కరోనావైరస్: రోజూ నలుగురు వలస కార్మికులు చనిపోతున్నారు... లాక్‌డౌన్‌లో పెరుగుతున్న పేదల మరణాలు

- రచయిత, శాదాబ్ నజ్మీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మార్చి 24 నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన అనేక రోడ్డు ప్రమాదాలు వలస కూలీల ప్రాణాలు తీశాయి.
మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం తమ సొంతూళ్లకు నడిచి వెళ్తున్న వలస కార్మికులు కూడా ఈ రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు.
అత్యవసర సేవల వైద్య విభాగం అందించిన సమాచారం ప్రకారం మొదటి లాక్ డౌన్ కాలంలో సుమారు 208 మంది మరణించారు.
కరోనావైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకూడందన్న ఉద్ధేశంతో లాక్ డౌన్ విధించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, భౌతిక దూరాన్ని తప్పని సరిగా పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. కానీ హఠాత్తుగా ఆయన చేసిన ప్రకటనతో వందల సంఖ్యలో వలస కార్మికులు ఎలాగోలా తమ సొంతూళ్లకు వెళ్లిపోవాలనుకున్నారు.

2020 మార్చి 29 వరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కోవిడ్-19కారణంగా 25 మంది చనిపోగా, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య సేవలు అందకపోవడం వల్ల 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
అదే మే 20 నాటికి వచ్చేసరికి రోడ్డు ప్రమాదాలు లేదా సుదూర తీరాలకు నడవలేక అలసి పోయి మార్గ మధ్యంలోనే మరణించిన వారి సంఖ్య 200కి పైగానే ఉంది.

వివిధ మీడియాల్లో వచ్చిన కథనాలను బీబీసీ పరిశీలించింది. మొత్తం మరణాల్లో 42 కేసులు రోడ్డు ప్రమాదాలకు సంబంధించినవి కాగా, 32 మంది నడిచి నడిచి తీవ్రంగా అలసిపోయి సమయానికి అత్యవసర వైద్యం అందక మరణించారు.
లాక్ డౌన్ ప్రకటన మొదలైనప్పటి నుంచి 5 రైలు ప్రమాదాలు జరిగాయి. అయితే చాలా మంది రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారని మా విశ్లేషణలో తేలింది.
రోడ్డు ప్రమాదాల తర్వాత వేల కిలోమీటర్ల దూరం నడవటం వల్లే మెజార్టీ మరణాలు సంభవించాయి. విపరీతమైన అలసట, నిస్సత్తువ కారణంగా చనిపోయిన వారిలో వృద్ధుల నుంచి యవకుల వరకు అన్ని వయసుల వారు ఉన్నారు.

ఫొటో సోర్స్, BBC/GOPAL SHOONYA
65 ఏళ్ల రామ్ కృపాల్ ముంబై నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
మొత్తం 1500 కిలోమీటర్ల దూరాన్ని కొంత వరకు నడిచి మరి కొంత ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వడం ద్వారా ప్రయాణించినప్పటికీ తన సొంత ఊరు చేరుకునే మార్గంలో తీవ్రమైన అలసటకు గురై ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలోని ములుగు జిల్లా పేరూరు గ్రామం నుంచి తన సొంతూరు వెళ్లాలనుకున్న 12 ఏళ్ల చిన్నారి దట్టమైన అడవుల గుండా సుమారు మూడు రోజుల పాటు వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన తర్వాత ఛత్తీస్‌ఘడ్‌లోని బీజ్‌పూర్ చేరుకునేసరికి ప్రాణాలు కోల్పోయారు.
లాక్ డౌన్ ప్రకటించక ముందు తన మామయ్య సహా 13 మందితో కలిసి మిరప పొలాల్లో పని చేసేందుకు ఆమె వెళ్లారు.

ఫొటో సోర్స్, BBC/GOPAL SHOONYA
రైలు ప్రమాదాలు
మే నెల ప్రారంభంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో 16 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక కథనం ప్రకారం 40 కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత అలసిపోయిన కూలీలు కర్మదా స్టేషన్ సమీపంలో ఆగిపోయారు. అప్పటికే లాక్ డౌన్ కారణంగా రైళ్లు ఆగిపోవడంతో అవి రావనుకొని ట్రాక్ పై నిద్రించారు.
కానీ ఓ గూడ్సు రైలు వారి మీద నుంచి వెళ్లిపోవడంతో 20 మందిలో 16 మంది మరణించారు.
ఈ ప్రమాదం జరిగిన తర్వాత ట్విట్టర్లో ద్వారా తీవ్ర విచారాన్ని వెలిబుచ్చిన ప్రధాని మోదీ.. వారికి అసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
మరో ఘటనలో ఇద్దరు వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. తమ సొంతూరికి కాలి నడకన వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో సరుకు రవాణా రైలు వారిపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే వారు చనిపోయారు. ఈ దుర్ఘటన ఏప్రిల్‌లో జరిగింది. మార్చి మొదటి వారంలో కూడా గుజరాత్‌లోని వాపి జిల్లాలో సరుకు రవాణా చేసే రైలు ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
(ఈ కథనంలో పేర్కొన్న ప్రతి ఘటన కనీసం రెండు మీడియా నివేదికలతో నిర్ధారించినవని గమనించగలరు.)
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- 'కరోనావైరస్ ప్రభావంతో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది... రుణాలపై ఆగస్ట్ 31 వరకూ మారటోరియం' - ఆర్బీఐ గవర్నర్
- దిల్లీ - హైదరాబాద్/వైజాగ్ విమాన ప్రయాణం ఛార్జీ కనిష్ఠం రూ.3,500, గరిష్ఠం రూ.10 వేలు
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
- కరోనా లాక్డౌన్: 200 ప్రత్యేక రైళ్లకు నేటి నుంచి బుకింగ్ ప్రారంభం... తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే
- వీడియో, ఇండియా లాక్డౌన్: 18 నెలల శిశువుతో 2 వేల కి.మీ. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు, 4,29
- కరోనావైరస్కు తుపాను కూడా తోడైతే సామాజిక దూరం పాటించడం ఎలా
- కరోనావైరస్: తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ టెస్టులు తక్కువగా చేస్తోందా... పాజిటివిటీ రేటు ఎందుకు ఎక్కువగా ఉంది?
- 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది
- వీడియో, కరోనా కాలంలో సెక్స్ వర్కర్ల ఆకలి కేకలు వినేదెవరు, 3,18








