బ్రిటిష్ వలస పాలనలో ‘జాత్యహంకారం’: కళ్లకు కడుతున్న ఫొటోలు

కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న భారతీయుని చిత్రం
ఫొటో క్యాప్షన్, కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న భారతీయుని చిత్రం
    • రచయిత, మహిమ ఎ జైన్
    • హోదా, లండన్

20వ శతాబ్దపు ప్రారంభంలో బొమ్మల పోస్టుకార్డులు ఒక రకమైన ఇన్‌స్టాగ్రామ్‌గా ఉపయోగపడేవి. అవి నాటి యూరోపియన్లకు బ్రిటిష్ వలస పాలన కింద ఉన్న భారతదేశంలోని ప్రజల గురించి వివరాలు తెలియజేసేవి.

ఇటీవల లండన్‌లోని ఎస్‌ఓఏఎస్ యూనివర్సిటీలో నిర్వహించిన ఒక ఎగ్జిబిషన్‌లో భారతదేశం నుంచి యూరప్‌కు పంపిన అలాంటి వెయ్యికి పైగా పోస్టుకార్డులను ప్రదర్శించారు. అవన్నీ 1900-1930ల మధ్యలో పంపినవి.

ఆ ఎగ్జిబిషన్ సహ క్యూరేటర్ స్టీఫెన్ పుట్నామ్ హ్యూజెస్ మాట్లాడుతూ.. ''ఆ పోస్టుకార్డులు వలస పాలన కాలం నాటి పురాస్మృతుల వాహకంగా ఉండాలనుకోవడం లేదు. దానికి భిన్నంగా, ప్రజలు వాటిని వలస పాలనకు సంబంధించిన సాక్ష్యాలుగా, వాటిని విమర్శనాత్మకంగా చూడాలని భావించాం'' అని తెలిపారు.

ఈ పోస్టుకార్డులను డాక్టర్ హ్యూజెస్, ఎమిలీ రోజ్ స్టీవెన్‌సన్‌ల ప్రైవేట్ కలెక్షన్ నుంచి సేకరించారు. వీరు ఈబేలాంటి వెబ్ సైట్ల నుంచి, పాత వస్తువుల విక్రయదారుల నుంచి కొనుగోలు చేశారు.

భారతదేశంలోని వివిధ కట్టడాలు, ఆలయాలు, ప్రజల పోస్టుకార్డులు

ఫొటో సోర్స్, Stephen Putnam Hughes and Emily Rose Stevenson

ఫొటో క్యాప్షన్, భారతదేశంలోని వివిధ కట్టడాలు, ఆలయాలు, ప్రజల పోస్టుకార్డులు

ఎగ్జిబిషన్ నిర్వాహకులు వెల్లడించిన వివరాల ప్రకారం, 1902-10 మధ్యకాలంలో బ్రిటిష్ తపాలా సేవ 600 కోట్లకు పైగా పోస్టుకార్డులు ఇలా చేరవేసింది.

''అక్షరాస్యతకు ప్రచురణ ఎంత మేలు చేస్తుందో, నాడు ఫొటోగ్రఫీకి పోస్టుకార్డులు అలా ఉపయోగపడ్డాయి'' అని డాక్టర్ హ్యూజెస్ తెలిపారు.

ఈ ఎగ్జిబిషన్‌లో కేవలం చెన్నై (గతంలో మద్రాసు), బెంగళూరుకు చెందిన చిత్రాలను ప్రదర్శించారు.

పోస్టుకార్డులను కేవలం రెండు వలస పాలన కాలం నాటి నగరాలకు పరిమితం చేయడం ద్వారా నాటి భారతీయులు, జాత్యహంకారం, నగరీకరణ, బ్రిటిష్ పాలనలో రోజువారీ జీవితం ఎలా ఉంటుంది అనే వివరాలను సమగ్రంగా తెలియజేసే ప్రయత్నం చేశారు.

ఈ పోస్టుకార్డులు తమదైన విధానంలో ఆయా నగరాలకు చెందిన చరిత్రను, విశేషాలను వివరిస్తాయని డాక్టర్ హ్యూజెస్ తెలిపారు.

చెన్నై(గతంలో మద్రాస్)లోని పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ కార్యాలయం

ఫొటో సోర్స్, Stephen Putnam Hughes and Emily Rose Stevenson

ఫొటో క్యాప్షన్, చెన్నై(గతంలో మద్రాస్)లోని పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ కార్యాలయం

పైన ఉన్న భవనం ఇప్పటికీ చెన్నైలో సిటీ పోస్ట్ ఆఫీస్‌గా పని చేస్తోంది.

అనేక పోస్టుకార్డులను పోగు చేయడం ద్వారా వలస పాలన కింద ఉన్న భారతదేశంలోని విశేషాలను వివరించే ప్రయత్నం చేశామని డాక్టర్ హ్యూజెస్ తెలిపారు.

ఈ ఎగ్జిబిషన్‌లోని పోస్టుకార్డులను ఆర్కిటెక్చర్, వీధుల్లో జీవితం, నాటి యూరోపియన్లు, స్థానికుల మధ్య సంబంధాల తదితర అంశాల ఆధారంగా వర్గీకరించారు.

బెంగళూరులోని ఒక వీధి చిత్రం పోస్టుకార్డు

ఫొటో సోర్స్, Stephen Putnam Hughes and Emily Rose Stevenson

ఫొటో క్యాప్షన్, బెంగళూరులోని ఒక వీధి చిత్రం పోస్టుకార్డు

ఆ రోజుల్లో వీధులు, ప్రభుత్వ భవనాల పోస్టుకార్డులకు బాగా డిమాండ్ ఉండేది. అవి భారతదేశంలోని నగరాల రూపకల్పనలో బ్రిటిష్ వారి దృక్పథాన్ని వివరిస్తాయి.

మాస్టర్స్ అనే ఒక ప్రజాదరణ పొందిన పోస్టుకార్డుల సిరీస్‌ను 1900 ప్రారంభంలో చెన్నైకు చెందిన ప్రచురణదారుడు ఒకరు ముద్రించారు.

వాటిలో కొన్ని తాము లేనప్పుడు భారతీయులు ఏం చేసేవారో అన్న బ్రిటిష్ పాలకుల ఆందోళనను, భయాన్ని వెల్లడిస్తాయి.

ఈ పోస్టుకార్డులలోని భారతీయులు మద్యం తాగుతూనో, కాళ్లు పైన పెట్టుకుని పేపర్ చదువుతూనో కనిపిస్తారు.

సేద తీరుతూ, తాగుతూ, పేపర్ చదువుతున్న భారతీయుల పోస్టుకార్డులు

ఫొటో సోర్స్, Stephen Putnam Hughes and Emily Rose Stevenson

ప్రముఖ ప్రచురణ సంస్థ హిగ్గిన్‌బాథమ్స్ అండ్ కో మరో వివాదాస్పద సిరీస్ 'మద్రాస్ హంట్' అన్న పోస్టుకార్డులను కూడా ముద్రించింది.

దీనిలో మహిళలను వరుసగా కూర్చోబెట్టి, ఒకరి తలలో ఒకరు పేలు చూసుకుంటున్నట్లు ఫొటో తీశారు. దీనిని బ్రిటిషర్ల వేటతో పోలుస్తూ ఎగతాళి చేయడం కనిపిస్తుంది.

తలలో పేలు చూసుకుంటున్న భారతీయ మహిళలు. ఎగతాళి చేసేందుకే వీరిని ఇలా కూర్చోబెట్టి ఫొటో తీశారు.

ఫొటో సోర్స్, Stephen Putnam Hughes and Emily Rose Stevenson

ఈ పోస్టుకార్డుల సిరీస్ రెచ్చగొట్టేదిగా, కించపరిచేదిగా, జాత్యహంకార పూరితంగా ఉందని క్యూరేటర్లు తెలిపారు. ఈ పోస్టుకార్డులను జర్మనీ, ఇటలీ, ఇంగ్లండ్‌లలో ముద్రించారు.

జాతి, కులం, మతం ఆధారంగా భారతీయులందరినీ ఎలా ఒకే గాటన కట్టేవారో కూడా ఈ పోస్టుకార్డులు వెల్లడిస్తాయి.

తన పిల్లాడిని ఎత్తుకున్న తలపాగా వ్యక్తి

ఫొటో సోర్స్, Stephen Putnam Hughes and Emily Rose Stevenson

యూరోపియన్ల కోసం చిన్నచిన్న పనులు చేసే భారతీయులు ఈ పోస్టుకార్డులన్నిటిలో కనిపించే ఒక సాధారణ లక్షణం.

శ్వేతజాతీయుడు స్నానం చేస్తుండగా తలపై నీళ్లు పోస్తున్న భారతీయుడు

'మార్నింగ్ టబ్' అనే పేరున్న ఈ పోస్టుకార్డు 20వ శతాబ్దపు మొదట్లో ముద్రించారు. ఇది యూరోపియన్లు స్నానం చేసేటప్పుడు భారతీయులు వాళ్లకు ఎలా సేవలు చేసేవారో వివరిస్తుంది.

''పోస్టుకార్డులన్నిటిలో భారతీయులు పని చేస్తూ కనిపిస్తారు. అదే సమయంలో సేవలు చేయించుకుంటున్న, విలాసాలను అనుభవిస్తున్న యూరోపియన్లు మాత్రమే వీటిలో ఉంటారు'' అని క్యూరేటర్లు వివరించారు.

బట్టలు మోసుకుపోతున్న రజకుడు

ఫొటో సోర్స్, Stephen Putnam Hughes and Emily Rose Stevenson

స్వదేశంలో పని మనుషులను నియమించుకునేంత తాహతు లేని యూరోపియన్లకు బ్రిటిష్ ఇండియాలో పెరిగిన తమ స్థాయిని చూపించుకోవడానికి ఇలాంటి పోస్టుకార్డులు బాగా ఉపయోపగపడేవి.

కొన్ని పోస్టుకార్డులపై కేవలం వృత్తులను సూచించే బొమ్మలు కనిపిస్తాయి.

''ఈ పోస్టుకార్డులు యూరోపియన్లకు భారతీయులపై ఉన్న మూసపోత అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది'' అని డాక్టర్ హ్యూజెస్ అంటారు.

ఆ కాలంలో ఆలయాలు, స్థానిక పండుగలకు సంబంధించిన పోస్టుకార్డులను ఎక్కువగా కొనేవారు.

జగన్నాథ రథయాత్ర

ఫొటో సోర్స్, Stephen Putnam Hughes and Emily Rose Stevenson

ఫొటో క్యాప్షన్, జగన్నాథ రథయాత్ర

ఇది నవంబర్, 1916 నాటి పోస్టుకార్డు. ఇది జగన్నాథ రథయాత్ర ఉత్సవాన్ని చూపుతోంది.

'భక్తులు తమంతట తాము రథం కింద పడిపోతారు' అని దీనిపై రాసి ఉంది.

ప్రజలు తమకై తాము వెళ్లి రథం కింద పడేవారు అని రాసి ఉన్న పోస్టుకార్డు

ఫొటో సోర్స్, Stephen Putnam Hughes and Emily Rose Stevenson

ఫొటో క్యాప్షన్, ప్రజలు తమకై తాము వెళ్లి రథం కింద పడేవారు అని రాసి ఉన్న పోస్టుకార్డు

అయితే ఇలాంటి ఫొటోలు హిందూ మతం అంటే ఒక గుడ్డి నమ్మకంపై ఆధారపడ్డ మూఢ మతం అనే దురభిప్రాయం కలుగజేస్తుందని డాక్టర్ హ్యూజెస్ అన్నారు.

''వలస ముద్రను తొలగించుకోవడం అన్నది ఒక్కసారిగా జరగదు. అది నిరంతర ప్రక్రియ. ప్రతి వ్యక్తి తనంతట తానుగా ఆ పని చేయాలి. మా ఎగ్జిబిషన్ ద్వారా ప్రతి వ్యక్తి అలా చేస్తారని మేం ఆశిస్తున్నాం'' అని డాక్టర్ హ్యూజెస్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)