చైనా: 2009 తర్వాత అత్యల్ప వృద్ధి రేటు నమోదు

ఫొటో సోర్స్, Getty Images
తాజా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాను నిరాశపరిచాయి. యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన 2008 ఆర్థిక మాంద్యం తర్వాత చైనాలో ఇప్పుడు అత్యల్ప వృద్ధి రేటు నమోదైంది.
ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదైనట్లు చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది.
అంతకుముందటి త్రైమాసికంలో 6.7 శాతంగా నమోదైంది. ఈ వ్యత్యాసం చూసేందుకు చాలా తక్కువగానే కనిపిస్తున్నా... 2008-09 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత దశాబ్ద కాలంలో చైనా వృద్ధి రేటు ఇంతగా నెమ్మదించడం ఇదే తొలిసారి.
తీవ్ర ఆర్థిక మాంద్యం తర్వాత 2009 తొలి త్రైమాసికంలో 6.2 శాతం వృద్ధి నమోదైంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య యుద్ధం, అధిక రుణ భారం లాంటి సమస్యలతో చైనా ఆర్థిక వ్యవస్థ సతమతమవుతోంది.
జూలై తర్వాత చైనా వస్తువులపై ట్రంప్ రెండుసార్లు భారీగా సుంకాలు పెంచారు. దాంతో దాదాపు 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఎగుమతులపై ప్రభావం పడింది.
ఆ పరిణామాల తర్వాత బీజింగ్ తన ఆర్థిక ఫలితాలు విడుదల చేయడం ఇదే తొలిసారి.
అనూహ్య వాణిజ్య యుద్ధం ప్రభావం రానున్న నెలల్లో చైనా వృద్ధి రేటుపై మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చైనా తన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని తాజా ఫలితాలు తెలియజేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కరిష్మా వస్వాని, ఆసియా బిజినెస్ కరస్పాండెండ్ విశ్లేషణ
ఇటీవల బీజింగ్ వెళ్లినప్పుడు ఒక చైనా ఆర్థిక రంగ విశ్లేషకుడు నాతో మాట్లాడారు. ప్రస్తుతం తమదేశం వాణిజ్య యుద్ధాన్ని కోరుకోవడంలేదని, తన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టుకునే పనిలోనే తలమునకలై ఉందని అన్నారు.
ప్రస్తుతానికి చైనా పాలకవర్గం ముందు పెద్దగా ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించడంలేదు. మోయలేని రుణ భారంతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.
ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు 2008 ఆర్థిక మాంద్యం తర్వాత లాగా ఇప్పుడు పదునైన నిర్ణయాలు తీసుకోలేకపోతోంది.
అంటే, ప్రస్తుతం చైనా అశ్వదళం లేకుండానే రెండు వైపులా పోరాడుతోందన్నమాట. అందులోనూ అమెరికా పాలకవర్గం రూపంలోని చంచల స్వభావం గల ప్రత్యర్థితో పోరాడుతోంది.
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కూడా చైనా ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను తగ్గించాయి. వాణిజ్య యుద్ధం తదనంతర పరిణామాల కారణంగా 2019లో చైనా వృద్ధి రేటు 6.2 శాతానికి పరిమితం కావచ్చునని అంచనా వేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక కష్టాలు
కొన్నేళ్లుగా ఎగుమతులపై ఆశలు తగ్గించుకున్న చైనా, దేశీయ వినియోగంపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అదే సమయంలో ఆర్థిక వృద్ధిని నిలకడగా కొనసాగిస్తూ... రుణ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేసింది.
మరోవైపు, అమెరికాతో వాణిజ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో తన ఆర్థిక వ్యవస్థను కుదురుగా ఉంచేందుకు కొన్ని సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా బ్యాంకుల వద్ద ఉండాల్సిన కనీస నగదు నిల్వల పరిమితిని తగ్గించింది. దాంతో దాదాపు 750 బిలియన్ యువాన్ల నగదు ఆర్థిక వ్యవస్థలోకి వచ్చింది.
శుక్రవారం విడుదలైన మరో నివేదిక ప్రకారం, సెప్టెంబర్‌లో ఉత్పత్తి వృద్ధి రేటు కూడా అంచనాలను అందుకోలేదని తేలింది. అయితే, రిటైల్ అమ్మకాల విషయంలో మాత్రం ఊహించిన దానికంటే కాస్తంత మెరుగైన ఫలితాలే నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనా: సినీ నటుల పారితోషికాలపై పరిమితి విధించిన ప్రభుత్వం
- ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
- వారెన్ బఫెట్ భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదు?
- భారత్కు ఎస్-400: ‘ఇంతకన్నా మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు’
- ఒకప్పటి 'దెయ్యాల ఊరు'.. ఇప్పుడు పర్యాటకులకు 'స్వర్గధామం'
- చరిత్రలో కనిష్ఠ స్థాయికి రూపాయి: ఈ పతనం ఎందుకు?
- రూపాయికి ఏమేం కొనొచ్చో చూడండి
- చిన్నపిల్లలకు గ్రోత్ హార్మోన్లు.. బ్రోకర్ల దారుణాలు
- ‘పోలియో వ్యాక్సిన్ కలుషితమైంద'నే ప్రచారంలో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








