తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’

- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
పంజాబ్‌లోని లూధియానాలోని ఒక ఫ్లై ఓవర్.. దాని దిగువన ఇళ్లు లేని కుటుంబాలు కొన్ని చాలాకాలంగా ఉంటున్నాయి.
రెండేళ్ల కిందట మాసిన గడ్డం, బేల చూపులతో సుమారు 55 ఏళ్ల వ్యక్తి ఒకరు వచ్చారక్కడికి.
అక్కడున్నవారు ఏమడిగినా మౌనమే అతని నుంచి సమాధానమైంది. అతనికి తమ భాష తెలియదని అక్కడివారికి అర్థమైంది మొదట.. ఆ తరువాత అసలు ఆయనకు మాటలే రావని, మూగవారని అర్థమైంది.
ఎక్కడివారో, ఎలా చేరారో చెప్పగలిగినంత తెలివితేటలు, లోక జ్ఞానమూ లేకపోవడంతో అక్కడే ఆ ఫ్లైఓవర్ కిందే వారిచ్చే గోధుమ రొట్టెలు తింటూ బతుకుతున్నారు.
కాలికి దెబ్బతగిలి నడవలేకపోవడంతో పనిచేయలేని దుస్థితి.
అసలే అక్కడున్నవారందరివీ అంతంతమాత్రం బతుకులు. కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఎవరికీ ఉపాధి లేకుండా పోయింది.
పంజాబ్‌లో కరోనావైరస్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన జిల్లాలు, నగరాల్లో లూధియానా కూడా ఒకటి.
లాక్‌డౌన్ ప్రకటించాకే అక్కడ తొలి కేసు నమోదైనప్పటికీ త్వరత్వరగా కేసుల సంఖ్య పెరగడంతో పాటు మృతుల సంఖ్యా పెరిగింది.
పంజాబ్‌లో ఇప్పటివరకు 40 మంది కరోనావైరస్ కారణంగా మరణించగా ఒక్క లూధియానాలోనే ఏడుగురు చనిపోయారు(మే 25.2020 నాటికి).
దేశంలో లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలవుతుండడంతో నిరుపేదలు, కార్మికులకు పూట గడవని దుస్థితి.
ప్రభుత్వం అందించే సహాయం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందించే ఆహారంపైనే ఆధారపడి రోజులీడుస్తున్నారు లక్షలాది మంది. లూధియానా ఫ్లైఓవర్ కింద నివసిస్తున్నవారూ దాతలు, స్వచ్ఛంద సంస్థలు అందించే ఆహారమే ఆధారంగా గడుపుతున్నారు.
అలా కొందరు దాతలు ఈ మూగ వ్యక్తికి రొట్టెలు ఇస్తుండగా గుర్ ప్రీత్ సింగ్ అనే మరో వ్యక్తి వీడియో తీసి దాన్ని టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు.
మార్చి చివరివారంలో ఆ వీడియో టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు.
లాక్‌డౌన్ కాలంలో పేదల కష్టాలు కానీ, టిక్‌టాక్‌లో ఎందరో ఔత్సాహికులు రకరకాల వీడియోలు పోస్ట్ చేయడం కానీ కొత్తేమీ కాదు.
కానీ, ఈ గుర్‌ప్రీత్ సింగ్ పోస్ట్ చేసిన ఈ టిక్‌టాక్ వీడియో ఒకటిన్నర నెలల తరువాత లూధియానాకు సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణలోని ఒక చిన్న ఊరిలోని కుటుంబానికి ఒక్కసారిగా పోయిన ఆశను తిరిగిచ్చింది.
రెండేళ్ల కిందట కనిపించకుండా పోయి ఏమయ్యారో, అసలున్నారో లేదో తెలియకుండా పోయిన వ్యక్తి కుటుంబంలో సంతోషం నింపింది.
రెండేళ్లుగా ఎదురుచూస్తున్న భార్య, అయిదుగురు పిల్లలకు ఆనందం కలిగించింది.
తప్పిపోయిన ఆ వ్యక్తి రొడ్డా వెంకటేశ్వర్లు. తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పినపాక ఆయనది. భార్య, అయిదుగురు పిల్లలు ఉన్నారు.
ఆ రొడ్డా వెంకటేశ్వర్లే రెండేళ్లుగా లూధియానాలో అనాథలా దాతల దయతో బతుకుతున్నారు.

రెండేళ్ల కిందట ఎలా తప్పిపోయారంటే..
వెంకటేశ్వర్లుకు మాటలు రావు. పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోసిస్తుండేవారు.రెండేళ్ల కిందట ఆయన కనిపించకుండాపోయారు.
ఇప్పుడు లూధియానాలో దొరికిన ఆయన్ను కుమారుడు రొడ్డా పెద్దిరాజు కలుసుకున్నారు.
తండ్రితో మాట్లాడిన తరువాత మొత్తం వివరాలు తెలుసుకున్న ఆయన తన తండ్రి ఎలా తప్పిపోయారు.. ఆ తరువాత ఎలాంటి కష్టాలు పడ్డారన్నది ‘బీబీసీ’కి వివరించారు.
‘‘నాన్న 2018 ఏప్రిల్ 27న పని కోసం పినపాక నుంచి వెళ్లారు. వేరే ప్రాంతానికి వెళ్లడం కోసం లారీ ఎక్కారు. అందులోనే నిద్రపోవడం.. లారీ డ్రైవరు లేపకపోవడంతో తెలంగాణ దాటి వెళ్లిపోయారు.
అక్కడ లారీ డ్రైవరు దిగమని బలవంతం చేయడంతో దిగిపోయిన నాన్నకు అక్కడి ప్రాంతం కానీ, భాష కానీ తెలియదు.
దాంతో మళ్లీ మరో లారీ ఎక్కారు. అది కూడా తెలంగాణకు వచ్చే లారీ కాదు.. నాన్నకు మాటలు రాకపోవడంతో ఆయన చెప్పింది లారీ వాళ్లకు అర్థం కాలేదు. వాళ్లు కూడా తమతో కొంత దూరం వెళ్లాక దించేశారు.
అలా ఆయన లూధియానా చేరుకున్నారు’’ అని పెద్దిరాజు చెప్పారు.
లూధియానాలో ఏం జరిగింది?
ఎన్నడూ పాత ఖమ్మం జిల్లా దాటి వెళ్లడం తెలియని వెంకటేశ్వర్లు లూధియానాలో లారీ దిగాక అయోమయానికి గురయ్యారు.
ఏం చేయాలో.. ఎలా తన సొంతూరికి చేరుకోవలో.. ఎవరిని కలవాలో ఏమీ తెలియక అక్కడే తిరుగుతుండేవారు.
తిండానికి తిండి, ఉండడానికి చోటు లేకపోవడంతో తిరుగుతూ తిరుగుతూ ఒక ఫ్లై ఓవర్ వద్దకు చేరుకున్నారు.
అక్కడున్నవారు వెంకటేశ్వర్లు పరిస్థితిని గమనించి తమతో పాటు రోజూ తిండి పెట్టేవారని.. అలా ఈ రెండేళ్లు తమ తండ్రి లూధియానాలోనే ఉన్నారని పెద్దిరాజు చెప్పారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా..
తండ్రి కనపడకపోవడంతో రెండుమూడు రోజులు చూసి తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని.. వారు కొన్నాళ్లపాటు కేసు దర్యాప్తు చేసినా ఎలాంటి ఆధారం లేకపోవడంతో ఫలితం లేకపోయిందని పెద్ది రాజు చెప్పారు.
దాంతో తమ తండ్రి ఎక్కడున్నారో, ఏమయ్యారో తెలియక ఇంటిల్లిపాదీ దిగులుపడిపోయామని అన్నారు.
అలా రెండేళ్లు గడిచిపోయాక.. వారం రోజుల కిందట మే 18న టిక్‌టాక్‌లో వీడియోలు చూస్తుండగా ఒక వీడియోలో ఇద్దరు వ్యక్తులు రొట్టెలు పంచుతుండడం కనిపించిందని.. అందులో రొట్టెలు అందుకుంటున్న వ్యక్తి తమ తండ్రిలా కనిపించడంతో మళ్లీమళ్లీ ఆ వీడియో చూసి అది తమ తండ్రేనని నిర్ధారించుకున్నామని చెప్పారు పెద్దిరాజు.
‘ఏడుపొచ్చేసింది..’
‘‘నాన్నను ఆ పరిస్థితుల్లో చూసేసరికి కంట్లో నీళ్లు తిరిగాయి. ఏడుపొచ్చేసింది. నేనుండేది హైదరాబాద్‌లో. ఐఐఎల్‌లో పనిచేస్తాను.
వెంటనే నాకు తెలిసిన కొందరితో, మా అధికారులతో ఈ విషయం పంచుకున్నాను.
పరిచయస్థులు, ఐఐఎల్ అధికారులు సహకరించారు. వారికున్న పరిచయాలతో లూధియానాలో మార్కెటింగ్ రంగంలో పనిచేస్తున్న జస్‌ప్రీత్ సింగ్‌కు ఈ వీడియో పంపించారు.
టిక్‌టాక్ చేసిందెవరో గుర్తించి ఆయన్నూ కాంటాక్ట్ చేశారు. మొత్తానికి లూధియానాలో నాన్న ఎక్కడున్నారో గుర్తించారు.
వీడియో కాల్ చేసి నాన్నను నాకు.. నాన్నకు నన్ను చూపించారు. నన్ను చూడగానే నాన్న ఏడుపు ఆపుకోలేకపోయారు. వెంటనే వచ్చేయమంటూ సంజ్ఞలు చేశారు.
ఆ తరువాత జస్‌ప్రీత్ సింగ్ ఈ వారం రోజులు నాన్నను తనతోనే ఉంచుకుని ఆయన బాధ్యత చూసుకున్నారు. నేను అక్కడికి వెళ్లగానే నాకు అప్పగించారు. ఈ విషయంలో లూధియానా పోలీసులూ సహకరించారు’’ అని చెప్పారు.

లాక్‌డౌన్‌లో లూధియానా నుంచి తీసుకురావడం ఎలా?
‘‘టిక్ టాక్ వీడియోలో నాన్నను చూడగానే బూర్గంపాడు పోలీసులను సంప్రదించాం. గతంలో వారు తమ తండ్రి మిస్సింగ్ కేసు దర్యాప్తు చేయడంతో ఇది ఆధారంగా పనికొస్తుందని వారిని కలిశాం. వెంటనే వారు స్పందించారు.
ఎస్‌ఐ, జిల్లా ఎస్పీ ద్వారా లూధియానా పోలీసులను కాంటాక్ట్ చేశారు.
లాక్‌డౌన్ ముగిశాక వెళ్లాలన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేసినా అప్పటివరకు ఆగితే మళ్లీ ఇంకేమవుతుందోనన్న ఆందోళనతో మేం వెంటనే వెళ్లాలనుకుంటున్నామని చెప్పాం.
దాంతో పోలీసు అధికారులు ట్రావెల్ పాస్‌లు జారీ చేశారు. నేను కారులో బయలుదేరి ఆదివారం లూధియానా చేరుకున్నాను.
నేను వెళ్లగానే జస్‌ప్రీత్ సింగ్ నన్ను కలిశారు. స్థానిక పోలీసులు, జస్ ప్రీత్ సింగ్ నాన్నను నాకు అప్పగించారు’’ అని మొత్తం కథను పెద్దిరాజు చెప్పారు.
‘రెండేళ్లుగా అన్నం లేదు.. ఇంటికెళ్లగానే అన్నం తినిపిస్తా’
బీబీసీ సోమవారం ఫోన్ చేసినప్పటికి రొడ్డం వెంకటేశ్వర్లు, పెద్దిరాజులు ప్రయాణిస్తున్న కారు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రాంతంలో ఉంది.
తాము ఇంటికి చేరుకునే సరికి మంగళవారం అవుతుందని అన్నారు పెద్దిరాజు.
‘‘పుట్టి బుద్దెరిగినప్పటి నుంచి మా ప్రాంతం దాటికి ఎక్కడికీ వెళ్లని నాన్న ఊహించని రీతిలో పంజాబ్ వెళ్లిపోయారు.
భాష, భోజనం అన్నీ ఆయనకు కొత్తే. అలాంటి చోట రెండేళ్లుగా అన్నం లేకుండా అక్కడి ఆహారమైన గోధుమ రొట్టెలే తిన్నారు.
ఇంటికి చేరగానే అమ్మ వేడివేడి అన్నం వడ్డిస్తే నాన్నకు తినిపిస్తాను’’ అన్నారు పెద్దిరాజు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్ లిపులేఖ్ మ్యాప్ వివాదంపై మనీషా కోయిరాలా ట్వీట్‌కు సుష్మా స్వరాజ్ భర్త ఎలా సమాధానం ఇచ్చారు?
- చైనాతో సరిహద్దు.. 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది?
- సైక్లోన్ ఆంఫన్: కోల్‌కతాలో విలయం సృష్టించిన తుపాను
- టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి? వివాదం ఏంటి?
- కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు.. నాలుగు దేశాల్లోనే అత్యధికం
- కరోనావైరస్: రోజూ నలుగురు వలస కార్మికులు చనిపోతున్నారు... లాక్‌డౌన్‌లో పెరుగుతున్న పేదల మరణాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








