సిపాయిల తిరుగుబాటు: పబ్‌లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర

- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''మా దగ్గర ఒక మనిషి పుర్రె ఉంది. దాంతో ఏం చేయాలో తోచడం లేదు..'' అని, 2014లో ప్రముఖ చరిత్రకారుడు కిమ్ వాగ్నర్‌కు మెయిల్ వచ్చింది. అప్పుడాయన లండన్‌లోని తన ఆఫీస్‌లో కూర్చొని ఉన్నారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఇద్దరు భార్యాభర్తలు మెయిల్ ద్వారా సంప్రదించి, తమ ఇంట్లో ఒక మనిషి పుర్రె ఉందని, దానితో ఏం చేయాలో తోచడం లేదని మెయిల్ చేశారని చెప్పారు.
ఈ పుర్రెకు కింది దవడ లేదు. కొన్ని దంతాలు పోయాయి. పుర్రె గోధుమ రంగులోకి మారింది. ఇది చాలా ఏళ్లనాటిదిగా అనిపిస్తోందని మెయిల్ సారాంశాన్ని వాగ్నర్ వివరించారు.
కానీ ఆ పుర్రెకు చెందిన పూర్తి సమాచారాన్ని ఒక కాగితంలో (నోట్) రాసి, ఆ పుర్రెలోనే ఉంచారు. ఆ కాగితం ఆ పుర్రె చరిత్రను ఇలా వివరించింది.
'ఇది ఆలమ్ బేగ్ కపాలం. ఇతను బెంగాల్‌లోని 46వ రెజిమెంట్‌కు చెందిన సైనికుడు. తోటి సైనికులతోపాటు ఇతడిని కూడా తుపాకితో కాల్చి చంపారు. 1857 సిపాయిల తిరుగుబాటులో ఆలమ్ బేగ్ ప్రధాన నాయకుడు. ఇతను అత్యంత దుష్ట స్వభావం కలవాడు. యూరోపియన్లు ప్రాణాలు రక్షించుకోవడానికి కోట వైపు పరుగులు పెడుతున్నారు. ఆలమ్ బేగ్ తన మార్బలంతో డా.గ్రాహమ్ గుర్రపు బండిపై మెరుపు దాడి చేసి, తన కూతురి ముందే గ్రాహమ్‌ను చంపాడు. ఆ తర్వాత, తన భార్యాపిల్లలతోపాటు పారిపోతున్న మిస్టర్ హంటర్‌పై పడ్డారు. హంటర్‌ను చంపాడు. ఆయన భార్యా, కూతుళ్లను కూడా దుర్మార్గంగా ఊచకోత కోసి, దారి పక్కనే పడవేశాడు' అని ఉంది.

ఆలమ్ బేగ్ వయసు 32 సంవత్సరాలు. ఎత్తు 5 అడుగుల ఏడున్నర అంగుళాలు. ఆల్ బేగ్‌ది క్రూరమైన ఆకారం.
ఈ కపాలం.. బెంగాల్‌కు చెందిన ఆలమ్ బేగ్ అనే ఒక భారతీయ తిరుగుబాటుదారుడిది అనే విషయాన్ని ఈ నోట్ స్పష్టం చేస్తూ ఉంది. సాయిల్‌కోట్(పంజాబ్ ప్రాంతంలోని ఒక పట్టణం. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది.)లో ఫిరంగి పేల్చి ఆలమ్ బేగ్‌ను చంపారు.
ఆలమ్ బేగ్‌కు మరణ శిక్ష విధించిన సందర్భంలో విధి నిర్వహణలో ఉన్న కెప్టెన్ కోస్టెల్లో ఆలమ్ కపాలాన్ని ఇంగ్లండ్ తీసుకుపోయారు. కానీ.. ఆలమ్ బేగ్ ఈ హత్యలు చేయడానికి కారణం మాత్రం ఆ కాగితంలో లేదు.
200 సంవత్సరాల బ్రిటీష్ పాలనలో 1857లో సిపాయిలు తిరుగుబాటు జరిగింది. తుపాకీ తూటాలకు భారతీయ సైనికుల మతం అంగీకరించని జంతువుల కొవ్వును పూశారు దీంతో భారతీయ సిపాయిలు తిరుగుబాటు చేశారు.
కిమ్ వాగ్నర్‌ను సంప్రదించిన భార్యాభర్తలు ఎస్సెక్స్‌లో నివసిస్తారు.. వారు ఆలమ్ బేగ్ గురించి ఇంటర్నెట్లో జల్లెడ పట్టారు కానీ అతని గురించిన ఏ సమాచారమూ లభించలేదు.
వాగ్నర్ ఓ చరిత్రికారుడు అని, 'ఇండియన్ అప్‌రైజింగ్' అనే పుస్తకం రచించారని తెలుసుకుని, దంపతులు వాగ్నర్‌ను సంప్రదించారు.
ఈ కపాలం వారి విజయానికి చిహ్నమా?
తన పుట్టినరోజున వాగ్నర్ ఆ దంపతులను కలిశారు. ఈ కపాలం గురించి ఆ దంపతులు వాగ్నర్‌కు వివరించారు. తమ బంధువులు కెంట్ ప్రాంతంలో 'ది లార్డ్ క్లైడ్' అనే పబ్‌ను 1963లో కోనుగోలు చేశారు.
ఆ పబ్ వెనక ఉన్న గదిలో పాత బాక్సులు ఉన్నాయి. అందులోని ఒక బాక్సులో ఈ పుర్రె దొరికిందని వారు అన్నారు.
కానీ ఆ పుర్రె ఆ పబ్‌కు ఎలా చేరిందో ఎవ్వరికీ తెలీదు. స్థానిక మీడియా 1963లో ఈ వార్త గురించి ప్రస్తావిస్తూ.. 'నరాలు చిట్లిపోయే ఆవిష్కరణ' అని పేర్కొంది.
ఆ పబ్ కొత్త యజమానులు ఒక ట్రోఫీ లాగ ఈ పుర్రెను చేతిలో పట్టుకుని గర్వంగా ఫోటోకు ఫోజిచ్చారు. ఆ తర్వాత పబ్‌లోనే ఈ పుర్రెను ప్రదర్శనకు పెట్టారు. ఈ యజమానులు మరణించాక, వారి బంధువుల వద్దకు ఈ పుర్రె చేరింది. వాళ్లేమో ఈ పుర్రెను మరుగున ఉంచేశారు.
''మళ్లీ అదే పుర్రెను బ్యాగులో పెట్టుకుని, ఆరోజు ఎస్సెక్స్ రైల్వేస్టేషన్‌లో నించున్నాను. ఇది మామూలు పుర్రె కాదు. ఒక చారిత్రక ఘటనతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పుర్రె ఇది. నేను ప్రతి సంవత్సరమూ నా విద్యార్థులకు బోధించే చరిత్రే నా బ్యాగులో ఉంది'' అని డా.వాగ్నర్ అన్నారు.
కానీ.. ఆ కాగితంలో ఉన్న చరిత్ర, ఈ పుర్రె ఒక్కటేనా అన్ని విషయాన్ని డా.వాగ్నర్ ధ్రువీకరించాల్సి ఉంది. లండన్‌లోని నాచురల్ హిస్టరీ మ్యూజియం ఈ పుర్రెను పరిశీలించి, ఇది 19 శతాబ్దం మధ్యకాలానికి చెందినదని, ముప్పైయ్యవ పడిలోని ఆసియా జాతికి చెందిన మగ వ్యక్తి పుర్రె అని చెప్పారు.

ఫొటో సోర్స్, DOVER KENT ARCHIVES
కానీ. ఆలమ్ బేగ్ గురించిన సమాచారం అంత త్వరగా దొరుకుతుందని వాగ్నర్ భావించడంలేదు. 1857, మార్చి 29న కోల్‌కతా శివార్లలో బ్రిటీష్ అధికారిపై మొదటి తూటా పేల్చిన మంగల్ పాండే.. బ్రిటీషర్లపై తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. అలాంటివారి గురించిన సమాచారం అందుబాటులో ఉన్నంతగా ఆ తిరుగుబాటులో పాల్గొన్న మామూలు సిపాయిల సమాచారం అందుబాటులో ఉండదు.
ఆలమ్ బేగ్ పేరును చరిత్రలోని డాక్యుమెంటు, ఉత్తరం, నివేదికల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. భారత్, ఇంగ్లండ్ దేశాల్లోని లైబ్రరీలు, ఆర్కైవ్‌లలో కూడా ఏ సమాచారం లేదు. ఆలమ్ బేగ్ తమ పూర్వీకుడు అని, ఆ పుర్రెను తమకు అప్పగించాలని ఇంతవరకూ ఎవ్వరూ ముందుకు రాలేదు.
ఈ పుర్రె గురించి ప్రస్తావించిన 'ది స్ఫియర్' వార్తా పత్రిక తన కథనంలో..
'బ్రిటీషర్లకు వ్యతిరేకంగా భారత్‌లో జరిగిన తిరుగుబాటులో మరణించిన ఒక సిపాయి పుర్రెను వైట్ హాల్‌లోని రాయల్ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్‌లో ఉంచారు. ఇది 49వ బెంగాల్ రెజిమెంట్‌కు చెందిన ఒక సిపాయి పుర్రె. 1858లో తుపాకులతో కాల్చి చంపిన 19 మంది సిపాయిలలో ఒకరిది. ఈ పుర్రెను ఒక సిగరెట్ల డబ్బాగా ఉపయోగిచడం మేం చూశాం.. అని పేర్కొంది.
''ఆ సమయంలో జరిగిన క్రూరమైన పరిణామాలను, స్థానికుల క్రూరత్వాన్ని, వారికి విధించిన క్రూరమైన శిక్షలను మేం అర్థం చేసుకోగలం. మనం విధించిన క్రూరమైన శిక్షలకు జ్ఞాపకంగా ఒక ప్రభుత్వ సంస్థలో ప్రదర్శనకు పెట్టడం దుర్మార్గం కాదా? ఈ కాలంలో ఇలాంటి ఘటనలను ఆమోదించగలమా?'' అని రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
తన చేతిలోని ఆధారం సహాయంతో డా.వాగ్నర్.. ఆలమ్ బేగ్ గురించి అధ్యయనం చేయడం మొదలు పెట్టారు. లండన్, దిల్లీలోని ఆర్కైవ్స్‌లో ఆయన గురించి వెతికారు. సాయిల్‌కోట్ వెళ్లి, 1857 జూలైలో నాలుగు రోజులపాటు యుద్ధం జరిగిన ట్రిమ్ము ఘాట్ ప్రాంతాన్ని గుర్తించేందుకు ప్రయత్నించారు. ఈ యుద్ధంలోనే ఆలమ్ బేగ్‌తోపాటు తక్కిన తిరుగుబాటుదారులను ఓడించి, బంధించారు.
''ఇంగ్లండ్, భారత్‌లో కొంతకాలం అధ్యయనం చేశాక, ఇది చాలా పెద్ద కథ అని అర్థమైంది. నేను చెప్పాల్సింది చాలా ఉంది'' అని వాగ్నర్ బీబీసీతో అన్నారు.
డిటెక్టివ్ నవల
వాగ్నర్ అధ్యయనం అనంతరం 'ది స్కల్ ఆఫ్ ఆలమ్ బేగ్' పేరుతో ఓ పుస్తకం రాశారు. 19వ శతాబ్దంలో బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన అతి పెద్ద తిరుగుబాటుగా అభివర్ణించిన సైనిక తిరుగుబాటు కాలంలో ఆలమ్ బేగ్ జీవితం, మరణం గురించి రాశారు.
'ఈ పుస్తకం ఒక డిటెక్టివ్ నవలలా అనిపిస్తుంది. ఆ కాలంలో బ్రిటీష్ పాలన, బ్రిటీష్ వలస పాలనలోని హింస తీవ్రతను అర్థ చేసుకోవడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది' అని ఆక్స్ఫ్‌ర్డ్ యూనివర్సిటీలో చరిత్రను బోధించే అసోసియేట్ ప్రొఫెసర్ యాస్మిన్ ఖాన్ అన్నారు.

ఆలమ్ బేగ్ అసలు పేరు ఆలిమ్ బెగ్. ఇతను ఉత్తర భారతానికి చెందిన సున్నీ ముస్లిం. ఇతని ఆధీనంలో ఓ చిన్న సైనిక కూటమి ఉండేది. క్యాంపు కాపలా కాస్తూ, ఉన్నతాధికారుల వద్ద బంట్రోతుగా పని చేస్తూ, ఉత్తరాలు అందవేయడం ఇలా అన్ని పనులూ చేసేవాడు ఆలమ్. 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటీష్ దళాలకు ఎదురొడ్డాడు. సంవత్సరం తర్వాత బ్రిటీష్ సైన్యానికి చిక్కి, మరణించాడు.
''నా అధ్యయనం లక్ష్యం ఒక్కటే. సాధ్యమైతే ఆలమ్ బేగ్‌ను భారత్‌కు అప్పగించడం'' అని వాగ్నర్ అన్నారు.
ఇంతవరకూ ఆలమ్ కోసం ఎవ్వరూ రాలేదు. కానీ, ఆలమ్ వారసుల కోసం భారతీయ సంస్థలు, భారత్‌లోని బ్రిటీష్ హై కమిషన్‌తో ఈయన సంప్రదింపులు జరుపుతున్నారు.
''ఆలమ్ బేగ్‌ను స్వదేశానికి తరలించే అంశాన్ని రాజకీయం చేయకూడదని భావిస్తున్నా. ఆలమ్ బేగ్ పుర్రె.. ఒక మ్యూజియంకు పరిమితం కారాదు. భవిష్యత్తులో ఆలమ్ పుర్రెను స్వదేశానికి తరలించి, సకల లాంఛనాలతో ఆలమ్‌కు దహన సంస్కారాలు జరగాలన్నది నా ఆశ'' అన్నారు.

ఆలమ్, ఆయన తోటి సైనికులు.. మొదటి రోజు యుద్ధం ముగిశాక ‘రావి’ నది ఒడ్డున ఆశ్రయం పొందారు. ఆ నదీ తీరం భారత్, పాక్ సరిహద్దులో ఉంది. ఆలమ్‌కు దహన సంస్కారాలకు ఆ ప్రాంతమే సరైనదని వాగ్నర్ అన్నారు.
''కానీ ఎలా జరగాలో, ఏం చేయాలో నిర్ణయించేది నేను కాదు. కానీ ఏది జరిగినా, ఆలమ్ బేగ్ కథలో అదే చివరి ఘట్టం. దాన్ని ఇంకా రాయాల్సి ఉంది’’ అని వాగ్నర్ అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








