కేసీఆర్ వర్సెస్ ప్రజా కూటమి: పై చేయి ఎవరిది? - ఎడిటర్స్ కామెంట్

ఫొటో సోర్స్, Facebook/TelanganaCMO
- రచయిత, జి.ఎస్.రామ్మోహన్
- హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు
ప్రచారం ముగిసింది, పోలింగ్ మిగిలింది. వాదనలు ముగిశాయి, తీర్పు మిగిలింది. అదేదో సినిమా డైలాగు మాదిరి వార్ వన్ సైడే అనుకున్న వాతావరణాన్ని ప్రజాకూటమి గట్టిపోటీ అనే స్థాయికి మార్చగలిగింది. అన్ని ఏర్పాట్లు చేసుకుని ముందస్తు ఎన్నికలను తెచ్చిపెట్టిన తెలంగాణ రాష్ర్ట సమితి అభ్యర్థుల జాబితా ప్రకటనలోనూ ప్రచారంలోనూ ముందస్తుగానే ఉంది. కాంగ్రెస్‌లో వచ్చిన మార్పు మరీ ముఖ్యంగా కర్నాటక ఎన్నికల సందర్భంగా వారు చూపించిన చొరవ, వేగం తెలంగాణ ఎన్నికల్లోనూ కనిపించింది. ఎవరికి వారే ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకునే కాంగ్రెస్‌లో లుకలుకలు బయటపడకుండా ఈ మాత్రం ఐక్యత ప్రదర్శన మామూలు విషయమేమీ కాదు. ముందస్తు ప్రకటన నాటికి విపక్షాల ఐక్యతను గానీ ఇంత గట్టిపోటీని గానీ టిఆర్ఎస్ ఊహించి ఉండకపోవచ్చు.
మీడియా పాలిటిక్స్
ఎన్నికల ప్రచారం ఎంత ముమ్మరంగా ఎంత రసవత్తరంగా ఉండగలదో తెలుగు నేల మరోమారు దేశానికి చూపించింది. హామీల ప్రవాహంలోనే కాకుండా డబ్బు ప్రవాహంలోనూ అందరికన్నా ముందుంది. సామదానభేదదండోపాయాలు నాలుగు రూపాలూ ఎన్నికల్లో కనిపించాయి. ఎవరికి వీలైనంతగా వారు అవతలివారిని మానసికంగా దెబ్బకొట్టడానికి సర్వేలతో పాటు అన్ని పద్థతులనూ వాడుకున్నారు. ఎన్నికలకు ముందు కొన్ని మీడియా సంస్థల్లోకి కొత్త పెట్టుబడులొచ్చాయి. మూతపడే స్థితిలో ఉన్న కొన్ని సంస్థలకు కొత్త యాజమాన్యాలొచ్చాయి. ఎన్నికల సమయంలో ప్రజల చేతుల్లోకి ఎంత డబ్బు చేరుతుందో ఏమో తెలీదు కానీ మీడియా సంస్థల్లోకి అయితే చాలానే చేరుతుంది. అసలే అంతంతమాత్రంగా కొట్టుకులాడుతున్న కొన్ని మీడియా సంస్థలకు ఇదో ఇంధనం. ఇదంతా రాజమార్గం ద్వారానే రాదు. అడ్డదారులు అనేకం. ఆ మేరకు వాళ్ల కవరేజీలో మార్పులూ వచ్చాయి. ఏ మీడియా సంస్థ ఎటువైపు అనే స్థాయి నుంచి ''ఆ చానలా అదంతేలే. అది ఫలానా వాళ్లది కదా, ఫలానా పార్టీ కదా'' అనే స్థాయికి రచ్చబండ చర్చలు మారిపోయాయి. ఇది మామూలుగా ఆయా సంస్థల విశ్వసనీయతను మాత్రమే కాకుండా మొత్తంగా మీడియా విశ్వసనీయతను దెబ్బతీసేవిధంగా మారింది. ప్రతి మీడియా సంస్థనూ ప్రతి రాతనూ అనుమానంగా చూసే వాతావరణం ఏర్పడింది.

ఫొటో సోర్స్, Facebook/RevanthReddy
ఎన్నికల ప్రచార సరళిని అంచనా వేస్తే సంక్షేమ పథకాలమీద భారీ అంచనాలు పెట్టుకుని ముందస్తుగా ఎన్నికల బరిలోకి దిగారు కెసిఆర్. ముఖ్యంగా విద్యుత్, పెన్షన్లు, రైతుబంధు ఈ మూడు అంశాలూ టిఆర్ఎస్ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ వస్తే రాష్ర్టం అంధకారం అయిపోతుంది అని మ్యాపులు చూపిస్తూ చెప్పిన విషయం ఇపుడు టిఆర్‌ఎస్‌కు బాగా ఉపయోగపడింది. దేశమంతా విద్యుత్ పరిస్థితి మెరుగుపడింది, మీరు చేసింది ప్రత్యేకంగా ఏమీ లేదని విపక్షాలు అనొచ్చుగానీ దాన్నుంచి టిఆర్ఎస్ ఎంతో కొంత క్రెడిట్ తీసుకోకుండా అడ్డుకోలేవు. విద్యుత్ జనజీవితంలో అనుభవంలో ఉండే విషయం. అందుకే ప్రతి సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి మాటలను గుర్తుచేసి మరీ టిఆర్ఎస్ దాన్ని ప్రధానప్రచారాస్ర్తంగా మల్చుకుంది. నగదు పరిమితి పెంచిన ఆసరా పెన్షన్లు సరేసరి. నేరుగా రైతు జేబుల్లోకి ఏడాదికి ఎనిమిది వేలు పంపిస్తున్న రైతుబంధు పథకం గ్రామసీమల్లో ఓట్ల వెల్లువగా మారుతుందని టిఆర్ఎస్ ఆశిస్తున్నది. కౌలు రైతుల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ పథకం మీద టిఆర్ఎస్‌కు పెద్ద ఆశలే ఉన్నాయి. ఇక కల్యాణ్ లక్ష్మి/షాదీ ముబారక్, కెసిఆర్ కిట్లు, గొర్రెలు, చేపల పంపిణీ, లాంటి పథకాల జాబితా చాలానే ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంటింటి సర్వేలో వెల్లడైన వివరాల ఆధారంగా అన్ని లెక్కలూ వేసుకునే సంక్షేమ పథకాలను డిజైన్ చేసినట్టు అర్థమవుతోంది. రాష్ర్టంలోని ప్రజానీకంలో ఎక్కువ మంది జేబుల్లోకి ఏదో రూపంలో ఎంతో కొంత డబ్బు చేరింది కాబట్టి వారు తమకు అనుకూలంగా ఉంటారన్నది వారి అంచనా.
కొలువులు, కుటుంబపాలన, కౌలు రైతులు
కొలువులు, కుటుంబపాలన, కౌలు రైతులు ప్రధానాస్ర్తాలుగా ప్రధాన ప్రతిపక్షాల ప్రజాకూటమి ప్రచార రంగంలో వేడిపుట్టించింది. రాహుల్, చంద్రబాబు ప్రచారం నిర్వహించిన తీరు కూటమిలో కొత్త ఉత్సాహమైతే నింపింది. అంతర్గత విభేదాలు ఎక్కడా బయటపడకుండా ఎన్నేళ్లనుంచో కలిసి కాపురం చేస్తున్న వాళ్లలాగా వేదికమీద కనిపించే ప్రయత్నం చేశారందరూ. మీ కుటుంబానికి ఇన్ని కొలువులున్నాయి, కొట్లాడిన వాళ్లకేవీ అంటూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఉపాధి విషయంలో తగినంతగా చేయలేదని యువతలో ఉన్న అసంతృప్తిని టాప్ చేయడానికి తగినంత ప్రయత్నమైతే చేశారు. కుటుంబపాలన గురించి అదే పనిగా మాట్లాడడం ద్వారా కెసిఆర్‌ది దొర తరహా ఫ్యూడల్ పాలన అని నొక్కి చెప్పడం ద్వారా పట్టణ మధ్యతరగతిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తల్లీ కుమారుడు వేదిక పంచుకుంటూ కుటుంబపాలన గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం ఏమిటని మోదీ మరోవైపు విరుచుకుపడ్డారు.

ఇలాంటి ప్రతి విమర్శలు ఎలాగున్నా ప్రచారంలో వెనక్కు తగ్గకుండా వేదికల మీదా డిజిటల్ ప్రచార స్లైడ్లలోనూ ప్రజాకూటమి దాన్ని ఉపయోగించుకుంటూనే ఉన్నది. మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు న్యాయం చేస్తాం, టిఆర్ఎస్ కేవలం పెద్ద రైతులకు లబ్ధి చేకూర్చేందుకే రైతుబంధు తీసుకొచ్చింది అని చెప్పడం ద్వారా కాంగ్రెస్ కౌలు రైతులను టార్గెట్ గా చేసుకుంది. కౌలు రైతుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. కౌలు రైతుల గుర్తింపులో ఇబ్బంది ఉన్న మాటా వాస్తవం. అయితే ఇబ్బంది ఉందని చెప్పి పూర్తిగా వారిని విస్మరించవచ్చునా అనే ప్రశ్న ఒకటి ముందుకు వస్తుంది. ఎన్నికల్లో ఈ తర్కాలకు తావులేదు. ఎవరికి ప్రయోజనాలు చేకూరాయి, ఎవరికి లేదు అనేది ప్రధానం. మొత్తంమీద ఈ ఎన్నికల్లో భూమి ఉన్న రైతులు ఒక ఓటుబ్యాంకుగా కౌలు రైతులు మరొక ఓటుబ్యాంకుగా మారారు. రాష్ర్టంలో 57 లక్షల పైచిలుకు రైతులుంటే అందులో ఐదెకరాలలోపు ఉన్న సన్న చిన్నకారు రైతులు 51 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి. కౌలు రైతులు ఎంతమంది ఉంటారో నిర్దిష్టంగా తెలీదు. పది లక్షల నుంచి పాతిక లక్షలదాకా ఎవరి సంఖ్య వారు చెపుతున్నారు.
అయితే విపక్షాల కూటమి కోదండరాంను గద్దర్‌ను ఎంతమేరకు శక్తిమంతంగా ఉపయోగించుకున్నాయన్నది ప్రశ్నార్థకం. వారిద్దరూ ఎన్నికల రాజకీయాల్లో నిష్ణాతులు కాకపోవచ్చుగానీ వారిద్దరికీ పార్టీలకతీతంగా కొంత ఇమేజ్ ఉన్నది. అది ప్రధాన పార్టీ నాయకులకు భిన్నమైనది. దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదనే అనిపిస్తున్నది.

అటు కెసిఆర్ తొలి దశలో చెప్పిన ఒక మాట ఆయనకంటే విపక్షాలకే అస్ర్తంగా మారింది. నేను ఓడిపోతే నాకేమీ నష్టం లేదు. హాయిగా ఇంట్ల పడుకుంటా అనడం విపక్షాలకు కొంత సరుకు అందించింది. అయితే సూక్ష్మ గ్రాహి వ్యూహా కర్త అయిన కెసిఆర్ వెంటనే తేరుకుని ఎదురుదాడికి పదును పెట్టారు. ప్రచారం చివరి దశలో రేవంత్ రెడ్డి విషయంలో పోలీసులు చేసిన ఓవరాక్షన్ కూడా కెసిఆర్ కు ఉపయోగపడేదేమీ కాదు. పేషెంట్ కోరుకున్నది, వైద్యుడు ఇచ్చింది ఒకటే అన్నట్టు అసలే ఇమేజ్ మేకోవర్లో ఉన్న ప్రత్యర్థి నాయకుడికి అనుకోని మైలేజీ ప్రభుత్వం చేజేతులా ఇచ్చినట్టైంది. తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా హెలికాప్టర్లో పర్యటించి కాంగ్రెస్ నాయకుల సమూహంలో తనకొక ప్రత్యేకమైన ఇమేజ్ కోసం అప్పటికే రేవంత్ ప్రయత్నిస్తూ ఉండినారు.
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అస్ర్తం
తమను తాము తెలంగాణకు, తెలంగాణ ఉద్యమానికి పర్యాయపదంగా మార్చుకుని గత ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించింది. ఈ సారి ఆ అస్ర్తానికి ఆ స్థాయి పదును లేకపోయినా పూర్తిగా దాన్ని వదిలిపెట్టలేదు. మేము తెలంగాణ, అవతలి వారు తెలంగాణ ద్రోహులు లేదా తెలంగాణ ద్రోహులతో చేతులు కలిపిన వారు అని భావోద్యేగాలతో ప్లే చేసింది. ఇప్పటికే చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకుడిగా చిత్రిస్తూ వచ్చిన టిఆర్ఎస్ అలాంటి నాయకుడితో కాంగ్రెస్ ఎట్లా చేతులు కలుపుతుంది అని ప్రశ్నిస్తూ ఆ అస్ర్తాన్ని అరిగిపోకుండా వాడుతూనే ఉంది. మరోవైపు చంద్రబాబు తనదైన శైలిలో హైదరాబాద్, సైబరాబాద్ అభివృద్ధిలో తన పాత్రా అది ఎప్పట్లానే వివరిస్తూ ఆ విధంగానే ముందుకు పోతూ వచ్చారు. కాంగ్రెస్ కూడా తెలివిగా ఆయన్ను ఖమ్మం, కోదాడ, హైదరాబాద్లకే పరిమితం చేసింది.
కొన్ని దళిత సమూహాలతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేసి.. లాల్ నీల్ నినాదంతో సీపీఎం ఒక ప్రయోగం అయితే చేసింది. ఇప్పటికిప్పుడు ఫలితాలు ఎలా ఉన్నా దీన్ని దీర్ఘకాలిక లక్ష్యంతో ఎంచుకున్నట్లు కనిపిస్తున్నది.
అపుడెపుడో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే ఘటన తర్వాత అంతగా కనిపించని లగడపాటి రాజగోపాల్ ఆఖరి అంకంలో రంగప్రవేశం చేసి సర్వేతో రక్తి కట్టించారు- లేటుగా వచ్చినా లేటెస్టుగా అన్న సినిమా డైలాగు మాదిరి.

తెలంగాణలో ప్రజాకూటమి ఎంతవరకు విజయవంతం అవుతుందో, వారు కోరుకున్న మేరకు అవుతుందో దానికి అడుగుదూరంలో ఆగిపోతుందో చెప్పలేముగానీ ఈ ప్రయోగం కేంద్రంలోనూ రిపీట్ చేసేట్టే కనిపిస్తున్నారు. ఆంధ్రలో తెలుగుదేశానికి ప్రధాన ప్రత్యర్థి స్థానాన్ని కాంగ్రెస్ ఖాళీ చేసింది. ఇటు తెలంగాణలో తెలుగుదేశానికి మరీ పెద్ద ఆశలుండే అవకాశం లేదు. ఇక్కడ అస్తిత్వ పోరాటమే. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులు టిఆర్ ఎస్, కాంగ్రెస్లే. మారిన రాజకీయ పరిస్థితులు కొత్త సమీకరణాలను తెచ్చి పెట్టాయి. నిన్నమొన్నటి దాకా సాగిన వైరం అసలు గుర్తుకే రానీయకుండా రాహుల్..చంద్రబాబు ఇద్దరూ ఎంచక్కా చేతుల్లో చేతులు వేసుకుని వేదికలమీ ద కనిపిస్తున్నారు. వేదికలమీద వారి అన్యోన్యత చూస్తే బాల్యస్నేహితులేమో అనేంత కలిసిమెలిసి కనిపిస్తున్నారు. రాజకీయములు బహు చిత్రములు.
టిఆర్ఎస్ ఏం చేసింది ఏం చేయలేదు అనేదానికంటే కూడా హామీలిస్తున్నపుడు వారు ఉపయోగించే భాష వారికి కొంత ఎదురుతిరుగుతున్నది. ఇంతమందికి మంచి నీళ్లిస్తాం అనరు. కుళాయి తిప్పితే నీళ్లు రాకపోతే ఓట్లే అడగం అంటారు. అపుడలా అంటిరేమయ్యా అంటే అలాంటి యాంబిషన్ ఉండడం తప్పా అంటారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి అంటారు. ఇపుడేమో భూమి చూపించండి. ఇస్తాం అంటారు. దళిత ముఖ్యమంత్రి సంగతి కాసేపు మర్చిపోదాం. సాధారణంగానే ఒక ఉద్యమం ముగిసి ప్రభుత్వం ఏర్పడుతున్నపుడు అంచనాలు భారీగా ఉంటాయి. ఇంతకాలం పలానా వారు పాలించడం వల్ల మనకేమీ లేదు. ఇపుడు సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుంది అనే ఆశ ఉంటది. పాలకులు ఈ ఆశలను మరింత పెంచితే ఆ బరువుకు తర్వాత ఇబ్బందిపడాల్సి వస్తుంది. దైనందిన జీవితంలో ఆటుపోట్లను తట్టుకోవడానికి అవసరమైన సంక్షేమ పథకాలకు ఇచ్చిన ప్రాధాన్యం భవిష్యత్తుకు బాటలు వేసే దీర్ఘకాల పథకాలకు ఇవ్వకపోతే ఇబ్బంది ఎదురవుతుంది. ఈ ప్రాధాన్యాల్లో బ్యాలెన్స్ గురించి పాలకులు ఆలోచించాల్సిన అవసరాన్ని అయితే ఈ ఎన్నికలు మనకు గుర్తు చేశాయి.

స్థూలంగా ఎన్నికల చిత్రాన్ని చూసినపుడు పట్టణ మధ్యతరగతిలో, ముఖ్యంగా వేతన జీవుల్లో టిఆర్ ఎస్ పట్ల అంత సుముఖత లేదని అనిపిస్తున్నది. ప్రభుత్వ పథకాల్లో వారిని చేరేవి అంతగా లేవు. అలాగే ధర్నాచౌక్ ఎత్తివేయడం, ప్రశ్నించిన వాళ్లమీద అణచివేత చర్యలు తీసుకోవడం వంటివి పాలకులకు శోభనిచ్చేవి కావు.
దానికి తోడు కెసిఆర్ వ్యవహారశైలి అంత ప్రజాస్వామికమైనది కాదనే విమర్శ ఉండనే ఉన్నది. కుటుంబపాలన గురించిన చర్చ ప్రభావం కూడా వారిపై అంతో ఇంతో ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో దృశ్యం దీనికి కొంత తేడాగా ఉంది. అక్కడ లబ్ధిదారులు అధికం. మీడియా ప్రభావం పరిమితం. అక్కడ రాజకీయ వాతావరణం వేతనజీవులకు కొంత భిన్నంగా కనిపిస్తున్నది. కాబట్టి ఏ కోయిల తొందరపడి ఎటు కూసినా అది వారి వారి ఆకాంక్షలకు అక్షరరూపం ఇవ్వడమే అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ ట్యూజ్ డే.
ఇవి కూడా చదవండి:
- ప్రచార హోరులో హెలికాప్టర్ల జోరు.. ఏ పార్టీ ఎన్ని ఉపయోగిస్తోందంటే...
- భారతీయులకు పొంచి ఉన్న వాతావరణ ముప్పు
- ఈ ఆవు ఎత్తే దాని ప్రాణాలను కాపాడింది... ఎలాగో తెలుసా?
- పిల్లలకు తల్లిపాలు ఎలా పట్టించాలి
- బులంద్‌షహర్‌లో ఎస్ఐ హత్య: ఎప్పుడు ఏం జరిగింది? ఎలా జరిగింది?
- అగస్టా వెస్ట్‌ల్యాండ్: సీబీఐ అరెస్ట్ చేసిన క్రిస్టియన్ మైకేల్ ఎవరు? అసలు హెలికాప్టర్ల కుంభకోణం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








