హిందూమతం అంటే ఏమిటి? చరిత్ర ఏం చెప్తోంది?

ఫొటో సోర్స్, Abanindranath Tagore, Ravindra Bharati Society
- రచయిత, రూపా ఝా
- హోదా, ఎడిటర్, బీబీసీ భారతీయ భాషలు
మతం - జాతీయవాదం. భారతదేశంలో అత్యంత కీలకమైన రాజకీయ అంశాలు. సామాజికంగానూ అంతే ముఖ్యమైనవి. ఒక్కోసారి ఈ రెండింటి మధ్య తేడా ‘కనిపించదు’ కూడా. ఈ విషయంలో భావోద్వేగాలు పెరిగిపోతున్నాయి. మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వివాదాలు ముదురుతున్నాయి. కానీ.. ఈ అంశాల గురించి అసలు చరిత్ర ఏం చెప్తోంది? చరిత్రకారులు ఏమంటున్నారు?
ఈ కీలక అంశాలపై ప్రఖ్యాత చరిత్రకారుడు ప్రొఫెసర్ డీఎన్ ఝాను బీబీసీ కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటికి ఆయన సాధికారికంగా స్పందించారు.

ఫొటో సోర్స్, Mukul Dube/Wikipedia
1) భారత చరిత్రలో ప్రాచీన కాలం స్వర్ణయుగమని, అప్పుడు సామాజిక సామరస్యం పరిఢవిల్లిందని, మధ్య యుగంలో హిందువులను ముస్లిం పాలకులు క్రూరంగా పరిపాలించారని హిందుత్వవాదులు భావిస్తుంటారు.. చారిత్రక ఆధారాలు ఏం చెప్తున్నాయి?
భారత చరిత్రలో స్వర్ణయుగం అనేది ఏదీ లేదని చారిత్రక ఆధారాలు స్పష్టంగా చెప్తున్నాయి. ప్రాచీన యుగాన్ని సామాజిక సామరస్యం, సుసంపన్నత పరిఢవిల్లిన కాలంగా చూడలేం. ప్రాచీన కాలంలో కులమనేది చాలా కఠోరంగా ఉండేదని, బ్రాహ్మణేతరుల మీద - ప్రత్యేకించి శూద్రులు లేదా అస్పృశ్యుల మీద సామాజికంగా, చట్టపరంగా, ఆర్థికంగా అనేక ప్రతిబంధకాలు విధించారని చూపుతున్న ఆధారాలు చాలా ఉన్నాయి. ఇది ప్రాచీన భారత సమాజంలో ఉద్రిక్తతలకు కారణమైంది.
అయిత, అగ్ర కులాలు, కులీనులు, భూస్వామ్య వర్గాల వారు మన కాలంలో అంబానీలు, అదానీల లాగానే సంతోషంగా సుసంపన్నంగా ఉన్నారన్నది నిజమే. స్వర్ణయుగంలో ఇటువంటి వాళ్లు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారన్నది మనకు అవగతమవుతుంది.
గుప్తుల పాలన కాలం స్వర్ణయుగమని.. జాతీయవాదాన్ని గుప్తులు పునరుద్ధరించారని పంతొమ్మిదో శతాబ్దం చివర్లోను, ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలోను చరిత్రకారులు వాదించటం మొదలుపెట్టిన తరువాత ప్రాచీన భారతదేశంలో స్వర్ణయుగం అనే ఆలోచన బలపడటం మొదలైంది.
కానీ, ప్రఖ్యాత భారత చరిత్రకారుడు డి.డి.కోశాంబి చెప్పిన ప్రకారం, గుప్తులు జాతీయవాదాన్ని పునరుద్ధరించటం కాదు - జాతీయవాదమే గుప్తులను పునరుద్ధరించింది. నిజానికి సామాజిక సామరస్యం, సుసంపన్నత గల స్వర్ణ యుగం అనే భావనను భారత చరిత్రకారులు, ఇతర దేశాల చరిత్రకారులు దుర్వినియోగం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మధ్య యుగాన్ని ముస్లిం పాలకుల క్రూర పరిపాలనా కాలంగా చిత్రీకరించే విషయానికి వస్తే, ముస్లింలను దుష్టులుగా చిత్రీకరించటం పంతొమ్మిదో శతాబ్దం చివర్లో కొందరు సంస్కరణవాదులు, నాయకులు తదితరులకు ఇష్టమైన అంశంగా మారింది.
ఉదాహరణకు దయానంద సరస్వతి (1824-83) రచించిన ‘సత్యార్థప్రకాశ’లో రెండు అధ్యాయాలను ఇస్లాం, క్రైస్తవ మతాలను అప్రతిష్ఠపాలు చేయటానికి అంకితం చేశారు. వివేకానంద (1863-1902) తన రచనల్లో ‘‘పసిఫిక్ మహాసముద్రం నుంచి అట్లాంటిక్ మహాసముద్రం వరకూ ప్రపంచమంతా ఐదు వందల ఏళ్ల పాటు రక్తం పారింది. అది మహమ్మదీయ మతం’’ అని వ్యాఖ్యానించారు.
ముస్లిం పాలకులను అప్రతిష్ఠపాలు చేసే ధోరణి చాలా మందికి చాలా ఇష్టమైన పనిగా కొనసాగింది. ముస్లింల పాలన క్రూరంగా ఉండేదని, హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని, హిందువుల ఆలయాలను ధ్వంసం చేశారని, హిందూ మహిళలను బలాత్కరించారని వర్ణించేవారు.
కానీ, మధ్య యుగాన్ని, ముస్లిం పాలనను ఈ రకంగా చిత్రీకరించటాన్ని తారాచంద్, ఎండీ హబీబ్, ఇర్ఫాన్ హబీబ్, షిరీన్ మూస్వీ, హర్బన్స్ ముఖియా, ఆడ్రే ట్రష్‌కే తదితరులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ముస్లిం పాలకుల ‘దుశ్చర్యల’ను గోరంతలు కొండంతలు చేసి చూపారని, వారు చేశారని చెబుతున్న దుర్మార్గాలు, ఆ కాలపు రాజకీయాలతో ప్రేరేపితమైనవని, వలస పాలన కాలానికి ముందు ముస్లింలు, హిందువుల మధ్య ఘర్షణ ఉందనటానికి సరైన ఆధారాలు లేవని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నిజానికి మొఘలుల పాలనలో ‘సంస్కృత’ సంస్కృతి పరిఢవిల్లింది.

ఫొటో సోర్స్, Getty Images
2) హిందూ మతాన్ని సహనశీల మతంగా మీరు చూస్తారా?
నా దృష్టిలో అన్ని మతాలూ మనుషులను విభజించేవే. ఈ విషయంలో హిందూమతం తక్కువేమీ కాదు. ప్రాచీన, మధ్య యుగాలంతటా బ్రాహ్మణ మతానికి - జైనం, బౌద్ధం తదితర శ్రామణ మతాలకు మధ్య శత్రుత్వానికి సంబంధించిన ఆధారాలను చూడండి.
వీటి మధ్య విరోధం ప్రాచీన గ్రంధాల్లో ప్రతిఫలించింది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, పాము - ముంగిస లాగా బ్రాహ్మణులు - శ్రామణులు శాశ్వత శత్రువులు అంటూ పతంజలి (క్రీస్తు పూర్వం 150) తన ‘మహాభాష్యం’లో ఎంతో ఘనంగా చెప్పారన్న సంగతి తెలిసిందే.
బ్రాహ్మణమతం, బౌద్ధమతాల మధ్య ఈ చిరకాల విరోధం.. ఈ రెండు మత సాహిత్యాల్లోనూ విస్తారంగా రుజువయింది. అంతకంటే ముఖ్యంగా.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బౌద్ధ స్మారకాలను ధ్వంసం చేయటం లేదా సంలీనం చేసుకున్న పురావస్తు ఆధారాలు భారీ స్థాయిలో ఉండటం దీనిని నిర్ధరిస్తోంది.
నిజానికి, దేశంలో బౌద్ధమతం అంతర్థానమవటం వెనుక ప్రధాన కారణం, దానికి వ్యతిరేకంగా బ్రాహ్మణమతం దాడి చేయటమే. బ్రాహ్మణమతం ఎన్నడూ బౌద్ధమతంతో సయోధ్య కుదుర్చుకోలేదని ఇది స్పష్టం చేస్తోంది. కాబట్టి, హిందూమతం సహనశీల మతమనే ఆలోచనకు సరైన ప్రాతిపదిక లేదు.

ఫొటో సోర్స్, Manuel Menal/Wikipedia
3) భారత్ అనే భావన ఎప్పుడు, ఎలా మొదలైంది?
భారత్ అనే దానికి ఆద్యంతాలు లేవని, అది సదా మనుగడలో ఉందని హిందుత్వవాదులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. కానీ, ఈ దేశానికి సంబంధించిన అతి ప్రాచీన సాహిత్య గ్రంథాల సమాహారమైన వేదాల్లో సైతం.. కొన్ని చోట్ల భారత తెగ అనే ప్రస్తావన ఉన్నప్పటికీ, ఒక భూభాగమనే అర్థంలో ఈ పదం ఎక్కడా కనిపించదు.
మొట్టమొదటిగా ఖారవేలుడి (క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం) శాసనంలో ‘భరతవర్ష’ అనే ప్రస్తావన కనిపిస్తుంది. అది ప్రస్తుత ఉత్తర భారతదేశాన్ని ఉద్దేశించి కావచ్చు. అందులో మగధ కలిసి లేదు.
మహాభారతంలో భారత అనే పదం ఇండియాలో ఎక్కువ భాగాన్ని సూచిస్తుంది కానీ, దక్కను భాగాల గురించి కానీ, దిగువ దక్షిణ ప్రాంతం గురించి కానీ ఏమీ చెప్పదు.

ఫొటో సోర్స్, Alexander Cunningham/Wikipedia
‘భరతవర్ష’ ఎక్కువగా పురాణాల్లో కనిపిస్తుంది. కానీ, అవి దీని ఆకారాన్ని పలు రకాలుగా వర్ణిస్తాయి. కొన్ని పురాణ భాగాల్లో దీనిని చంద్రుడితో పోల్చారు. ఇంకొన్నిటిలో ఇది త్రిభుజాకారంలో ఉన్నట్లు పేర్కొన్నారు. మరికొన్నిటిలో ఇరువైపుల త్రికోణాలుండే చతుర్భుజాకారంలో ఉంటుందనో, అసమ చతుర్భుజాకారంలో ఉంటుందనో, నారి చాచిన విల్లు ఆకారంలో ఉంటుందనో వర్ణించారు.
అయితే, ఈ ప్రాచీన భారత గ్రంథాలు వేటిలోనూ ఇండియాను ఒక తల్లిగా చిత్రీకరించకపోవటం విస్పష్టంగా కనిపిస్తుంది. ఇండియాను ఒక ‘తల్లి’గా స్త్రీ రూపంలో అభివర్ణించటం మొదటిసారిగా ద్విజేంద్రరాయ్ (1863-1913) రాసిన ఒక పాటలో కనిపిస్తుంది. ఆ తరువాత కొంత కాలానికి బంకిమ్ చటర్జీ రాసిన 'ఆనందమఠ్'లోనూ కనిపిస్తుంది.
భరతమాతను మానవరూపంలో చిత్రీకరించటం మొదటిసారిగా అవనీంద్రనాథ్ ఠాగూర్ 1905లో గీసిన వర్ణచిత్రంలో కనిపించింది. ఒక హిందూ వైష్ణవ సన్యాసిని రూపంలో భరతమాతను ఆయన చిత్రీకరించారు. అలాగే, 1936లో వారణాసిలో నిర్మించిన భరతమాత ఆలయంలో మొదటిసారిగా ఆమెను దేశపటం రూపంలో చిత్రీకరించారు.

ఫొటో సోర్స్, Adityamadhav83/Wikipedia
4) మీ కొత్త పుస్తకం ‘అగెనెస్ట్ ద గ్రెయిన్’లో, బ్రాహ్మణమతం ఎన్నడూ బౌద్ధమతంతో సఖ్యత కుదుర్చుకోలేదని మీరు రాశారు. దీనర్థం ఏమిటి? దళితులు తమ అస్తిత్వాన్ని చాటుకోవటం, దాడులకు గురవుతుండటం వంటి ఇటీవలి పరిణామాల నేపథ్యంలో దీనిని మీరు ఎలా చూస్తారు?
అసహన హిందూవాదం గురించి నేను ఇంతకుముందు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, బౌద్ధుల పట్ల బ్రాహ్మణులు ఎల్లప్పుడూ విరోధంగానే ఉన్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది.
కానీ, ఎక్కువమంది బౌద్ధమతస్తులుగా ఉన్న దళితుల పట్ల నేటి శత్రుత్వం, హిందూమతానికి కేంద్రకమైన కుల వ్యవస్థ పునాదుల్లో, వారి ఆహార సంస్కృతిలో పాతుకుని ఉంది.
నిచ్చెన మెట్ల సామాజిక స్థాయిల్లో దళితులకు అథమ స్థానాన్ని కేటాయిస్తుందీ కుల వ్యవస్థ. దళితుల ఆహార సంస్కృతిలో ఆవు మాంసం తినటం భాగం. ఆవు మాంసం తినటాన్ని హిందువులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
అందుకే, పశు వ్యాపారులను కానీ బీఫ్ తినేవాళ్లని కానీ మూకదాడులు చేసి కొట్టి చంపుతున్న చాలా ఘటనలకు అత్యుత్సాహవంతులైన హిందుత్వవాదులే బాధ్యులు కావడం ఆశ్చర్యం కలిగించదు.

ఫొటో సోర్స్, Getty Images
7) నేటి కాలంలో హిందు అస్తిత్వాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది కల్పిత చిత్రమా?
హిందూమతం అన్నది ఈ దేశంలో విస్తరించివున్న విభిన్న మత శాఖలు, విశ్వాసాలు, ఆచారాల సమ్మేళనం. కానీ హిందుత్వవాదులు హిందూమతాన్ని ఏక జాతిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏకశిలా సదృశమైన అఖండ మతమని చూపించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. భిన్నత్వాన్ని నిరాకరించే ధోరణి ఒక అంతుచిక్కని హిందూ అస్తిత్వాన్ని సృష్టించింది. అది ఆవేశం, అరాచకత్వాలకు దారితీసింది.
దీని ప్రధాన లక్షణం ఆవును పూజించటం, అందరి దేవుళ్ళ కన్నా రాముడే గొప్ప దేవుడని నిర్థరించడం, ఇతర మత గ్రంథాలకన్నా రామాయణం సర్వోన్నతమైనదని తేల్చి చెప్పడం. హిందుత్వ సంస్థలు మనుస్మృతిని ఈ కాలానికి అనుగుణంగా పునర్లిఖించేందుకు ప్రయత్నిస్తున్నాయని కొంత కాలం కిందట నేను విన్నాను. ఇదంతా, ఈ ఊహాజనిత ఏకశిలా సదృశ అస్తిత్వం ఎంత కృత్రిమమైనదో చెపకనే చెబుతోంది. ఇది దేశంలో మత, సాంస్కృతిక, రాజకీయ చర్చలను కలుషితం చేసి సమకాలీన భారతదేశాన్ని చీకటి యుగంలోకి నెట్టివేసింది.

ఫొటో సోర్స్, Manohar/Navayana Publishing
8) ఆవు అనేది ఒక భావావేశ సాంస్కృతిక చిహ్నంగా ఎప్పుడు ఆవిర్భవించింది? ఇప్పుడు దీనిని ఎలా ఉపయోగిస్తున్నారని మీరు భావిస్తున్నారు?
గోవధ పట్ల వ్యతిరేకత ప్రాచీన యుగం చివరలో, మధ్యయుగం ప్రారంభంలో పుట్టుకువచ్చింది. అయితే, ఇస్లాం రాకతో ఇది బాగా బలపడింది. వేదకాలంలో బ్రాహ్మణులు గోమాంసం తినే తమను తాము "బలవంతులు"గా మార్చుకుని ఉండవచ్చు. అలాంటి బ్రాహ్మణులే ఈరోజున ముస్లింల మీద గోమాంస భక్షకులు అనే ముద్ర వేయడం విచిత్రం.
గోవు మధ్య యుగంలో ఒక భావావేశ సాంస్కృతిక చిహ్నంగా ఆవిర్భవించిందనడంలో సందేహం లేదు. శివాజీ సారథ్యంలో మరాఠా శక్తి బలపడటంతో అది ఇంకా భావోద్వేగభరితంగా మారింది. బ్రాహ్మణులను, గోవులను సంరక్షించటానికి భువికి దిగివచ్చిన దేవుడి అవతారంగా శివాజీని కీర్తించేవారూ ఉన్నారు.
కానీ, రాజకీయంగా సాధారణ జనాన్ని సమీకరించటం కోసం గో చిహ్నాన్ని మొదటిసారిగా ఉపయోగించింది 1870ల్లో సిక్కు కుకా ఉద్యమం. దాదాపు అదే కాలంలో దయానంద సరస్వతి మొదటి గోరక్షణ సభను స్థాపించారు. గోరక్షణ ఉద్యమం తీవ్రమవుతుండటంతో ఆవు గోమాతగా మారింది. భారత్ కూడా భరతమాతగా మారిన కాలానికి కొంచెం అటూ ఇటూగానే గోవు గోమాత అయింది.
మాలిక్ ముహమ్మద్ జాయసీ రచించిన ’పద్మావత్’ లోని పద్మిని నుంచి ఇటీవల ఒక ముఖ్యమంత్రి సృష్టించిన ‘రాష్ట్రమాత’ తెర మీదకు ఆలస్యంగా వచ్చిన పాత్ర. కానీ, ఇవన్నీ కలిసి భారత సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయి.

ఫొటో సోర్స్, AFP
9) రాముడు ఓ రాజకీయ దేవుడు - అయోధ్యలో రామమందిరం అంశంపై రాజకీయాలు 2019 ఎన్నికలకు ముందు ఇంకా వేడెక్కుతుంటే - ఉత్తర భారతదేశంలో 17వ శతాబ్దం చివర, 18వ శతాబ్దం ఆరంభం వరకూ రాముడికి ప్రత్యేకంగా ఆలయం లేదని మీరు రాశారు.
హిందుత్వ దళాలు ఏం చెప్తున్నాయనేదానితో నిమిత్తం లేకుండా.. మధ్యప్రదేశ్‌లో మినహా ఉత్తర భారతదేశంలో 17 లేదా 18వ శతాబ్దాలకు ముందు రాముడి ఆలయాలు ఉన్నాయని చెప్పే ఎలాంటి ఆధారాలూ లేవు.
మధ్యప్రదేశ్‌లో 12వ శతాబ్దపు రాముడి ఆలయాలు రెండో, మూడో బయటపడ్డాయి.
నిజానికి, అయోధ్యలో జైనమతం, బౌద్ధమతం వంటి ఇతర మతాలే ప్రముఖంగా ఉండేవి. మిర్ బఖీ 1528లో ఆ మసీదును నిర్మించినపుడు అక్కడ రామాలయం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
10) భారతదేశం మరింత సామరస్యపూర్వక సమ్మిళిత దేశంగా మారటంలో చరిత్ర ఎలాంటి పాత్ర పోషించగలదని మీరు భావిస్తున్నారు?
భారతదేశాన్ని మరింత సామరస్య సమ్మిళిత దేశంగా రూపొందించటంలో చరిత్రకారులు గణనీయమైన పాత్ర పోషించగలరు.
వీరు ఇప్పటివరకూ అర్థంకాని భాషలో, సామాన్య పాఠకులకు అందుబాటులో ఉండని చరిత్ర పుస్తకాలను గుట్టలు గుట్టలుగా రాయటం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు.
చరిత్రకారులు కనుక సామాన్య ప్రజల కోసం, అది కూడా ఇంగ్లిష్‌లో మాత్రమే కాకుండా ప్రాంతీయ భాషల్లో కూడా రాస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ ప్రజలు చరిత్రను మరింత హేతుబద్ధంగా అర్థం చేసుకోవడానికి ఆ రచనలు తోడ్పడతాయి.
మతం పట్ల సహేతుకమై వైఖరి కచ్చితంగా సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. కానీ, మూఢత్వం మత దురభిమానాన్ని పెంచి పోషిస్తుంది.
(ప్రొఫెసర్ ద్విజేంద్ర నారాయణ్ ఝా ప్రఖ్యాత భారతీయ చరిత్రకారుడు. ప్రత్యేకించి ప్రాచీన, మధ్యయుగాల నాటి చరిత్రకు సంబంధించి ఈయన అధ్యయనం చేశారు. ప్రాచీన భారతంలో పశుమాంస భక్షణకు సంబంధించి ఆయన రాసిన 'మిత్ ఆఫ్ ద హోలీ కౌ' పుస్తకం ఎంతో చర్చకు దారితీసింది. ఇటీవల ఆయన రాసిన 'అగెనెస్ట్ ద గ్రెయిన్ - నోట్స్ ఆన్ ఐడెంటిటీ, ఇంటాలరెన్స్ అండ్ హిస్టరీ'పుస్తకంలో ప్రస్తుతం భారత్‌లో నెలకొని ఉన్న విభిన్న రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై చర్చించారు.)
ఇవి కూడా చదవండి.
- BBC SPECIAL: ‘దేశంలో అతిపెద్ద మారణకాండను నేను ఆరోజే చూశాను’
- కరణ్ థాపర్: ‘మోదీ ముఖంలో కోపం, అడ్వాణీ కళ్లలో నీళ్లు, భుట్టో చూపులో ప్రేమ.. అన్నీ చూశా’
- ఇది హిందూ-ముస్లింల ఘర్షణా లేక అస్సామీలకూ బెంగాలీలకూ మధ్య ఘర్షణా?
- జీసస్: నిజంగా నల్లగా ఉండేవాడా?
- తొలి కంచి పీఠాధిపతి ఆది శంకరుడేనా?
- వినాయకుడికి ప్లాస్టిక్ సర్జరీ.. ఇది దేవుడి ఇంజనీరింగ్!!
- ఎన్కౌంటర్లలో ముస్లింలూ, దళితులే ఎందుకు హతులవుతారు?
- భారతదేశంలో ముస్లింల సమస్యల గురించి మనకు అవగాహన ఉందా?
- చరిత్ర: ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ ఎలా సాధించుకున్నారు?
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
- సోషల్మీడియాలో మీసం మెలేస్తున్న దళితులు!
- భీమా-కోరెగాంలో దళితులు విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
- పద్మావత్ వివాదాలకు అసలు కారణాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








