యాపిల్, అమెజాన్, అమెరికా గూఢచార సంస్థల డేటాను తస్కరించిన చైనా హ్యాకర్లు

ఫొటో సోర్స్, AFP
యాపిల్, అమెజాన్ సహా అమెరికాకు చెందిన వివిధ కంపెనీలు, ఫెడరల్ ఏజెన్సీల డేటాను చైనా హ్యాకర్లు తస్కరించారని 'బ్లూమ్‌బర్గ్' వార్తాసంస్థ తెలిపింది.
''చైనా కంపెనీ 'సూపర్ మైక్రో కంప్యూటర్' తయారు చేసిన సర్వర్ సర్క్యూట్ బోర్డుల్లో అమర్చిన చిన్నపాటి చిప్‌ల ద్వారా హ్యాకర్లు డేటా తస్కరణకు పాల్పడ్డారు. తయారీ దశలోనే ఈ సర్వర్లలో భద్రతాపరమైన లోపాలకు బీజం పడింది'' అని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.
సూపర్ మైక్రో కంప్యూటర్ తయారుచేసిన హార్డ్‌వేర్‌ను అమెరికాలోని ప్రధాన బ్యాంకులు కూడా తీసుకున్నాయి.
ఈ హ్యాకింగ్‌పై తమ ప్రతినిధులు జోర్డాన్ రాబర్ట్‌సన్, మైకేల్ రైలీ ఏడాదిపాటు పరిశోధన జరిపారని, ఈ దాడి గురించి ఆధారాలను సేకరించారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఈ దాడితో 30 పెద్ద కంపెనీలు, అనేక ఫెడరల్ సంస్థల డేటా చైనాకు లభించిందని చెప్పింది. సర్వర్ నమూనాపై లోతైన అవగాహన ఏర్పరచుకోవడం, సర్వర్ల తయారీ కర్మాగారంలో కంపోనెంట్లను తారుమారు చేయడం ఈ పథకంలో భాగమని పేర్కొంది.
2015లో అమెజాన్ భద్రత తనిఖీలు చేపట్టినప్పుడు ఈ దాడి ఆనవాళ్లు తొలిసారి బయటపడ్డాయని ఈ వార్తాసంస్థ వెల్లడించింది. అమెరికా సంస్థ 'ఎలిమెంటల్' సర్వర్లను వినియోగించబోయే ముందు ఈ తనిఖీలు జరిగాయని చెప్పింది. ఈ సర్వర్లను సూపర్ మైక్రో కంప్యూటర్ చైనాలోని తన పరిశ్రమల్లో తయారు చేసిందని తెలిపింది.
తనిఖీల్లో అమెజాన్ ఈ విషయాన్ని గుర్తించిన తర్వాత అమెరికా గూఢచార సంస్థలు అత్యంత గోప్యంగా సుదీర్ఘ విచారణ చేపట్టాయని బ్లూమ్‌బర్గ్ చెప్పింది. ''రక్షణ శాఖ డేటా సెంటర్లలో, యుద్ధనౌకల్లో ఇలాంటి లోపభూయిష్ట సర్వర్లు ఉన్నట్లు గూఢచార సంస్థలు కనుగొన్నాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డ్రోన్లు సేకరించే డేటాను నిర్వహించే సర్వర్ల జాబితాలోనూ ఈ సర్వర్లు ఉన్నట్లు గుర్తించాయి'' అని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోని 90 శాతం పర్సనల్ కంప్యూటర్లు చైనాలోనే తయారవుతాయని, ఇలాంటి దాడి చేయగల సామర్థ్యం చైనాకు బాగా ఉందని బ్లూమ్‌బర్గ్ వ్యాఖ్యానించింది.
అమెరికా గూఢచార సంస్థల విచారణలో వెల్లడైన సమాచారం నేపథ్యంలో కొన్ని అమెరికా కంపెనీలు సూపర్ మైక్రో కంప్యూటర్ తయారుచేసిన సర్వర్లను తీసేశాయని, కొన్ని కంపెనీలు ఈ కంపెనీతో వ్యాపార సంబంధాలు తెంచుకున్నాయని వార్తాసంస్థ చెప్పింది.
బ్లూమ్‌బర్గ్ సమాచారాన్ని యాపిల్, అమెజాన్, సూపర్ మైక్రో కంప్యూటర్ సంస్థలు తోసిపుచ్చాయి. ఇది అవాస్తవ సమాచారమని వ్యాఖ్యానించాయి.
హార్డ్‌వేర్ మార్పులు జరిగాయని చెప్పే ఆధారాలేవీ లేవని అమెజాన్ తన ప్రకటనలో తెలిపింది.
ఈ ఆరోపణలతో బ్లూమ్‌బర్గ్ తమను చాలాసార్లు సంప్రదించిందని యాపిల్ తెలిపింది. సంప్రదించిన ప్రతిసారి క్షుణ్నంగా అంతర్గత తనిఖీలు నిర్వహించామని, భద్రతా లోపంపై ఒక్కసారి కూడా ఏ ఆధారమూ దొరకలేదని చెప్పింది.
ఈ అంశంపై ఏదైనా ప్రభుత్వ సంస్థ దర్యాప్తు చేస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని సూపర్ మైక్రో కంప్యూటర్ పేర్కొంది. చైనా హ్యాకర్ల నుంచి ముప్పుందనే కారణంతో తమ ఉత్పత్తులు కొనడాన్ని ఏ కంపెనీ ఆపేయలేదని తెలిపింది.
బ్లూమ్‌బర్గ్ ఆరోపణ అసంబద్ధమైనదని చైనా విదేశీ వ్యవహారాలశాఖ వ్యాఖ్యానించింది.
డేటా తస్కరణ జరగలేదన్న ఆయా సంస్థల వ్యాఖ్యలను బ్లూమ్‌బర్గ్ తోసిపుచ్చింది. అమెరికాలోని ఆరుగురు ప్రస్తుత, మాజీ జాతీయ భద్రతాధికారులతోపాటు గూఢచార సంస్థల విచారణ, తదనంతర పరిణామాలపై యాపిల్, అమెజాన్ సంస్థల్లోని కొందరు వ్యక్తులు తమకు ఇచ్చిన సమాచారం ఈ వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉందని చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- తన ఆధార్ డేటా హ్యాక్ చేయాలని ట్రాయ్ చీఫ్ సవాల్.. ‘చేసి చూపించిన’ గుజరాత్ యువకుడు
- మైక్రోసాఫ్ట్: ‘రష్యా పొలిటికల్ హ్యాక్’ను విజయవంతంగా అడ్డుకున్నాం
- ఫేస్‌బుక్: ‘భద్రతాలోపం.. హ్యాకింగ్ బారిన 5 కోట్ల మంది యూజర్ల ఖాతాలు’
- ‘ఒత్తిడికి గురైతే ఒళ్లు పెరుగుతుంది’ జాగ్రత్త!!
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- భారత్‌లో షాడో బ్యాంకింగ్ సంక్షోభం.. రూ.88504 కోట్ల అప్పుల్లో ఐఎల్ఎఫ్ఎస్
- బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’: కళ్లకు కడుతున్న ఫొటోలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








