జర్నలిస్టు ఖషోగ్జీ చనిపోయారు.. కాన్సులేట్‌లో అధికారులతో ఘర్షణలో: సౌదీ ప్రభుత్వ టీవీ

జమాల్ ఖషోగ్జీ

ఫొటో సోర్స్, AFP/Getty

ఫొటో క్యాప్షన్, జమాల్ ఖషోగ్జీ

ఈ నెల 2న టర్కీ ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌ లోపలకు వెళ్లి అప్పట్నుంచి కనిపించకుండాపోయిన సౌదీ జర్నలిస్టు, వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్టు జమాల్ ఖషోగ్జీ అదే రోజు అక్కడే సౌదీ అధికారులకు, ఆయనకు మధ్య జరిగిన ఘర్షణలో చనిపోయారని సౌదీ ప్రభుత్వ టీవీ శనివారం తెలిపింది. ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం వెల్లడైందని చెప్పింది.

ఆయన మృతదేహాన్ని ఇస్తాంబుల్‌కు దగ్గర్లోని బెల్‌గ్రాడ్ అడవిలోగాని, లేదా వ్యవసాయ క్షేత్రంలోగాని పడేసి ఉంటారని కొందరు అధికారులను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి.

ఖషోగ్జీ మరణానికి బాధ్యుల్ని చేస్తూ సౌదీ నిఘా విభాగం ఉప సారథి (డిప్యూటీ చీఫ్) అహ్మద్ అల్-అసీరి, సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్‌ సలహాదారు సౌద్ అల్-ఖతానీలను డిస్మిస్ చేశారు. అహ్మద్ అల్-అసీరి యెమెన్ యుద్ధంలో సౌదీ ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికార ప్రతినిధిగా ఉన్నారు.

ఖషోగ్జీ కేసుకు సంబంధించి 18 మంది సౌదీ జాతీయులను అరెస్టు చేశామని, విచారణ కొనసాగుతోందని సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.

సౌద్ అల్ ఖతానీ ట్విటర్‌ ఖాతా

ఫొటో సోర్స్, TWIITER/@SUADQ1978

ఫొటో క్యాప్షన్, సౌదీ యువరాజు సల్మాన్‌ సలహాదారు సౌద్ అల్-ఖతానీకి ట్విటర్‌లో పది లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు

ఖషోగ్జీ చనిపోయినట్లు సౌదీ ప్రభుత్వం చెప్పడం ఇదే తొలిసారి. ఆయన కాన్సులేట్‌లోంచి స్వేచ్ఛగా వెళ్లిపోయారని ఇంతకాలం చెబుతూ వచ్చి, ఆయన అక్కడే మరణించినట్లు ఇప్పుడు అంగీకరించింది.

ఖషోగ్జీ మరణవార్తపై అమెరికా స్పందిస్తూ, తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఖషోగ్జీ కేసు దర్యాప్తునకు సంబంధించిన అన్ని అంశాలను నిశితంగా గమనిస్తామని చెప్పింది. సత్వరం, పారదర్శకంగా న్యాయం అందించాలని కోరింది.

ఖషోగ్జీ ఉదంతం నేపథ్యంలో, సౌదీ గూఢచార సంస్థలను పునర్ వ్యవస్థీకరించాలని యువరాజు సల్మాన్ నిర్ణయించారని, ఇందుకోసం ఒక మినిస్టీరియల్ కమిటీ ఏర్పాటుకు ఆదేశించారని వార్తలు వస్తున్నాయి.

వీడియో: సౌదీ కాన్సులేట్ వద్ద ఏం జరిగింది?

వీడియో క్యాప్షన్, వీడియో: ఆ రోజు ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ దగ్గర ఏం జరిగింది?

హటీస్ చెంగిజ్ అనే టర్కీ మహిళతో తన వివాహానికి అవసరమైన పత్రాలను తీసుకొనేందుకు ఖషోగ్జీ ఈ నెల 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌ లోపలకు వెళ్లారు.

''ఖషోగ్జీ హత్యకు గురైనట్లయితే కేవలం ఖండనలు సరిపోవు. దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలి'' అని హటీస్ చెంగిజ్‌ ఆయన మరణవార్త వెలువడక ముందు డిమాండ్ చేశారు.

ఖషోగ్జీ అదృశ్యం కేసు గురించి టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయీప్ ఎర్డోగన్‌తో సౌదీ యువరాజు సల్మాన్ ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఈ అంశంపై సౌదీ ప్రభుత్వ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

కేసు దర్యాప్తుకు సంబంధించి టర్కీ ఇచ్చిన సమాచారం ఆధారంగా సౌదీ చర్యలు చేపట్టింది.

అనుమానం వ్యక్తంచేసిన అమెరికన్ సెనేటర్

ఖషోగ్జీ మరణంపై అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహయ్ అనుమానం వ్యక్తంచేశారు.

''ఖషోగ్జీ కాన్సులేట్‌లోంచి వెళ్లిపోయుంటారని మొదట్లో చెప్పారు. ఆయన విషయంలో సౌదీ అరేబియా ప్రమేయమేమీ లేదన్నారు. కాన్సులేట్‌లో గొడవ జరిగిందని, అందులో ఆయన చనిపోయారని ఇప్పుడు చెబుతున్నారు. ఇదంతా సౌదీ యువరాజుకు తెలియకుండానే జరిగిందా'' అని సెనేటర్ వ్యాఖ్యానించారు.

సౌదీ ఇంతకాలం వినిపించిన వాదన టర్కీ భద్రతా విభాగంలోని విశ్వసనీయ వర్గాలు స్థానిక పత్రికలకు వెల్లడించిన సమాచారానికి విరుద్ధంగా ఉందని బీబీసీ దౌత్య ప్రతినిధి జేమ్స్ లాన్స్‌డేల్ చెప్పారు.

''ఖషోగ్జీని సౌదీ అధికారులు చిత్రహింసలు పెట్టారని, ఎముకలు కోసే రంపం(బోన్‌ సా)తో ఆయన శరీరాన్ని ముక్కలు చేశారని టర్కీ భద్రతా విభాగంలోని విశ్వసనీయ వర్గాలు స్థానిక మీడియాతో చెప్పాయి. ఆయన ఘర్షణలో చనిపోయారని సౌదీ చెబుతోంది. ఆయన మరణం వెనక కుట్ర లేదని సౌదీ పరోక్షంగా చెబుతోంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది అపహరణ యత్నం వికటించి, దాన్ని కప్పిపెట్టేందుకు హత్య చేసిన సందర్భంలో వినిపించే వివరణలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

''అహ్మద్ అల్-అసీరి, సౌద్ అల్-ఖతానీ యువరాజు సల్మాన్ బృందంలో కీలకమైనవారని, ఖషోగ్జీ హత్య గురించి యువరాజుకు తెలుసనే ఆరోపణలు రాకుండా ఉండేందుకే వీరిద్దరిపై వేటు వేశారని ఒక పాశ్చాత్య దౌత్యవేత్త అన్నారు. ఈ ఎత్తుగడ ఎంతమేర ఫలితమిస్తుందో చూడాల్సి ఉంది. ఖషోగ్జీ ఉదంతం నేపథ్యంలో, యువరాజు సల్మాన్ అధికారాలకు కత్తెర పడొచ్చని కొందరు పాశ్చాత్య దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సల్మాన్ తర్వాతి స్థాయిని మరో రాకుమారుడికి కట్టబెట్టి, ఆయన్ను ఇంకో అధికార కేంద్రం చేసే అవకాశముందని చెబుతున్నారు'' అని బీబీసీ ప్రతినిధి తెలిపారు.

సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్

సౌదీ కాన్సులేట్‌లో ఖషోగ్జీ హత్యను నిరూపించే ఆడియో, వీడియో సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని టర్కీ అధికారులు ఇంతకుముందు నుంచి చెబుతున్నారు.

ఖషోగ్జీని విచారిస్తున్నప్పుడు, చిత్రహింసలు పెడుతున్నప్పుడు రికార్డయిన మాటలు, ఆర్తనాదాల ఆడియో తమకు లభించిందని చెబుతూ కొన్ని టర్కీ వార్తాపత్రికలు కథనాలు ప్రచురించాయి. సదరు ఆడియోలోని వివరాలను వెల్లడించాయి. ఇవి టర్కీ ప్రభుత్వంతో దగ్గర సంబంధాలున్న పత్రికలు.

ఖషోగ్జీ అదృశ్యమైన రోజు ఇస్తాంబుల్‌కు వచ్చి, వెళ్లిపోయిన 15 మంది బృందాన్ని గుర్తించారని, వీరిని సౌదీ ఏజెంట్లుగా అనుమానిస్తున్నారని టర్కీ మీడియా తెలిపింది.

ఖషోగ్జీ ఆచూకీ తెలియడం లేదని ఈ నెల 3న టర్కీ ప్రకటించింది. ఆయన కాన్సులేట్‌లోనే హత్యకు గురయ్యారని భావిస్తున్నామని టర్కీ అధికారులు ఈ నెల 7న బీబీసీకి వెల్లడించారు. అప్పుడు సౌదీ ఈ సమాచారాన్ని ఖండించింది.

ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో టర్కీ ఫోరెన్సిక్ సైన్స్ విభాగం సిబ్బంది తనిఖీలు నిర్వహించారు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో టర్కీ ఫోరెన్సిక్ సైన్స్ విభాగం సిబ్బంది తనిఖీలు నిర్వహించారు

ఖషోగ్జీ: ఎందుకంత ముఖ్యమైన వ్యక్తి?

అల్-వతన్ అనే వార్తాపత్రికకు ఖషోగ్జీ ఎడిటర్‌గా చేశారు. సౌదీ యువరాజు సల్మాన్‌ను ఆయన ఎప్పట్నుంచో విమర్శిస్తున్నారు. అయితే సౌదీ రాజకుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకప్పుడు సౌదీ సీనియర్ అధికారులకు సలహాదారుగా కూడా ఉండేవారు.

సౌదీ అరేబియా వ్యవహారాలపై గట్టి పట్టున్న ఖషోగ్జీ 2017లో అమెరికాకు వెళ్లారు. అసమ్మతి స్వరం వినిపిస్తున్న వారిపై సల్మాన్ ఆదేశాల మేర జరుగుతున్న అణచివేత నుంచి బయటపడడం కోసం తన దేశం నుంచి తనను తానే వెలి వేసుకుంటున్నానని ఆయన ప్రకటించారు. గత ఏడాది నుంచి ఆయన అమెరికాలోనే ఉంటున్నారు.

అరబిక్ వార్తాపత్రిక అల్-హయత్‌లో తన వ్యాసాల ప్రచురణను నిలిపివేయాలని పబ్లిషర్‌ను సౌదీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఖషోగ్జీ ఆరోపించారు. తనను ట్వీట్లు కూడా చేయొద్దని చెప్పిందన్నారు.

అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్‌కు వ్యాసాలు రాయడం మాత్రం ఖషోగ్జీ మానలేదు. పశ్చిమ దేశాల మీడియాలోనూ ఆయన ఎన్నో సార్లు కనిపించారు.

సౌదీలో కొనసాగుతున్న ఏక వ్యక్తి పాలనపై నిరుడు నవంబరులో బీబీసీ ప్రసారం చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఆందోళన వ్యక్తపర్చారు.

"నా పిల్లలు, మనవళ్లు, మనవరాళ్ల గురించి నాకు బెంగగా ఉంది. సౌదీ అరేబియాలో ఏకవ్యక్తి పాలన ఆందోళన కలిగిస్తోంది. సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. ఏకవ్యక్తి పాలన ఏ దేశంలోనైనా పతనానికే దారితీస్తుంది. అది సౌదీ అరేబియా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇరాక్ కావచ్చు" అని ఆ ఇంటర్వ్యూలో ఖషోగ్జీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)