తెలంగాణ: 'మాకు రెండు రాష్ట్రాలు.. రెండు ఓటరు కార్డులు.. అయినా తీరని కష్టాలు'

- రచయిత, దీప్తి బత్తిని, బీబీసీ ప్రతినిధి
- హోదా, షూట్: శివ, ఎడిట్: నవీన్ కుమార్, ప్రొడ్యూసర్: సంగీతం ప్రభాకర్
ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దు వివాదంలో ఉన్న 14 గ్రామాలు అందరి దృష్టికీ వస్తాయి. ఇక్కడి ప్రజలకు రెండు రాష్ట్రాల ఓటర్ కార్డులు ఉంటాయి. వీళ్లు రెండు రాష్ట్రాలలోనూ సర్పంచ్‌లను, ఎమ్మెల్యేలను, ఎంపీలనూ వేరువేరుగా ఎన్నుకుంటారు.
"కేవలం ఎన్నికలప్పుడే నాయకులు మా ఊళ్లలోకి వచ్చి మా కష్టాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మేము కూడా ఇలాంటప్పుడే మా డిమాండ్లను వారికి చెబుకుంటాం" అని పరందోలి గ్రామస్థుడు ఒకరు చెప్పారు.
పరందోలి, కోట, శంకర్కులొద్ది, ముకధం గూడ, లెండి గూడ, ఈసాపూర్, మహర్జా గూడ, అనంతపూర్, భోలాపూర్, గౌరీ, లేందీజలా, లక్మాపూర్, జంకపూర్, పద్మావతి- ఈ 14 ఊళ్లు తెలంగాణ- మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దు వివాదంలో నలుగుతున్నాయి.
తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలానికి చెందిన ఈ పల్లెలు, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోని జీవితి తాలూకాకు కూడా చెందుతాయి.

ఇక్కడ ఉన్న దాదాపు 3,819 మంది లంబాడా వారు. అయితే, తెలంగాణలో లంబాడాను షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)గా వర్గీకరిస్తే, మహారాష్ట్రలో మాత్రం వెనుకబడిన కులాల్లో సంచార తెగగా గుర్తించారు.
"కుల ధ్రువీకరణ పత్రాలను సర్పంచి సిఫార్సుతో తెలంగాణ నుంచి తీసుకుంటాం" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక గ్రామస్థుడు చెప్పారు.
వీళ్లు రెండు రాష్ట్రాల నుంచీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందుతారు. ఆ ప్రయోజనాలు ఆగిపోతాయేమో అని ఎప్పుడూ భయం ఉంటుందని గ్రామంలోని వేపచెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటున్న ఊరి పెద్దలు వివరించారు.
బీబీసీ న్యూస్ తెలుగు ఈ గ్రామాలకు వెళ్లి ఇక్కడి ప్రజలతో మాట్లాడింది. ఈ ఊళ్లకు వెళ్లాలంటే చాల ప్రమాదకరమైన రాళ్లతో కూడిన ఘాట్ రోడ్ల మీద ప్రయాణించాలి. కొత్తవారు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడాల్సిందే. ఈ గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన కెరమెరి వెళ్లిరావాలంటే రెండు రోజులు పని వదులుకోవాల్సిందే.


వివాదం ఎలా మొదలైంది?
1983 ఫిబ్రవరిలో రెండు రాష్ట్రాల అధికారులు ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ గ్రామాలు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని నిర్ణయం తీసుకున్నారు.
ఈ గ్రామాలను అప్పటి ఆదిలాబాద్ జిల్లాలో చేర్చారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి. అయితే, రెండు రాష్ట్రాల అధికారులు కలిసి నిర్ణయం తీసుకోవడం చట్టవిరుద్ధమని మహారాష్ట్రలోని రాజుర నియోజకవర్గం ఎమ్మెల్యే వామనరావు చాటప్ మహారాష్ట్ర శాసనసభలో లేవనెత్తారు.
"ఈ గ్రామాలపై నిర్ణయం తీసుకునే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంటుంది. ఇక్కడి వారంతా మరాఠీ మాట్లాడేవారే. ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ 1991 ఎన్నికలను కూడా ఈ గ్రామాల ప్రజలు బహిష్కరించారు" అని ఎమ్మెల్యే వివరించారు.
"1991 ఎన్నికలను బహిష్కరించాం. కానీ ఆ తరువాత నుంచి రెండు రాష్ట్రాలలోనూ ఓటు వేస్తూనే ఉన్నాం" అని పరందోలి గ్రామానికి చెందిన కాంబ్లే లక్ష్మణ్ తెలిపారు.

వీళ్ల బాగోగులు రెండు రాష్ట్రాలూ చూడాలి
ఈ వివాదం అక్కడితో ఆగలేదు. ఈ గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తూ జారీ చేసిన కేబినెట్ ఉత్తర్వులను రద్దు చేస్తూ, 1996లో బీజేపీ -శివసేన ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
దాంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ గ్రామాలపై హక్కు లేదంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ గ్రామాల పరిపాలనలో మహారాష్ట్ర జోక్యం చేసుకూడదని తేల్చి చెప్పింది.
ఆ తీర్పుని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. "అప్పుడు హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని 1997లో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్‌ను ఆదేశింది. సరిహద్దు సంగతి తేల్చేవరకూ రెండు రాష్ట్రాలూ ఈ గ్రామాల ప్రజల బాగోగులు చూసుకోవాలని తీర్పు ఇచ్చింది. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది" అని వామనరావు వివరించారు.
అప్పటి నుంచి ఈ గ్రామాల పరిపాలనా వ్యవహారాలను రెండు రాష్ట్రాలూ చూస్తున్నాయి.

ఇక్కడి గ్రామస్థులు రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాల ప్రయోజనాలనూ అందుకుంటున్నారు.
ఈ గ్రామాల్లో రెండు రాష్ట్రాల సర్పంచ్‌లు ఉంటారు. కాంబ్లే లక్ష్మణ్ మొదటిసారి 1995లో ఆంధ్రప్రదేశ్ తరఫున పరందోలి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్ర తరఫున సర్పంచ్‌గా ఉన్నారు.
"మా వాదన ఒకటే. మా భూములకు పట్టాలు ఏ రాష్ట్రం ఇస్తే మేము ఆ రాష్ట్ర ప్రజలమే అవుతాం. మేము రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేస్తున్నాం, ఈ విషయం ప్రభుత్వాలకు తెలియదా? మరి ఎందుకు మమ్మల్ని పట్టించుకోరు? మేము రెండు రాష్ట్రాల నుంచి ప్రయోజనాల పొందుతున్నది వాస్తవమే. కానీ, ఇక్కడ రోడ్లు లేవు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల పాఠశాలలు ఉన్నాయి, కానీ వాటిని పర్యవేక్షించేవారు లేరు" అని అన్నారు కాంబ్లే లక్ష్మణ్.

రెండు వైపులా సంక్షేమ పథకాలు అందుతున్నా, ఇక్కడి గిరిజన గూడేలు మాత్రం అభివృద్ధి చెందలేదు.
"మా ఊరికి రోడ్లు లేవు. ఎండాకాలంలో నీళ్లు దొరకవు. మా ఊరి బడికి వచ్చేందుకు ఏ ఉపాధ్యాయుడూ సిద్ధంగా లేరు" అని పరందోలి గ్రామస్థురాలు గయా బాయ్ చెప్పారు.

ఇక్కడి రైతులకు వారు సాగు చేసుకునే భూమిపై యాజమాన్యపు హక్కుల్లేవు. రెండు ఓట్లు ఉన్నా తమది ఏ రాష్ట్రమో చెప్పుకోలేని పరిస్థితి ఈ గ్రామాల ప్రజలది.
"ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ భూమి మీద హక్కు కేవలం ఆదివాసీ తెగలకు మాత్రమే ఉండాలి. అయినప్పటికీ వీరందరికీ అటవీ హక్కుల గుర్తింపు పత్రాలు ఉన్నాయి. పరందోలిలో 121 మంది రైతులకు, అనంతపూర్‌లో 150 రైతులకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతుబంధు చెక్కులు అందాయి" అని కెరమెరి పంచాయతీ కార్యదర్శి రమేష్ తెలిపారు.

ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రచారానికి పార్టీలు తమ ఊరు వస్తారని వీరు ఎదురు చూస్తున్నారు. తమ సమస్యలకు రాజకీయ నాయకులు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నారు.
"మేమంతా రైతులం. మాకు ఎవరు భూమి పట్టాలు ఇస్తారో వచ్చే ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోనే ఓట్లు వేస్తాం" అని కాంబ్లే లక్ష్మణ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- జికా వైరస్: బ్రెజిల్ ప్రేమ కథలు
- మహారాష్ట్ర: 13 మందిని చంపిన ఆడ పులి కాల్చివేత
- బౌడికా: రోమన్లను తరిమికొట్టిన తొలి మహారాణి, ఆమె నేర్పే ఆరు జీవిత పాఠాలు
- తెలంగాణ: ‘24 గంటల కరెంట్ మాకొద్దు’
- సర్దార్ వల్లభాయ్ పటేల్: నర్మదా నదీ తీరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- శ్రీలంక విషయంలో భారత్-చైనా ఒక్కటవ్వాలా?
- ఒక్క కోడిని కూడా చంపకుండా చికెన్ తినడం ఎలా?
- హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోందంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









