గ్లోబల్ వార్మింగ్: ఈ 5 పనులూ చేయండి.. భూ తాపాన్ని మీరూ తగ్గించండి

పోలార్ ఎలుగుబంటి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్లోబల్ వార్మింగ్ మరో 12 ఏళ్లలో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరుగుతుందని ఐపీసీసీ చెబుతోంది

భూమిపై అంతకంతకూ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోడానికి ప్రపంచం వేగంగా స్పందించాలి. కానీ ప్రపంచం అంటే మరెవరో కాదు... మనమే.

మానవుడు గ్లోబల్ వార్మింగ్ ఎలా తగ్గించగలడు?

భూతాపం తగ్గించడం మనవల్లే సాధ్యం అంటున్నారు నిపుణులు. సింపుల్‌గా ఐదు పద్ధతులు పాటిస్తే చాలు గ్లోబల్ వార్మింగ్ ప్రమాదకర స్థాయికి చేరకుండా పరిమితం చేయవచ్చు అంటున్నారు.

"తక్షణం చేయండి లేదా పెను ముప్పు ఎదుర్కోండి"

భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రపంచంలోని చాలామంది ప్రముఖ పర్యావరణవేత్తలు ఇలాంటి హెచ్చరికలే చేస్తున్నారు.

వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్న ఐక్యరాజ్యసమితి 'ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్'(ఐపీసీసీ) భూమి ఉపరితల ఉష్ణోగ్రత 12 ఏళ్లలో పారిశ్రామిక విప్లవం ముందు ఉన్నప్పటి దాని కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరవచ్చని తెలిపింది.

భూతాపం ఆ స్థాయికి పెరిగితే అది తీవ్రమైన కరువు, కార్చిచ్చు, వరదలు లాంటి అసహజ వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేస్తుంది. లక్షలాది మందికి ఆహారం కొరత ఏర్పడేలా చేస్తుంది.

భూమి ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరుకోకుండా ఉండాలంటే ప్రపంచంలో అందరూ ఎక్కువ కాలం పాటు ఉండే మార్పులు ఇప్పటి నుంచే చేయడం అవసరమని చెప్పింది.

భూతాపం తగ్గించడానికి మనమేం చేయగలం?

భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటకుండా దానిని వేగంగా అదుపు చేయడంలో పౌరులు, వినియోగదారులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు.

ఈ నివేదిక రూపొందించిన రచయిత ఆరోమర్ రేవీ "మనం చాలా మామూలుగా చేసే పనుల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు, భూతాపాన్ని చాలావరకూ పరిమితం చేయవచ్చని" అంటున్నారు.

రోజువారీ కార్యకలాపాల్లో మనం చేసుకోవాల్సిన కొన్ని మార్పులను ఆయన సూచించారు.

Aerial view of Dubai Highway

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నగరాలలో ప్రజా రవాణాను ఉపయోగించాలి

1.ప్రజా రవాణాను ఉపయోగించండి

కారు ఉపయోగించకుండా నడిచి వెళ్లడం, లేదా సైకిలుపై వెళ్లడం, అది కూడా కుదరకపోతే ప్రజా రవాణాను ఉపయోగించడం చాలా మంచిది.

ఇలా చేయడం వల్ల మనం ఫిట్‌గా ఉండడంతోపాటు కర్బన ఉద్గారాలు విడుదల కావడం కూడా తగ్గుతుంది.

నగరాల్లో ఎక్కడికి ఎలా వెళ్లాలి అనే దారులు మనమే ఎంచుకోవచ్చు.

"ప్రజా రవాణాను ఉపయోగించే అవకాశం లేకుంటే, మనం ఎన్నుకునే రాజకీయ నాయకులే మనకు ఆ అవకాశాలు అందించేలా చూసుకోవాలి" అని ఐపీసీసీ కో-ఛైర్మన్ అంటారు.

మీరు కచ్చితంగా వెళ్లాల్సి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించండి. మీ దూర ప్రయాణాలకు విమానాలకు బదులు రైళ్లు ఎంచుకోండి.

వ్యాపార పర్యటనలు రద్దు చేసుకోవడానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండండి. దానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ పనులు పూర్తి చేయండి.

Spectacular aerial view of a solar thermal power plant station in Nevada desert, USA.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం పెరగాలి

2.విద్యుత్ ఆదా చేయండి

శిలాజ ఇంధనాలు, విద్యుత్ ఆదా చేయాలి.

బట్టలు ఆరేయడానికి వాషింగ్ మెషిన్ డ్రయ్యర్ ఉపయోగించడం కంటే ఒక తాడుపై వాటిని ఆరేయడం మంచిది.

చల్లబడడానికి ఏసీని ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం, వేడెక్కడానికి హీటర్లను తక్కువ ఉష్ణోగ్రతలో ఉపయోగించడం వల్ల కూడా చాలా విద్యుత్ ఆదా అవుతుంది.

చలికాలాల్లో ఇంట్లో వేడిని కోల్పోకుండా మీ పైకప్పుకు ఫైబర్ లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి వాటితో మరింత రక్షణ కల్పించడం మంచిది. దానివల్ల విద్యుత్ ఉపకరణాలపై ఆధారపడడం తగ్గుతుంది.

ఏవైనా విద్యుత్ పరికరాలను ఉపయోగించనప్పుడు వాటి స్విచ్ ఆఫ్ చేయండి. ప్లగ్ నుంచి తీసివేయండి.

Close-up of a man setting his dishwasher on the eco cycle

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అనవసర విద్యుత్ వినియోగం తగ్గించాలి

ఇవి మీకు చిన్న చిన్న మార్పుల్లాగే కనిపించవచ్చు, కానీ విద్యుత్ ఆదాకు ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయి

ఈసారీ మీరు బయట ఏదైనా విద్యుత్ పరికరం కొంటున్నప్పుడు, దాని 'ఎనర్జీ ఎఫిషియన్సీ' చెక్ చేయండి.( ఎనర్జీ ఎఫిషియన్సీ లేబుల్ చూడండి)

కొన్ని అవసరాల కోసం మీరు సోలార్ వాటర్ హీటర్, సోలార్ గీజర్ లాంటి 'పునరుత్పాదక శక్తి వనరులు' కూడా ఉపయోగించవచ్చు.

Switch to organic food and consume more local produce

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాంసం తగ్గించి కూరగాయలు, పండ్లు ఎక్కువ తినాలి

3.మాంసం తగ్గించండి.. వీగన్‌ అయితే మరీ మంచిది

పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యం ఉత్పత్తి కంటే మాంసం ఉత్పత్తి వల్ల గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువగా విడుదలవుతాయి.

ప్యారిస్ పర్యావరణ సదస్సులో వ్యవసాయరంగంలో ఉద్గారాలు తగ్గిస్తామని 119 దేశాలు ప్రమాణం చేశాయి. కానీ ఎలా చేస్తామనే విషయం మాత్రం అవి చెప్పలేదు.

కానీ దానికి మీరు సాయం చేయవచ్చు.

మాంసం తినడం తగ్గించండి. దాని బదులు మరిన్ని కూరగాయలు, పండ్లు తినండి

పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడాన్ని తగ్గించడం వల్ల, వీగన్‌గా మారడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి.

పాల ఉత్పత్తుల తయారీ వల్ల, వాటిని సుదూర ప్రాంతాలకు రవాణా చేయడం వల్ల ఎన్నో గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతున్నాయి.

పాల ఉత్పత్తులకు బదులు స్థానికంగా ఆయా కాలాలను బట్టి దొరికే ఆహార పదార్థాలను ఎంచుకోవడం మంచిది.

Water being poured on children's hands.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీళ్లు కూడా రీసైకిల్ చేయాలి

4.నీళ్లైనా సరే మళ్లీ ఉపయోగించండి

రీసైక్లింగ్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.

కానీ రీసైకిల్ చేసే పదార్థాలను రవాణా చేయడం, వాటిని ప్రాసెసింగ్ చేయడం అనే ప్రక్రియతో కూడా కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి.

ఒక ఉత్పత్తిని ముడిపదార్థాల నుంచి చేయడం కంటే, దానిని రీసైకిల్ చేయడానికి చాలా తక్కువ విద్యుత్ వినియోగించవచ్చు.

ఇలా ఉత్పత్తి తగ్గించి, వస్తువులను మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల వనరుల నష్టం తగ్గించడానికి సాయం చేయచ్చు.

నీళ్లైనా సరే ఇదే విషయం వర్తిస్తుంది.

"మనం వర్షపు నీటిని సేకరించాలని అనుకున్నప్పుడు, వాటిని కచ్చితంగా సంరక్షించాలి, మళ్లీ, మళ్లీ వినియోగించాలి" అని ఆరోమర్ రెవి చెబుతారు.

Cute little girls being taught how to recycle plastic bottles by her father

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చిన్నతనం నుంచే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం నేర్పాలి

5.మిగతా వారిలో చైతన్యం తీసుకురండి

ప్రపంచంలో పర్యావరణ మార్పుల గురించి, భూతాపం గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పండి.

ఒక స్థిరమైన జీవితం గడిపేలా అందరూ కలిసి చర్చించుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయండి.

పంటల పద్ధతులు, విద్యుత్ ఆదా చిట్కాలు, రీసైకిల్ ప్రయోజనాలు లాంటివి అందరికీ తెలిసేలా 'షేర్డ్ నెట్‌వర్క్' గ్రూపులు ఏర్పాటు చేయండి.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఇలాంటి చిన్న చిన్న మార్పులను ప్రతి రోజూ పాటిస్తే.. అది వారి సంక్షేమంపై చాలా ప్రభావం చూపిస్తుంది. అభివృద్ధి స్థిరంగా ఉండేలా చేస్తుంది.

భూతాపం తగ్గించడానికి, రాబోవు తరాలకు మెరుగైన, సురక్షితమైన భవిష్యత్తు అందించడానికి సాయం అవుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)