అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా

చైనా కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాతో వాణిజ్య పోరు ముదురుతున్న తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేలా ద్రవ్య లభ్యత పెంచేందుకు చైనా సెంట్రల్ బ్యాంకు 'పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా' చర్యలు చేపడుతోంది.

ఈ మేరకు దేశంలోని బ్యాంకులు తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన కనీస నగదు నిల్వ శాతాన్ని సెంట్రల్ బ్యాంకు మరోసారి తగ్గించనుంది.

ఈ చర్యతో 10,900 కోట్ల డాలర్ల (75 వేల కోట్ల యువాన్ల) నగదు అదనంగా చైనా ఆర్థిక వ్యవస్థలో అందుబాటులోకి వస్తుంది.

కనీస నగదు నిల్వ శాతాన్ని తగ్గించడం ఈ ఏడాది ఇది నాలుగోసారి.

ప్రస్తుత నిబంధనల ప్రకారం కనీస నగదు నిల్వ భారీ వాణిజ్య బ్యాంకులకు 15.5 శాతంగా, చిన్న బ్యాంకులకు 13.5 శాతంగా ఉంది. ఈ పరిమితిని వంద బేసిస్ పాయింట్లు (అంటే ఒక్క శాతం) తగ్గిస్తున్నామని, ఈ నిర్ణయం ఈ నెల 15న అమల్లోకి వస్తుందని సెంట్రల్ బ్యాంకు ప్రకటించింది.

ఈ సడలింపుతో బ్యాంకులు ఒకదానికి మరొకటి, అలాగే వినియోగదారులకు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.

అమెరికా, చైనాల పోరును ప్రతిబింబించే చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

వాణిజ్య యుద్ధంతో ప్రతికూల ప్రభావం

వాణిజ్య యుద్ధంలో అమెరికా, చైనా ఒకదానిపై మరొకటి పోటాపోటీగా సుంకాలు విధించుకొంటున్నాయి.

చైనా ఎగుమతుల్లో దాదాపు సగం ఎగుమతులపై అమెరికా సుంకాల భారాన్ని మోపింది. తమ దేశంలోకి చైనా చేసే ఎగుమతులన్నింటినీ లక్ష్యంగా చేసుకొంటామని హెచ్చరించింది.

వాణిజ్య యుద్ధంతో చైనా తయారీ రంగానికి, ఎగుమతులకు ముప్పు పొంచి ఉంది. వాణిజ్య పోరు చైనా స్టాక్ మార్కెట్‌, కరెన్సీపై, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందనే సంకేతాలున్నాయి.

''అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో చైనా ఆర్థిక వృద్ధిపై నేరుగా ప్రభావం పడుతోంది. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు చైనా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలభ్యతను పెంచుతోంది'' అని డీబీఎస్ ఇటీవల ఒక పరిశోధనా పత్రంలో వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)