బులంద్‌షహర్‌లో ఎస్‌ఐ హత్య: ఎప్పుడు ఏం జరిగింది? ఎలా జరిగింది?.. దాద్రి మూకదాడి విచారణాధికారి ఈ సబ్ ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్

ఫొటో సోర్స్, Sumit Sharma
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో సోమవారం ఆందోళనకారుల చేతిలో మరణించిన సబ్ ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ కొన్నేళ్ల క్రితం దాద్రిలో జరిగిన మూకదాడిలో మరణించిన మహమ్మద్ అఖ్లాక్ హత్య కేసులో విచారణాధికారిగా పని చేశారు.
2015లో ఈ మూకదాడి జరిగినపుడు సుబోధ్ కుమార్ జార్చా పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓగా ఉన్నారు. అఖ్లాక్ అహ్మద్ ఘటన జరిగిన దాద్రి జిల్లాలోని బిషారా గ్రామం ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకే వస్తుంది.
అఖ్లాక్ సోదరుడు జాన్ మొహమ్మద్ మాట్లాడుతూ.. ''అఖ్లాక్ హత్య జరిగినపుడు సంఘటనాస్థలానికి మొదట చేరుకున్న వ్యక్తి సుబోధ్ కుమారే. అఖ్లాక్, ఆయన కుమారుడు దానిష్ ఖాన్‌లను సుబోధే ఆసుపత్రికి పంపారు'' అని బీబీసీకి తెలిపారు.
తర్వాత సుబోధ్ కుమార్‌ను అక్కడి నుంచి బదిలీ చేయగా, మరో పోలీసు అధికారి ఆ కేసులో చార్జిషీటు దాఖలు చేశారు.

ఫొటో సోర్స్, UP Police
అదనపు బలగాలు పంపలేదు..
సుబోధ్ కుమార్ గురించి ఆయన సోదరుడు అతుల్ కుమార్, ''తను చాలా చిత్తశుద్ధి గల అధికారి. మిగతా వారిలాగే తనూ పని చేసుకుపోవాలని మేం చెప్పేవాళ్లం. కానీ ఆయన లెక్కచేసేవాడు కాదు. చివరికి అదే ఆయన ప్రాణాలు తీసింది'' అన్నారు.
పోస్ట్‌మార్టం నివేదికలో సుబోధ్ కుమార్ తలలో తూటా దూసుకుపోవడం వల్ల మరణించినట్లు తెలిపారు.
అఖ్లాక్ కేసులో సెప్టెంబర్ 28, 2015 నుంచి నవంబర్ 9, 2015 వరకు సుబోధ్ కుమార్ విచారణాధికారిగా ఉన్నారు. అయితే ఆ కేసులో చార్జిషీటు ఆయన దాఖలు చేయలేదు.
సోమవారం గోవధకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నపుడు అదనపు బలగాలను పంపలేదని అతుల్ కుమార్ ఆరోపించారు. దీనిని పెద్ద కుట్రగా అతుల్ అభివర్ణించారు.
సుబోధ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా బ్యాకప్ బలగాలను పంపలేదని ఆరోపిస్తున్నారు.
అయితే యూపీ పోలీస్ ఏడీజీ(లా అండ్ ఆర్డర్) ఆనంద్ కుమార్, ఈ సంఘటనపై సిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ కేసులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఫొటో సోర్స్, Bulandshahr Police
ఇంతకూ బులంద్ షహర్‌లో ఏం జరిగింది?
సోమవారం తలకు తూటా తగిలి సుబోధ్ కుమార్ మరణించిన బులంద్‌షహర్ జిల్లాలో ప్ర్తసుతం నిశబ్దం నెలకొంది.
పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, దీనికి సంబంధించి కొంతమందిని అరెస్టు చేయగా, దాడికి పాల్పడిన మరికొందరిని గుర్తించే పనిలో ఉన్నారు.
సీనియర్ పోలీసు అధికారి ప్రశాంత్ కుమార్, పోలీసులు గోవధ వదంతులపై కూడా విచారిస్తున్నారని తెలిపారు.
సోమవారం నాటి ఘటన తర్వాత బులంద్‌షహర్‌లో వేయిమందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. దుకాణాలు, పాఠశాలలను మూసేశారు.
ఇంతకూ గోవధ వదంతులు ఇంతటి హింసాకాండకు ఎలా దారి తీశాయి? ఆందోళనకారులను నియంత్రించలేని స్థితికి పోలీసులు ఎందుకు చేరుకున్నారు? పరిస్థితి ఎందుకు అదుపు తప్పి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి, ఒక పోలీసు అధికారి మరణించేంత వరకు వెళ్లింది?

ఫొటో సోర్స్, Yogesh Kumar Singh
ఎఫ్‌ఐఆర్‌లో 27 మంది మంది పేర్లున్నాయి. 50-60 మంది గుర్తు తెలియని వ్యక్తుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది.
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం: మహావ్ గ్రామ సమీపంలోని అడవిలో గోవధ జరిగిందన్న వార్తలు వచ్చాయి. పోలీసులకు ఈ విషయం తెలీడంతో వాళ్లు అక్కడికి వెళ్లగా, అప్పటికే అక్కడ కొంత మంది గుంపు చేరుకొని ఉన్నారు.
పోలీసులు, సుబోధ్ కుమార్ సింగ్ వాళ్లను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ ఆందోళనకారులు వాళ్ల మాట వినలేదు.
ఆ తర్వాత యోగేశ్ రాజ్ అనే వ్యక్తి నేతృత్వంలో మధ్యాహ్నం సుమారు 1.35 సమయంలో ఆందోళనకారులు చింగ్రావటి పోలీస్ ఔట్ పోస్టు ఎదుట ఆందోళనకు దిగారు.
అక్కడే ఉన్న సైనా ఎస్‌డీఎమ్, ఇతర అధికారులు ఆందోళనకారులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. సంఘటనపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కానీ ఆందోళనకారుల్లో కొందరు రెచ్చగట్టడంతో పరిస్థితి అదుపు తప్పింది.
ఎఫ్‌ఐఆర్ ప్రకారం ఆందోళనకారులు పోలీసులుపై రాళ్లు, కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేశారు. వారిలో కొందరు కాల్పులు కూడా జరిపారు.

ఫొటో సోర్స్, Sumit Sharma
సుబోధ్ కుమార్ సింగ్ ఎలా మరణించారు?
సుబోధ్ కుమార్ తలకు తూటా తగలడంతో మరణించారు. ఆయన లైసెన్స్డ్ పిస్టల్, మూడు ఫోన్లు కూడా పోయాయి.
కాల్పులు జరుగుతున్నపుడు ఒక పోలీసు అధికారి భయంలో పోలీస్ స్టేషన్ లోపల దాక్కోవడంతో ఆందోళనకారులు అతణ్ని కూడా చంపండి అంటూ స్టేషన్‌కు నిప్పు పెట్టారు.
పోలీసులు బుల్లెట్ దెబ్బ తగిలిన సుబోధ్ కుమార్ సింగ్‌ను ప్రభుత్వం వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, ఆందోళనకారులు మరోసారి దాడి చేశారు. ఈ దాడిలో కూడా అనేక మంది పోలీసులు గాయపడ్డారు.
ఈ లోపు పోలీసుల విజ్ఞప్తి మేరకు అదనపు బలగాలు అక్కడికి రావడంతో వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. సుబోధ్ కుమార్ సింగ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆయన అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు.
యూపీ పోలీసులు సుబోధ్ కుమార్ కేసును విచారించేందుకు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేశారు. అది రెండు రోజుల్లో తన నివేదికను అందజేస్తుంది.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ఆశించిన లక్ష్యాలను సాధించాయా?
- సోనాలి బెంద్రే: కేన్సర్‌తో పోరాటం ఇంకా పూర్తి కాలేదు
- మనం ‘రేప్ కల్చర్’ను పెంచి పోషిస్తున్నామా
- ఈ ఆవు ఎత్తే దాని ప్రాణాలను కాపాడింది... ఎలాగో తెలుసా?
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: ‘సుంకాలు తగ్గించేందుకు చైనా అంగీకరించింది’
- 'నీ అందాలు చూపిస్తేనే టీమ్‌లో చోటిస్తా'
- పెట్రోల్ ధర: భారత్‌లో తగ్గుతుంటే, ఫ్రాన్స్‌లో ఎందుకు పెరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








