ఒక్క కోడిని కూడా చంపకుండా చికెన్ తినడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రీగన్ మోరిస్, జేమ్స్ కుక్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
విన్‌స్టన్ చర్చిల్ 1931లో.. చికెన్‌లోని ఏదో ఒక భాగాన్ని తినడానికి దాన్ని మొత్తం పెంచడం వివేకహీనమని, కేవలం మనం తినే భాగాలను మాత్రం ప్రత్యేకంగా పెంచే రోజు ఏదో ఒకనాడు వస్తుందని అన్నారు.
87 ఏళ్ల అనంతరం ఆ రోజు వచ్చింది. జస్ట్ అనే అమెరికన్ ఆహారసంస్థ కోడి కణాలతో తయారు చేసిన నగెట్స్ తయారు చేసింది. ఇవి అచ్చం మనం తినే మామూలు చికెన్ లాగానే ఉంటుంది.
దీనిని కల్చర్డ్ మీట్, సింథటిక్, ఇన్ విట్రో అనే రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. లేబరేటరీలో తయారు చేస్తున్న ఈ కోడి మాంసం చాలా పరిశుభ్రమైనది కూడా అని జస్ట్ చెబుతోంది.
చిన్న బయోరియాక్టర్‌లో ఒక చికెన్ నగెట్‌ను తయారు చేయడానికి రెండు రోజులు పడుతుంది. దీనిలో కోడి కణాల సంఖ్యను పెంచడానికి ప్రొటీన్‌ను ఉపయోగిస్తారు. ఈ ఏడాది చివరినాటికి ఇలాంటి నగెట్స్ అన్ని రెస్టారెంట్లలో ఉంటాయని జస్ట్ సీఈఓ జోష్ టెట్రిక్ తెలిపారు.
''మనం ఇప్పటికే గుడ్లు, ఐస్ క్రీమ్, వెన్నవంటి వాటిని మొక్కల నుంచి తయారు చేస్తున్నాం. అలాగే ఇప్పడు కణాలతో మాంసాన్ని తయారు చేస్తున్నాం. ఇందుకోసం ఒక జంతువును చంపాల్సిన అవసరం లేదు.'' అన్నారు జోష్.

ఫొటో సోర్స్, Getty Images
కృత్రిమ మాంసం రుచి ఎలా ఉంది?
రుచిలో ఇవి అచ్చం చికెన్ నగెట్స్‌లాగే ఉన్నాయి. వాటి లోపలి భాగం మెక్‌డొనాల్డ్స్ లేదా కేఎఫ్‌సీల చికెన్ నగెట్స్ కన్నా మరింత మెత్తగా ఉంది.
టెట్రిక్‌తో పాటు ఇంకా చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్లు ఇలాంటి 'సెల్యూలార్ మీట్' తయారీ కోసం కృషి చేస్తున్నారు. తినడం కోసం జంతువులను చంపడం ఆపేయాలని, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షాంచలని వాళ్లు భావిస్తున్నారు. భూగోళాన్ని నాశనం చేయకుండా పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని ఎలా సమకూర్చాలన్న సమస్యకు వారు పరిష్కారాలు అన్వేషిస్తున్నారు.
ఈ కోడి మాంసం జన్యు పరివర్తన (జీఎమ్) తరహా మాంసం కాదని, దీనిని పెంచడానికి ఎలాంటి యాంటీ బయాటిక్స్ ఉపయోగించలేదని వారు స్పష్టం చేస్తున్నారు.
700 కోట్ల మంది ఆహారం కోసం మనం ఏటా 7 వేల కోట్ల జంతువులను చంపుతున్నామని భారత సంతతికి చెందిన కార్డియాలజిస్ట్ ఉమా వలేటి తెలిపారు. ఆయన అమెరికాలో ఇలా కణాల ద్వారా మాంసాన్ని ఉత్పత్తి చేసే ‘మెమ్‌ఫిస్ మీట్స్’ నెలకొల్పారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు పేదరికం నుంచి బైట పడుతున్న కొద్దీ మాంసానికి డిమాండ్ పెరుగుతోందని ఆయన తెలిపారు. 2050 నాటికి మనం 900 కోట్ల మంది ఆహార అవసరాలను తీర్చగల జంతువులను, కోళ్లను పెంచలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇలా కణాల ద్వారా మాంసాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియకు డచ్ సైంటిస్ట్ మార్క్ పోస్ట్ ఆద్యుడు. ఆయన 2013లో ప్రయోగశాలలో బర్గర్ తయారు చేశారు.
అయితే ఇప్పటివరకు ఏ సంస్థ కూడా కణాల నుంచి తయారు చేసిన హాంబర్గర్‌ను చవకైన ధరకు తయారు చేయలేకపోయింది. అది సాధ్యమైనా దానికయ్యే ఖర్చు చాలా ఎక్కువని మార్క్ అంటారు. ఆయన అంచనా ప్రకారం ఇలా కృత్రిమ మాంసం ద్వారా తయారు చేసే హాంబర్గర్ ధర ఒక్కోటి 800 రూపాయల వరకు ఉండొచ్చు.
ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో కణాల ద్వారా ప్రయోగశాలలో మాంసాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియలో అనేక డజన్ల కంపెనీలు ఉన్నాయి. బిల్ గేట్స్, రిచర్డ్ బ్రాన్సన్ లాంటి వారు కూడా ఇలాంటి టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టారు.
గ్లోబల్ వార్మింగ్, నీటి కాలుష్యానికి మన ఆహారం కోసం జంతువులను పెంచడం ఒక ప్రధాన కారణమని ఐక్యరాజ్య సమితి అంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
కృత్రిమ మాంసంపై ఎవరేమంటున్నారు?
ఇలా తయారు చేసిన ఉత్పత్తులపై 'లేబరేటరీలో ఉత్పత్తి చేసిన కృత్రిమ మాంసం' అనే ముద్ర ఉండాలని పశువుల పెంపకందారులు భావిస్తున్నారు. అప్పుడే వినియోగదారులకు తాము అందించే మాంసానికి, లేబరేటరీలో తయారు చేసిన దానికి మధ్య తేడా ఉంటుందని వారంటున్నారు.
రైతుల అభిప్రాయంతో మిసోరీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది. ఇక్కడ కేవలం పశువుల నుంచి చేసిన ఉత్పత్తులపై మాత్రమే మాంసం లేబుళ్లను అతికిస్తారు. ఇదే విధానాన్ని తమ రాష్ట్రాలలో కూడా అనుసరించాలని, అప్పుడే తమకు భద్రత ఉంటుందని ఇతర రాష్ట్రాలకు చెందిన పెంపకందారులు అంటున్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇలాంటి వాటిని వినియోగదారులు ఆమోదిస్తారా?
మాంసం అంటే ఒక ఫామ్‌లో పెంచినదై ఉండాలని చాలా మంది అమెరికన్లు భావిస్తున్నారు.
మనిషి సృష్టించింది ఏదైనా తినాలంటే తమకు భయమని మరికొందరు తెలిపారు.
అయితే ఇలా ప్రయోగశాలలో ఉత్పత్తి చేసిన మాంసం, సాంప్రదాయ మాంసంతో పోలిస్తే పూర్తిగా సురక్షితమని, దీని వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం లేదని జోష్ టెట్రిక్ తెలిపారు.
మానవుని అనుభవాలు ప్రగతి వైపే దారి తీస్తాయని, అందువల్ల ముందు ముందు ప్రజలు ఈ కృత్రిమ మాంసాన్ని తప్పక ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








