క‌రోనావైర‌స్‌-తెలంగాణ: భర్త మృతి.. భార్యకు చెప్పకుండానే అంత్యక్రియలు చేసిన పోలీసులు

తెలంగాణ
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో కోవిడ్-19 మరణాల విషయంలో వివాదాలు వస్తున్నాయి. క‌రోనావైర‌స్ మృతుల బంధువులు ట్విట‌ర్‌ వేదికగా ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.

తన బాబాయ్ మరణాన్ని ప్రభుత్వం ప్రెస్ నోట్లో పెట్టలేదని ఆదిత్య అనే వ్యక్తి గతంలో ప్రశ్నించారు. చనిపోయిన సమయం వల్ల అది తరువాత రోజు ప్రెస్ నోట్లో వచ్చిందంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

తాజాగా మరో మహిళ తన భర్త బతికున్నారో లేదో చెప్పాలంటూ ట్విటర్‌లో కేటీఆర్‌ను ప్రశ్నించారు.

వనస్థలిపురానికి చెందిన అల్లంపల్లి మాధవి భర్త, 42 ఏళ్ల మధుసూదన్.. మలక్ పేటలో నూనె వ్యాపారం చేస్తారు. ఆయనకు, సోద‌రుడి ద్వారా క‌రోనావైర‌స్‌ సోకింది. త‌ర్వాత‌ కుటుంబం మొత్తానికి ఇన్ఫెక్ష‌న్‌ వచ్చింది.

మాధవి చేసిన ట్వీట్

ఫొటో సోర్స్, twitter/AlampallyMadha3

"వెంటిలేటర్‌పై ఉన్నాడని చెప్పారు’’

‘‘నా భర్తను ఏప్రిల్ 27న కోఠి ఆసుపత్రిలో చేర్చారు. తరువాత ఏప్రిల్ 30న గాంధీ ఆసుపత్రికి మార్చారు. మే 1న నా భర్త మరణించినట్టు, మే2న అంత్యక్రియలు జరిపినట్టు చెబుతున్నారు’’

‘‘కానీ మా అనుమతి తీసుకోలేదు. మాకు ఆయ‌న్ను చూపించలేదు. వీడియో లేదా ఫోటో సాక్ష్యం లేదా ఆయ‌న‌ వస్తువులు చూపించమని అడగ్గా స్పందించలేదు’’.

‘‘నేను, నా కుటుంబ సభ్యులు మే 16న డిశ్చార్జి అయ్యాం. నా భర్త గురించి అడిగితే.. ఆయన వెంటిలేటర్ పై ఉన్నారని చెప్పారు. ఒకసారి ఆయ‌న‌ బతికున్నాడనీ, మరోసారి చనిపోయాడనీ చెబుతున్నారు. మీరు నా భర్త ఆచూకీ కేసులో సాయం చేగలరు’’ అంటూ ట్వీట్ చేశారు మాధవి. ఈ ట్వీట్ బాగా వైర‌ల్ అయ్యింది.

‘‘మా మామగారు కోవిడ్-19తో చనిపోయారు. అప్పుడు మా అత్తగారికి చూపించారు. నేను మే 1వ తేదీ మధ్యాహ్నం 12.30 వరకూ నా భర్తతో మాట్లాడాను. అదే రోజు రాత్రి 7.30కి మా చుట్టుపక్కల వాళ్లు నాకు ఫోన్ చేసి నా భర్త మరణించారని చెప్పారు. డాక్టర్లను అడిగితే వెంటిలేటర్ పై ఉన్నారు అని చెప్పారు. మీరు ముందు కోలుకోండి. మీతో పాటూ ఆయనా వస్తాడు అన్నారు. రకరకాలుగా చెప్పారు’’ అంటూ బీబీసీకి వివరించారు మాధవి.

మాధవి చేసిన ట్వీట్

ఫొటో సోర్స్, twitter/AlampallyMadha3

అంత్యక్రియలకు అనుమతి అక్కర్లేదా?

‘‘నా భర్త అంత్యక్రియలు చేశాము అంటున్నారు. కనీసం నా అనుమతి తీసుకోలేదు. అసలు ఆ వ్యక్తి నా భర్తో కాదో గుర్తించకుండా ఎలా చేశారు? ఫోటోలు, వీడియో, చివ‌రికి సీసీటీవీ ఫుటేజ్ అయినా ఉందా’’ అని ప్రశ్నిస్తున్నారు మాధవి.

‘‘అసలు నేను ఆసుపత్రికి ఎలా వెళ్లానో అలానే వచ్చాను. చాలా వైర‌స్ ల‌క్ష‌ణాలు నాలో చాలా తక్కువ క‌నిపించాయి. నాకెప్పుడూ సీరియస్ కాలేదు. నా భర్త సంపూర్ణ ఆరోగ్య వంతుడు. ఆయనకు ఎలా సీరియస్ అవుతుంది. ఇవన్నీ సరే, నిజంగా నా భర్త చనిపోతే నాకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి’’.

గాంధీ హాస్పిటల్

ఫొటో సోర్స్, TSMSIDC

"నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే చేశాం"

మాధవి ట్విట్టర్ పోస్టుపై గాంధీ ఆసుపత్రి వైద్యులు స్పందించారు.

‘‘మధుసూదన్ ఏప్రిల్ 30న‌ రాత్రి 7.45కి గాంధీలో చేరారు. అప్పటికి ఆయన పరిస్థితి సీరియస్ గా ఉంది. (బైలేటరల్ న్యూమోనియా విత్ ఏఆర్డీఎస్). మేం ప్రయత్నించాం కానీ ఆయన్ను కాపాడలేకపోయాం. మే 1 సాయంత్రం 6.03 నిమిషాలకు ఆయన మరణించారు’’ అని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజా రావు పేరిట ప్రకటన విడుదల అయింది.

‘‘మేం పద్ధతి ప్రకారం కుటుంబ సభ్యులకు చెప్పాం. నిబంధనల ప్రకారం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించాం. పోలీసులు కుటంబ సభ్యులకు అప్పగించాలి. ఒకవేళ కుటుంబ సభ్యులు ముందుకురాకపోతే అప్పుడు జీహెచ్ఎంసీ అంత్యక్రియలు నిర్వహించాలి’’.

‘‘ఈ కేసులో కూడా శరీరాన్ని పోలీసులకు అప్పగించి సంతకం తీసుకున్నాం. జీహెచ్ఎంసీ అంత్యక్రియలు నిర్వహించినట్టు మాకు విచారణలో తెలిసింది. తరువాత వారి ఇతర కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ తో గాంధీలో చేరారు. అన్నీ పద్ధతులూ పాటించాం. మాకు ఆ కుటుంబంపై సానుభూతి ఉంది. కానీ ఆసుపత్రి, వైద్యులను తప్పుపట్టడం సరికాదు’’.

ఒక అధికారి ద్వారా, గాంధీలో కోవిడ్ మరణాల రిజిష్టర్‌లోని మే 1వ తేదీ ఫోటో చూసింది బీబీసీ. అందులో మే 1న నలుగురు చనిపోయినట్టు రికార్డు ఉంది. మూడో పేరుగా 42 ఏళ్ల‌ మధుసూదన్ అనే పేరు ఉంది. ఆ పక్కనే కానిస్టేబుల్ పేరు, స్టేషన్, సెల్ నంబర్ ఉన్నాయి.

దీనిపై వనస్థలిపురం పోలీసు స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్, సంబంధిత కానిస్టేబుల్‌ను బీబీసీ సంప్రదించింది. అయితే, వారు ఈ వ్యవహారంపై స్పందించలేదు.

మాధవి మాత్రం తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ తన భర్త మరణం గురించి చెప్పలేదని స్పష్టం చేశారు.

‘‘నా కుటుంబ సభ్యులకు చెప్పాం అంటున్నారు. ఆ కుటుంబ సభ్యులు ఎవరో పోలీసులు చెప్పాలి’’ అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)