఒడిశాలోని బరంపూర్ ప్రాంతం నుంచి 200 మంది కూలీలను తీసుకొచ్చాం. వాళ్లంతా ఏప్రిల్ ఆఖరి వరకూ ఇక్కడే ఉన్నప్పటికీ పనులు లేకపోవడంతో వెళ్లిపోయారు. కొంతమందిని ఆదుకోవడానికి ప్రయాణ ఏర్పాట్లు చేశాం. కానీ అందరికీ సాధ్యం కాలేదు. దాంతో వాళ్లంతా మళ్లీ వెనక్కి రావడానికి సుముఖత చూపడం లేదు. పరిస్థితి సర్దుమణిగిన తర్వాత క్రమంగా వస్తారని భావిస్తున్నాం". అని తెలిపారు.

అన్ని చోట్లా నైపుణ్యం ఉన్న కూలీల కొరత

వలస కూలీలు తరలిపోవడంతో సాంకేతిక నైపుణ్యం ఉన్న వారి కొరత ఇతర పరిశ్రమల్లో కూడా కనిపిస్తోంది. కాకినాడ సమీపంలోని చ‌మురు పరిశ్రమల వద్ద కూడా అలాంటి పరిస్థితి ఉందని కార్మిక నాయకుడు మేడిశెట్టి రమణ తెలిపారు.

"చాలాకాలంగా పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు కూడా వెళ్లిపోవడంతో ఒక్కసారిగా సమస్యలు వస్తున్నాయి. ఉన్న ఒకరిద్దరితోనే ఇప్పుడు నడుపుతున్నారు. ఉత్పత్తి సాధారణ స్థితికి తీసుకురావాలంటే అనుభవజ్ఞుల అవసరం ఉంది. వారు వస్తేనే ఉత్పత్తి పెంచడానికి వీలు ఉంటుంది" అని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని ప్రధాన పారిశ్రామిక వాడల్లో కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నేటికీ కొందరు సొంతూళ్లకు పయనమవుతున్న నేపథ్యంలో తిరిగి వారు పని ప్రాంతాలకు చేరడం ఇప్పట్లో సాధ్యమా అంటే సందేహంగానే కనిపిస్తోంది. త్వరలోనే పరిస్థితి సర్దుకుంటుందనే ఆశాభావంతో ఏపీ పరిశ్రమల శాఖ అధికారులున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)