రేవంత్ రెడ్డిని విడుదల చేసిన పోలీసులు.. ‘‘అర్ధరాత్రి అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏముంది’’ - హైకోర్టు ప్రశ్న

రేవంత్ రెడ్డి అరెస్ట్ దృశ్యాలు

ఫొటో సోర్స్, RevanthReddyFamily

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్ దృశ్యాలు

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. జడ్చర్ల నుంచి కొడంగల్‌లోని ఆయన నివాసానికి తీసుకెళుతున్నారు.

రేవంత్ రెడ్డిని విడుదల చేశామని కోర్టుకు తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బి శివానంద ప్రసాద్ తెలిపారు. ఈ కేసులో ఏజీ వాంగ్మూలాన్ని హైకోర్టు రికార్డు చేసింది. రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం.. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

కాగా, రేవంత్ రెడ్డి అరెస్టుకు గల కారణాలను రేపు వివరిస్తామని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణ 5వ తేదీ బుధవారానికి వాయిదా పడింది.

‘‘బంద్‌కు పిలుపు ఇవ్వడంతో ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు’’

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కావడానికి 72 గంటల ముందు పోలీసులు రేవంత్‌ను బలవంతంగా అరెస్ట్ చేయడం.. అందుకోసం అర్ధరాత్రి దాటాక ఆయన ఇంటి గేట్లు, పడక గది తలుపులు సైతం పగలగొట్టి లోపలకి ప్రవేశించి అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల సభ నిర్వహించడానికి ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం రాజకీయంగా కలకలం రేపింది.

రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో కేసీఆర్ ఎన్నికల ప్రచారసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ముందస్తు అరెస్ట్ చేశారు.

ముఖ్యమంత్రి సభకు నిరసనగా రేవంత్ బంద్‌కు పిలుపు ఇవ్వడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో పోలీసులు రేవంత్ ఇంటిలోకి ప్రవేశించారు. రేవంత్ దంపతులు, వారి కుమార్తె పడక గదిలో ఉన్న సమయంలో వారు లోనికి వెళ్లారు.. ఇదంతా రేవంత్ కుటుంబసభ్యులు తీసిన మూడు వీడియోల్లో రికార్డయింది.

వీడియోలో ఉన్న సంభాషణల్లో.. తాము ముందుస్తు అరెస్టుకు వచ్చినట్టు పోలీసు అధికారి చెప్పారు. తలుపు బోల్టు విరగ్గొట్టి లోపలికి ఎందుకు వచ్చారని, బయటకు వెళ్లిపోవాలని పోలీసులతో రేవంత్ అన్నారు. ''మేమేమైనా టెర్రరిస్టులమా? ఆడవాళ్లున్న రూంలోకి ఇలా ఎలా వస్తారు, హరీశ్ రావు ఇంటికి ఇలానే వెళ్తారా?'' అని రేవంత్ భార్య గీత ప్రశ్నించడమూ ఆ వీడియోల్లో కనిపించింది.

అయితే, పోలీసులు అదేమీ పట్టించుకోకుండా రేవంత్‌ను అదుపులోకి తీసుకుని తమతో తీసుకెళ్లారు. రేవంత్‌తో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

‘కేసీఆర్‌కు విశ్రాంతి’

రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘అరెస్టులతో కాంగ్రెస్ ప్రభంజనాన్ని టీఆర్ఎస్ అడ్డుకోలేదు. కేసీఆర్ నిరంకుశ ధోరణికి పరాకాష్టే రేవంత్ రెడ్డి అరెస్ట్. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గరపడ్డాయి. ఓటమి భయం వల్లే అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్‌ను ప్రజలు చిత్తుగా ఓడించి కేసీఆర్‌కు విశ్రాంతి ఇవ్వబోతున్నారు’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇప్పటికే ఉద్రిక్తం.. ఇప్పుడు మరింతగా..

ముఖ్యమంత్రి సభకు నిరసనగా రేవంత్ నిరసనలు చేపట్టడంతో గత రెండు మూడు రోజులుగా కొడంగల్ నియోజకవర్గంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తాజాగా రేవంత్ అరెస్ట్‌తో కొడంగల్ మరింత ఉద్రిక్తంగా మారింది.

''పోలీసులు అర్థరాత్రుళ్లు మా కార్యకర్తల ఇళ్లలోకి చొరబడుతున్నారు. దానికి నిరనసనగా రేవంత్ ఆందోళన చేస్తున్నారు. ఇది కొడంగల్ ప్రజలపై దాడి. మేం, పాప గదిలో ఉన్నప్పుడు రాత్రి 3 గంటలకు తలపులు విరగ్గొట్టి లోపలికి వచ్చారు. ఎప్పుడుపడితే అప్పుడు పోలీసులు ఈడ్చుకుపోవచ్చా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కే లేదా'' అని రేవంత్ భార్య గీత ప్రశ్నించారు.

''కొడంగల్‌కి నీళ్ళు, సిమెంట్ ఫాక్టరీ, కాలేజీలు రాకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి దానికి సమాధానం చెప్పిన తరువాతే ఇక్కడకు రావాలని సీఎంను డిమాండ్ చేశాం. అది తప్పంటే ఎలా? మేం కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాం. ఎలాంటి నిరసన కార్యక్రమాలూ చేపట్టొద్దు. పోలింగ్ బూత్‌లో ఓటేసి నిరసన తెలపండి. రేవంత్ మెజార్టీ 50 వేలు దాటించండి. నేను భార్యగా బాధపడుతున్నా, పౌరురాలిగా ప్రజాస్వామ్యం పట్ల ఆందోళన చెందుతున్నా'' అన్నారామె.

ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook/UttamKumarReddy

ఎన్నికల సంఘం టీఆర్ఎస్ ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాగా రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ చురుగ్గా స్పందించింది. ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

రేవంత్ రెడ్డి అరెస్టును ఆ పార్టీ నేతలు తప్పుపట్టారు. టీఆర్ఎస్ సభ విఫలం అవుతుందన్న భయంతోనే ఇదంతా చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదనీ, అర్థరాత్రి అరెస్టు చేయడం దేనికి సంకేతమనీ ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కాంగ్రెస్ ఫిర్యాదులను పట్టించుకోకుండా, కేవలం టీఆర్ఎస్ ఫిర్యాదులపైనే చర్యలు తీసుకుంటోందని ఆరోపించారాయన.

టీఆర్ఎస్ నేతలు ఓటమి భయంతోనే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి డీకే అరుణ. పోలీసులు, అధికారులు టీఆర్ఎస్ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేసినందుకే రేవంత్ రెడ్డి అరెస్ట్: తాడూరి శ్రీనివాస్, ఎంబీసీ ఛైర్మన్

కేసీఆర్ సభ నిర్వహిస్తుంటే రేవంత్ రెడ్డి బంద్ పిలుపిచ్చి శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లేదంటే ఇతర రాష్ట్రాలకు చెందిన ఏ నాయకులు వచ్చి ఇక్కడ ఎన్నికల సభలు పెట్టుకున్నా తామేమీ అడ్డంకులు సృష్టించలేదని... ఇప్పుడు తమ నేత సభకు అడ్డంకులు సృష్టించేందుకు రేవంత్ ప్రయత్నించడంతో అధికారులను ఆశ్రయించామని.. వారు చర్యలు తీసుకున్నారని చెప్పారు.

ప్రతిపక్ష నేతల నియోజకవర్గాల్లోనూ తాము అభివృద్ధి పనులు చేశామని, ఆ క్రమంలో కొడంగల్‌ను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయడంతో రేవంత్ రెడ్డి ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చి ఇలా రెచ్చగొట్టే పనులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశం

ఫొటో సోర్స్, OfficeOfTheChiefElectoralOfficer

ఫొటో క్యాప్షన్, చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశం

కేసీఆర్ సభను అడ్డుకోవాలంటూ రేవంత్ పిలుపునిచ్చిన వీడియో కాపీలతో టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం.. ఆ ఫిర్యాదును వికారాబాద్ కలెక్టర్, తెలంగాణ డీజీపీలకు పంపించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆదేశించిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.

శాంతిభద్రతల సమస్య రాకూడదనే: ఎన్నికల సంఘం సీఈవో రజత్ కుమార్

‘‘కొడంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఈ నెల 2న ఒక ప్రకటన చేశారు. కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో 4 న బంద్ పాటించాలని అందులో పిలుపిచ్చారు. దీనిపై టీఆరెస్ పార్టీ నాయకులు నాకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించాం. వాళ్ల ఆదేశాలకు అనుగుణంగా నేను ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారికి లేఖలు రాశాను. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని వాళ్ళను కోరాం. అందులో భాగంగా ఈరోజు అర్థరాత్రి కొడంగల్ అభ్యర్థిని అరెస్ట్ చేశాం. ఈసీ అన్ని పార్టీలనూ ఒకేలా చూస్తుంది. ప్రస్తుతం కొడంగల్‌లో మాత్రమే కొంత శాంతిభద్రతల సమస్య ఉంది. రాష్ట్రంలో అంతటా ప్రశాంతంగా ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని విజ్ఞప్తులు పరిశీలిస్తాం. ఎవరికైనా ప్రచారం చేసుకొనే వీలు, స్వేచ్ఛ కల్పిస్తాం’’ అని ఎన్నికల సంఘం సీఈవో రజత్ కుమార్ చెప్పారు.

కేసీఆర్ సభ ముగియగానే విడిచిపెడతాం: వికారాబాద్ ఎస్పీ

రేవంత్ రెడ్డి తమ అదుపులోనే ఉన్నారని.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా రేవంత్‌ను అదుపులోకి తీసుకుని మహబూబ్‌నగర్ తరలించామని, సభ ముగిసిన వెంటనే రేవంత్ రెడ్డిని వదిలేస్తామని వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ తెలిపారు.

‘కేసీఆర్ ప్రధాన టార్గెట్ రేవంతే’

కాగా ఈ పరిణామాలపై సీనియర్ పాత్రికేయులు ఎ.ఎం.ఖాన్ యజ్దానీ (డానీ) బీబీసీతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రధాన రాజకీయ శత్రువు రాహుల్ గాంధీయో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, లేదంటే కూటమిలోని ఇతర పార్టీల నాయకులో కాదని.. రేవంత్ రెడ్డే ఆయన ప్రధాన రాజకీయ శత్రువని అభిప్రాయపడ్డారు.

ఓటుకు నోటు కేసు నుంచే ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం మొదలైందని.. ఈ ఎన్నికల్లో అది మరింత తీవ్రమైందని అన్నారు.

ఓటుకు నోటు కేసు తరువాత రేవంత్ రెడ్డి ఓ సందర్భంలో.. తెలంగాణలో సామాజిక వర్గ లెక్కలను ఉదాహరణగా చూపుతూ తానే భవిష్యత్ నేతనని ప్రకటించుకున్నారని.. దాంతో రాజకీయంగా కేసీఆర్.. రేవంత్‌ను మరింత సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించారని చెప్పారు.

అయితే, పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న వేళ తీసుకుంటున్న ఇలాంటి చర్యలు రేవంత్‌ పాపులారిటీని మరింత పెంచే అవకాశముంటుందని టీఆర్ఎస్ తెలుసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)