భారత్‌లో షాడో బ్యాంకింగ్ సంక్షోభం.. రూ.88504 కోట్ల అప్పుల్లో ఐఎల్ఎఫ్ఎస్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డెవినా గుప్తా, పూజా అగర్వాల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
భారతదేశం ఇప్పుడు ఒక ఆర్థిక సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇందులో కేంద్ర బిందువుగా ఉన్నది ఏదో పేద్ద కార్పొరేట్ బ్యాంక్ కాదు. షాడో బ్యాంక్ అని వ్యవహరించే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ.. అంటే బ్యాంకేతర ఆర్థిక సంస్థ.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ఎఫ్ఎస్) అనే ఈ సంస్థ అనూహ్యంగా 1,208 కోట్ల డాలర్లు అంటే రూ.88504 కోట్లు బకాయిపడింది. ఇది ఆర్థిక వ్యవస్థను కష్టాల్లోకి నెడుతుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అరుదైన చర్య చేపట్టక తప్పని పరిస్థితి తలెత్తిందని నిపుణులు చెప్తున్నారు.
ఈ సంస్థను భారత ప్రభుత్వం సోమవారం తన అధీనంలోకి తీసుకుంది. సంస్థ బోర్డును రద్దుచేసి.. ఆరుగురు సభ్యులను నామినేషన్‌తో నియమించింది.

ఫొటో సోర్స్, Sumedh Kadoo
ఇదెలా మొదలైంది?
1987లో భారతదేశంలో మౌలికసదుపాయాల నిర్మాణం ఊపందుకుంది. రహదారుల నుంచి జలమార్గాల వరకూ.. భారత నగరాలు అనుసంధానం కోసం, సులభమైన రవాణా కోసం వేచి చూస్తున్నాయి.
అప్పుడు కొన్ని బ్యాంకులు కలిసి ఒక బ్యాంకేతర రుణ సంస్థను ఏర్పాటు చేశాయి. అదే ఐఎల్ఎఫ్‌ఎస్.
మౌలికసదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించటంతోపాటు సాంకేతిక పరిష్కారాలను కూడా ఇవ్వటం ఈ సంస్థ ఏర్పాటు వెనుక ఉద్దేశం.
బ్యాంకులకు - బ్యాంకేతర సంస్థలకు ఉన్న ప్రధాన తేడా.. బ్యాంకులు డిపాజిట్లు తీసుకోవచ్చు. బ్యాంకింగ్ సర్వీసుల మీద ఆధారపడవచ్చు. నాన్‌బ్యాంకింగ్ సంస్థ షార్ట్, లాంగ్ టెర్మ్ బాండ్ల ద్వారా నిధులు సమీకరించుకుంటుంది.
వ్యవస్థాగత మదుపుదారులు కూడా ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఐఎల్ఎఫ్ఎస్‌లో అత్యధిక పెట్టుబడి పెట్టిన సంస్థ.. భారతదేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీ. ఐఎల్ఎఫ్ఎస్‌లో 25.3 శాతం వాటా ఎల్ఐసీదే. జపాన్‌కు చెందిన ఓరిక్స్ కార్పొరేషన్‌కి 23.5 శాతం, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి 12.6 శాతం చొప్పున ఈ సంస్థలో వాటాలు ఉన్నాయి.
ఈ సంస్థలోని నిధులను వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులుగా పెట్టారు.
వ్యవస్థాపితమైనప్పటి నుంచీ ఇప్పటివరకు 169 అనుబంధ సంస్థలను ఐఎల్ఎఫ్ఎస్ ఏర్పాటు చేసింది. ఐఎల్ఎఫ్ఎస్ పెట్టుబడులను ఆయా అనుబంధ సంస్థలు నిర్వహిస్తాయి. ఇలా దాదాపు 31 ఏళ్ల పాటు సాగించిన కార్యకలాపాల్లో పలు సాహసాలు కూడా చేసింది. ఫలితంగా ఇప్పుడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది.
ఆగిపోయిన ప్రాజెక్టులు, ఆలస్యమైన ప్రాజెక్టులు ఐఎల్ఎఫ్ఎస్‌ను గట్టి దెబ్బకొట్టాయి. రియల్ ఎస్టేట్ కొనుగోళ్లలో ప్రవేశించటం తిప్పికొట్టింది. డబ్బులు కరిగిపోతుండటంతో అనేక రుణాలను తిరిగి చెల్లించలేక చతికిలపడింది. ఇది నాన్‌బ్యాంకింగ్ రంగంపై మదుపుదారుల విశ్వాసాన్ని దెబ్బతీసింది.

ఫొటో సోర్స్, Arjuncm3/Wikipedia
ఈ ముప్పు ఎంత పెద్దది?
ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకులు 15 వేల కోట్ల డాలర్ల మేర బకాయిపడ్డ పరిస్థితుల్లో.. కార్పొరేట్ రుణగ్రహీతలకు ఈ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణాలు ఇస్తూ ఆ ఖాళీని భర్తీచేశాయి.
ప్రత్యేకించి.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు పెంపు కారణంగా.. ఎదుగుతున్న మార్కెట్లు, దేశీయ బ్యాంకుల నుంచి మదుపుదారులు తప్పుకోవటంతో దేశీయ బ్యాంకులు సైతం రుణాల వడ్డీ రేట్లను పెంచుతుండటంతో ఈ షాడో బ్యాంకులు స్థిరంగా వృద్ధి చెందాయి.
రాయిటర్స్ వార్తాసంస్థ చెప్తున్న ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో 11,400 షాడో బ్యాంకింగ్ కంపెనీలు ఉన్నాయి. వాటి మొత్తం బ్యాలెన్స్ షీట్ విలువ 30,400 కోట్ల డాలర్లు. ఈ సంస్థల రుణ ఖాతాలు కూడా బ్యాంకుల కన్నా దాదాపు రెట్టింపు పెరిగాయి.
ఇప్పుడు ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభంతో ఈ సంస్థల ఆర్థిక స్థిరత్వం మీద మదుపుదారుల విశ్వాసం సడలిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘చాలా నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నికర విలువ, ఆస్తుల నాణ్యత, క్రెడిట్ రేటింగ్‌ల మీద కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఉన్నాయి. మన దగ్గర చాలా ఎన్‌బీఎఫ్‌సీలు ఉన్నాయి. అవి బాగా విస్తరించాయి’’ అని మాజీ బ్యాంకర్ అనంత్ నారాయణ్ చెప్పారు.
ఇది గొలుసుకట్టు ప్రభావం చూపుతూ ఎన్‌బీఎఫ్‌సీల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే మూచ్యువల్ ఫండ్స్‌లో తమ డబ్బులు దాచిన లక్షల మంది మదుపుదారులకు తక్షణ ముప్పుగా కనిపిస్తోంది.
ఎన్‌బీఎఫ్‌సీల్లో మూచ్యువల్ ఫండ్స్ చేసిన ఫిక్స్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్లు గత నాలుగేళ్లలో రెండున్నర రెట్లు పెరిగి 3,300 కోట్ల డాలర్లకు చేరాయని ఒక అధ్యయనం చెప్తోంది. దీనికి ఐఎల్ఎఫ్ఎస్ ఒక మేల్కొలుపని ఈవీపీ మార్కెట్స్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్‌కి చెందిన నిపుణుడు సంజీవ్ భాసిన్ బీబీసీతో పేర్కొన్నారు.
ఈక్విటీ మార్కెట్లకు కూడా ఈ సెగ తగులుతోంది. దేవన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వంటి లిస్టయిన ఎన్‌బీఎఫ్‌సీల షేర్ల ధరలు కూడా గత వారంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
ప్రమాద సంకేతాలను విస్మరించారా?
కేవలం మూడు నెలల కిందటే మొదటి ప్రమాద సంకేతం కనిపించింది.
మూడు దశాబ్దాల పాటు ఐఎల్ఎఫ్ఎస్ చైర్మన్‌గా పనిచేసిన రవి పార్థసారథి.. అనారోగ్య కారణాలు చూపుతూ ఆ పదవి నుంచి వైదొలగారు.
అనంతరం రేటింగ్స్ తగ్గిపోయాయి. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ విభాగమైన రేటింగ్స్ సంస్థ ఐసీఆర్ఏ.. గత ఆగస్టులో ఐఎల్ఎఫ్ఎస్ రేటింగ్‌ను AAA నుంచి AA+ కు తగ్గించింది. రుణ బకాయిలు, డిబెంచర్లు దీనికి కారణం. ఈ రేటింగ్‌ను కూడా సెప్టెంబర్ చివరి నాటికి పలుమార్లు సమీక్షించారు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంకా ముందుగానే స్పందించి ఉండాల్సిందని నిపుణులు అంటున్నారు.
‘‘ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, బోర్డు, ఆడిటర్లు.. ఈ సంక్షోభాన్ని ఇంతలా పెరిగిపోనిచ్చారు. ముందుగా హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి. వాటిని ఎందుకు విస్మరించారనేది వెల్లడవాలంటే ఇప్పుడు లోతైన విచారణ అవసరం. ఈ సంక్షోభం నేర్పిన పాఠాలతో నియంత్రణ, పరిపాలన స్థాయి మెరుగుపడుతుందని ఆశించాలి’’ అని ఆర్థిక విశ్లేషకుడు, రచయిత ప్రంజాల్ శర్మ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు ఏం జరుగుతుంది?
‘‘ఐఎల్‌ఎఫ్ఎస్ విలువను, ఆస్తులను కాపాడటానికి ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయాత్మక చర్య చేపట్టింది’’ అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు.
ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఒక సంస్థను భారత ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవటం గత తొమ్మిదేళ్లలో ఇది రెండోసారి. 2009లో అప్పుడు అగ్రస్థాయిలో ఉన్న భారతీయ ఐటీ సంస్థ సత్యం కంప్యూటర్స్‌లో కార్పొరేట్ కుంభకోణం వెలుగుచూడటంతో నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఆ సంస్థను తన నియంత్రణలోకి తీసుకుని దాని తలరాతను మార్చేసింది.
ఇప్పుడు బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అదే పాత్రను పోషిస్తోంది.
ఐఎల్ఎఫ్ఎస్‌కు ఆరుగురు సభ్యుల బోర్డును ఏర్పాటు చేసింది. అందులో బ్యాంకింగ్, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రముఖులు ఉన్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈవో ఉదయ్ కోటక్, సెబీ మాజీ చైర్మన్ జి.ఎన్.బాజ్‌పాయ్, షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ మాలిని శంకర్, టెక్ మహీంద్ర ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నాయర్, ఐసీఐసీఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గిరీశ్‌చంద్ర చతుర్వేది, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నందకిశోర్- ఆ ఆరుగురు.
సంస్థను వీరు పునర్‌వ్యవస్థీకరిస్తారు. ప్రస్తుతమున్న ప్రాజెక్టులు ఆగిపోకుండా ఉండేందుకు కొత్తగా నిధులు సమకూరుస్తారు. ఆర్థిక అవకతవకల విషయంలో మోసం దర్యాప్తును ప్రారంభిస్తారు.
‘‘నిధుల అవసరాలు, అప్పులు తీర్చే మార్గాలను గుర్తించి వాటిని సంబంధితులందరికీ తెలియజేయటం ప్రధాన అంశం. ఇదో సంక్లిష్టమైన వ్యవస్థ. మొత్తం పరిస్థితి గురించి విస్పష్టంగా నిజాయతీగా చెప్పటం ఈ కొత్త టీం ముందున్న అతిపెద్ద సవాలు’’ అని మాజీ బ్యాంకర్ అనంత్ నారాయణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- నల్లడబ్బు స్విస్ బ్యాంకులకు ఎలా తరలిపోతోంది?
- ఎన్నికల ముందు ఇచ్చే ఉద్యోగ హామీలు తీరవెందుకు?
- బిగ్ బాస్-2: ’’ఈక్వల్ గేమ్ ఎలా అవుతుంది‘‘- బాబు గోగినేని
- బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’: కళ్లకు కడుతున్న ఫొటోలు
- ‘‘అత్యాచారం వ్యధ నుంచి నేనెలా కోలుకున్నానంటే...’’
- జస్టిస్ రంజన్ గోగోయ్: సొంత కారు లేని సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్
- పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు... 32 ఏళ్లుగా బాధను భరిస్తూనే ఉన్నాను
- గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఎర్రగా పుడతారా?
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








