‘అందరూ నిర్దోషులైతే.. ఈ దళితుల్ని చంపిందెవరు?’

ఫొటో సోర్స్, SUDHARAK OLWE
- రచయిత, సుధారక్ ఆల్వే
- హోదా, బీబీసీ కోసం
మహారాష్ట్రలో ఇతరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన దళితుల కుటుంబాల పరిస్థితిని ఫొటో జర్నలిస్టు సుధారక్ ఆల్వే కళ్లకు కట్టారు. ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సుధారక్ ఆల్వే ముంబైలో ఈ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
'ఈ నిజాలు కాస్త కఠినంగా ఉంటాయి' అని ఆయన ఈ ఫొటోల గురించి చెప్పారు. ఆ ఫొటోల వెనక ఉన్న కథ ఇది.
1. మాణిక్ ఉడాగే: రాళ్లతో కొట్టి చంపారు
పైఫొటోలో ఉన్నది మాణిక్ ఉడాగే కుటుంబ సభ్యులు. భీమ్ జయంతిని జరుపుకున్నందుకు మాణిక్‌ను రాళ్లతో కొట్టి చంపారు. మాణిక్ కుటుంబం పుణెలోని చిక్లి ఏరియాలో ఉంటుంది. మాణిక్ స్థానికంగా చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసుకుంటూనే దళితుల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు సంవిధాన్ ప్రతిస్థా అనే సంస్థను నెలకొల్పారు.
2014, ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని నిర్వహించినందుకు అగ్రకులాలకు చెందిన నలుగురు వ్యక్తులు అతడిని స్టీలు రాడ్లు, రాళ్లతో కొట్టి చంపారన్న ఆరోపణలున్నాయి. అగ్రకులాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మోర్య వస్తిలో అంబేడ్కర్ జయంతిని భారీ స్థాయిలో జరపాలని మాణిక్ నిర్ణయించడం వల్లే అతడిని చంపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ కేసులో అరెస్టయిన నిందితులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇప్పటికీ మాణిక్ సోదరుడు శ్రవణ్ వీధిలో తిరుగుతున్నప్పుడు నిందితుల బంధువుల కొరకొర చూపులకు గురవుతున్నాడు. నిందితుల బెయిల్ పిటిషిన్ ఇప్పటికి చాలాసార్లు తిరస్కరణకు గురైంది.

ఫొటో సోర్స్, SUDHARAK OLWE
2. మధుకర్ గాడ్గే: బావి తవ్వినందుకు చంపేశారు
ఉన్నత విద్యావంతుడైన మధుకర్ గాడ్గే 2007 ఏప్రిల్ 26న సతారా జిల్లా, కులకజై గ్రామంలో హత్యకు గురయ్యారు. తన భూమిలో బావిని తవ్వుతున్నుందుకు 12మంది అగ్రకులాలకు చెందిన వాళ్లు అతడిపై క్రూరంగా దాడి చేసి హత్య చేశారు.
దాడికి గురైన తరవాత మధుకర్ బంధువులు అతడిని బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. కానీ అప్పటికే అతడు చనిపోయాడు. బాగా చదువుకోవడం, ఆర్థికంగా బలంగా ఉండటం, గ్రామ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేయడం.. ఇలా రకరకాల కారణాల వల్ల మధుకర్‌ను చంపేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు.
కానీ సరైన ఆధారాలు లేని కారణంగా మూడేళ్ల తరవాత సెషన్స్ కోర్టు నిందితులందర్నీ వదిలిపెట్టింది. ప్రస్తుతం రివ్యూ పిటిషిన్ హైకోర్టులో విచారణలో ఉంది.

ఫొటో సోర్స్, SUDHARAK OLWE
3. సాగర్ షెజ్వాల్: అంబేడ్కర్ రింగ్‌టోన్ పెట్టుకున్నందుకు...
అంబేడ్కర్‌ను కీర్తించే రింగ్‌టోన్‌ను పెట్టుకోవడమే సాగర్ చేసిన తప్పు. దానివల్ల అతడు ఏకంగా ప్రాణాలను కోల్పోయాడు. 24ఏళ్ల సాగర్ 2015లో షిర్డిలో అగ్రకులాల వారి చేతుల్లో హత్యకు గురయ్యాడనే ఆరోపణలున్నాయి.
సాగర్ తన స్నేహితుడి పెళ్లికి హాజరయ్యేందుకు షిరిడీ వెళ్లాడు. అక్కడ వైన్ షాప్‌కు వెళ్లినప్పుడు అతడి ఫోన్ చాలాసార్లు రింగైంది. 'ఎన్ని అడ్డంకులు సృష్టించినా అంబేడ్కర్ భావజాలం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది' అన్న అర్థం వచ్చేలా అతడి రింగ్‌టోన్ ఉంది. అక్కడ మత్తులో జోగుతున్న తొమ్మిది మంది వ్యక్తులు రింగ్‌టోన్ మార్చమని సాగర్‌ను ఒత్తిడి చేశారు.
కానీ రింగ్‌టోన్ మార్చడానికి సాగర్ నిరాకరించడంతో అతడిని తీవ్రంగా కొట్టి దగ్గర్లోని పొలాల్లో అతడి దేహాన్ని పడేశారు. ప్రస్తుతం నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. అహ్మద్‌నగర్ కోర్టులో కేసు విచారణలో ఉంది.

ఫొటో సోర్స్, SUDHARAK OLWE
4. పార్థిలు.. నిరాదరణకు గురైన గిరిజనులు
2016 డిసెంబర్‌లో దాదాపు 17పార్థి కుటుంబాలకు చెందిన గుడిసెలను అగ్రకులాలకు చెందిన వ్యక్తులు నాశనం చేశారనే ఆరోపణలున్నాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం వారంతా గుడారాల కిందే తలదాచుకుంటున్నారు.

ఫొటో సోర్స్, SUDHARAK OLWE UND HELENA SCHAETZLE
5. నితిన్ ఆగే.. ప్రాణం తీసిన సాన్నిహిత్యం
అహ్మద్‌నగర్ జిల్లాలోని ఖార్దా గ్రామానికి చెందిన 17ఏళ్ల నితిన్ ఆగేను అతి క్రూరంగా చంపి అతడి శవాన్ని చెట్టుకు వేలాడదీశారు. అగ్ర కులానికి చెందిన ఓ అమ్మాయితో మాట్లాడినందుకు 2014 ఏప్రిల్‌లో యువతి సోదరుడితో పాటు మరొకొందరు కలిసి అతడిని చంపినట్టు ఆరోపణలున్నాయి.
అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడన్న అనుమానంతో హత్య జరగడానికి ముందు నుంచీ నితిన్‌కు అనేకసార్లు వేధింపులు ఎదురయ్యాయి.
2017 నవంబర్‌లో అహ్మద్‌నగర్ కోర్టు నిందితులందర్నీ వదిలిపెట్టింది. ‘అందరూ నిర్దోషులైతే మరి మా కొడుకుని చంపిందెవరు?’ అని నితిన్ తండ్రి ప్రశ్నిస్తారు.

ఫొటో సోర్స్, SUDHARAK OLWE
6. రోహన్ కకడే: ప్రేమిస్తున్నాడనే అనుమానంతో..
తన 19వ పుట్టినరోజుకు ఒక్క రోజు ముందే సతారాకు చెందిన రోహన్ అనే దళిత కుర్రాడు దారుణంగా హత్యకు గురయ్యాడు. నేరస్థులు అతడి తలను నరికేసి, శరీరాన్ని కాల్చేసి సమీపంలోని ఓ కొండ ప్రాంతంలో పడేశారు. అగ్రకులానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే కారణంగా ఆమె సోదరుడితో పాటు మరో నలుగురు వ్యక్తులు కలిసి రోహన్‌ను హత్య చేశారనే ఆరోపణలున్నాయి. సునీల్ అనే వ్యక్తి కూతురు తనకు అప్పుడప్పుడూ ఫోన్ చేస్తుందనీ, తమది కేవలం స్నేహమేననీ రోహన్ తన తల్లిదండ్రులకు చెప్పేవాడు.
ఈ హత్య జరిగిన రెండున్నరేళ్ల తరవాత రోహన్ తండ్రి చనిపోయాడు. కానీ అతడి తల్లి ఇంకా ఒంటరిగా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు.
7. సంజయ్ దనానే: హక్కు కోసం పోరాడినందుకు..
38ఏళ్ల సంజయ్ దనానే గతంలో ఓ ప్రభుత్వ కళాశాలలో పనిచేసేవారు. పదేళ్ల సర్వీస్ పూర్తయ్యాక ప్యూన్‌గా అతడికి పర్మనెంట్ ఉద్యోగం లభించింది. 2010లో సంజయ్‌కు ల్యాబ్ అసిస్టెంట్‌గా పదోన్నతి రావాల్సి ఉంది.
కానీ అతడి స్థానంలో మరో వ్యక్తి అక్రమంగా ఆ ఉద్యోగాన్ని సంపాదించినట్టు సంజయ్‌కు తెలిసింది. తన పదోన్నతి కోసం సంజయ్ తీవ్రంగా పోరాడాడు. సోలాపార్, పుణె, ముంబయ్‌తో పాటు దిల్లీలోని అధికారులకు కూడా లేఖలు రాశాడు.
అతడి శ్రమ ఫలించి సంజయ్‌కు పదోన్నతి దక్కింది. కానీ కొన్ని రోజులకే అతడి శవం స్కూల్‌కి దగ్గరలో చెట్టుకూ వేలాడుతూ కనిపించింది. ఆ కేసులో అరెస్టయిన 18మంది బెయిల్‌పై విడుదలయ్యారు. కేసు విచారణలో ఉంది.
అట్రాసిటీ నేరాలు
జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2016 నివేదిక ప్రకారం ఆ ఏడాది దేశ వ్యాప్తంగా 40,801 ఎస్సీ అట్రాసిటీ సంఘటనలు నమోదయ్యాయి. అందులో 25.6శాతం, అంటే 10,426కేసులు ఉత్తర్ ప్రదేశ్‌లోనే నమోదయ్యాయి. బిహార్, రాజస్థాన్‌లు తరవాతి స్థానంలో నిలిచాయి.
అదే ఏడాది 6,568 ఎస్టీ అట్రాసిటీ ఘటనలు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా మధ్య ప్రదేశ్ నుంచి 1823ఘటనలు వెలుగు చూశాయి.

ఫొటో సోర్స్, SUDHARAK OLWE
దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద నమోదైన 15.4శాతం కేసుల్లో మాత్రమే దోషులకు శిక్ష పడుతోందని ఎన్‌సీఆర్‌బీ నివేదికలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








